అతడో బిక్షగాడు. దారినపోయే వాళ్లు ఇచ్చే చిల్లరతో జీవనం సాగించేవాడు. అనారోగ్య సమస్యలతో మరణించాడు. అతడి ఇంట్లోకి వెళ్లి చూస్తే లక్షల్లో డబ్బు కనిపించింది. తిరుమలలో జరిగింది ఈ ఘటన.
శ్రీనివాసన్ అనే వ్యక్తి కొండపై బిక్షాటన చేసుకొని జీవించేవాడు. అతడ్ని నిర్వాసితుడిగా భావించి దేవస్థానం అతడికి గది కూడా కేటాయించింది. అలా ఒంటరిగా, బిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న శ్రీనివాసన్ గతేడాది మరణించాడు.
వారసులు ఎవ్వరూ లేకపోవడంతో అతడికి కేటాయించిన గది అలానే ఖాళీగా ఉండిపోయింది. శేషాచల కాలనీలో అలా ఖాళీగా ఉండిపోయిన రూమ్ నంబర్ 75 గదిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
గదిలోకి వెళ్లి చూస్తే రెండు ట్రంకు పెట్టెలు కనిపించాయి. తెరిచి చూస్తే వాటి నిండి డబ్బు ఉంది. వెంటనే షాక్ అయిన అధికారులు, విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విజిలెన్స్ సమక్షంలో డబ్బు లెక్కించగా.. 10 లక్షలకు పైగా ఉన్నట్టు తేలింది.
కేవలం కొండపై బిక్షాటన చేసుకుంటూ ఇతడు ఇంత డబ్బు సంపాదించాడు. ఆ డబ్బును అతడు లెక్కపెట్టకుండానే అలానే పెట్టెలో దాచాడనే విషయాన్ని అధికారులు గుర్తించారు. ఎందుకంటే, అందులో రద్దయిన పాత నోట్లు కూడా ఉన్నాయి.