11-11-11.. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ కోసం రాజమౌళి సెట్ చేసిన డేట్ ఇది. చెప్పినట్టుగానే సరిగ్గా నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ ప్రాజెక్టును లాంఛ్ చేశాడు. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పుడు ఇదే ప్రాజెక్టుకు సంబంధించి పైన చెప్పుకున్న లాంటిదే మరో మేజిక్ డేట్ ను రాజమౌళి సెట్ చేసినట్టు తెలుస్తోంది.
ఈసారి ఏ తేదీని ఆయన సెట్ చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దగ్గర్లో మాత్రం 12-12-12 అనే డేట్ మాత్రమే ఉంది. అంటే డిసెంబర్ 12, మధ్యాహ్నం 12 గంటలకు అని అర్థం. మరి ఇదే తేదీని రాజమౌళి ఫిక్స్ చేస్తాడా..? ఇంతకీ రాజమౌళి ఎందుకు మరో డేట్ ఫిక్స్ చేస్తున్నాడనేది సస్పెన్స్ గా మారింది.
ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీకి సంబంధించి హీరోలు, టెక్నీషియన్లతో సహా అందర్నీ లాంఛింగ్ రోజునే ప్రకటించేశారు. కేవలం మిగిలింది హీరోయిన్లు మాత్రమే. వాళ్ల కోసమే జక్కన్న ఇలా మరో మేజిక్ డేట్ ను ఫిక్స్ చేశాడనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆ తేదీని నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించబోతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ నడుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య భారీ యాక్షన్ బ్లాక్ తీస్తున్నాడు రాజమౌళి. మరో 2 రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ ముగుస్తుంది. ఆ తర్వాత హీరోయిన్లపై ఓ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.