సినిమా రివ్యూ: అమర్‌ అక్బర్‌ ఆంటొని

రివ్యూ: అమర్‌ అక్బర్‌ ఆంటొని రేటింగ్‌: 2/5 బ్యానర్‌: మైత్రి మూవీ మేకర్స్‌ తారాగణం: రవితేజ, ఇలియానా, తరుణ్‌ అరోరా, సయాజి షిండే, సునీల్‌, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, సత్య, శ్రీనివాసరెడ్డి, అభిమన్యు సింగ్‌,…

రివ్యూ: అమర్‌ అక్బర్‌ ఆంటొని
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: మైత్రి మూవీ మేకర్స్‌
తారాగణం: రవితేజ, ఇలియానా, తరుణ్‌ అరోరా, సయాజి షిండే, సునీల్‌, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, సత్య, శ్రీనివాసరెడ్డి, అభిమన్యు సింగ్‌, ఆదిత్య మీనన్‌ తదితరులు
కథ: వంశీ రాజేష్‌ కొండవీటి
సంగీతం: తమన్‌
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
ఛాయాగ్రహణం: వెంకట్‌ సి. దిలీప్‌
నిర్మాత: నవీన్‌ యేర్నేని, వై. రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి
కథనం, మాటలు, దర్శకత్వం: శ్రీనువైట్ల
విడుదల తేదీ: నవంబర్‌ 16, 2018

'ఆగడు'తో మొదలైన వైట్ల కష్టాలు ఇప్పట్లో ఆగేలా లేవు. 'అమర్‌ అక్బర్‌ ఆంటొని' కూడా వైట్ల గత మూడు చిత్రాలతో పోటీ పడి దీనికంటే ముందు సినిమానే బెటరు అనుకునేలా వుంది. క్రియేటివ్‌ ఫీల్డులో వున్న వారికి అయినా, క్రీడారంగంలో వున్నవారికి అయినా లాస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ మైండ్‌లో వుంటే ఇప్పుడు ఇచ్చే అవుట్‌పుట్‌ ఎఫెక్ట్‌ అవుతుంది. గత విజయంతో ఆత్మ విశ్వాసం పెరగాలి, పరాజయంతో తప్పులేంటో తెలుసుకోవాలి. అంతే తప్ప ఒక విజయాన్ని రిపీట్‌ చేద్దామనో, లేదా ఒక పరాజయాన్ని మరపించే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇద్దామనో ట్రై చేస్తే ఫలితం ఇలాగే వుంటుంది.

శ్రీనువైట్ల దగ్గర ఒక ఆకట్టుకునే సినిమా కాగల స్టోరీ లైన్‌ అయితే వుంది. కాకపోతే దానితో ఏమి చేయాలనే దానిపై క్లారిటీ మిస్‌ అయింది. ఇప్పటి ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు కనుక వారి అభిరుచికి తగ్గట్టు ఏవైనా స్పెషల్‌ ఎలిమెంట్స్‌ పెడదామని, తననుంచి వినోదం ఆశిస్తారు కనుక వారి కోసం కామెడీని కూడా జోడించేద్దామని చూడడంతో ఈ చిత్రం రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలింది. రవితేజకి ఎనర్జిటిక్‌ క్యారెక్టరైజేషన్‌ రాసి, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద ఫోకస్‌ పెడితే మొత్తం తనే చూసుకుంటాడు.

కానీ ఎదురుగా వున్న బలాన్ని వదిలేసి, లేని బలగం కోసం ట్రై చేసి ఇందులో తనే రాసుకున్న నిజాన్ని (మనకి ఆపద వచ్చినపుడు కాపాడేది మన చుట్టూ వున్న బలగం కాదు, మనలో వున్న బలం) శ్రీను వైట్ల విస్మరించాడు. దాంతో ఎవర్‌ ఎనర్జిటిక్‌ రవితేజ కూడా ఏ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వాలో తెలియని అయోమయంలో వుండిపోయి, అమర్‌ అక్బర్‌ ఆంటొని క్రియేటివ్‌ సుడిగుండంలో పడిపోయారు. రవితేజ లాంటి యాక్టర్‌ ఒక క్యారెక్టర్‌ని పండించడానికి ఇబ్బంది పడుతున్నాడంటే అది ఎంత అర్ధాంతరంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

అమర్‌గా సీరియస్‌గా కనిపించే రవితేజ అక్బర్‌గా గుడ్లు మిటకరిస్తూ, భుజాలు బిగిస్తూ కామెడీలాంటిది ఏదో ట్రై చేసాడు. ఇక ఆంటొనిగా అయితే డైలాగ్‌ లేని టైమ్‌లో ఎలా ప్రవర్తించాలో తెలియని తికమకకి గురయ్యాడు. డిసోసియేటివ్‌ ఐడెంటిటీ డిజార్డర్‌ వున్న పాత్రకి అసలు ఎంత పకడ్బందీ క్యారెక్టర్‌ డెవలప్‌మెంట్‌ జరగాలి? రెగ్యులర్‌ రివెంజ్‌ అనేస్తారు కనుక ఈ డిజార్డర్‌ తగిలించేస్తే కొత్తగా అనిపిస్తుందనే ఫీలింగ్‌తో అది యాడ్‌ చేసినట్టు వుంటుందే తప్ప అది ఎక్కడా అవసరం పడకుండా పోయింది.

అసలు ఆ డిజార్డర్‌ ఎందుకు వచ్చినట్టు? హీరోయిన్‌కి అయినా ఆ డిజార్డర్‌ రావడానికో కారణం (సిల్లీదే అయినా) వుంటుంది కానీ హీరోకి మాత్రం కావాలని తగిలించిన జబ్బులా అనిపిస్తుంది. పోనీ డిజార్డర్‌ వల్ల కథ ఏమైనా రక్తి కడుతుందా, సన్నివేశాలు ఆసక్తి గొలుపుతాయా అంటే అదీ లేదు. అద్దం పగిలితే అక్బర్‌, బాంబు పేలితే అమర్‌, ఇంకోటేదో అయితే ఆంటొని అంటూ శ్రీను వైట్ల తెరకెక్కించింది చూస్తే ఇది సీరియస్‌గా సినిమాకోసం తీసినదేనా, లేక జబర్దస్త్‌ స్కిట్‌ కోసం రాసుకున్నదా అనిపిస్తుంది.

స్ట్రెయిట్‌గా చెప్పుకుంటే తల్లిదండ్రులని చంపిన విలన్లపై పగ తీర్చుకునే హీరో కథ. హీరోకి డిసోసియేటివ్‌ ఐడెంటిటీ డిజార్డర్‌ వుండడం వల్ల రివెంజ్‌ని కొత్తగా చూపించే వీలు చిక్కింది. కానీ దానిపై దృష్టి పెట్టడం మానేసి కామెడీ కోసం ప్రయత్నించడం వల్ల టోటల్‌గా కంగాళీ అయిపోయింది. కాసేపు సీరియస్‌గా నడిచింది కదా, ఇప్పుడు రిలీఫ్‌ కోసం రెండు కామెడీ సీన్లు వేద్దాం… ఇక్కడో పాటేద్దాం, ఇక్కడో ఫైటేసుకుందాం అన్నంత 'గ్రిప్పింగ్‌' స్క్రీన్‌ప్లేకి తోడు ఆ కామెడీ సీన్లయినా పండాయా అంటే అదీ లేదు.

ఫలానా సినిమాలో ఫలానా దానిపై సెటైర్‌ వేస్తే పేలింది కనుక ఈసారి అమెరికా తెలుగు అసోసియేషన్స్‌ వ్యవహార తీరుని కామెడీ చేద్దామన్నట్టు అక్కడా అత్తెసరు ప్రయత్నమే, అరకొర ఎఫర్ట్సే. పేజీల కొద్దీ డైలాగులు మాట్లాడిస్తూ పంచ్‌లు వెతుక్కోండనే శ్రీను వైట్ల ధోరణి ఇందులోను కొనసాగింది. తెరపై సన్నివేశం చూస్తే అర్థం కావాల్సిన విషయాన్ని తనే వాయిస్‌ ఓవర్‌ ఇచ్చుకుని ఎక్స్‌ప్లెయిన్‌ చేసుకోవాల్సిన రీతిలో అతని దర్శకత్వం సాగింది.

ఒకానొక టైమ్‌లో ఎంతటి కాంప్లెక్స్‌ స్క్రీన్‌ప్లే అయినా కాస్త కూడా కన్‌ఫ్యూజ్‌ కాకుండా వందల కొద్దీ క్యారెక్టర్లతో వినోదాత్మకంగా నడిపించిన దర్శకుడు ఇతడేనా అనే అనుమానమొస్తుంది. ఈ చిత్రంలోను స్క్రీనుకి సరిపడా ఆర్టిస్టులు, పేజీల కొద్దీ డైలాగులు, అవసరానికి మించిన ఖర్చు అన్నీ వున్నాయి కానీ అప్పుడంత క్లారిటీతో వైట్ల ఇప్పుడు లేడు. ఇదివరకటి కమాండ్‌తో అతను తన సినిమాలని తీర్చిదిద్దడం లేదు. ఎఫ్‌బిఐ ఆఫీసర్‌ అంటూ అభిమన్యు సింగ్‌ చేసే హడావిడి, పక్కన చిదంబరం క్యారెక్టర్‌… వారు చేసే ఇన్వెస్టిగేషన్‌ చూస్తే నవ్వించడానికి ఇన్ని పాట్లా వైట్లా? అనుకోవాల్సి వస్తుంది.

ఒక పాయింట్‌కి చేరే సరికి చూపించింది చాలు, విలన్‌ని చంపేసి శుభం కార్డేసేయండనే ఫీలింగొస్తుంది. కానీ అక్కడ్నుంచి కూడా మరో రెండు పాటలు, ఫైట్లతో సాగతీసి ప్రేక్షకుల సహనానికి ఎండ్‌ పాయింట్‌ ఎక్కడో కొలిచి చూస్తుంది. పాయింట్‌ తట్టగానే ఎక్సయిట్‌ అయిపోయి, సీనిక్‌ ఆర్డర్‌ వేసుకుని సెట్‌ మీదకి వెళ్లిపోయినట్టుగా అనిపిస్తుంది.

అంతమంది తారాగణం, వెనుక బలమైన సాంకేతిక గణం, నిర్మాతలు మంచినీళ్లలా ఖర్చు చేసిన ధనం మొత్తం కలిసినా కూడా కాపాడలేని గందరగోళంగా తయారైంది.

బాటమ్‌ లైన్‌: అసహనం అయోమయం ఆందోళన!

– గణేష్‌ రావూరి

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్