త‌ప్పు చేసిన ఆ యాంక‌ర్ ఎవ‌రు?

ప‌ల్లెల్లో పొద్దు గ‌డ‌వ‌క పేకాట ఆడుతున్న వాళ్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటే మాత్రం ప‌త్రిక‌ల్లో వాళ్ల పేర్ల‌ను ద‌ర్జాగా రాస్తారు. సామాన్యులు, ఎలా రాజ‌కీయ అండ లేని వాళ్ల విష‌యంలో మీడియా త‌న జులుం…

ప‌ల్లెల్లో పొద్దు గ‌డ‌వ‌క పేకాట ఆడుతున్న వాళ్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటే మాత్రం ప‌త్రిక‌ల్లో వాళ్ల పేర్ల‌ను ద‌ర్జాగా రాస్తారు. సామాన్యులు, ఎలా రాజ‌కీయ అండ లేని వాళ్ల విష‌యంలో మీడియా త‌న జులుం ప్ర‌ద‌ర్శించ‌డంలో ముందుంటుంది. అదే సెలిబ్రిటీలు, కాస్తా సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ ప‌ర‌ప‌తి, ప‌లుకుబ‌డి ఉన్న వాళ్లు ఎంత పెద్ద త‌ప్పు చేసినా, పోలీస్ కేసులు న‌మోదైనా …వాళ్ల వివ‌రాలు మాత్రం స‌మాజానికి తెలియనివ్వ‌రు. పైపెచ్చు అలాంటి వాళ్ల ప‌రువు కాపాడ‌డం త‌మ బాధ్య‌త‌గా మీడియా భావిస్తూ ఉంటుంది.

ఇద్ద‌రు బాలిక‌ల‌తో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ఓ టీవీ యాంక‌ర్‌పై పోలీసులు కేసు న‌మోదు చేసినా….స‌ద‌రు యాంక‌ర్ ఎవ‌రో తెలియ‌కుండా మీడియా జాగ్ర‌త్త తీసుకొంది. దీనిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కృష్ణా జిల్లా నూజివీడులోని చైల్ఢ్ కేర్‌లో చ‌దువుకుంటున్న ఇద్ద‌రు బాలిక‌ల్ని పండుగ సెల‌వుల కార‌ణంగా వాళ్ల త‌ల్లి హైద‌రాబాద్ తీసుకెళ్లింది. అయితే ఆ బాలిక‌ల్ని హైద‌రాబాద్‌లోని ఓ యాంక‌ర్ ఇంట్లో ప‌నికి కుదిర్చింది.

సెల‌వులు ముగిసినా, ఇద్ద‌రు బాలిక‌లు ఎన్నాళ్ల‌కూ రాక‌పోవ‌డంతో చైల్డ్ కేర్ సెంట‌ర్ అధికారులు మిస్సింగ్ కేసు పెట్టారు. అనంత‌రం విచార‌ణ చేప‌ట్టారు. చివ‌రికి ఇద్ద‌రు బాలిక‌లు హైద‌రాబాద్‌లో ఓ టీవీ యాంక‌ర్ ఇంట్లో వెట్టి చాకిరి చేస్తున్న‌ట్టు శిశు సంక్షేమ క‌మిటీ గుర్తించింది. బాలిక‌ల‌ను క‌మిటీ స‌భ్యులు అదుపులోకి తీసుకుని విచారించారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. ఇంటి ప‌నుల‌తో పాటు బాడీ మ‌సాజ్ లాంటి ప‌నుల‌ను సైతం త‌మ‌తో చేయించుకున్న‌ట్టు బాలిక‌లు వెల్ల‌డించారు. మైన‌ర్ల‌తో వెట్టి చాకిరి చేయించుకోవ‌డం చ‌ట్ట‌రీత్యా తీవ్ర నేరం. ఈ నేప‌థ్యంలో శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు యాంక‌ర్‌పై కేసు న‌మోదు చేశారు. కానీ ఆ యాంక‌ర్ గురించి మీడియా రాయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సామాన్య ప్ర‌జ‌ల‌పై ఏదైనా కార‌ణంతో ఇలాంటి కేసు న‌మోదు చేస్తే మీడియా ఇదే విధ‌మైన గోప్య‌త పాటిస్తుందా అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం

అదంతా ప్రమోషనల్ జిమ్మిక్