ఎంతైనా బొత్స గారి మాటల్లో చాలా చాలా సరదా అర్థాలుంటాయి. ఆయన చాలా మామూలుగానే మాట్లాడుతారు. కానీ.. ఆ మాటలకు ఉండగల అర్థాలే పెక్కురీతులుగా ఉంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో రాష్ట్రపతి ఏర్పాటుచేసిన విందుకు జగన్ ను ఎందుకు ఆహ్వానించలేదన్న దానికి ఆయన ఇచ్చిన వివరణ కూడా చిత్రంగానే ఉంది. జగన్ హవాను, బలాన్ని చూసి మోడీ జడుసుకుంటున్నారా? అని సందేహాలు కలిగే రీతిలో ఆయన మాటలు ఉన్నాయి.
ఈ విషయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు బొత్స సత్యానారాయణ సమాధానమిస్తూ.. బలమైన నాయకుడు గనుకనే జగన్ ను ఆహ్వానించలేదేమో అని సెలవిచ్చారు. దేశంలో పలుమార్లు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలను కూడా పిలవలేదని.. ఈ పోకడలను బట్టి చూస్తోంటే.. బలమైన నాయకులను పిలవలేదని అర్థమవుతోందని బొత్స చెప్పడం చిత్రంగా కనిపిస్తోంది. అంటే ఆయన దృష్టిలో జగన్ బలాన్ని చూసి, భాజపా ఓర్వలేకపనోతున్నదని గానీ, భయపడుతున్నదని గానీ అర్థం వచ్చేలా ఉంది.
అదే సమయంలో బొత్స… భాజపాకు వారి లెక్కలు, సమీకరణలు వారికి ఉంటాయని కూడా అంటున్నారు.
భాజపా- వైకాపా బంధం ముదురుతున్నదేమో అనే అనుమానాలు ప్రజల్లో కలగడానికి కూడా బొత్స కొన్ని రోజుల కిందట మాట్లాడిన మాటలే కారణం. జగన్ ఢిల్లీ టూర్ తర్వాత.. ఏమో అవకాశం వస్తే కేంద్ర కేబినెట్ లో చేరుతాం.. మేం వారితో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నాం వంటి డైలాగులతో బొత్స సత్యనారాయణ ప్రజల్లో అనుమానాలు పుట్టించారు. ఆ వ్యాఖ్యలపై చాలా రాద్ధాంతం రేగింది. వైకాపా ఇతర నాయకులు ఖండించారు. తాను అలా అనలేదని బొత్స మాట మార్చారు. తీరా ఇప్పుడు… మరో వివాదం పుట్టేలాగా జగన్ బలం గురించి ట్రంప్ తో విందుకు ముడిపెడుతూ ఆయన మాట్లాడడమే తమాషా.
ట్రంప్ తో విందుకు ఎవరిని ఆహ్వానించాలనే విషయంలో ఇదమిత్థంగా కారణాలు ఏమీ కేంద్రం తేల్చి చెప్పలేదు. ప్రాతిపదిక ఏమిటో ఎవ్వరికీ తెలియదు. పొరుగురాష్ట్రం సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు గనుక.. జగన్ ను ఆహ్వానించలేదనే చర్చ తెరపైకి వచ్చింది. విపక్షాలు దానిని పట్టుకుని.. అక్కడికేదో ఘోరం జరిగిపోయినట్లుగా ప్రచారం సాగించాయి!