మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విశాఖపట్టణంలో తన ప్రజాచైతన్య యాత్రను నిర్వహిస్తున్నారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ఎదుట తెలియజెప్పడం, ప్రభుత్వం తప్పులు చేస్తున్నదని నిరూపించడం చంద్రబాబు లక్ష్యం. ఈ సందర్భంగా.. చంద్రబాబు ర్యాలీ నిర్వహించడానికి పోలీసు శాఖ అనుమతులు నిరాకరించింది. విశాఖలో ఆయన నిర్వహించదలచుకున్న ఇతర కార్యక్రమాలకు కూడా అనేక షరతులు విధించింది. చంద్రబాబు వెంట 50మంది నాయకులకు మించి ఉండకూదని.. కాన్వాయ్‌లోనూ వాహనాలు చాలా పరిమితం గా మాత్రమే ఉండాలని నిబంధనలు విధించింది.
అంతా కలిపి ఇక్కడ అర్థంకాని సంగతి ఏంటంటే.. పోలీసు యంత్రాంగం మొత్తం కూడబలుక్కున్నట్లుగా.. చంద్రబాబును హీరో చేయడానికి ఎందుకు ఇంతగా తపిస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని ఆటంకాలు సృష్టించేకొద్దీ.. చంద్రబాబు నాయుడు అంతగా హీరో అవుతారనే సంగతి వారు గుర్తించడంలేదు. ప్రతి ఆటంకాన్ని తమ రాజకీయా మైలేజీకి వాడుకుంటారనే విషయాన్ని కూడా వారు తెలుసుకోవడం లేదు.
వర్తమానంలో చంద్రబాబునాయుడు ప్రజలు తిరస్కరించిన నాయకుడు. తృటిలో అధికారం మిస్సయిన నాయకుడు కాదు. ఆయన పార్టీని కేవలం 23 సీట్లకు పరిమితం చేసి.. ప్రజలు స్పష్టంగా ఆయనను తిరస్కరించారు. అలాంటి నాయకుడు ప్రజల్లోకి వస్తోంటే.. ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవాలి? అది కూడా జగన్ ఎగ్జిక్యూటివ్ రాజధానిని ఏర్పాటు చేయదలచుకున్న తర్వాత.. ప్రజలు ఆయనకు నీరాజనం పడుతున్న విశాఖ పట్టణంలో!
విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. రాజధాని ప్రకటించిన తర్వాత.. ప్రజలంతా హేపీగా ఉన్నారు. తమ నగరం స్థాయికి తగిన ప్రగతిని చూడబోతున్నదని ఆనందిస్తున్నారు. అలాంటి ఊర్లో చంద్రబాబునాయుడు ను మాట్లాడనివ్వాలి. ఇప్పటికే చంద్రబాబు.. కొన్నిచోట్ల అమరావతి రాజధాని డిమాండును పలుచన చేసేసి.. కేవలం జగన్ దూషణలతో సభలు ముగిస్తున్నారు. విశాఖలు ఆయనకు ఫుల్ పర్మిట్ ఇచ్చేసి ఉంటే.. ఈ నగరానికి రాజధాని రావొద్దు అనే తన డిమాండ్ ను ఏ రకంగా ప్రజల ఎదుట పెట్టి ఉంటారో ప్రభుత్వం వేడుక చూసి ఉండాల్సింది. అలాకాకుండా, చంద్రబాబు యాత్రకు ఆటంకాలు సృష్టించడం ద్వారా.. ఆయన అమరావతి రాజధాని గురించి గానీ.. విశాఖకు రాజధాని వద్దని గానీ చెప్పే అవకాశం లేకుండా.. తన యాత్రను చూసి భయపడి ఆటంకాలు సృష్టిస్తున్నారనే టాపిక్ మీదకే ప్రసంగం మళ్లించే అవకాశం కల్పించారు.