మిసెస్ సమంతకి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. ఇంతకాలం స్టార్ హీరోల చిత్రాల్లో నటిగా ఎక్కువ స్కోప్ ఇవ్వని పాత్రలు చేసిన సమంత ఇక తనకి నచ్చిన సినిమాలు చేసుకుందామని డిసైడయింది. 'యు టర్న్' చిత్రం ప్రశంసలు అందుకున్నా కానీ ఆర్థికంగా చెప్పుకోతగ్గ ఫలితాన్ని అందుకోలేదు. కానీ ఆ ఫలితం సమంతని నిరాశ పరచలేదు.
ఇకపై కథానాయిక ప్రధానంగా వుండే చిత్రాలనే సమంత ఎక్కువగా చేయనుంది. ఇందులో భాగంగా 'మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేయాలని డిసైడయింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రంలో అప్పటికప్పుడు ఇరవయ్యేళ్ల యువతిగా మారిపోయే డెబ్బయ్ ఏళ్ల వృద్ధురాలి పాత్రలో సమంత కనిపించనుంది.
ఈ చిత్రం పలు దేశాల్లో రీమేక్ అయి అన్ని చోట్లా ప్రశంసలు అందుకుంది. సమంత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చేయబోతోంది. మునుపటిలా ఎక్కువ చిత్రాలు ఒప్పుకోకుండా తన వైవాహిక జీవితానికి తగినంత సమయం ఇస్తూనే ఇలా మనసుకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ కెరీర్ కొనసాగించాలని సమంత ఫిక్సయింది.