అబ్బో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మామూలోడు కాదు. డొనాల్డ్ ట్రంప్ కన్నుపడితే చాలు…ఆమెను దక్కించుకోవాల్సిందేనా? ట‌్రంప్ వ్యవహారం చూస్తే అట్లే ఉంది. అప్పటికే రెండు పెళ్లిళ్లు పెటాకులైనా ఆయన మనసులో ప్రేమ నిత్యనూతనమే. లేకపోతే 52 ఏళ్ల ట్రంప్ ఎక్కడ…28 ఏళ్ల మెలనియా వయసు ఎక్కడ? వయసులో ఇద్దరికీ 24 ఏళ్ల తేడా. మనసుకు నచ్చితే వయసుతో పనేంటని ట్రంప్ గ్లామర్ మోడల్ మెలానియా వెంట పడి…మరీ తన జీవితభాగస్వామిగా చేసుకున్నాడు.
1998లో మెలనియా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో మొదటిసారి ట్రంప్ కంటపడింది. అమెరికాలో ట్రంప్ పెద్ద వ్యాపారవేత్త. ఆమె మోడల్, టీవీ వ్యాఖ్యాత. అప్పటికే ట్రంప్ జీవితం నుంచి ఇద్దరు మహిళలు నిష్క్రమించారు. కానీ ఆయనకు 50 ఏళ్లు పైబడినా మహిళల దాహం తీరలేదు. ప్రేమపై మనసు చావలేదు. మెలనియా అందానికి ఆయన ఫిదా అయ్యాడు.
దీంతో ఆయన ‘ ఎవరీ అమ్మాయి!’ అని ఆరా తీశాడు. అమెరికన్ అమ్మాయి కాదని, స్లొవేనియా మోడల్ అని చెప్పారు. దీంతో ఆమె పరిచయం కోసం తహతహలాడాడు. పరిచయం చేసుకున్నాడు. రెండేళ్ల క్రితమే ఫ్యామిలీతో పాటు న్యూయార్క్ వచ్చినట్లు ఆమె ట్రంప్‌నకు చెప్పింది మెలనియా. ఫోన్ నెంబర్ అడిగాడు. ఊహూ, ఇవ్వనని మెలనియా తెగేసి చెప్పింది. దీనికి కారణం లేకపోలేదు. అతడి పక్కనే సెలీనా మిడెల్‌ఫార్ట్ అనే అమ్మాయి ఉంది.
ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయి ఫోన్ నెంబర్ అడగడం ఆమెకు అసలు నచ్చలేదు. అంతేకాదు ట్రంప్‌పై ఆమెకు కోపం వచ్చి నెంబర్ ఇవ్వలేదు. ట్రంప్ పట్టు పట్టాడంటే వదిలే రకం కాదు. ఆమెను విడిచిపెట్టలేదు. మెలనియా ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వెళ్లాడు. నిను వీడని నీడను నేను అంటూ ఫాలో అయ్యాడు. చివరికి ‘ఎస్’ అంది. తర్వాత కొన్నాళ్లకు ‘నో’ అంది. అలా కొంతకాలం ‘ఎస్’లు, ‘నో’ లతో వాళ్ల రిలేషన్ నడిచింది.
ఫస్ట్ టైమ్ ‘హోవార్డ్ స్టెర్న్ టీవీ షో’లో ఇద్దరి మధ్య ప్రేమ బయటపడింది. తర్వాత ఇద్దరూ అమెరికా అంతటా చెట్టపట్టాలేసుకుని తిరిగారు. డ్యూయెట్స్ పాడుకున్నారు. ట్రంప్ 2005లో ఓ టీవీ చానెల్‌లో మాట్లాడుతూ ‘‘మా మధ్య వాదులాటలు ఉండవు. మా గురించి ప్రపంచం వాదులాటలు పెట్టుకోవడం తప్ప’’ అని అన్నాడు. ఆ ముందు ఏడాదే వీళ్ల ఎంగేజ్‌మెంట్ అయింది. 2005లో పెళ్లి. 2006లో మెలనియా తల్లి అయింది. కొడుకు పుట్టాడు. మెలనియాకు 2005లో అమెరికన్ పౌరసత్వం లభించింది. తాజాగా ట్రంప్-మెలనియా కలసి ఇండియా టూర్‌కు వచ్చిన సందర్భంగా వారి ప్రేమగాధపై ఈ చర్చ.