మాజీ మంత్రి పరిటాల సునీత అవినీతి పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని అంటున్నారు రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. తెలుగుదేశం హయాంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వస్తుండటంపై ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. పరిటాల ఆధ్వర్యంలో జరిగిన అవినీతి వ్యవహారాలను కూడా వెలుగులోకి తీసుకొస్తామని ప్రకటించారు. కాంట్రాక్టు వ్యవహారాలు, సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించిన అవినీతి వ్యవహారాలను బయటపెడతామని అన్నారు. తెలుగుదేశం పార్టీ హాయంలో పరిటాల సునీత పౌరసరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
సివిల్ సప్లైస్ లో అవినీతికి చాలా ఆస్కారం ఉంటుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. అందులోనూ అప్పట్లో చంద్రన్న కానుకలు అంటూ కోట్ల రూపాయలను చిల్లాడారు. పండగ వచ్చిందంటే.. పండగ చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. మగ్గిపోయిన పప్పు బెల్లాలను ప్రజలకు పెట్టి నేతలు కోట్ల రూపాయలు కుప్పేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అన్నా క్యాంటీన్ల వ్యవహారం కూడా రచ్చ రేగింది. అన్నా క్యాంటీన్ల నిర్మాణాలకు అంటూ కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. ఈ విషయాలను ప్రకాష్ రెడ్డి స్పందించారు. పరిటాల సునీత సోదరులు, వారి అనుచరులు నామినేషన్ పద్ధతిలో కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులను పొందారని, అడ్డగోలుగా వ్యవహరించి కోట్ల రూపాయలను దోచారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
అన్నింటినీ బయట పెట్టే సమయం వచ్చిందని, పరిటాల అవినీతిని మొత్తం బయటపెడతామని ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కియా భూముల వ్యవహారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మరి మాటల సంగతెలా ఉన్నా… అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తీసుకు వస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమవి మాటలు కాదని, చేతలనే విషయాన్ని రుజువు చేసిన వాళ్లు అవుతారు.