వైసీపీకి ఎప్ప‌టికైనా మ‌చ్చే…

తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక ముగిసినా …దొంగ ఓట్ల‌కు సంబంధించి గొడ‌వ సాగుతూనే ఉంది. తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏడు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాలున్నాయి. అయితే ఒక్క తిరుప‌తి అసెంబ్లీకి సంబంధించి మాత్ర‌మే…

తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక ముగిసినా …దొంగ ఓట్ల‌కు సంబంధించి గొడ‌వ సాగుతూనే ఉంది. తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏడు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాలున్నాయి. అయితే ఒక్క తిరుప‌తి అసెంబ్లీకి సంబంధించి మాత్ర‌మే వివాదం న‌డుస్తోంది. తిరుప‌తి న‌గ‌రంలో పెద్ద ఎత్తున అధికార పార్టీ వైసీపీ దొంగ ఓట్లు వేసుకున్న‌ట్టు ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ మూకుమ్మ‌డిగా విమ‌ర్శిస్తు న్నాయి. దొంగ ఓట్ల వ్య‌వ‌హారంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ, బీజేపీ ఫిర్యాదులు కూడా చేశాయి.

ఈ ఫిర్యాదుల వ‌ల్ల తిరిగి తిరుప‌తి అసెంబ్లీ ప‌రిధిలో రీపోలింగ్ జ‌రుగుతుందా? అంటే …లేద‌నే స‌మాధానం వ‌స్తోంది. అయితే తిరుప‌తిలో తాము వేసిన ప్లానింగ్ స‌క్సెస్ అయ్యింద‌ని వైసీపీ సంబ‌రాలు చేసుకోవ‌చ్చు. రీపోలింగ్ జ‌రిగే అవ‌కాశం లేద‌ని ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ రాజ‌కీయాలంటే సుదీర్ఘ ప్ర‌క్రియ‌. తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోసం క‌క్కుర్తి ప‌డితే, భ‌విష్య‌త్‌లో దెబ్బ తినాల్సి వ‌స్తుంద‌ని అధికార పార్టీ గుర్తించిన‌ట్టు లేదు.

మ‌రీ ముఖ్యంగా దొంగ ఓట్ల వ్య‌వ‌హార‌మే ముందుకు రాక‌పోయి ఉంటే …జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, వైసీపీకి రాజ‌కీయంగా మంచి మైలేజీ వ‌చ్చేది.  డ‌బ్బు పంపిణీ లేకుండా ఎన్నిక‌ల‌కు వెళ్లిన ఘ‌న‌త వైసీపీ ఖాతాలో ప‌డేది. ఇప్పుడు అన‌వ‌స‌రంగా దొంగ ఓట్ల ప్ర‌చారం పుణ్యాన అప‌కీర్తిని మూట క‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. ప్ర‌తిప‌క్షాలు ఆరోపించిన‌ స్థాయిలో కాక‌పోయినా …అందులో నిజం లేక‌పోలేదు. అయితే రాజ‌కీయ వ్య‌వ‌స్థ మొత్తాన్ని డ‌బ్బుతో క‌లుషితం చేయ‌డంలో చంద్ర‌బాబుది కీల‌క‌పాత్ర‌.

ఇప్పుడు తాను ప్ర‌తిప‌క్షంలో ఉంటే మాత్రం అంతా నీతిగా ఉండాలి, అన్నీ స‌వ్యంగా జ‌ర‌గాల‌ని ఆయ‌న వాదించ‌డం విడ్డూరంగా ఉంది. చంద్ర‌బాబు, సోము వీర్రాజు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోస‌మో కాదు కానీ, ఎన్నిక‌ల్లో ధ‌న ప్ర‌భావాన్ని త‌గ్గించాల‌నే జ‌గ‌న్ ఆశ‌యం మాత్రం ప్ర‌శంస‌నీయ‌మైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా ….ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టే కార్య‌క్ర‌మాల‌కు జ‌గ‌న్ అంగీక‌రించ‌క‌పోవ‌డం ప్ర‌తి ఒక్క‌రూ స్వాగ‌తించాల్సిందే.

అయితే చంద్రుడిపై మ‌చ్చ‌లాగా, జ‌గ‌న్ స‌ర్కార్‌కు తిరుప‌తిలో దొంగ ఓట్ల ప్ర‌క్రియ మాత్రం ఓ మ‌చ్చ‌లాగా మిగిలిపోతుంద‌ని చెప్పొచ్చు. అలాగే తిరుప‌తి దొంగ ఓట్ల పుణ్య‌మా అని …వైసీపీ భారీ మెజార్టీతో గెలుపొందినా …అదంతా దొంగ ఓట్ల ఖాతాలోకి వెళుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ సంబ‌రానికి తిరుప‌తిలో వైసీపీ ఎందుకంత బ‌రి తెగించిందో అంతు చిక్క‌ని విష‌య‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో స్థానిక ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి పేరు ఎక్క‌డా వినిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కేంద్రంగా తిరుప‌తిలో దొంగ ఓట్ల దందాపై పాల‌క ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు సంధించుకున్నాయి. అంతిమంగా వైసీపీకి చెడ్డు పేరు రావ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్‌లో తిరుప‌తిలో న‌ష్ట‌పోయేది మాత్రం భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మాత్ర‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

వైఎస్సార్ కోట‌రీలో వ్యూహ‌క‌ర్త‌గా పేరొందిన క‌రుణాక‌ర‌రెడ్డి నిన్న‌టి తిరుప‌తి ఎపిసోడ్‌లో తాను కోల్పోయిందేంటో గ్ర‌హించారా? తిరుప‌తిలో దొంగ ఓట్ల‌తో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తికి ఓ ప‌దివేల ఓట్లు పెరగొచ్చు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ‌ద్ద మార్కులు పెరిగి ఉండొచ్చు. కానీ తిరుప‌తిలో జ‌రిగే ప్ర‌తి ఘ‌ట‌న‌కు అంతిమంగా మంచైనా, చెడైనా భ‌రించాల్సింది తానేన‌ని క‌రుణాక‌ర‌రెడ్డి గ్ర‌హించారా? మ‌రెందుకుని తిరుప‌తిని మ‌రొక‌రి చేతుల్లో పెట్టాల్సి వ‌చ్చింది?

ఇటీవ‌ల తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఏక‌ప‌క్ష విజ‌యాల్ని సొంతం చేసుకుని తిరుగులేని నాయ‌కుడిన‌ని నిరూపించుకున్న క‌రుణాక‌ర రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు భూమ‌న అభిన‌య్‌రెడ్డి …ఉప పోరులో మాత్రం ఎక్క‌డా ఉనికే లేకుండా చేసుకోవ‌డం వెనుక వ్యూహ‌మా? లేక త‌ప్పిద‌మా? అర్థం కావ‌డం లేదు. 

తిరుప‌తిలో మంత్రి పెద్దిరెడ్డి అంతా తానై చేశాన‌ని లోకానికి చాటి చెప్ప‌డం ద్వారా …భూమ‌న పాత్ర ఏంటి? అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే వైసీపీ శ్రేణుల్లో త‌లెత్త‌దా? అస‌లు తిరుప‌తిలో ఏం జ‌రుగుతోంది? చాప కింద నీరులా ముంచుకొస్తున్న ప్ర‌మాదాన్ని భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అభిన‌య్ గుర్తించారా?  

విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు, విభిన్న‌ ఆలోచ‌నాప‌రులు, ఆధ్యాత్మిక‌, హేతువాద భావ‌జాలాల‌తో భిన్న‌త్వంలో ఏక‌త్వానికి ఆల‌వాల‌మైన తిరుప‌తి ఎంతో సున్నిత‌మైన నియోజ‌కవ‌ర్గం. అలాంటి చోట వైసీపీ చాలా మొర‌ట‌గా వ్య‌వ‌హ‌రించింద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా మాంసం తింటున్నామ‌ని ఎముక‌లు మెడ‌లో వేసుకున్న చందంగా …. తిరుప‌తిలో వైసీపీ వ్య‌వ‌హ‌రించిన తీరు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

వెంక‌న్న ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌ట్టు …ఇత‌ర ప్రాంతాల నుంచి బ‌స్సుల్లో వ‌చ్చిన వైసీపీ శ్రేణులు నేరుగా పోలింగ్ కేంద్రాల వ‌ద్దే దిగ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్ర‌స్తుతం అధికారంలో ఉండ‌డం వ‌ల్ల వైసీపీ ఏం చేసినా చెల్లుబాటు అవుతుండొచ్చు. కానీ భ‌విష్య‌త్‌లో ఈ సంఘ‌ట‌న‌లే పౌర స‌మాజం నుంచి మ‌ద్ద‌తు క‌రువ‌య్యేలా చేస్తుంద‌ని హెచ్చ‌రించ‌క త‌ప్ప‌దు. దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబే అని పాల‌క‌ప‌క్షం గుర్తించి మ‌స‌లుకుంటే మంచిది.

సొదుం ర‌మ‌ణ‌