థాంక్స్ చెప్పడం పవన్ కు చిన్నతనమా?

కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి అనే అమ్మాయికి అన్యాయం జరిగింది. పాఠశాలకు వెళ్లిన పదోతరగతి బాలికను అత్యాచారం చేసి, అంతమొందించారు. ఇది మానవత్వం ఉన్న ఎవరైనా ఖండించే విషయం. అలాగే పవన్ కల్యాణ్ కూడా…

కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి అనే అమ్మాయికి అన్యాయం జరిగింది. పాఠశాలకు వెళ్లిన పదోతరగతి బాలికను అత్యాచారం చేసి, అంతమొందించారు. ఇది మానవత్వం ఉన్న ఎవరైనా ఖండించే విషయం. అలాగే పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ఆ అమ్మాయి కుటుంబం తరఫున కేసును సీబీఐకు అప్పగించాలనే డిమాండును వినిపించారు.

ఆయన డిమాండు చేసినందువల్లనో.. లేదా.. ప్రీతి కుటుంబీకుల ద్వారా తన దృష్టికి వచ్చినందువల్లనో.. మొత్తానికి ముఖ్యమంత్రి జగన్ కేసును సీబీఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల పవన్ కల్యాణ్ కూడా స్పందించారు గానీ.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలో, అభినందనలో చెప్పడానికి ఆయనకు నోరు రాకపోవడం గమనార్హం. మంచినిర్ణయం, ఆ కుటుంబానికి ఊరట అంటున్నారే తప్ప.. కృతజ్ఞతలు మాత్రం చెప్పలేదు.

సుగాలి ప్రీతి వ్యవహారం అమానుషమైనది. 2017 లో ఈ హత్యాచారం జరిగింది. అత్యాచారానికి ఒడిగట్టిన వాళ్లు తెలుగుదేశం పార్టీ నాయకులే అనే ఆరోపణలున్నాయి. బలహీనమైన  కేసులు పెట్టి నిందితుల్ని వదిలేశారంటూ ప్రీతి తల్లి ఆవేదన చెందుతోంది.

ఈ నేపథ్యంలో అప్పట్లోనే పవన్ ఓసారి ఈ సమస్యను లేవనెత్తారు. అప్పట్లో తెదేపా సర్కారు ఆయన డిమాండును ఏమాత్రం పట్టించుకోలేదు. పవన్ కూడా.. ఏదో ఎన్నికల స్టంటులాగా ఆ డిమాండు వినిపించి అంతటితో వదిలిపెట్టారు.

తీరా ఇప్పుడు మళ్లీ ఆ అంశం మీద కర్నూలులో ర్యాలీ నిర్వహించి.. కేసు సీబీఐకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవన్ పుణ్యమే అని ప్రస్తుతానికి అనుకున్నప్పటికీ, జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారు. పవన్ కావాలంటే.. క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవచ్చు.

ప్రీతి కుటుంబీకులు జగన్మోహన రెడ్డికి థాంక్స్ చెప్పకుండా తనకు మాత్రమే థాంక్స్ చెప్పాలని కూడా ఆయన కోరుకోవచ్చు. కానీ.. మానవత్వం ఉన్న వ్యక్తిగా.. తాను డిమాండ్ చేసిన నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రిని అభినందిస్తే ఆయన ఇమేజీ పదింతలు పెరిగి ఉండేది. ప్రజలందరూ పవన్ నిష్పాక్షితను గౌరవించేవాళ్లు.

పవన్ తను విడుదల చేసిన ప్రెస్ నోట్ లో.. ప్రీతి కుటుంబం తరఫున పోరాడిన జనసైనికులకు అభినందనలు చెప్పారే తప్ప.. కనీసం.. సీఎంకు కృతజ్ఞతలు గానీ, అభినందనలు గానీ చెప్పనేలేదు. పైగా ఇప్పటికే ఆలస్యమైందంటున్నారు. ఎన్నికల తర్వాత.. పనిలేకుండా ఖాళీ అయిపోయి సినిమాలు చేసుకుంటున్న పవన్ కల్యాణ్ కే ప్రీతి కేసు గురించి పట్టించుకోడానికి ఇప్పటిదాకా ఖాళీ దొరకలేదు.

అలాంటిది ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉన్న జగన్ కు ఎలా తెలుస్తుంది? రెండేళ్లు కేసును నీరుగార్చిన తెదేపా పాలకుల్ని ఆయన ఎందుకు నిందించడంలేదు.  జగన్ కు ఎందుకు కనీసం థాంక్స్ చెప్పలేకపోతున్నారు. ఇవన్నీ చూస్తే.. పవన్ చేస్తున్నవి అన్నీ.. సంకుచిత రాజకీయాలే అని ఎవ్వరికైనా అర్థం అవుతుంది.