“సోమవారం నుంచి ఆంధ్రలో కర్ఫ్యూ. సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్. పదో తరగతి పరీక్షలు రద్దు. స్కూల్స్ బంద్. పట్టణ ప్రాంతాల్లో పరిమిత వేళల్లో మాత్రమే షాపింగ్.” వాట్సాప్ తో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్ లో ప్రస్తుతం సర్కులేట్ అవుతున్న సందేశం ఇది.
దీంతో ప్రజలు మరోసారి భయాందోళనలకు గురవుతున్నారు. నిజమేనా అంటూ తమకు తెలిసిన వాళ్లకు ఫోన్లు చేసి ఆరాలు తీస్తున్నారు. అయితే ఈ సందేశంలో ఎలాంటి నిజం లేదంటున్నారు అధికారులు. ప్రస్తుతానికి ఏపీలో ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేస్తున్నారు.
కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. ఇప్పటివరకు లాక్ డౌన్ పై ఎలాంటి ఆదేశాలు, సూచనలు చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఆంక్షలు, పాక్షిక లాక్ డౌన్ లేనట్టే. అయితే రాబోయే రోజుల్లో మాత్రం దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు కొంతమంది అధికారులు.
ఏపీలో ప్రస్తుతం రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే 6వేల కేసులు నమోదయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పాక్షికంగా ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మాస్క్ ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం.
రాబోయే రోజుల్లో రాత్రి వేళ కర్ఫ్యూ పెట్టే ఆలోచనలో ఉంది. పదో తరగతి పరీక్షలు, పాఠశాలల నిర్వహణపై కూడా త్వరలోనే తన నిర్ణయాన్ని వెలువరచనుంది. అయితే సోమవారం నుంచే ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయనే ప్రచారంలో మాత్రం నిజం లేదు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే జనతా కర్ఫ్యూ, 144 సెక్షన్ అమల్లో ఉంది.
ఢిల్లీలో ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం వరకు వ్యాపార-వాణిజ్య కార్యకలాపాలు బంద్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లో ఆదివారాలు లాక్ డౌన్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో కరోనా కర్ఫ్యూ పేరిట ఆంక్షలు విధించారు. రాజస్థాన్ లో నిన్నట్నుంచి 19వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. తమిళనాట ఏప్రిల్ 10 నుంచి కఠిన ఆంక్షలు అమలౌతున్నాయి. పంజాబ్, కేరళలో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉంది.