తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో దొంగ ఓట్ల గురించి దుమారం చెలరేగింది. ఈ సందర్భంగా తిరుపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ నేతృత్వంలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దొంగ ఓట్లు వేసే పోలింగ్ కేంద్రాల వద్ద ఏ ఒక్కర్నీ పట్టుకున్న దాఖలాలు లేవు. ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు కూడా దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని ఏ ఒక్కరినీ అడ్డుకున్న ఘటనలు కూడా ఇంత వరకూ లేవు.
కానీ వైసీపీ ఎన్నికల ప్రధాన కార్యాలయమైన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్దకెళ్లి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ మేయర్ నరసింహయాదవ్ తదితరులు గొడవకు దిగారు. దొంగ ఓట్ల గురించి మరెవరైనా మాట్లాడితే సబబుగా ఉంటుందేమో కానీ, సుగుణమ్మతో పాటు మిగిలిన టీడీపీ నాయకులు నీతులు చెప్పడం …దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది. దొంగ ఓట్లు వేసుకునే విద్యలో టీడీపీ ఆరితేరింది. తిరుపతిలో దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా ఉందని ప్రత్యర్థులు మండిపడుతున్నారు. టీడీపీ దొంగ ఓట్ల కథ గురించి తెలుసుకుందాం.
2014లో టీడీపీ అభ్యర్థి ఎం.వెంకటరమణ తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఎన్నికైన కొంత కాలానికే ఆయన అనారోగ్యంతో చనిపోయారు. దీంతో 2015లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పట్లో ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే, పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఇచ్చే సంస్కృతికి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కట్టుబడింది. దీంతో ఆ ఉప ఎన్నికలో వైసీపీ పోటీ నిలపలేదు. అయితే కాంగ్రెస్ మాత్రం బరిలో నిలబడడంతో ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్.శ్రీదేవి పోటీలో నిలిచారు.
2015లో జరిగిన ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోవడంతో టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడింది. అధికార పార్టీ కావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. నాటి కలెక్టర్ టీడీపీ ఏజెంట్‌లా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఎం.సుగుణమ్మ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవిపై 1,16.524 ఓట్ల మెజార్టీతో గెలుపొం దారు. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 9,628 ఓట్లు మాత్రమే దక్కాయి.
టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ 85.69% ఓట్ల షేర్‌తో మొత్తం 1,26,162 ఓట్లు దక్కించుకున్నారు. ఈ ఓట్లన్నీ రిగ్గింగ్ చేసుకుంటే వచ్చినవే అని సుగుణమ్మకు తెలియదా? ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు మాట్లాడుతున్న వాళ్లంతా నాడు తమ అరాచకాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిదని వైసీపీ నేతలు హితవు చెబుతున్నారు. ప్రశ్నించే వాళ్లు లేరని తిరుపతి నగరంలో అత్త, అల్లుడు చేసిన దాష్టీకాల గురించి కథలుకథలుగా చెప్పుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఇప్పుడు తగదునమ్మా అని వీధులకెక్కి రచ్చ చేయడం సుగుణమ్మ, టీడీపీ నేతలకే చెల్లిందని ప్రత్యర్థులు అంటున్నారు. కనీసం తన మనుమరాలు కీర్తిని ఇటీవల కార్పొరేటర్‌గా కూడా గెలిపించుకోలేని స్థాయిలో ప్రజాదరణ కోల్పోయిన సుగుణమ్మ … ధర్నాలు, రాస్తారోకోలతో ప్రజల్లో సానుభూతి పొంది ఓట్లు వేయించుకోవాలనే కుయుక్తులు తప్ప, మరేమీ కాదని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఎన్నికల్లో ఇలాంటి ఛీప్ ట్రిక్స్ సుగుణమ్మ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్యగా ప్రత్యర్థులు ఘాటు విమర్శలు చేస్తున్నారు.