దిల్ రాజు-లక్ష్మణ్-శిరీష్ అనే ఈ మూడు పేర్లు ఎస్ వి సి బ్యానర్ మీద వచ్చే సినిమాల్లో కనిపించడం సినిమా అభిమానులకు తెలిసిందే. ఇప్పడు ఇక ఈ మూడు పేర్లలో ఒకటి కనిపించదు. లక్ష్మణ్ వేరే కుంపటి పెట్టుకున్నారు. దాదాపు అయిదు నెలల క్రితమే లక్ష్మణ్ ఎస్వీసీ సంస్థకు బ్రేకప్ చెప్పేసారు. ఆయన తన కొడుకు పేరుతో నేరుగా సినిమాలు తీయాలనుకుంటున్నారు.
ఇప్పటికే లక్ష్మణ్ కొడుకు నిర్మాత నిరంజన్ రెడ్డి హీరో నాగార్జున తో నిర్మిస్తున్న సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తున్నారు. ఇలా అనుభవం గడించిన తరువాత పూర్తి స్థాయి నిర్మాతగా మారతారు. ఇటీవలే మైత్రీ సంస్థలోని ముగ్గురిలో ఒకరైన మోహన్ కూడా విడిపోయిన సంగతి తెలిసిందే.
దిల్ రాజుకు లక్ష్మణ్ కు వ్యాపార బంధాలు తప్ప శిరీష్ మాదిరిగా కుటుంబ సంబంధాలు లేవు. బహుశా అందువల్ల సులువుగా బ్రేకప్ చెప్పగలిగి వుంటారు. అయిదు నెలలుగా జరుగుతున్న ఈ వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చింది. దాంతో ఇప్పుడు బయటకు వచ్చింది. చిత్రమేమిటంటే దిల్ రాజు-శిరీష్ కూడా వేరు వేరుగా వ్యాపారాలు చేసే రోజు వుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించడం విశేషం. కానీ వాళ్లు రక్త సంబంధీకులు కాబట్టి అలాంటివి వుండకపోవచ్చు.