త్వరలోనే నాగచైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమా చేయబోతున్నాడు వెంకటేష్. అయితే ఈసారి ఈ సీనియర్ హీరో నిజంగానే మామ కాబోతున్నాడు. అవును.. వెంకటేష్ తన కూతురు అశ్రితకు పెళ్లి చేయబోతున్నాడు. ఈ మేరకు మ్యాచ్ ఫిక్సింగ్ కూడా అయిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త సురేందర్ రెడ్డి మనవడికి అశ్రితను ఇచ్చి పెళ్లి చేయబోతున్నారట. హైదరాబాద్ రేస్ క్లబ్ వీళ్లదే. దీంతో పాటు వీళ్లకు చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఈ సంబంధం దాదాపు ఫిక్స్ అయినట్టు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఇది లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ అంటున్నారు. సురేందర్ రెడ్డి మనవడు, అశ్రిత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారట. వాళ్ల ప్రేమకు పెద్దలు కూడా ఒప్పుకోవడంతో లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. వెంకటేష్ తన కుటుంబాన్ని మీడియాకు, చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంచుతారు. మరీ ముఖ్యంగా పిల్లలను మీడియాకు చాలా దూరంగా ఉంచారు.
ఎలాంటి పబ్లిక్ ఫంక్షన్లు, సినిమా ఈవెంట్లకు పిల్లలను తీసుకెళ్లేవారు కాదు. అందుకే వెంకీ పిల్లల గురించి జనాలకు పెద్దగా తెలియదు. ఇప్పుడు సడెన్ గా కూతురు పెళ్లి అనేసరికి, వెంకటేష్ కు ఇంత పెద్ద కూతురు ఉందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.