బాలయ్య కోటరీలో షడ్డకుడి కలకలం?

మొత్తానికి మూడు నెలలుగా నలుగుతున్న వ్యవహారం బయటకు వచ్చేసింది. వాస్తవానికి మూడునెలలు కాదు. అంతకన్నా ఎక్కువే. నందమూరి బాలకృష్ణ సినిమా రంగ వ్యవహారాలు అంటే చూసేది కొన్నాళ్ల కిందటి వరకు ఇద్దరే. ఒకరు ఆయన…

మొత్తానికి మూడు నెలలుగా నలుగుతున్న వ్యవహారం బయటకు వచ్చేసింది. వాస్తవానికి మూడునెలలు కాదు. అంతకన్నా ఎక్కువే. నందమూరి బాలకృష్ణ సినిమా రంగ వ్యవహారాలు అంటే చూసేది కొన్నాళ్ల కిందటి వరకు ఇద్దరే. ఒకరు ఆయన వ్యవహారాలు అన్నీ క్లోజ్ గా వుంటూ డాక్టర్ గారు అని పిలిపించుకునే వ్యక్తి. రెండవది నిర్మాత సాయి కొర్రపాటి. కానీ ఎప్పుడయితే ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణం కోసం స్వంత బ్యానర్ స్టార్ట్ చేయాలని బాలయ్య అనుకున్నారో అప్పటి నుంచి కథ అంతా మారిపోయింది.

ఈ బ్యానర్ వ్యవహారాలు చూసేందుకు బాలయ్య తోడల్లుడు ప్రసాద్ రంగప్రవేశం చేసారు. అక్కడి నుంచి లుకలుకలు స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. ఇవేవీ బాలయ్య దాకా వెళ్లకుండానే చాపకింద నీరుగా సాగుతున్నాయి ఇన్నాళ్లు.

విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ బయోపిక్ ప్రతిపాదన విష్ణుది. స్క్రిప్ట్ ను ఆయనే రెడీ చేయించుకున్నారు. లేదా రెడీ చేసుకున్నారు. సరే, స్వంత బ్యానర్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో, అనుభవం వున్న సన్నిహితుడు సాయి కొర్రపాటిని కూడా కలుపుకున్నారు. అలా బాలయ్య నిర్మాతగా, సాయి, విష్ణు సహనిర్మాతలుగా ప్రాజెక్టు స్టార్ట్ అయింది. తేజ డైరక్టర్ గా వచ్చారు. అప్పుడే గతంలో ఎప్పుడో బాలయ్యతో ఓ సినిమా చేసిన తోడల్లుడు ప్రసాద్ నిర్మాణవ్యవహారాలు పర్యవేక్షించేందుకు రంగంలోకి వచ్చారు.

వస్తూనే ముందుగా ఆయనకు దర్శకుడు తేజకు మద్యలో చెడినట్లు బోగట్టా. అది చినికి చినికి ఆఖరికి తేజ బయటకు వెళ్లిపోయారు. బాలయ్య చొరవతో క్రిష్ వచ్చారు. ఇక అప్పటి నుంచే అంటే దాదాపు మూడునెలల కన్నా ముందు నుంచే సిసిఎల్ విష్ణును ఎలా పక్కకు తప్పించాలా? అన్న వ్యూహరచన ప్రారంభమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విష్ణునే నిజంగా స్క్రిప్ట్ తయారుచేసారా? దర్శకుడు నీలకంఠ పాత్ర ఏమిటి? ఇవన్నీ ఆరా తీసే కార్యక్రమాన్ని ప్రసాద్ స్టార్ట్ చేసారని ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ విషయం విష్ణు దాకా వెళ్లినా కామ్ గా వుండిపోయారని తెలుస్తోంది.

ఎప్పుడైతే క్రిష్ వచ్చారో, సినిమాకు మార్పులు చేర్పులు చేసి, స్టార్ కాస్ట్ పెరిగిందో, బజ్ రావడం మొదలైంది. దాంతో సినిమాకు మాంచి లాభాలు కనిపించే అవకాశం వున్నట్లు తేలింది. అప్పటి నుంచి ఇక ఇద్దరు సహనిర్మాతలను పంపేయాలన్న స్కెచ్ స్టార్ట్ అయినట్లు బోగట్టా.

జరుగుతున్నవి అన్నీ తెలుస్తున్నా, సాయి కొర్రపాటి, విష్ణు చేసేది లేక మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వీళ్లు బయటవాళ్లు, ప్రసాద్ తోడల్లుడు. ప్రసాద్ తో ఘర్షణ పడి, బాలయ్యకు దూరంకావడం ఇష్టం లేక ఆ ఇద్దరూ మౌనం  వహించినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే మొన్న వినాయకచవితికి లుక్ పోస్టర్ వదిలినపుడే, కేవలం బాలయ్య పేరు మాత్రమే వుండేలా, సహనిర్మాతల పేర్లు లేకుండా ఓ పోస్టర్, ముగ్గురి పేర్లతో ఓ పోస్టర్ డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ రెండూ బాలయ్య అప్రూవల్ కు పంపితే, ఆయన ముగ్గురు పేర్లు వున్న పోస్టర్ నే అప్రూవ్ చేసి పంపినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటికి ఆ వ్యవహారం సద్దుమణిగింది. 

వాస్తవానికి సాయి కొర్రపాటి, విష్ణు పెద్దగా ఇన్వెస్ట్ చేసింది లేదు. సింగిల్ డిజిట్ కోట్లలోనే పెట్టినట్లు వినికిడి. అందువల్ల ఇఫ్పుడు వారిద్దరిని సెటిల్ చేసి, కేవలం బాలయ్య సోలో ప్రాజెక్టుగా బయోపిక్ ను మార్చాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది తెలిసినా తాము ఏమీ చేయలేమని వారు మౌనం వహించారట.

నష్టాలైతే.. అలా.. లాభాలైతే అలా…
చిరకాలంగా అంటే దాదాపు గడచిన నాలుగైదేళ్లుగా బాలకృష్ణతో సినిమాలు చేసి నష్టపోయిన నిర్మాతలే తప్ప, లాభాలు పొందిన వారు లేరు. అది అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాలు అయితే డిజాస్టర్లు అయి, అటు బయ్యర్లో, ఇటు నిర్మాతలో గుల్లయిపోయినవారే. 

ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో గుసగుసలకు దారితీస్తోంది. నష్టాల ప్రాజెక్టులు అయితే నిర్మాతలు కావాలి. లాభాల ప్రాజెక్టు అయితే స్వంత బ్యానర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు రాబోయే బాలయ్య-బోయపాటి ప్రాజెక్టు కూడా బాలయ్య స్వంత ప్రాజెక్టునే. కానీ ఆ తరువాత మాత్రం మళ్లీ నిర్మాతలకు ఇస్తారని వినికిడి.

నిర్మాతలనే కాదు

కేవలం సహనిర్మాతలనే కాదు, సినిమాకు, బాలయ్యకు సంబంధించి మరి కొందరి మార్పులు చేర్పులు జరిగే అవకాశం వుందని, ఆ మేరకు ఇప్పటికే బాలయ్య తోడల్లుడు తన స్టయిల్ ఎంక్వయిరీలు వగైరా ఫినిష్ చేసి వుంచారని టాక్ వినిపిస్తోంది. మొత్తంమీద చూస్తుంటే ఎన్టీఆర్ బయోపిక్ పూర్తయ్యేలోగా బాలయ్య చుట్టూవుండే టీమ్ మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

కానీ ఇవన్నీ బాలయ్యకు తెలియవని, ఎవ్వరూ తమకెందుకు, వాళ్లు, వాళ్లు ఒక కుటుంబం తామే బయటవారం అని సైలంట్ గా వుండిపోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి రాబోయే దసరాకు వదిలే బయోపిక్ పోస్టర్ లో మాత్రం ఇక సాయి కొర్రపాటి, విష్ణుల పేర్లు వుండవనే రూఢిగా వినిపిస్తోంది.

ఆ ఇద్దరూ ప్రెజెంటర్స్-ప్రసాద్

ఇదిలా వుండగా ఈ టోటల్ ఎపిసోడ్ మీద, వినవస్తున్న గ్యాసిప్ ల మీద బాలయ్య తోడల్లుడు ఎమ్ ఆర్ వి ప్రసాద్ వివరణ ను గ్రేట్ ఆంధ్ర తీసుకుంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి కేవలం సినిమాకు ప్రెజెంటర్స్ అని, బ్యానర్ ఎన్ బి కె ఫిలింస్ అని, నిర్మాత బాలకృష్ణ మాత్రమే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. మరి ప్రారంభంలో సహనిర్మాతలు అని పేర్కొన్నారు కదా? అని ప్రశ్నించగా, అది పొరపాటు దొర్లిందని వివరించారు.

ఇలాంటి మార్పులు, చేర్పులకు మీరే కారణం అని వినిపిస్తోందని ప్రశ్నించగా 'తనకు ఆ అవసరం లేదని, దాని వల్ల తనకేం ప్రయోజనం' అని ఆయన తిరిగి ప్రశ్నించారు. ఇకపై బాలయ్య తన స్వంత బ్యానర్ పైనే మాగ్జిమమ్ సినిమాలు చేస్తారని, బయట బ్యానర్ లకు మరీ స్క్రిప్ట్ అద్భుతంగా వుంటేనే చేస్తారని అన్నారు. అప్పుడు కూడా భాగస్వామ్యం వుంటుందన్నారు.