సినిమా రివ్యూ: రంగస్థలం

రివ్యూ: రంగస్థలం రేటింగ్‌: 3.25/5 బ్యానర్‌: మైత్రి మూవీ మేకర్స్‌ తారాగణం: రామ్‌ చరణ్‌, సమంత, జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ, ప్రకాష్‌రాజ్‌, నరేష్‌, బ్రహ్మాజీ, జబర్దస్త్‌ మహేష్‌, అజయ్‌ ఘోష్‌, పూజా హెగ్డే…

రివ్యూ: రంగస్థలం
రేటింగ్‌: 3.25/5
బ్యానర్‌: మైత్రి మూవీ మేకర్స్‌
తారాగణం: రామ్‌ చరణ్‌, సమంత, జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ, ప్రకాష్‌రాజ్‌, నరేష్‌, బ్రహ్మాజీ, జబర్దస్త్‌ మహేష్‌, అజయ్‌ ఘోష్‌, పూజా హెగ్డే తదితరులు
కూర్పు: నవీన్‌ నూలి
కళ: రామకృష్ణ
సాహిత్యం: చంద్రబోస్‌
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
ఛాయాగ్రహణం: రత్నవేలు
నిర్మాతలు: నవీన్‌ యేర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం)
రచన, దర్శకత్వం: బి. సుకుమార్‌
విడుదల తేదీ: మార్చి 30, 2018

''క్యారెక్టర్‌ తలకెక్కడం కష్టం కానీ అండీ… ఒక్కసారి అది కానీ కనక్ట్‌ అయిందంటే ఇక ఆ పాత్రలో జీవించేస్తానండీ''

రామ్‌ చరణ్‌ ఈ మాటలెక్కడా అనలేదు కానీ… రంగస్థలంలో చిట్టిబాబుగా పరకాయ ప్రవేశం చేసిన అతని నట పటిమకి ఈ మాటలు అతను చెబుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. మూస సినిమాల్లో నటిస్తూ 'యాక్షన్‌, కట్‌' ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయిపోతూ చాలా రోబాటిక్‌గా కనిపిస్తూ వచ్చిన చరణ్‌ 'రంగస్థలం'లో ఫస్ట్‌ షాట్‌ నుంచీ మనకి తెలిసిన 'మెగా పవర్‌స్టార్‌'ని మర్చిపోయేట్టు చేసి 'చిట్టిబాబు'ని మాత్రం చూసేట్టు చేసాడు.

నిద్రాణమై వున్న మెగా జీన్స్‌ అన్నీ ఒకేసారి పూనకం వచ్చి విజృంభించినట్టు… 'అసలు యాక్టర్‌ మెటీరియలేనా?' అన్నవాళ్లతోనే 'ఏమి యాక్టర్‌రా బాబూ' అనిపించేసాడు. ఒక నటుడికి ఒక క్యారెక్టర్‌ నచ్చితే, దాంతో కనక్ట్‌ కాగలిగితే ఎంతగా లీనమైపోగలడో, ఇంకెంతగా దానికి జీవం పోయగలడో చరణ్‌ చూపించాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ నట ప్రదర్శన ఇవ్వడమే కాదు… ఒకేసారి ఉత్తమ నటుల సరసన స్థానాన్ని సొంతం చేసుకునే రీతిన చిట్టిబాబుగా ఒదిగిపోయాడు.

ఆ మాటకొస్తే చరణ్‌ ఒక్కడనే కాదు… 'రంగస్థలం'లోని అందరు నటులూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చక్కని క్యారెక్టరైజేషన్లు రాసుకుని, నేటివిటీకి తగ్గట్టు సజీవమైన స్కెచ్‌లు డిజైన్‌ చేయించిన సుకుమార్‌ ఇందులోని ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే సినిమానిచ్చాడు. జగపతిబాబు ఎన్నో విలన్‌ పాత్రలు చేసినా కానీ ఇందులోని 'ప్రెసిడెంట్‌గారు' అతని కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ క్యారెక్టర్స్‌. ఆది, సమంత, అనసూయ ఇలా అందరికీ 'గర్వించే' చిత్రాన్నిచ్చాడు. సైడ్‌ క్యారెక్టర్లు చేసిన జబర్దస్త్‌ మహేష్‌, అజయ్‌ ఘోష్‌లాంటి వారికి కూడా ఇదో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందనడంలో సందేహం లేదు.

మైండ్‌ గేమ్స్‌తో, ఇంటిలిజెంట్‌ టాక్టిక్స్‌తో, లేదా కన్‌ఫ్యూజింగ్‌ లాజిక్స్‌తో సుకుమార్‌ హీరోలు సహజత్వానికి కాస్త దూరంగా వుంటూ వుంటారు. అయితే ఈసారి 'లెక్కల మాస్టర్‌' అలాంటి అన్‌రియలిస్టిక్‌ అప్రోచ్‌ మాని, సోకాల్డ్‌ ఇంటిలిజెంట్‌ స్క్రీన్‌ప్లే జోలికి కానీ పోకుండా స్ట్రెయిట్‌ నెరేషన్‌తో సహజత్వాన్ని ప్రతిబింబించే కథ, పాత్రలు, భావోద్వేగాలు సృష్టించాడు. సుకుమార్‌ అండ్‌ టీమ్‌ తమతో పాటు మనని పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలోకి తీసుకుపోతారు. గోదావరి తీరంలో వున్న రంగస్థలం అనే కల్పిత గ్రామానికి చెందిన కథ చెబుతారు.

భూస్వామ్య వ్యవస్థలో అష్టకష్టాలు పడుతోన్న ఆ ఊరి ప్రజల కోసం అండగా నిలబడతారు ఇద్దరు అన్నదమ్ములు. పవర్‌కి ఎదురెళ్లిన ప్రతి ఒక్కరినీ కబళించే ఆ వ్యవస్థలో ఆ ఇద్దరు సోదరులు అనుకున్నది సాధించగలిగారా? అధికారాన్ని నిలదీసిన పర్యవసానంగా ఆ సామాన్యుల జీవితాలు ఏమవుతాయి?

సుకుమార్‌ కథ మనకి తెలిసినదే. అయితే ఒక్కసారి గతంలోకి తీసుకెళ్లి కల్పిత గ్రామంలో వాస్తవిక పాత్రలు చూపించడంతో చాలా కొత్త అనుభూతిని కలిగిస్తుంటుంది. కథలోని ముఖ్య ఘట్టాలన్నీ ఊహించినట్టుగానే జరుగుతుంటాయి. కాకపోతే తన పాత్రలని తీర్చిదిద్దిన తీరుతో సుకుమార్‌ ఆసక్తిని కలిగిస్తాడు. నిదానంగా నడిచే కథనం అయినప్పటికీ ఎక్కడా డ్రామాకి లోటు లేకపోవడంతో విసుగనిపించదు.

సుకుమార్‌ దర్శకత్వంలో వున్న మరో గొప్ప లక్షణం ఏమిటంటే… ఏ సన్నివేశం కూడా కమర్షియల్‌ విలువల కోసం నేల విడిచి సాము చేయదు. తన కథలోంచి కాస్త కూడా డీవియేట్‌ అవకుండానే అతను ఏ ఎమోషన్‌ అయినా పండిస్తాడు. హీరోయిజం ఎలివేట్‌ చేయడంలోను సుకుమార్‌ ఇదే తీరు చూపిస్తాడు. సగటు మాస్‌ హీరోలా పంచ్‌ డైలాగులు చెప్పడం, బిగ్గరగా అరుస్తూ సవాళ్లు చేయడం అతని హీరోలు చేయరు. విలన్‌ పేరుకి సంబంధించిన చిన్న కాన్సెప్ట్‌తో పీక్స్‌లో హీరోయిజం చూపించిన తీరుకి సుకుమార్‌కి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.

కథలో కొత్తదనం ఏమీ వుండదు. చాలా తెలిసిన, ఎన్నోసార్లు చూసిన ప్లాట్‌ ఇది. అయితే ఆ ప్లాట్‌ కొత్తగా అనిపించేట్టు చేసింది పాత్ర చిత్రణే. హీరోకి వినికిడి సమస్య పెట్టడంతోనే అదో డ్రైవింగ్‌ ఫ్యాక్టర్‌ అయిపోయింది. దానిని వాడుకుంటూ హాస్యం మాత్రమే కాకుండా వివిధ భావోద్వేగాలని సయితం పండించిన తీరు, చివరకు దానిచుట్టే అల్లుకున్న క్లయిమాక్స్‌ ట్విస్టు సుకుమార్‌ తెలివితేటలని చాటిచెపుతాయి.

కేవలం కథానాయకుడు, కొన్ని ముఖ్య పాత్రలు మాత్రం రాసేసుకుని సన్నివేశాలు రూపొందించేస్తూ వుంటారు. కానీ ఈ కథలో కేవలం ముఖ్య పాత్రలే కాకుండా సపోర్టింగ్‌ రోల్స్‌ అన్నీ కూడా ఎంతో పక్కాగా సిద్ధమయ్యాయి. ఉదాహరణకి అనసూయ పాత్రనే తీసుకుంటే మొదట్లో వినోదానికి మాత్రమే అన్నట్టున్న పాత్రకి ఒక ఎమోషనల్‌ టర్న్‌ ఇచ్చిన తీరు మెప్పిస్తుంది.

సుకుమార్‌ రెగ్యులర్‌గా తీసే 'తెలివైన' సినిమాల్లా లేకపోయినా కానీ అతని మార్కు చివరి ఘట్టంలో ప్రస్ఫుటమవుతుంది. బలమైన సన్నివేశాలు, పదునైన సంభాషణలు వెరసి రంగస్థలం అడుగడుగునా రక్తి కడుతూ రొటీన్‌ సినిమాల మధ్య రెగ్యులర్‌ సెటప్‌తోనే చాలా డిఫరెంట్‌ ఫీల్‌ ఇస్తుంది. డ్రామా చిక్కబడుతోన్న సమయంలో కథనం మరింత నిదానంగా మారిపోవడం సుకుమార్‌ సినిమాల్లో కనిపించే బలహీనత.

ఈ చిత్రంలో కూడా అది ద్వితియార్ధం మధ్యలో చొరబడుతుంది. కాకపోతే రామ్‌ చరణ్‌ కళ్లు తిప్పుకోనివ్వని అభినయం బలహీనతల్ని అధిగమించేట్టు చేసింది. కథలోని అత్యంత ముఖ్య ఘట్టం కోసం చాలా సమయం వెచ్చించిన సుకుమార్‌ ఆ భారాన్ని చివరి ఘట్టంతో చాలా వరకు మరిపించేసి, ఓవరాల్‌గా ఒక 'మంచి సినిమా' చూసిన ఫీలింగ్‌తో బయటకి పంపిస్తాడు.

పల్లెటూరి నేపథ్యంలో అనేక సినిమాలొచ్చాయి కానీ వేటిలోను లేనంత సహజత్వం 'రంగస్థలం'లో కనిపిస్తుంది. కళా దర్శకుడు, ఛాయాగ్రహకుడు చూపించిన ప్రతిభ అపారం. ముప్పయ్యేళ్ల క్రితం నాటి గ్రామాన్ని, పరిస్థితులని, వాతావరణాన్ని కళ్ళకి కట్టేసారు. డీటెయిలింగ్‌ పరంగా సుకుమార్‌ తీసుకునే కేర్‌కి 'రంగస్థలం' అద్దం పడుతుంది. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీత, సాహిత్యాల పరంగా కూడా అప్పటి కాలమానానికి తగ్గ వాయిద్యాలు, భాష వినిపిస్తాయి. 

సుకుమార్‌ తీర్చిదిద్దిన పాత్రలు నటీనటులు ప్రాణం పోస్తే, అతని ఆలోచనలని అత్యద్భుతంగా తెరమీదకి తీసుకొచ్చిన ఘనత సాంకేతిక వర్గానికి దక్కుతుంది. దేవిశ్రీప్రసాద్‌ పాటలే కాకుండా నేపథ్య సంగీతం కూడా ఎనభైల శైలితో కొత్త అనుభూతినిస్తుంది. బ్యాక్‌డ్రాప్‌కి, టైమ్‌ పీరియడ్‌కి తగ్గట్టు అద్భుతమైన సినిమాలు తీయడం తమిళ దర్శకులకే (పరుత్తివీరన్‌, సుబ్రమణ్యపురం) కాదు, మనసు పెడితే మనవాళ్లు కూడా అలాంటి గుర్తుండిపోయే మణిపూసలని అందించగలరని రంగస్థలం చాటిచెబుతుంది.

సగటు 'ఎంటర్‌టైనర్స్‌' నుంచి బ్రేక్‌ కోరుకునే వారికి రిలీఫ్‌ ఇచ్చే రియలిస్టిక్‌, రస్టిక్‌ ఎమోషనల్‌ డ్రామా ఇది. ఎమోషన్స్‌ మరీ 'రా'గా చూపించడం వల్ల సెన్సిటివ్‌ ఆడియన్స్‌కి కాసేపు భారంగా అనిపించవచ్చునేమో కానీ ఎంగేజ్‌ చేయడంలో, ఎంటర్‌టైన్‌ చేయడంలో 'రంగస్థలం' ఎంతమాత్రం డిజప్పాయింట్‌ చేయదు. ఇటీవల వచ్చిన పెద్ద సినిమాల్లో ప్రేక్షకులకి ఒక అనుభూతినిచ్చి, సంతృప్తిగా బయటకి పంపించిన అరుదైనవాటిలో ఇది ముందు వరుసలో వుంటుంది.

బాటమ్‌ లైన్‌: రీసౌండ్‌ వచ్చేట్టు అదరగొట్టిన చిట్టిబాబు!

– గణేష్‌ రావూరి