ఒకప్పుడు ఆడియో ఫంక్షన్లు అంటే హైదరాబాద్ శిల్పకళా వేదిక. కానీ ఇప్పడు ట్రెండ్ మారింది. ఆడియో ఫంక్షన్ అంటే విశాఖ బీచ్ అన్నది పాపులర్ గా మారుతోంది. విశాఖలో సినిమా ఫంక్షన్లు చేయడం అన్నది గత రెండేళ్లుగా పెరిగింది. అయితే ఆడియో ఫంక్షన్ల కన్నా సక్సెస్ ఫంక్షన్లు ఎక్కువగా చేసారు. తరువాత తరువాత ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేయడం అలవాటైంది.
ఇప్పుడు అది ఆనవాయతీగా మారుతున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ గా మరో రెండు రోజుల్లో సుకుమార్-రామ్ చరణ్ కాంబో రంగస్థలం సినిమా ఆడియో ఫంక్షన్ వైజాగ్ బీచ్ రోడ్ లో జరగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ తదితరులు ఈ ఫంక్షన్ కు వస్తున్నారు.
సమ్మర్ లో రాబోతున్న మరో భారీ సినిమా భరత్ అనే నేను ఆడియో ఫంక్షన్ కూడా విశాఖలోనే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఏప్రియల్ 7 లేదా 8తేదీలో ప్లాన్ చేస్తున్నారు. 7వ తేదీనే వుండడానికి ఎక్కువ అవకాశం వుంది. సూపర్ స్టార్ మహేష్ నటించిన ఈ సినిమాకు ఏస్ డైరక్టర్ కొరటాల శివ దర్శకుడు.
నైజాం తరువాత వైజాగ్ మార్కెట్ ను కీలకంగా భావిస్తున్నారు టాలీవుడ్ జనాలు. భరత్ అనే నేను సినిమాను కూడా కాస్త మంచి రేటుగా వైజాగ్ కు విక్రయించి, ప్రెస్టీజియస్ గా విడుదల చేస్తున్నారు. ఈ డీల్ వెనుక దర్శకుడు కొరటాల హ్యాండ్ కూడా వుందని వినికిడి. అందుకే ఆడియో ఫంక్షన్ ను విశాఖలో ప్లాన్ చేసారని టాక్ కూడా వుంది.