ఇప్పుడు మీడియా వంతు

మీడియా-సినిమా రంగం పరస్పర ఆధారితాలు. వాళ్ల మెటీరియల్, ప్రకటనలు వీళ్లకు కావాలి. వీళ్లు అందించే పబ్లిసిటీ వాళ్లకు కావాలి. అలాంటి సృహుద్భావ వాతావరణం గడచిన కొన్నేళ్లుగా చెడిపోయింది. సినిమా రంగంలోని కొందరు కలసి, కేవలం…

మీడియా-సినిమా రంగం పరస్పర ఆధారితాలు. వాళ్ల మెటీరియల్, ప్రకటనలు వీళ్లకు కావాలి. వీళ్లు అందించే పబ్లిసిటీ వాళ్లకు కావాలి. అలాంటి సృహుద్భావ వాతావరణం గడచిన కొన్నేళ్లుగా చెడిపోయింది. సినిమా రంగంలోని కొందరు కలసి, కేవలం ఓ సెక్షన్ ఆఫ్ మీడియాతో అగ్రిమెంట్లు చేసుకుని, వాళ్లకు మాత్రమే ప్రకటనలు ఇస్తూ, మిగిలిన వారిని వదిలేస్తూ వచ్చారు. అంతేకాదు, ఆఖరికి పెద్ద హీరోలు, డైరక్టర్లు ఇంటర్వూలు పెట్టినా, ప్రెస్ మీట్ లు పెట్టినా, అన్ని పత్రికలను, అన్ని చానెళ్లను పిలవడం మానేసారు. చిన్న సినిమాలను చిన్న చూపు చూసినట్లే, చిన్న పత్రికలను, చిన్న చానెళ్లను పట్టించుకోలేదు. పైగా సిండికేట్ అయిన నిర్మాతలు, సెలెక్టెడ్ మీడియాకు ఇచ్చే ప్రకటనల్లో కమీషన్లు కూడా తీసుకుని, తమ ఎల్ ఎల్ పికి ఆదాయమార్గం చూపించుకున్నారు. 

భయపెట్టేవాడికి భయపడతారని ఓ దినపత్రిక మొత్తం ఇండస్ట్రీ బండారాలు అన్నీ బయటకు తీయడంతో, ఇప్పుడు ఆ పత్రికకు భయపడి, ప్రతి సినిమా ప్రకటన ఇస్తూ వస్తున్నారు. కానీ మిగిలిన పత్రికలు, మిగిలిన జర్నలిస్ట్ లు సినిమా జనాల వైఖరికి బాధపడడమే తప్ప మరేమీ చేసిందిలేదు. పైగా ఈ పత్రికలు, ఈ చానెళ్లు ఎవరు చూస్తారు? అని సినిమా జనాలు ఈసడించడం ప్రారంభించారు. 

ఇలాంటి టైమ్ లో డ్రగ్ కేసు వచ్చింది. సినిమా రంగం పెద్దలు డీల్ పెట్టుకుని చానెళ్లు, డైలీలే ఇప్పుడు మరింత బలంగా ఈ కేసును ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అదే సమయంలో మిగిలిన చిన్న పత్రికలు, చానెళ్లు కూడా మరింత నిర్మొహమాటంగా వార్తలు, కథనాలు అందిస్తున్నాయి. చిన్న పత్రికలు, చానెళ్లు అందించిన కథనాలు జనాలకు చేర్చడానికి యూట్యూబ్, సోషల్ నెట్ వర్క్ లు ఉపయోగపడుతున్నాయి. చిన్న చానెళ్లు, చిన్న పత్రికలు మంచి కథనాలు అందించడంతో, మొహమాటం వున్న పెద్ద పత్రికలు, పెద్ద చానెళ్లు కూడా అదేబాట పట్టక తప్పలేదు. 

ఆ నిర్మాత మారిపోయారా?

ఓ పెద్ద నిర్మాత వున్నారు. ఆయన మీడియాను చూస్తే సీరియస్ గా వుంటారు ఎప్పుడూ. నవ్వుతూ పలకరించింది లేదు. ఆయన సినిమాలు తీయడం ఆపేసినా, ఆయన మనుషుల సినిమాలకు కూడా పబ్లిసిటీ అంటే ఆమడ దూరంలో వుంటారు. పైగా ఆయన పంపిణీ చేసే సినిమాల నిర్మాతలను కూడా రూపాయి ప్రకటనలు ఇవ్వకండి అని ఆయన కట్టడి చేస్తారు. అలాంటిది ఆయన ఇద్దరు కొడుకులు డ్రగ్స్ కేసులో వున్నారని, కోట్లు కుమ్మరించి, పలుకుబడి వాడి పేర్లు రాకుండా చేసారని వదంతులు గుప్పుమన్నాయి. 

మొన్నటికి మొన్న ఆయన ఇన్ వాల్వ్ మెంట్ వున్న సినిమా ఫంక్షన్ జరిగింది. ఈసారి ఆయన స్టయిల్ మారిపోయింది. మీడియా అందరినీ నవ్వుతూ పలకరించే ప్రయత్నం చేసారు. రాసుకుపూసుకు తిరిగారు. కానీ మీడియా మాత్రం గుసగుసలు పోయింది. ఈయనకు ఇప్పుడు మీడియా అవసరం పడుతున్నట్లుంది అంటూ. 

ప్రతి ఒక్కరికి ఓ టైమ్ వస్తుందని సామెత. సినిమా జనాలకు ఇన్నాళ్లు ఈ మీడియా గుంపు పట్టలేదు. ఇప్పుడు ఆ గుంపు జనాలకే టైమ్ వచ్చింది. నిర్మొహమాటంగా వార్తలు వండి వారుస్తున్నారు. పైగా సినిమా జర్నలిస్ట్ లు వేరు, జనరల్ జర్నలిస్ట్ లు వేరు. వీళ్లకు కాస్తయినా మొహమాటం వుంటుందేమో కానీ, వాళ్లకు నో మోమాట్స్.  దాంతో టాలీవుడ్ బాగోతాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి.