పవన్‌కళ్యాణ్ – పాతకాలపు మనిషి

సీమాంధ్ర.. ఇది రెండున్నరేళ్ళ క్రితం నాటి మాట. ఇప్పుడది ఆంధ్రప్రదేశ్‌ అయ్యింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని మినహాయిస్తే, మిగిలింది సీమాంధ్ర ప్రాంతంగా చెలామణీ అయిన విషయం విదితమే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా…

సీమాంధ్ర.. ఇది రెండున్నరేళ్ళ క్రితం నాటి మాట. ఇప్పుడది ఆంధ్రప్రదేశ్‌ అయ్యింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని మినహాయిస్తే, మిగిలింది సీమాంధ్ర ప్రాంతంగా చెలామణీ అయిన విషయం విదితమే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత, సీమాంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా మిగిలిపోయింది. అంటే, పాత పేరుతో కొత్త రాష్ట్రం.. అన్నమాట. 

సీమాంధ్ర.. అన్న ప్రస్తావన గడచిన రెండున్నరేళ్ళలో పెద్దగా ఎవరూ తీసుకురాలేదు. కానీ, పవన్‌కళ్యాణ్‌ మాత్రం తాను పాతకాలపు మనిషినని పదే పదే చాటుకుంటున్నారు. ఎప్పుడో ఏడాదికో, ఆర్నెళ్లకో, మూణ్ణెళ్ళకో మాత్రమే మీడియాకి మొహం చూపించే అలవాటున్న పవన్‌కళ్యాణ్‌, వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోలేక తడబడుతున్నారేమో అన్పిస్తోంది.. ఆయన చర్యలు చూస్తోంటే. 

నవంబర్‌ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పవన్‌కళ్యాణ్‌, బహిరంగ సభ నిర్వహించనున్నారు. 'సీమాంధ్ర హక్కుల చైతన్య సభ' అనే పేరుని ఈ బహిరంగ సభకు ఖరారు చేశారు. సభా ప్రాంగణానికి తరిమెల నాగిరెడ్డి పేరునీ, సభా వేదికకు కల్లూరు సుబ్బారావు పేరునీ పెట్టేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు పవన్‌కళ్యాణ్‌. ఈ మేరకు జనసేన పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెల్లడయ్యింది. 

సీమాంధ్ర హక్కుల చైతన్య సభ.. అంటే, ఇక్కడ మేటర్‌ ఆంధ్రప్రదేశ్‌ హక్కుల చైతన్య సభ అని. ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై పవన్‌కళ్యాణ్‌, ఈ వేదికపైనుంచి ప్రసంగించనున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా రెండు బహిరంగ సభలు నిర్వహించింది జనసేన పార్టీ. అందులో ఒకటి తిరుపతిలో హడావిడిగా నిర్వహిస్తే, ఇంకొకటి కాకినాడలో కాస్త ప్లానింగ్‌తో ఏర్పాటు చేసిన విషయం విదితమే. 

రెండో బహిరంగ సభలో బీజేపీపై ఘాటైన విమర్శలతో పవన్‌కళ్యాణ్‌ విరుచుకుపడ్డారు. మూడో బహిరంగ సభలో పవన్‌, టీడీపీని టార్గెట్‌ చేస్తారనే ప్రచారం జరుగుతున్నా, అదెంత నిజం.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. 'ప్యాకేజీపై నిపుణులతో చర్చిస్తాం..' అంటూ ఆ మధ్యన పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యల్ని, నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ మీటింగ్‌లో ప్రస్తావించడం గమనార్హం. 'ప్యాకేజీని అధ్యయనం చేస్తే, పవన్‌కళ్యాణ్‌ దాన్ని వ్యతిరేకించరు..' అనే ధీమాతో వున్నారు చంద్రబాబు. 

మరి, పవన్‌కళ్యాణ్‌ ప్యాకేజీని అర్థం చేసుకుని, ఆ ప్యాకేజీ గొప్పతనం గురించి అనంతపురం సభలో ఊకదంపుడు ప్రసంగం ఇస్తారా.? లేదంటే, బీజేపీతోపాటు టీడీపీపైన విరుచుకుపడతారా.? అని ఆయన అభిమానులే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఏదిఏమైనా, 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాష్ట్రంగా ఏర్పడినా, ఇంకా పాతకాలపు సీమాంధ్ర పేరునే పట్టుకుని వేలాడుతున్న పవన్‌కళ్యాణ్‌ నుంచి అనంతపురం బహిరంగ సభలోనూ కొత్తదనం ఆశించడం అత్యాశే అవుతుంది. అవును, పవన్‌కళ్యాణ్‌ నిజంగానే పాతకాలపు మనిషి.