స్కిప్ట్ లు బాబూ స్క్రిప్ట్ లు అంటూ కలవరిస్తోంది ఇప్పుడు టాలీవుడ్. సరైన స్క్రిప్ట్ ఎవరు తెచ్చినా అక్కున పెట్టుకుంటాం అంటోంది టాలీవుడ్.నిన్న మొన్నటి దాకా నటుల ఆస్థాన రచయితలు, లేదా కోటరీలో రైటర్లు రాజ్యం ఏలారు. దర్శకులు కూడా తమ తమ టీమ్ లతో కూర్చుని స్క్రిప్ట్ వంటకాలు సాగించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వర్కవుట్ కావడం లేదు. అంతగా ఫలితాలు ఇవ్వడం లేదు. అందుకే ఇప్పుడు కొత్త వాళ్లకు స్వాగతం, అంటూ కొత్త తరహా స్క్రిప్ట్ లకు రెడ్ కార్పెట్ పరుస్తోంది.
చిన్న సినిమాలు, వైవిధ్యమైన సినిమాలు, ఎమోషన్లు, స్వీట్ నథింగ్స్ ఇలాంటివి అన్నీ ఇప్పుడు టాలీవుడ్ లో పే ఎలిమెంట్స్ గా మారాయి. పెళ్లి చూపులు, జ్యో అచ్చ్యుతానంద, నేను శైలజ, అ..ఆ, ఊహలు గుసగుస లాడే, భలే భలే మగాడివోయ్, ఇలాంటి సినిమాల విజయాలు టాలీవుడ్ నిర్మాతల, దర్శకుల ఆలోచనను మారుస్తున్నాయి. ఇప్పుడు నిర్మాతల దగ్గర కాస్త విషయం వుంది అనుకునే కుర్రాళ్లకు ఇప్పుడు సులువుగానే ఎంట్రీ దొరుకుతోంది. షార్ట్ ఫిలిమ్ ల ద్వారా కాస్త విషయం వుంది అని నిరూపించుకున్నవారికి సులువుగానే పరిచయాలు లభిస్తున్నాయి.
ఇక్కడ ఇంకో మంచి పరిణామం ఏమిటంటే, వస్తున్న కొత్త నెత్తురులో ఎంటెక్ లు బీటెక్ లు చదివిన వారు ఎక్కువగా వుండడం. టూరింగ్ టాకీస్ లో సినిమాలు చూసి, జత బట్టలు పట్టుకుని, ట్రైన్ ఎక్కి కృష్ణనగర్ దిగిపోయే వారి కన్నా, కాస్త చదువుకుని, ప్రఫంచ సినిమా పోకడలు గమనిస్తూ, కొత్తగా తీయగలం అనిపించుకునే వారికే ఇప్పుడు వాల్యూ పెరుగుతోంది.
టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు ఒకటే విషయం పై క్లియర్ గా వున్నారు. మంచి స్క్రిప్ట్ వుంటే కావాలి. ఎవరితో తీస్తారు. ఏ హీరోకి కావాలి అన్నది కాదు. మంచి స్క్రిప్ట్ అన్నదే పాయింట్.
అయితే ఇక్కడ రెండు సమస్యలు వున్నాయి. కొట్టేయడం అన్న జాడ్యం ఇంకా టాలీవుడ్ లో పోలేదు. మంచి పాయింట్ దొరికితే కొట్టేయడం అన్నది కామన్. శ్రీమంతుడు సినిమా స్క్రిప్ట్ ను పోలినవి రెండు స్క్రిప్ట్ లు రైటర్స్ అసోసియేషన్ లో రిజస్టర్ అయి వున్నాయి. ఒక స్క్రిప్ట్ విషయంలో వివాదం చెలరేగి ఆఖరికి డబ్బుల దగ్గర రాజీకి చేరింది.అలాగే కత్తి (ఖైదీ నెంబర్ 150) కూడా అలాంటి వ్యవహారమే. కొరటాల శివ లాంటి ప్రతిభ వున్న వారు కూడా అప్రెంటీస్ రోజుల్లో సింహా లాంటి స్క్రిప్ట్ ను గురువు కోసం వదులుకోవాల్సి వచ్చిందని ఇటీవల వెల్లడయింది.
ఈ పరిస్థితి కూడా మారాలి. స్క్రిప్ట్ కు క్రెడిట్ లైన్ ఇవ్వడం అన్న దాంట్లో దర్శకులు కాస్త నిజాయతీగా వ్యవహారించాల్సి వుంది.ఆ నమ్మకం కలిగిన నాడు ఇంకా ఎంతో మంది కొత్త వాళ్లు, కొత్త సృజన టాలీవుడ్ లోకి వస్తుంది. రైటర్స్ అసోసియేషన్ కూడా ఈ విషయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త మార్పులు చేసుకుని, కొత్త రక్తాన్ని పిలిచి మరీ ప్రోత్సహించాలి. అప్పుడే ఇంకా మంచి సినిమాలు వస్తాయి.