'బాహుబలి' తర్వాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడు.? ఎవరితో చేస్తాడు.? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, 'బాహుబలి' ప్రారంభానికి ముందే పుట్టుకొచ్చింది. కానీ, 'బాహుబలి' మీదనే ఫోకస్ పెట్టిన రాజమౌళి, తదుపరి సినిమా గురించి నిన్న మొన్నటిదాకా ఆలోచించలేదు. కానీ, ఈ మధ్యన రాజమౌళి, తన తదుపరి సినిమా గురించి హింట్స్ ఇస్తున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి తదుపరి సినిమా వుండబోతోందనే విషయం రాజమౌళి ఇస్తోన్న హింట్స్‌ని బట్టి అర్థమవుతోంది. అది పౌరాణిక గాధ కానుంది. మహాభారతం నేపథ్యంలో రాజమౌళి తదుపరి సినిమా తెరకెక్కే ఛాన్స్ వుంది. ఎన్టీఆర్‌తో చేస్తే అలాంటి సినిమానే చేయాలని తనకు వుందనీ, అయితే దానికోసం చాలా ఖర్చు, చాలా సమయం అవసరమవుతాయని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
'బాహుబలి'తో తెలుగు సినిమా మార్కెట్ దశదిశలా వ్యాపించింది. జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ కూడా ఇప్పుడు ఓ రేంజ్లో కన్పిస్తోంది. 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్' సినిమాలతో ఎన్టీఆర్ మంచి ఊపు మీదున్నాడు. సో, రాజమౌళి అతి త్వరలోనే ఎన్టీఆర్‌తో చేసే సినిమాపై క్లారిటీ ఇచ్చేందుకు అవకాశాలు సుస్పష్టం. అయితే ప్రభాస్‌లా ఎన్టీఆర్ ఏళ్ళ తరబడి రాజమౌళికి డేట్స్ ఇస్తాడా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజమౌళి అడిగితే, ఎన్టీఆర్ కాదంటాడా.? ఇదీ పాయింటే మరి.! ఎందుకంటే, రాజమౌళితో తనకు బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్లున్నాయి. ఒకటి 'స్టూడెంట్ నెం.1', ఇంకోటి 'సింహాద్రి', మరోటి 'యమదొంగ'.