వసూల్‌ రాజా: గుడియెనక నాసామి

దేవాలయాల్ని ఏ రాజకీయ పార్టీ అయినాసరే 'ధనార్జన' కోణంలోనే చూస్తోంది. దేవాదాయ, ధర్మాదాయ.. అన్న పదాల్లోనే 'ఆదాయం' స్పష్టంగా కన్పిస్తుంది. అదే ఓ చర్చ్‌ విషయంలోనో, మసీదు విషయంలోనో ఏ ప్రభుత్వమైనాసరే, 'ఆర్జన' కోణంలో…

దేవాలయాల్ని ఏ రాజకీయ పార్టీ అయినాసరే 'ధనార్జన' కోణంలోనే చూస్తోంది. దేవాదాయ, ధర్మాదాయ.. అన్న పదాల్లోనే 'ఆదాయం' స్పష్టంగా కన్పిస్తుంది. అదే ఓ చర్చ్‌ విషయంలోనో, మసీదు విషయంలోనో ఏ ప్రభుత్వమైనాసరే, 'ఆర్జన' కోణంలో చూడగలదా.? ఛాన్సే లేదు. ఏమన్నా అంటే, హిందూ దేవాలయాల కోసం చేస్తున్న ఖర్చులో సగం కాదు కదా, పదోవంతు కూడా ఇతర మతాలకు చెందిన ఆలయాల మీద ఖర్చు చేయడంలేదు కదా.. అన్న చర్చ తెరపైకొస్తుంటుంది. 

నిజమే, దేవాలయాల మీద చేసినంత ఖర్చు, ఇతర మతాలకు చెందిన ఆలయాలమీద చేయరన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, దేవాలయాలమీద పాలకులు ఎందుకు ఖర్చు చేస్తున్నట్లు.? అంటే ఆ ఖర్చుకి తగినంత ఆదాయం వస్తోంది గనుక. ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు లేదా ఆలయాల విషయంలో ఈ పరిస్థితి వుండదు మరి. 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పోటీ పడి మరీ దేవాలయాల అభివృద్ధి మీద ఫోకస్‌ పెట్టేశారు. తిరుపతి తరహాలో యాదగిరిగుట్టని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి చేసేస్తున్నారు. చంద్రబాబు తక్కువేమన్నా తిన్నారా.? అటు బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం, ఇటు శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవాలయం.. తిరుపతితో సరితూగేలా అభివృద్ధి చెందుతాయని ప్రకటించేశారు. 

దేవాలయాల అభివృద్ధి విషయంలో ఎవరైనాసరే అడ్డుపడటానికి ఏమీ వుండదు. కానీ, ఆ అభివృద్ధి ముసుగులో వసూల్‌ దందా గురించే ఇప్పుడు ఆందోళన అంతా. హిందూ ధర్మాన్ని ధనార్జనకోసం వాడుకుంటుండడాన్నే తప్పుపడ్తున్నారు. కానీ ఏం చేస్తాం.? ఒక్కసారి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళిపోయాక, ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితే లేదు. సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి, వసూలు తప్పదన్నది ప్రభుత్వం వాదన. 

ఏదిఏమైనా, టెంపుల్‌ టూరిజం పేరుతో, తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం మూడు పువ్వులు ముప్పయ్యారు కాయలుగా వర్ధిల్లనుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. 

అన్నట్టు, ఆధాత్మిక భావనలు, మానసిక ప్రశాంతత విషయంలో చంద్రబాబు, ఈ రోజు శ్రీశైలం దేవస్థానానికి సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ఎందుకు ఇవ్వరు, వీఐపీల సేవలో అధికారులు నిమగ్నమైతే 'పెద్దోళ్ళకి' ప్రశాంతత ఎందుకు దక్కదు.? సామాన్యుడి పాట్లు ఈ వీవీఐపీలకు ఎందుకు అర్థమవుతాయి.! దేవాలయంలో కాదు, క్యూలైన్లలోనే భక్తులకు దేవుడు కన్పించేస్తున్నాడు మరి.

కొసమెరుపు: ఎక్కువ తప్పులు చేసినవారే, ఎక్కువగా దేవాలయాలకు వెళ్తుంటారని ఆ మధ్య చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి, చంద్రబాబు ఈ మధ్య దేవాలయాల చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారంటే, ఏమనుకోవాలట.?