'జెఎన్‌యు జాతివ్యతిరేకులకు నిలయమై పోయింది' అనే శీర్షికతో జీ న్యూస్ వారు దీన్ని సంచలనాత్మక కథనంగా ప్రదర్శించింది. వెంటనే మహేశ్ గిరి అనే బిజెపి ఎంపి ఎబివిపి కార్యకర్తల సహకారంతో వసంత్ కుంజ్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో యీ గొలుసుకట్టు సంఘటనల వెనుక ఒక పథకం వుందని అందరికీ అర్థమైంది. లేకపోతే న్యూస్ ఛానెల్ వాళ్లు క్యాంపస్‌లోకి వచ్చేటంత అవసరం ఎందుకు పడుతుంది? పోలీసులు చెప్పేదేమిటంటే – 'జెఎన్‌యులో జాతివ్యతిరేక కార్యక్రమం సాగబోతోంది, గమనించండి అని హోం శాఖ మమ్మల్ని హెచ్చరించింది. స్పెషల్ బ్రాంచ్‌కు సంబంధించిన ఏరియా ఆఫీసరు ఆ కార్యక్రమం తాలూకు పోస్టరును ఫిబ్రవరి 9 ఉదయం గమనించాడు. వెంటనే అప్రమత్తుడై స్థానిక పోలీసుకు, స్పెషల్ బ్రాంచ్ కంట్రోలు రూముకు ఫోన్ చేశాడు. ఆ కార్యక్రమం వలన క్యాంపస్‌లో శాంతిభద్రతల సమస్య వస్తుందని, డిఎస్‌యు, యితర వామపక్షవిద్యార్థియూనియన్లు సాంస్కృతిక కార్యక్రమం ముసుగులో దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని భయపడడం జరిగింది.' అని. జెఎన్‌యులో యిలాటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం కొత్త కాదు. అందరూ ఔనన్నది ఏదో ఒక విద్యార్థిబృందం కాదని అలజడి చేయడం, కాస్సేపు హంగామా చేయడం అక్కడ రివాజే. అంతమాత్రానికే కుట్ర జరిగిపోయిందంటే యీ పాటికి ఎన్ని జరిగి వుండాలి? ఢిల్లీలో వున్న ఇంగ్లీషు పత్రికలన్నిటికి క్యాంపస్‌లో రిపోర్టర్లున్నారు. అయినా ఎవరూ ఫిబ్రవరి 9 నాటి సంఘటనను పెద్దగా పట్టించుకోలేదు. విద్యార్థుల గ్రూపులు ఒకరి మీద మరొకరు కేకలు వేసుకోవడం పెద్ద న్యూస్‌గా ఎవరూ అనుకోలేదు. అందుకే ఢిల్లీ పేపర్లు సిటీ పేజీల్లో కూడా దాన్ని కవర్ చేయలేదు. ఢిల్లీలో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా వుంది. మీరు బాధ్యులంటే మీరు బాధ్యులని ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం కీచులాడుకుంటూండగానే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు తలమునకలా పని వుండి వుండాలి. కానీ బియస్ బస్సీకి అన్నిటికంటె జెఎన్‌యు ప్రదర్శనే ముఖ్యమై పోయింది. ఫిబ్రవరి 10, 11 తారీకుల్లో టివి ఛానెళ్లలో జెఎన్‌యును జాతివ్యతిరేకుల డెన్‌గా చూపిస్తూ వుండడంతో ఇదంతా ఎబివిపి ప్రచారం అనే ఖండించడానికి ఫిబ్రవరి 11 న కన్నయ్య క్యాంపస్‌లో వేరే మీటింగు పెట్టాడు. అంతే, మర్నాడు ఉదయానికల్లా ఢిల్లీ పోలీసు క్యాంపస్‌లోకి అడుగుపెట్టింది. విసి జగదీశ్ కుమార్ వారిని అనుమతించారు. పోలీసులు కన్నయ్యను, మరో ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసి దేశద్రోహం కింద కేసులు పెట్టారు.
నినాదాలిచ్చిన కుర్రవాళ్లను అరెస్టు చేయడం సరే, కన్నయ్యను ఎందుకు చేశారు? అతను మీటింగు ఆర్గనైజ్ చేయలేదు. దేశవ్యతిరేక నినాదాలు చేయలేదు. విద్యార్థి సంఘాలు కొట్టుకుంటూ వుంటే వెళ్లి మధ్యస్తం చేయబోయాడు. దానికి దేశద్రోహి అవుతాడా? జరిగిందేమిటంటే ఫిబ్రవరి 11న కన్నయ్య సంఘ్ పరివారానికి వ్యతిరేకంగా ఉపన్యాసం యిచ్చాడు. 'దేశభక్తి గురించి ఆరెస్సెస్ నుండి, బిజెపి నుండి సర్టిఫికెట్లు తీసుకోవలసిన దుస్థితిలో మేం లేం. మేము యీ దేశానికి చెందినవాళ్లం, దాన్ని ప్రేమిస్తాం. దేశజనాభాలో 80 శాతం వున్న పేదల కోసం మేం పోరాడుతాం. ఇదే మా దృష్టిలో దేశభక్తి' అని మాట్లాడడంతో ఎబివిపికి రగిలింది. దాని ఫలితమే కన్నయ్యను అరెస్టు చేయించడం! చేయించడమైతే చేయించారు కానీ తగిన సాక్ష్యాలు చూపలేక బొక్కబోర్లా పడ్డారు. అఫ్జల్ గురు ఉరిని వ్యతిరేకించినందుకే దేశద్రోహులై పోతే మరి అదే పని చేసిన పిడిఎఫ్‌తో బిజెపి పొత్తెలా కలుపుతోంది అని అందరూ అడుగుతున్నారు. బిజెపి మరో భాగస్వామి అకాలీ దళ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్‌ను చంపి ఉరిశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోవాణాను అమరవీరుడంటోంది. వారి సంగతేమిటి? దేశాన్ని మతపరంగా విడగొడుతూ ప్రకటనలు చేసిన బిజెపి ఎంపీలు దేశోద్ధారకులా?
కన్నయ్యపై దేశద్రోహి ముద్ర వేయడానికి ఫిబ్రవరి 9 నాటి మీటింగుల్లో యితరులను యిచ్చిన నినాదాలను, ఫిబ్రవరి 11 నాటి కన్నయ్య మీటింగులోకి మార్ఫ్ చేసిన వీడియోలు సంఘ్ పరివార్ అనుబంధ సంస్థల ద్వారా, సమర్థకుల ద్వారా సోషల్ మీడియాలో వీరవిహారం చేశాయి. పోలీసులను జెఎన్‌యులోకి రప్పించి వివాదానికి జాతీయప్రచారం కల్పించిన వైస్‌ఛాన్సలర్ అంతటితో ఆగలేదు. ఆ రోజు విద్యార్థులు జాతివ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా లేదా అని తేల్చడానికి అంతర్గత విచారణ కమిటీ వేశారు. అలాటి కమిటీ ముందుగా వేసి దాని నిర్ణయం వచ్చాకనే పోలీసులకు కేసు అప్పగించి వుంటే సబబుగా వుండేది. పోలీసులు వచ్చి పట్టుకెళ్లాక వాళ్లే చూసుకుంటారుగా. ఇలాటి కమిటీలో జెఎన్‌యులోని అన్ని కళాశాలలనుండి ఒక్కో ప్రతినిథిని తీసుకోవాలి. కానీ విసి గారు సైన్సు కళాశాలల నుండి మాత్రమే తీసుకుని కమిటీ ఏర్పరచేశారు. ఇది పొరపాటని జెఎన్‌యు టీచర్ల అసోసియేషన్ ఎత్తి చూపి కమిటీని మళ్లీ ఏర్పరచమని విసిపై ఒత్తిడి తెచ్చింది. చివరకు ఐదుగురు సభ్యులతో ఏర్పడిన హై లెవెల్ ఇన్క్వయిరీ కమిటీ అనిర్వాణ్ భట్టాచార్య, ఉమర్ ఖాలిద్‌లను కొంతకాలం పాటు రస్టికేట్ చేయాలని సిఫార్సు చేసింది. కన్నయ్యతో సహా మరి కొందరు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేసి జరిమానా మాత్రం వేయాలంది. 21 మంది విద్యార్థులకు క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలంది. మా తరఫు వాదనలు వినకుండానే ఎలా తీర్పిచ్చేస్తారంటూ విద్యార్థులు నోటీసులు తిరస్కరించారు. అంతిమ నిర్ణయం తీసుకోవలసిన చీఫ్ ప్రొక్టర్ మాత్రమే.
పోలీసుల అతి చేష్టలను సమర్థించుకోవడానికి కేంద్రం హోం మంత్రి ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది. నిందితుల్లో ఒకడైన ఉమర్ ఖాలిద్‌కి పాకిస్తాన్ ఆధారిత టెర్రరిస్టు గ్రూపు లష్కరే తొయిబాకు సంబంధం వుండి వుండవచ్చన్నారు. వివరాలు అడిగితే చెప్పనన్నారు. కొన్ని న్యూస్ ఛానెల్స్ ఖాలిద్‌కు జేషే మొహమ్మద్‌తో లింకు పెట్టాయి. ఈ వార్తలకు ఆధారం ఏమిటి అంటే యింటెలిజెన్సు బ్యూరో ఎవరో చెప్పారన్నారు. ఇలా చెప్పి కన్నయ్య, యితర విద్యార్థులపై జనాల్ని బాగా రెచ్చగొట్టారు. ఫిబ్రవరి 17న కన్నయ్యను పాటియాలా హౌస్ కోర్టుకి తీసుకుని వచ్చినపుడు హిందూత్వ సంఘాలవారు వారిపై, తోడుగా వచ్చిన టీచర్లపై, జర్నలిస్టులపై దాడి చేశారు. ఆ దాడి గురించి విచారించడానికి సుప్రీం కోర్టు ఏర్పరచిన కపిల్ సిబ్బల్, రాజీవ్ ధవన్, దుష్యంత్ దవే వంటి లాయర్ల బృందం వస్తే కొంతమంది లాయర్లు వారిపై కూడా దాడి చేశారు. అవన్నీ టీవీ కెమెరాలు రికార్డు చేస్తున్నా వారు ఖాతరు చేయలేదు. ఢిల్లీ ఎసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేగా వున్న ఓం శర్మ టివి కెమెరాల ఎదుటే కోర్టు బయట ఒక ఆందోళనకారుణ్ని కొట్టాడు. బస్సీగారి కళ్లకి అది 'ఓ చిన్న సంఘటన'గా కనబడింది. కనబడక ఛస్తుందా? ఆయనకు ఆ నెలలోనే రిటైర్మెంట్. రిటైరయ్యాక ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టింగుకోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం చెప్పినట్లు ఆడకపోతే పోస్టింగెలా వస్తుంది? అప్పటికీ అరవింద్ కేజ్రీవాల్‌తో అనుక్షణం తలపడి మోదీ దగ్గర మంచి మార్కులే కొట్టేశాడు. 'బస్సీ చేతిలో ఢిల్లీ ఎప్పటికీ సురక్షితం కాదు' అన్నాడు అరవింద్ విసిగిపోయి.
పోలీసు మనవాడైనపుడు దుండగులు ఆగుతారా? అందుకే వాళ్లందరూ రెచ్చిపోయారు. లాయర్ల గుంపుకు నాయకత్వం వహించిన విక్రమ్ చౌహాన్, యశ్పాల్ త్యాగిలకు నిమిషాల్లో బెయిల్ దొరికింది. పోలీసులు అభ్యంతరం తెలపలేదు. వారి కంటికి జెఎన్‌యు విద్యార్థులు తప్ప వేరెవరూ దోషులు కారు. కన్నయ్యను అరెస్టు చేయించాక ఎబివిపి నాయకుల ధైర్యం మరింత పెరిగింది. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ సత్యేందర్ ఆవానా తన క్యాంపస్‌లో ''ఈ జెఎన్‌యు విద్యార్థులను కోర్టులు శిక్షించకుండా వదిలివేస్తే, మేల్కొన్న మా యువత (జాగరూక్ యువక్) వాళ్ల క్యాంపస్‌లోకి వెళ్లి ఆ దేశద్రోహులను షూట్ చేసి పడేస్తాం'' అని ప్రసంగించాడు. ఇదీ పోలీసుల దృష్టిలో నేరం కాదు. కన్నయ్య అరెస్టుకు వ్యతిరేకంగా అలహాబాద్, పట్నా, బెనారస్ హిందూ యూనివర్శిటీల్లో జరిగిన నిరసన ప్రదర్శనలను ఎబివిపి కార్యకర్తలు అడ్డుకుని భౌతికమైన దాడులకు తెగబడ్డారు. జెఎన్‌యు క్యాంపస్‌లో కాంగ్రెసు నాయకుడు ఆనంద్ శర్మపై ఎబివిపి కార్యకర్తలు దాడి చేశారు. సిపిఐ లీడరు డి.రాజా కూతురు అపరాజిత జెఎన్‌యులో విద్యార్థిని. జాతివ్యతిరేక నినాదాలిచ్చినవారిలో ఆమె కూడా వుందని ఎబివిపి ఫిర్యాదు చేసింది. ఇలా తమతో విభేదించే ప్రతివారిని కేసుల్లో యిరికించే, భయపెట్టి అణచి వేసే ప్రయత్నం చేస్తోంది ఎబివిపి. – (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)