మెగా ఫ్యామిలీ ఉదారతను మెచ్చుకోవాల్సిన సందర్భం ఇది. హిట్టు మాత్రమే ప్రాతిపదిక అన్నట్టుగా సాగే ఇండస్ట్రీ గమనంలో…ప్లాఫుల్లో ఉన్న దర్శకులకు ఛాన్సులిచ్చి ప్రోత్సహిస్తోంది మెగా ఫ్యామిలీ. ఈ దర్శకుల ముందు సినిమా లు ఇండస్ట్రీ డిజాస్టర్లుగా నిలిచినా.. వీరిని ఆదరిస్తోంది చిరంజీవి కుటుంబం. ముందుగా మెగాస్టార్ ఫుల్ లెంగ్త్ రీ ఎంట్రీ సినిమాగా చెప్పదగ్గ 'కత్తి' రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్న వినాయక్ నే ప్రస్తావిస్తే ఆయన గత సినిమా 'అఖిల్' డిజాస్టర్ గుర్తుకొస్తుంది.
అక్కినేని అఖిల్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి భారీ ప్లాఫుగా నిలిచింది. ఆ తర్వాత వినాయక్ పరిస్థితి ఏమిటి? అనుకొంటే… ఏకంగా చిరంజీవితో సినిమాను రూపొందించే అవకాశం వచ్చింది! ఇక చరణ్ చేస్తున్న తమిళ రీమేక్ ను డీల్ చేయనున్నాడు సురేందర్ రెడ్డి. ఈ దర్శకుడి గత సినిమా కూడా డిజాస్టర్ అని వేరే చెప్పనక్కర్లేదు. 'కిక్ 2' రూపంలో సురేందర్ ఖాతాలో పెద్ద డిజాస్టర్ ఉంది. 'అఖిల్' , 'కిక్ 2' సినిమాలు రెండూ కోట్ల రూపాయల లాస్ నే మిగిల్చాయి.
వీళ్లకే కాదు.. శ్రీనువైట్లకు కూడా మెగాఫ్యామిలీ మరో ఛాన్స్ ఇస్తోంది. 'ఆగడు' ప్లాఫ్ తర్వాత ఈ దర్శకుడికి చరణ్ 'బ్రూస్ లీ' రూపంలో ఛాన్స్ ఇవ్వగా.. ఆ సినిమా కూడా గొప్ప ఫలితాన్నేమీ నమోదు చేయలేదు. అయినా కూడా వైట్లకు మెగా క్యాంప్ లో మరో ఛాన్స్ దక్కింది. ఈ దర్శకుడు వరుణ్ తేజతో సినిమా రూపొందించే అవకాశాలున్నాయి. మరి యాధృచ్ఛికంగా జరిగిందో.. లేక ప్లాఫుల్లో ఉన్నారని తెలిసినా ఛాన్సులిచ్చారో కానీ.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి లీడ్ లో ఉన్న ముగ్గురు హీరోలు డిజాస్టర్లను నమోదు చేసిన దర్శకులతోనే పనిచేస్తున్నారు. మరి వీరు వారి అదృష్టాన్ని మార్చగలరా?!