నాలుగో అంకం వసంతసేన యింట్లో ప్రారంభమైంది. వసంతసేన తన మాట వినటం లేదని గ్రహించిన శకారుడు ఆమె తల్లి వద్దకు వెళ్లి పదివేల బంగారునాణాలు, నగలు యిచ్చి మచ్చిక చేసుకున్నాడు. ఒక బండిలో వసంతసేనను అతని వద్దకు పంపిస్తానని మాట యిచ్చి తల్లి తన దాసీని బండితో సహా వసంతసేన యింటికి పంపించింది. ఆమె వెళ్లేసరికి వసంతసేన తను అప్పుడే గీసిన చారుదత్తుడి చిత్రపటం గురించి తన దాసి మదనికతో కబుర్లు చెపుతోంది. తల్లి ఆజ్ఞ వినగానే మండిపడింది. ''నేను బతికి వుండాలని కోరుకుంటే యింకెప్పుడూ యిలాటి ఆదేశాలివ్వవద్దని మా అమ్మకు చెప్పు'' అని దాసితో కఠినంగా చెప్పి పంపించివేసింది. తను గీసిన చిత్రపటాన్ని తన పడకగదిలో పెట్టి రమ్మనమని మదనికకు చెప్పింది. ఆమె లోపలకి వెళుతూ వుంటే అప్పుడే శర్విలకుడు చాటుగా వచ్చి ఆమెను కిటికీలోంచి పలకరించాడు. ''ఇన్నాళ్లూ ఎక్కడకి వెళ్లావు?'' అంటూ అడిగింది. ఇద్దరూ ఒకరినొకర్ని చూసుకుంటూ వుండిపోయారు. లోపలకి వెళ్లిన మదనిక యింకా రాలేదేమా అని వసంతసనే లోపలకి వచ్చి వీళ్లిద్దరిని రహస్యంగా గమనించింది. 'తన ప్రియుడు తనను దాసీవృత్తి నుంచి విడిపించి తీసుకెళదామనుకుంటున్నాడని మదనిక చెప్పింది, బహుశా అతను యితనేనేమో' అనుకుంది. వాళ్ల సంభాషణ చాటుగా వినసాగింది.
'డబ్బిస్తే మీ వసంతసేన వదిలేస్తుందంటావా?' అని శర్విలకుడు ఆత్రుతగా అడిగాడు. ''ఇంతకుముందే కదలేసి చూశాను. మీరంతా మా అమ్మ ఆస్తి. అందువలన డబ్బు తీసుకోవలసి వస్తోంది, నా అజమాయిషీలోనే వుంటే డబ్బు ప్రసక్తి లేకుండానే విడిచి పెట్టేసేదాన్ని అని చెప్పింది. అది సరే కానీ, నీకు అంత డబ్బు ఎలా వచ్చింది?'' అని అడిగింది మదనిక. ''ఒక దుస్సాహసం చేసి చేశాను.'' అని జవాబిచ్చాడు శర్విలకుడు.
మదనిక నివ్వెరపోయింది. ''ఈ సౌందర్యం అశాశ్వతం. దీనికోసం నువ్వు దేహాన్ని కష్టాలపాలు చేసుకున్నావు. శీలాన్ని కోల్పోయావు. తగునా?'' అని అడిగింది.
''ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు కదా..''
''ఇలాటి కబుర్లు చెప్పకు. నాకోసం పతనమయ్యావు''
''నేను పతనం కాలేదు. నాకుండే నియమాలు నాకున్నాయి. స్త్రీల నుంచి ఆభరణాలు దోచుకోను, యజ్ఞయాగాదులకై పోగు చేసి పెట్టుకున్న డబ్బును ముట్టను, దాది ఒడిలో వున్న బాలుణ్ని అపహరించను. నేను చేస్తున్నది దొంగతనమే అయినా నా బుద్ధి మంచి చెడుల గురించి ఆలోచిస్తూనే వుంటుంది. ఇక యీ చర్చ కట్టిపెట్టి యీ నగలను పట్టుకెళ్లి మీ వసంతసేనకు యిచ్చి 'మీ కోసమే చేసినట్లున్నాయి యీ నగలు' అని చెప్పి యిచ్చి నీ దాసీత్వం విడిపించుకో.'' అని శర్విలకుడు నగలమూటను ఆమె చేతిలో పెట్టాడు.
అవి చూస్తూనే మదనిక వీటినెక్కడో చూసినట్లుందే అనుకుంటూ యివి ఎక్కణ్నుంచి దొంగిలించావు అది చెప్పు అంది. ఆ వివరాలు నీకెందుకు అని శర్విలకుడు విసుక్కున్నా వదిలిపెట్టలేదు. చివరకు అతను చెప్పాడు – వ్యాపారస్తులు వుండే వీధిలో ఒక యింట్లోంచి పట్టుకుని వచ్చాను. మర్నాడు పొద్దున్న జనాలు మాట్లాడుకున్న మాటల బట్టి అది చారుదత్తుడనే ఆయన యిల్లని తెలిసింది అని.
అది వింటూనే మదనికకు మూర్ఛవచ్చినంత పని అయింది. 'ఆ యింట్లో వాళ్లనెవర్నీ కొట్టలేదు కదా' అని ఆతృతగా అడిగింది. 'నిద్రపోయేవారిని కొట్టకూడదని నా నియమం కదా, అయినా చారుదత్తుడు ఎవరోకానీ అతని గురించి అంత వ్యాకుల పడుతున్నావేమిటి? ఇక్కడ నేను నీ కోసం పడుతున్న ఆరాటం నీ కంటికి కనబడటం లేదు. ఎటువంటి సచ్చరిత్రుల వంశంలో పుట్టాను, నీకోసం ఎంతటి అనాచారాలు చేస్తున్నాను, అవన్నీ లెక్కలోకి రావా? వేశ్యల యిళ్లలో వుండివుండి నువ్వు కూడా వాళ్లలాగే తయారయినట్లున్నావే' అన్నాడు శర్విలకుడు ఆవేదనగా.
'ఓ వాచాలుడా, నీ వాగుడు కట్టిపెట్టు. ఆ నగలు వసంతసేనవే, చారుదత్తుడిపై ప్రేమతో అతని యింటికి రాకపోకలు సాగించడానికి సాకు దొరకాలని అతని దగ్గర దాచింది. నువ్వు ఆ నగలే తెచ్చి ఆమెకే యివ్వబోతున్నావు' అని మదనిక తిట్టిపోసింది. సంగతి తెలిసి శర్విలకుడు కుప్పకూలాడు. తెలియక చేసిన తప్పు యిది. బయటపడే వుపాయం చెప్పు అని మదనికను బతిమాలాడు.
వెళ్లి చారుదత్తుడికి తిరిగి యిచ్చేయి అని మదనిక చెప్పింది. 'ఇవ్వడానికి అభ్యంతరం లేదు, ఆయన రాజుకి పట్టిస్తాడన్న భయమూ లేదు, కానీ ఆయన గుణగణాలు గొప్పవని చెప్తున్నావు, ఆయన దగ్గరకు వెళ్లడానికి మొహం చెల్లటం లేదు, వేరే ఏదైనా ఉపాయం చెప్పు' అని బతిమాలాడాడు. 'అయితే చారుదత్తుడే పంపించాడని చెప్పి వసంతసేనకు నగలిచ్చేసేయి.' అని చెప్పింది మదనిక. సరేనన్నాడు శర్విలకుడు. దాసీత్వం విడిపించి పెళ్లి చేసుకునే అవకాశం కోల్పోతున్నా కనీసం యీ యిరకాటంలోంచి బయటపడుతున్నాం కదా అని యిద్దరూ సంతోషిస్తున్నారన్న విషయం గ్రహించిన వసంతసేనకు వారిపై జాలి కలిగింది. తల్లి చేత తర్వాత మాటపడినా సరే, డబ్బేమీ తీసుకోకుండా మదనికకు స్వేచ్ఛ యిచ్చేద్దామనుకుంది. ఏమీ తెలియనట్లుగా ముందుగదిలోకి వచ్చి కూర్చుంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)