రవితేజ వ్యవహారం దగ్గర నిక్కచ్చిగా వుంటాడు. ఓ మాట అనుకుంటే మాటే. లేదంటే లేదు. రెమ్యూనిరేషన్ మాట్లాడుకున్నపుడు చేసుకున్న అగ్రిమెంట్ కు నిర్మాత కట్టుబడి వుండాలంటాడు. అలాంటి వైఖరి వల్లే గతంలో పివిపి తో తకరారు వచ్చింది. ఆ తరువాత సారొచ్చారు సినిమా టైమ్ లో అశ్వనీదత్ తోనూ సమస్య వచ్చింది. ఇప్పుడు ఇదే సమస్య బెంగాల్ టైగర్ నిర్మాత రాధామోహన్ తోనూ వస్తుందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
బెంగాల్ టైగర్ తో ఒప్పందం ప్రకారం సినిమా హిట్ అయితే రవితేజకు ఓ కోటి రూపాయిలు అదనంగా చెల్లించాలి అని తెలుస్తోంది. ఇప్పుడు సినిమా హిట్ అయినట్లే. ఎందుకంటే ఓవర్ సీస్, నైజాం, సీడెడ్ బ్రేకీవెన్ అయిపోయాయి. ఆంధ్ర కూడా ఆల్ మోస్ట్ దగ్గరకు వచ్చేసింది.నైజాం 7.15 కోట్లకు,ఆంధ్ర 8.50 కోట్లు, సీడెడ్3.5కోట్లు కర్ణాటక 2.40 కోట్లు, ఒరిస్సా, తమిళనాడు 0.30 లక్షలు, హిందీ డబ్బింగ్ 2.60, శాటిలైట్ 7.50, ఓవర్ సీస్ 1.50 కి అమ్మినట్లు తెలుస్తోంది.
అంటే ముఫై మూడు నలభై అయిదు అన్నమాట. వడ్డీలు ఖర్చులు కలుపుకుని 31 దాటిందని వినికిడి. ఖర్చులు, అమ్మకాలపై తెలుస్తున్నలెక్కల ప్రకారం వడ్డీలు, పబ్లిసిటీ కలుపుకున్నా నిర్మాత ఒకటి రెండు కోట్లు లాభంలోనే వున్నారని టాక్. సో, దీనివల్ల నిర్మాత అదనపు చెల్లింపు జరపాలని హీరో అడగాలనుకుంటున్నట్లు వినికిడి.
అయితే నిర్మాతకు బయ్యర్లు అందరితో ఓవర్ ఫ్లోస్ లో వాటా ఇవ్వాలని అగ్రిమెంట్ వుంది. నైజాం, సీడెడ్ లో ఓవర్ ఫ్లో స్టార్ట్ అయింది. కానీ సినిమా రంగంలో సహజంగానే ఏ బయ్యరూ కూడా ఓవర్ ఫ్లో వుందని చెప్పరు. ఏవో ఖర్చులు చెబుతారు. అద్దెలకే సరిపోతోందని చెబుతారు. దీనివల్ల నిర్మాతకు ఓవర్ ఫ్లో ఆదాయం అన్నది అనుమానంగానే వుంది. మరి ఓవర్ ఫ్లో ఆదాయం లేకుంటే తానేం ఇస్తానని నిర్మాత భావిస్తున్నట్లు బోగట్టా. కానీ అలా అన్నంత మాత్రాన రవితేజ ఊరుకుంటారా అంటే గతానుభవాల రీత్యా అనుమానమే.
సో మళ్లీ మరోసారి రవితేజ రెమ్యూనిరేషన్ పై నిర్మాతతో తకరారు అన్నది రిపీట్ అయ్యేలాగే కనిపిస్తోంది.