తమిళనాడులో సెంటిమెంట్లు కాస్త ఎక్కువ. కాదు కాదు.. చాలా ఎక్కువ. ఆ మాటకొస్తే ‘అతి’కి పరాకాష్టగా అరవ సెంటిమెంట్ గురించి చెబుతుంటారు చాలామంది. చాలా విషయాల్లో ఇది నిజమని తేలింది. శ్రీలంక ప్రభుత్వం, ఎల్టీటీఈ అధినేత ప్రభాకర్‌ని క్రూరంగా చంపేసిందంటూ, శ్రీలంకపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది చాలాకాలంగా. ఆ కారణంగానే, శ్రీలంకకు చెందిన ఏ విషయంలో అయినా సినీ తారలకు లింక్ కుదిరితే అంతే సంగతులు.
‘కత్తి’ సినిమా వివాదాల్లో ఇరుక్కుందంటే, దానికి కారణం ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరు శ్రీలంకకు చెందిన వ్యక్తి కావడమే. తూచ్.. అదేమీ లేదని అప్పట్లో హీరో విజయ్ నెత్తీనోరూ బాదుకున్నా ఫలితం లేకుండా పోయింది. శ్రీలంకకు చెందిన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ పట్లా తమిళనాడులో కాస్తో కూస్తో వ్యక్తమవుతూనే వుంటుంది.
ఇక, తాజాగా త్రిష విషయంలో అరవ తంబిలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ‘ఎర్రచందనం దొంగలు’ హతమవడం, వారంతా తమిళనాడుకు చెందినవారు కావడంతో, ఆంధ్రప్రదేశ్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి తమిళనాడులో. సరిగ్గా ఇదే టైమ్‌లో త్రిష ‘లయన్’ సినిమా ఆడియో విడుదల వేడుకలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో కలిసి వేదికను పంచుకుంది. ఇంకేముంది, తమిళ తంబిలకు కోపమొచ్చింది.
సిల్లీగానే వున్నా, ఇలాంటి వివాదాలు తమిళనాడులో చాలా సీరియస్‌గా మారిపోతాయి. త్రిష ఈ వివాదం నుంచి ఎలా బయటపడ్తుందోగానీ, ముందు ముందు త్రిషకు చుక్కలు చూపిస్తామంటున్నారు అరవ తంబిలు. త్రిష తట్టుకోగలదంటారా మరి అరవ వ్యతిరేకతని.!