అక్కినేని వంశం నుంచి వస్తున్న కొత్త హీరో అప్పుడే తన సత్తా చూపుతున్నాడు. ఈ యువ హీరో నటించిన సినిమా బిజినెస్ అ‘ధర’హో అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాకు ప్రాంతాల వారీగా పలికిన ధర గతంలో ఇలా కొత్తగా ‘తెరంగేట్రం’చేసిన ఏ హీరోకి రాలేదని అంటున్నారు. ‘మనం’లో టీజర్ ఎంట్రీతోనే అందరినీ ఆకట్టుకున్న అఖిల్‌పై తెలుగు ప్రేక్షకుల్లో పెద్ద యెత్తున అంచనాలున్నాయి.
డ్యాన్సులు బాగా చేస్తున్నాడని, స్క్రీన్ మీద చాలా స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తాడని వస్తున్న వార్తలు వీటిని మరింత పెంచాయి. కొందరైతే భవిష్యత్తులో సూపర్‌స్టార్ మహేష్‌బాబుకి పోటీగా మారతాడని కూడా జోస్యం చెప్పేస్తున్నారు. అందుకు తగ్గట్టే… సినిమా విడుదల కాకముందే వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఏకైక తెలుగు హీరోగా కూడా అఖిల్ రికార్డ్ సృష్టించాడు.
వీటన్నింటి పుణ్యమాని… సినిమా మాత్రం అదిరే రేంజ్ బిజినెస్ చేసింద ని ట్రేడ్ టాక్. ఒక్క నైజాం ఏరియా హక్కుల కోసమే రూ.14 కోట్లు చెల్లించారట. గత అల్లు అర్జున్ సినిమా సన్నాఫ్ సత్యమూర్తి (రూ.13కోట్లు) కన్నా ఇది ఎక్కువుండడాన్ని ట్రేడ్ సర్కిల్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. సీడెడ్ రూ.6.3 కోట్లు, కృష్ణా రూ.2.5 కోట్లు… ఇలా అమ్మారని అంటున్నారు.
ఈ బిజినెస్ వరుస చూస్తుంటే నిర్మాతలకు రూ.50కోట్లకు అటూ ఇటూగా రావచ్చంటున్నారు. అఖిల్ మీద ఉన్న అంచనాలతో పాటు దర్శకుడు వి.వి.వినాయక్ సినిమాల కలక్షెన్లపై ఉన్న నమ్మకం కూడా ఈ సినిమా బయ్యర్లకు క్రేజీగా మారడానికి దోహదపడింది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజు అంటే సెప్టెంబరు 20న ఈ సినిమా ఆడియో లాంచ్ జరుగనుంది.