ఎమ్బీయస్‌: సిబిఐ చేతికి వ్యాపమ్‌- 4

సిబిఐ రంగంలోకి దిగిన మూడు రోజుల్లోనే ఎస్‌టిఎఫ్‌ను పరుగులెత్తిస్తోంది. తాము ప్రారంభించి పెండింగులో పెట్టిన 185 కేసులను సిబిఐకు అప్పగించేద్దామని చూసిన ఎస్‌టిఎఫ్‌ను మీరు యిన్వెస్టిగేషన్‌ పూర్తి చేసిన కేసుల్లో వెంటనే చార్జి షీట్లు…

సిబిఐ రంగంలోకి దిగిన మూడు రోజుల్లోనే ఎస్‌టిఎఫ్‌ను పరుగులెత్తిస్తోంది. తాము ప్రారంభించి పెండింగులో పెట్టిన 185 కేసులను సిబిఐకు అప్పగించేద్దామని చూసిన ఎస్‌టిఎఫ్‌ను మీరు యిన్వెస్టిగేషన్‌ పూర్తి చేసిన కేసుల్లో వెంటనే చార్జి షీట్లు వేసేయండి అని చెప్పి ఆ మేరకు సుప్రీం కోర్టుకు విన్నవించింది. 'కేసుల బదిలీ చాలాకాలం పడుతుంది, నిందితులను కస్టడీలోకి తీసుకున్న 90 రోజుల్లోపున చార్జి షీటు ఫైల్‌ చేయకపోతే బెయిల్‌ తీసుకుని బయటకు వెళ్లిపోయే అవకాశం వారికి కల్పించినట్లవుతుంది' అని సిబిఐ లాయరు వాదించారు. సుప్రీం కోర్టు జులై 20 సోమవారం నాడు తీర్పుచెపుతానంది.  అంతేకాదు, నమ్రతా దామోర్‌, విజయ్‌ పటేల్‌, రాజేంద్ర ఆర్య, అక్షయ్‌ సింగ్‌, దీపక్‌ వర్మల వంటి 9 మంది మరణాల గురించిన రికార్డులు తమకు యివ్వమని ఆ యా జిల్లాలకు సంబంధించిన పోలీసు అధికారులను అడిగి తీసుకుని కేసులు నమోదు చేసింది. అన్నిటి కన్నా ముఖ్యంగా గులాబ్‌ సింగ్‌ కిరార్‌, అతని కొడుకుతో సహా 150 మంది పై అవినీతి, మోసం, ఫ్రాడ్‌, నేరపూరితమైన కుట్ర వంటి 5 రకాల కేసులు పెట్టింది. ఇతను ముఖ్యమంత్రి చౌహాన్‌కు బంధువు, మైనారిటీ వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో సభ్యుడు. తన కొడుకుకు 2011లో ప్రి పిజి (మెడికల్‌)లో ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చేందుకు మోసం చేశాడని అభియోగం. అతనూ అతని కొడుకు శక్తి కనబడకుండా పోయారని (అబ్‌స్కాండింగ్‌) అని పోలీసులు చెపుతున్నారు. వాళ్లను అరెస్టు చేసేందుకు ఉపయోగపడే సమాచారం యిస్తే బహుమతి యిస్తామని కూడా ప్రకటించారు. కానీ కిరార్‌ ఎక్కడికీ పోలేదు, చౌహాన్‌తో కలిసి బహిరంగ వేదికల మీద కనబడుతూనే వున్నాడు. ఎస్‌టిఎఫ్‌ దీని గురించి యిన్నాళ్లూ ఏమీ చేయలేదు.

సిటిఎఫ్‌ పనితీరులో లోపాల గురించి, అవి అలా వుండడానికి గల కారణాల గురించి చర్చ తీవ్రంగా జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లో బలంగా వున్న ఆరెస్సెస్‌కు సంబంధించిన కొందరు నాయకులకు యీ స్కాములో భాగస్వామ్యం వుందన్న ప్రచారమూ సాగుతోంది. ఈ స్కామును బయటపెట్టిన ఇండోర్‌ వాసి, నేత్రవైద్యుడు ఆనంద్‌ రాయ్‌ తన అనుభవాలను పత్రికలకు యిచ్చిన యింటర్వ్యూల్లో వివరించసాగాడు. అతను ఆరెస్సెస్‌ సిద్ధాంతాలను అభిమానిస్తాడు. 2005 నుంచి వాళ్ల శాఖల్లో, వర్క్‌షాపుల్లో పాల్గొంటాడు. వాళ్లకు సంబంధించిన మెడికల్‌ వింగ్‌ ఆరోగ్య భారతిలో వైస్‌ ప్రెసిడెంటు కూడా. సమాజసేవకై యిచ్చే నానాజీ దేశ్‌ముఖ్‌ ఎవార్డును 2012-13 సంవత్సరానికై యితనికి యిద్దామని ఆరెస్సెస్‌ అనుకుంది కూడా. అయితే 2013లో యితను వ్యాపమ్‌ స్కామ్‌ను బయటపెట్టడంతో కథంతా మారిపోయింది. ఆరెస్సెస్‌ యితన్ని దూరంగా పెట్టసాగింది. తన కార్యక్రమాలకు పిలవడం మానేసింది. అవార్డు యివ్వకూడదని నిశ్చయించింది. స్కామును బయటపెట్టేందుకు ఎలాటి సహకారమూ అందించలేదు. 2005లో ఎండి పరీక్షకు రాయడానికి భోపాల్‌ వెళ్లినపుడు  యితనికి మొదటిసారి పరీక్షల గురించి అనుమానం కలిగింది. తనతో బాటు హాస్టల్లో వున్న పలుకుబడి వున్న కొందరు కుర్రవాళ్లకు చదువు పెద్దగా లేకపోయినా పరీక్ష పాసవడం యితనికి ఆశ్చర్యం కలిగించింది. అక్కణ్నుంచి పరిశోధన ప్రారంభించాడు. 2009 జులైలో యింకొకరి పేరుమీద పరీక్ష రాయడానికి ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన ఇండోర్‌ హోటల్‌లో బస చేసిన వారి గురించి తెలిసి, క్రైమ్‌ బ్రాంచ్‌కు తెలియపరిచాడు. అతను ఫిర్యాదుపై విచారణ జరిగి, కొందరు అలా రాశారని తేలినా చర్యలు ఏమీ తీసుకోలేదు. ఇతను పట్టు వదలకుండా మారుపేర్లతో పరీక్షలు రాసేవారి పేర్లు సేకరించి అసెంబ్లీలో సక్లేచా అనే ఎమ్మెల్యే ద్వారా బయటపెడుతూనే వచ్చాడు. 2012 వరకు 295 మంది అలా రాశారని ఒప్పుకోవడం, అరెస్టులు చేయడం జరిగాయి.

ఇక్కడ ఉత్తర ప్రదేశ్‌ కనక్షన్‌ గురించి తెలుసుకోవాలి. కాన్పూరులోని కాకాదేవ్‌ ప్రాంతంలో మెడికల్‌ ఎగ్జామ్స్‌ కోచింగ్‌ సెంటర్లు చాలా వున్నాయి. అక్కడే మంచి కాలేజీలు కూడా వున్నాయి. వ్యాపమ్‌ సూత్రధారులు అక్కడకు వచ్చి బాగా చదివే విద్యార్థులను తీసుకెళుతూ వుంటారు. అక్కణ్నుంచే కాదు, యితర ప్రాంతాల నుంచి కూడా తీసుకెళ్లి డబ్బులిచ్చి మారు పేర్లతో పరీక్షలు రాయిస్తూ వుంటారు. 2013లో ఇండోర్‌ పోలీసు 20 మందిని అరెస్టు చేస్తే 17 మంది ఉత్తర ప్రదేశ్‌ వారే. ఎస్‌టిఎఫ్‌ దృష్టికి 150 మంది అలాటి విద్యార్థులు వచ్చారు. వారిలో 52 మంది కాన్పూరుకు చెందినవారు, 40 మంది లఖనవ్‌కు చెందినవారు కాగా తక్కినవారు ఝాన్సీ, గోరఖ్‌పూర్‌, అలహాబాదులకు చెందినవారు. వీరిలో 36 మంది విద్యార్థులు దొరికారు. సిట్‌ 34 మంది మెడికల్‌ స్టూడెంట్స్‌ పరారీలో వున్నట్టు ప్రకటించి, వారి సమాచారం చెప్పినవారికి రూ.2 వేలు యిస్తామని ప్రకటించింది. విజిల్‌ బ్లోయర్‌గా ఆనంద్‌ రాయ్‌ పేరు బయటకు రావడంతో ప్రభుత్వం కక్ష కట్టింది. ఇతని భార్య గైనికాలజిస్టు. పిల్లాడు పుడితే వాణ్ని చూసుకోవాలంటూ సెలవు పెట్టింది. ఆమెను సస్పెండ్‌ చేసేసింది ప్రభుత్వం. మళ్లీ వేడుకోగా ఉద్యోగం యిచ్చింది కానీ ఉజ్జయినికి బదిలీ చేసింది. అదే చేత్తో తనను ధార్‌ అనే గిరిజన ప్రాంతానికి బదిలీ చేయబోతోందని యితనికి తెలిసింది. ''మాకు రెండున్నరేళ్ల పిల్లాడున్నాడు. కావాలని మా భార్యాభర్తలను చెరో మూలకు వేయడం వలన ప్రభుత్వం చెప్పదలచుకున్నదేమిటి, అవినీతిని బయటపెడితే దొరికే బహుమతి యిదే అనా?'' అని అతను అడుగుతున్నాడు. అతనికి అన్యాయం జరగకుండా చూసే ఉద్దేశం ఆరెస్సెస్‌ నాయకులకు ఎవరికీ లేదు. ''అవినీతి సహించమని చెప్పే ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ వ్యాపమ్‌ గురించి ఒక్కసారైనా నోరెత్తారా?'' అని అడుగుతున్నాడు ఆనంద్‌. 

నమ్రతా దామోర్‌ మరణం విషయంలో కూడా అతి కీలకమైన సాక్ష్యాన్ని సంపాదించినవాడు ఆనందే. 19 ఏళ్ల వయసున్న ఆమె ఇండోర్‌లో ఎంజిఎమ్‌ కాలేజీలో మెడిసిన్‌ రెండవ సంవత్సరం చదువుతోంది. 2012 జనవరి 7 నుంచి కనబడడం మానేసింది. ఆమె సోదరుడు ఆ విషయమై జనవరి 12 న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు ఉజ్జయినిలో రైలు పట్టాల వద్ద ఆమె శవం కనబడింది. ఆమె ఎవరో తెలియదని చెప్పి పోలీసులు హత్యకేసుగా నమోదు చేసి ఖననం చేశారు. నాలుగు రోజుల తర్వాత నమ్రత సోదరుడు శవాన్ని గుర్తుపట్టాడు. ఉజ్జయిని జిల్లా ఆసుపత్రిలోలోని డా|| పురోహిత్‌ పోస్ట్‌ మార్డ్టమ్‌ నిర్వహించి ఊపిరాడకుండా ఆమెను అదిమిపెట్టడం వలన మరణించిందని రాశాడు. అయితే కేసును సమీక్షించిన భోపాల్‌లోని ఎంపి మెడికో లీగల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారు అది ఆత్మహత్య అని నిర్ధారించడంతో పోలీసులు కేసు మూసేశారు. నమ్రత తండ్రి దీనితో తృప్తి పడక హై కోర్టుకి వెళ్లాడు. కానీ పోలీసుల ఒత్తిడికి లొంగి కేసు విత్‌డ్రా చేసుకున్నాడు. ఆనంద్‌ రాయ్‌ తన విచారణ కొనసాగిస్తూండగా ఆమె గురించి యిద్దరు మధ్యవరుల మధ్య జరిగిన సంభాషణ  ఆడియో రికార్డింగ్‌ దొరికింది. సీటు సంపాదించి పెట్టినందుకు ఆమె యివ్వాల్సిన డబ్బు యివ్వలేదని, తర్వాత రాబట్టుకున్నామని వాళ్లు అనుకుంటున్నారు. దీని ఆధారంగా పోలీసుల వద్దకు మళ్లీ వెళితే 'ఆమె జబ్బల్‌పూర్‌కు రైలెక్కుతూ కింద పడిపోయి చచ్చిపోయింది' అని చెప్పేసి కేసు మూసేశారు. అనుమానితులుగా వున్న నలుగురు యువకులు – దేవ్‌ శిశోదియా, యశ్‌ దేశ్‌వాలా, విశాల్‌ వర్మ, అలేక్‌ – లను వదిలేశారు కూడా. ఈ విశాల్‌ వర్మ నమ్రత ప్రియుడని, తనకు మెడికల్‌ కాలేజీ సీటు యిప్పించడమే కాక, గ్వాలియర్‌ మెడికల్‌ కాలేజీ నుంచి ఇండోర్‌ మెడికల్‌ కాలేజీకి బదిలీ అయ్యేందుకు సహకరించాడని వినికిడి. ఇవన్నీ కూపీ తీయబోయిన జర్నలిస్టు అక్షయ్‌ సింగ్‌ కూడా చనిపోయాడు. (సశేషం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]

Click Here For Archives