Advertisement

Advertisement


Home > Articles - Chanakya

బాక్సైట్ పై బాబు వ్యూహరచన?

బాక్సైట్ పై బాబు వ్యూహరచన?

'కొండలు దిగి రండి..మీకు అపారమైన అవకాశాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం' ఇదీ ముఖ్యమంత్రి విశాఖ మన్యం గిరిజనులకు చెప్పిన మాట. 

కానీ గిరిజనులతో కీలక సమస్య కూడా అదే. మిగిలిన సామాజిక వర్గాల మాదిరిగా కాదు వారు. 

వారికి నిలువెత్తు ధనం పోసినా, ఆ కొండలపై, వారున్న చోటే పోయాలి కానీ, వారు మిగిలిన జన జీవనంలోకి రారు. అది అనాదిగా వారిలో పేరుకుపోయిన వ్యవహారం. మన్యంలో పని చేసిన ఏ అధికారిని అడిగినా ఈ విషయం చెబుతారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా గిరిజానాభివృద్ధి సంస్థ ద్వారా వాళ్లు ఎక్కడుంటే అక్కడే పక్కాఇళ్లు కట్టించింది. నిజానికి గిరిజనుల ఈ వైఖరి వారినే అభివృద్ధికి దూరం చేస్తోందన్నది వాస్తవం. ముఖ్యంగా వైద్య సదుపాయాలు అందకుండా చేస్తోంది. అనేక మంది ఏటా మృత్యువాత పడేలా చేస్తోంది. అయినా కూడా గిరిజనులు కొండను, చెట్లను నమ్ముకుని అక్కడే వుంటామంటారు. చదువుకుంటున్నవారిలో కూడా ఒకటి రెండు శాతం మంది మాత్రమే తమకు వున్న అద్భుతమైన రిజర్వేషన్ సదుపాయం వాడుకుని పైకి వస్తున్నారు. మిగిలిన వారు అంతంత మాత్రం చదువులతో అక్కడికి దగ్గరలోని ఊళ్లలోనే వుంటున్నారు తప్ప దూరం కావడం లేదు. 

ఇలాంటి నేపథ్యం ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు తెలియకుండా వుండదు. అయినా కూడా ఎందుకీ మాట అన్నారు?

అంటే బాక్సయిట్ తవ్వకాలకు మార్గం సుగమం చేయాలనా? కొండలు ఖాళీ చేయించి, బాక్సయిట్ తవ్వించాలనా?

విశాఖ మన్యంలో బాక్సయిట్ నిల్వలపై కన్నేయడం అన్నది ఇవ్వాళ నిన్నటి వ్యవహారం కాదు. దాదాపు నాలుగైదు దశాబ్దాల కాలం నాటిది. చాలా కాలం కిందటే నాల్కో విశాఖ మన్యంలో అల్యూమినా ఫ్యాక్టరీ పెట్టే ఆలోచన వచ్చింది. నక్సలైట్లు, గిరిజనులు, తత్ ఫలితంగా వచ్చే సమస్యలు తెలుసుకునుక ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆఖరికి వైఎస్ హయాంలో, కేంద్రంలో పలుకుబడి వున్న జిందాల్ సంస్థ కొన్ని అనుమతులు సంపాదించి, కొంత ముందుకు వెళ్లింది. కార్యాలయం కూడా ప్రారంభించింది. అలాగే ఆన్ రాక్ సంస్థ కూడా కోన్ని అనుమతులు పోందింది. ఎందుకీ ధైర్యం చేయడం అంటే విశాఖ మన్యంలో వున్న అపార బాక్సయిట్ నిల్వలు. ఒక టన్ను అల్యూమినియం తయారుచేయాలంటే రెండు టన్నుల అల్యూమినా కావాలి. రెండు టన్నుల అల్యూమినా కావాలంటే నాలుగు టన్నుల బాక్సయిట్ అవసరం. మన దేశం ప్రపంచంలోనే బాక్సయిట్ నిల్వలలో అయిదో స్థానంలో వుంది. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు విశాఖ మన్యం లో భారీ నిల్వలు వున్నాయని చాలా సర్వేలు తేల్చాయి. 

అయితే ప్రతి సారీ రాజకీయాలే వీటిని తవ్వితీయడానికి అడ్డం పడుతున్నాయి. వీటికి తోడు విశాఖ మన్యంలో వున్న నక్సలైట్లు గిరిజనులు ముందుకు ఉద్యమింపచేయడం ప్రతి సారీ ఆనవాయితీగామారింది. 

బాబు తక్కువ తినలేదు

వైఎస్ హయాంలో విశాఖ మన్యం బాక్సయిట్ పై తెలుగుదేశం పార్టీ చేయాల్సినంత హడావుడి చేసింది. బాక్సయిట్ వెలికితీత కు సంబంధించి ఇచ్చిన పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని, నిపుణుల కమిటీ పర్యటనను అడ్డుకోవాలని చూసింది. అప్పట్లో తెలుగుదేశంలో వున్న దాడి వీరభద్రరావు ఈ మేరకు పలు పాయింట్లతో కేంద్ర అటవీ శాఖ పర్యావరణ విభాగం నిపుణల కమిటీ చైర్మన్ కు లేఖ కూడా రాసారు. వైఎస్ తన పార్టీ నేతలకు, తన అనునాయులకు బాక్సయిట్ నిల్వలు దోచి పెట్టే ఆలోచనలో వున్నారని అప్పట్లో తెలుగుదేశం నేతలు విమర్శలు చేసారు. విశాఖ మన్యంలో అఖిల పక్షాల సమావేశాలు ఏర్పాటు చేసారు. మన్యంలో కాస్త ప్రభావిత స్థాయిలో వుండే కమ్యూనిస్టులు, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి చెరోవైపు నిలబడ్డారు. 

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో సంగతేమిటంటే, గతంలో తాము కూడా ఈతరహా ఆలోచన చేసినా, ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ సూచన మేరకు తెలుగుదేశం పార్టీ ఆ ఆలోచన విరమించుకున్నామని వీరభద్రరావు పేర్కొనడం. ఈ లేఖ పూర్తి వివరాలను  ఈ లింక్ లొ చూడొచ్చు

Click here For Link

తెలుగుదేశం పార్టీ గిరిజనుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని, కార్పొరేట్ శక్తులకు గిరిజన సంపద దోచి పెడితే చూస్తూ ఊరుకోదని హెచ్చరించారా లేఖలో.

ఇప్పుడెందుకిలా?

ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే నాలుక మడతేసారు. విశాఖ బాక్సయిట్ పై ఆయన కన్ను పడింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ విధానాలను కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నాయన్న సంగతి తెలిసిందే. పైగా దాన్ని అనుకూలంగా చేసుకోవడానికి వున్న పాజిటివ్ పాయింట్ రాష్ట్రం విడిపోవడం, అర్థికంగా స్వావలంబన సాధించాల్సిన అవసరం. దీన్ని అడ్డం పెట్టుకుని విశాఖ బాక్సయిట్ వెలికి తీతకు ముందుకు సాగాలని బాబు చూస్తున్నారు. 

కొన్నాళ్ల క్రితమే ఆయన విశాఖ బాక్సయిట్ తవ్వి తీస్తామని, అయితే అందులో వచ్చిన ఆదాయం అంతా అక్కడి గిరిజనులకే ఇస్తామని అన్నారు. గతంలో తాము వ్యతిరేకించిన మాట వాస్తవమే అని, అయితే కాంగ్రెస్ మాదిరిగా కాకుండా గిరిజనుల కోసం ఈ వ్యవహారం చేస్తామని చెప్పుకొచ్చారు. 

మరి గతంలో బాక్సయిట్ తవ్వుతామన్నపుడే బాబు ఈ గిరిజనుల షరతు విధించి అంగీకరించి వుండొచ్చు కదా?

బాక్సయిట్ లో వచ్చిన ఆదాయమంతా గిరిజనులకే వెచ్చిస్తామని బాబు చెబుతున్నారు. అదేమంత లాజిక్ కు అందని వ్యవహారం కాదు. ఎవరైనా చేయచ్చు ఆపని. ఎలా? తమకు నచ్చిన వారికి, కార్పొరేట్ సంస్థలకు బాక్సయిట్ నిల్వలు  అరకొర రేటుకు అప్పగిస్తారు. వారు ప్రభుత్వానికి ఇచ్చిన దాన్ని గిరిజనులకే ఇచ్చేస్తారు. అదేమంత విషయం కాదు. కానీ అసలు సంగతి ఆ సంస్థలు ప్రభుత్వానికి ఇచ్చే ఆదాయం..దాన్ని గిరిజనులకు ఖర్చు చేయడం కాదు.  తమకు నచ్చిన వారికి బాక్సయిట్ నిల్వలను కట్టబెట్టడం. రాజకీయ నేతలు, కార్పొరేట్ వ్యవహారాలు, బినామీ సంగతులు ఎవరికి తెలియనివి..అందునా తెలుగుదేశం నాయకులు సదా జగన్ పై ఆరోపిస్తూనే వుంటారు. మరి ఇప్పుడు మాత్రం ఆ కార్పొరేట్ సంస్థలు తెలుగుదేశం బినామీలకు చోటివ్వలేదని ఎలా అనగలరు? నేరుగా పెట్టుబడులు, నేరుగా లబ్ది అన్నది చాలా కాలం క్రితమే మారిపోయిన పరిస్థితి. వైఎస్ హయాంలో అది తారాస్థాయికి వెళ్లిందన్నది తెలుగుదేశమే తేల్చిన నిజం. జగన్ బినామీలు ఎందరున్నారో, బాబు బినామీలు అంతే మంది వున్నారని రాజకీయాల్లో నిత్యం వినిపించే విషయం. 

మీడియా దన్ను

గతంలో ఎప్పుడు గిరిజనులు పోరాటంతో ముందుకు సాగినా మీడియా మద్దతుగా నిలిచేది. ఇప్పుడు మరి తెలుగుదేశం అందునా తాము సదా గొడుగు పట్టి కాపాడే చంద్రబాబే స్వయంగా బాక్సయిట్ నిల్వలు తవ్వితీయించాలని నిర్ణయించారు కాబట్టి, మీడియా ఏం చేస్తుందో చూడాలి. ఆగస్టులోనే తొలిసారి బాబు బాక్సయిట్ వ్యూహానికి వ్యతిరేకంగా నిషేధిత మావోయిస్టు పార్టీ మన్యంలో సమావేశం నిర్వహించింది. 25 గ్రామాలకు చెందిన ఎనిమిది వందల మంది ఈ సమావేశానికి హాజరయ్యానికి జాతీయ మీడియా వెల్లడించింది. జిందాల్ అయినా, ఆన్ రాక్ అయినా, ఆఖరికి ప్రభుత్వ సంస్థలైనా బాక్సయిట్ వెలికి తీతతో గిరిజనుల బతుకులు అతలాకుతలం అయిపోతాయని ఈ సమావేశం హెచ్చరించింది. అన్ని మైనింగ్ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఈ వివరాలు మన మీడియాలో మాత్రం జిల్లా పేపర్లకు, అదీ నియోజకవర్గ పేజీలకు పరిమితం అయ్యాయి. అదే వైఎస్ హాయాంలో అయితే గిరిజనుల పోరుబాట అంటూ రాష్ట్రం అంతా తెలిసేలా మొదటి పేజీలోకి వచ్చి కూర్చునేవి. 

మళ్లీ తెరపైకి

హుద్ హుద్ తుపాను సందర్భంగా బాబు మరోసారి తమ మనసులో మాట బయటపెట్టారు. గిరిజనుల పరామర్శకు వచ్చి వారిని కొండ దిగి రమ్మన్నారు. అందులో భావం మరేమిటి? వారికి మైదాన ప్రాంతాల్లో సకల వసతులు కల్పిస్తారు. కొండలు బాక్సయిట్ కోసం బడాబాబులకు వదిలేయాలి. గిరిజనులకు సదుపాయం ప్రభుత్వసొమ్ముతో కల్పిస్తారు. బడాబాబులు బాక్సయిట్ తవ్వుకుంటారు. ప్రభుత్వానికి అరకొరగా ముడి బాక్సయిట్ కాబట్టి దాని ధర, అందులోంచి తవ్వడానికి పెట్టుబడి అంతా తమదే కాబట్టి, అది పోను పావలా, అర్థా ఇస్తారు. ఆ డబ్బు కూడా గిరిజనులకే ఇచ్చేసామని ప్రభుత్వం బాకా ఊదుతుంది. అద్భుతం అమోఘం అని బాబు అనుకూల మీడియా భజన ప్రారంభిస్తుంది.  రాజకీయ నాయకులకు మాత్రం ఎవరికి అందాల్సిన లాభాలు వారికి దొడ్డిదోవన అందిపోతాయి. బినామీ వ్యవహారాలు చకచకా నడిచిపోతాయి. 

అందుకోసమేనా బాబు ప్రేమగా గిరిజనులను కొండ దిగి రమ్మని పిలిచేది. మరి ఈ పిలుపు. ఇలా బాక్సయిట్ తవ్వితీయాలని గతంలో వైఎస్ కు ఎందుకు సూచించలేదో? ఇలా అయితే తాము సహరిస్తామని ఎందుకు చెప్పలేదో? ఎంతసేపూ అడ్డం పడడం తప్ప. మరి ఇప్పుడు వైకాపా అడ్డం పడితే ఏమంటారు? మీరు ఘనుల దొంగలు. బళ్లారిలో దోచారు..ఖమ్మంలో దోచాలనుకున్నారు. మీరా మాకు చెప్పేది అంటారు. అందుకు సమాచారం, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అన్నది శిక్షణ ఇచ్చేందుకు, సమాచారం అందించేందు తేదేపా నాలెడ్జ్ సెంటర్ రెడీగా వుండనే వుంటుంది. 

అందుకే అన్నారు ఎదుటివాళ్లకు చెప్పేటందుకే నీతులని. బాబు బాక్సయిట్ వ్యూహం విజయవంతంగా అమలు జరిగిపోయినా ఆశ్చర్యం లేదు మరి.

చాణక్య 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?