Advertisement

Advertisement


Home > Articles - Chanakya

భరతావనిలో మరో కురుక్షేత్రం?

భరతావనిలో మరో కురుక్షేత్రం?

రెండు పార్టీల నడుమ ఇది కురుక్షేత్ర సంగ్రామం. రెండు గ్రూపుల నడుమ చిరకాల వైరం. గడచిన పదేళ్లుగా సాగుతున్న యుద్ధం. ఒక గ్రూపు యథాతథంగానే వుంది. మరిన్ని బలగాలను సమీకరించి, మరింత బలంగా మారింది. రెండో గ్రూఫు మాత్రం తిరుగులేని నాయకుడిని కోల్పోయి, మనోధైర్యం మెండుగా వున్న వారసుడితో మిగిలింది. ఈ రెండు గ్రూపుల మధ్య మరోసారి యుద్ధం ఇంకో రెండు రోజుల్లో జరగబోతోంది. కచ్చితంగా ఇది రెండు గ్రూపుల నడుమే. రెండు పార్టీలు అన్నది కేవలం ప్రజాస్యామ్య వ్యవహారం కోసం. ఎన్నికల కోసమే. 

అధికారం కోల్పోయిన తెలుగుదేశం, దాని అనుకూల వర్గం ఓ వైపు, అండగా వున్న నాయకుడు లేక, వున్న పార్టీ ఆదుకోక, స్వంత పార్టీ స్థాపించి అధికారం అందుకుని తమ సత్తా చాటాలని అనుకుంటున్న వైకాపా వర్గం మరో వైపు మోహరించాయి. రెండింటి ఆశయం మొహమాటం లేకుండా చెప్పాలంటే ఒకటే, అధికారాన్ని అందుకోవడం. ఈ అధికారం అందుకోవడం అనే ఒక్క పాయింట్ వెనుక సవాలక్ష వ్యవహారాలు, సవాలక్ష ఈక్వేషన్లు, సవాలక్ష కారణాలు దాగి వున్నాయి. వాటిలో కుల వ్యవహారాలు, తమ తమ వ్యాపారాల ప్రయోజనాలు, తమ తమ వర్గాల, అభిమానుల అభిమాతలు అన్నీ వున్నాయి. వీటిలో ఏ ఒక్క వర్గమూ తక్కువా కాదు, మినహాయింపూ లేదు. 

వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఇది చావు బతుకుల సమస్య. తండ్రి అనంతరం వారసత్వంగా అధికార సింహాసనం అధిరోహిద్దామనుకుంటే, కుదరలేదు. కాంగ్రెస్ అధిష్టానం తన లెక్కలు తాను వేసుకుని, కుదరదు పొమ్మంది. అక్కడితో జగన్ సైలెంట్ అయి వుంటే వ్యవహారం వేరేగా వుండేదేమో? అధికారానికి దూరంగా వున్న కాంగ్రెస్ కు తన తండ్రి ఊపిరులూది సింహాసనం సాధించి పెట్టాడు కనుక, కొడుకుగా తాను దాన్ని ఆశించాడు. అది తప్పా, ఒప్పా అన్న చర్చ పక్కన పెడితే, ఆశించి ఊరుకోలేదు. దాన్ని ఎలాగైనా సాధించాలని పంతం పట్టాడు. అదే ఇంతవరకు తెచ్చింది. చాలా మంది వైకాపా అభిమానులు ఇప్పటికీ ఒకటి అంటుంటారు. జగన్ తన తండ్రి పోయిన తరువాత కాస్త సైలెంట్ గా వుండి వుంటే, ఈ ఎన్నికల వేళకు అధికారం కాంగ్రెస్ నే ఇచ్చేది కదా అని. 

కానీ అక్కడ పరిస్థితి అలా వుండదు. ఎప్పటి వ్యవహారం అప్పుడే, ఎప్పటి వేడి అప్పటిదే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నన్నాళ్లు చంద్రబాబు ఏమీ చేయలేదు. లక్ష్మీ పార్వతి వచ్చి, అధికారం చెలాయించడం ప్రారంభించడంతో వచ్చింది సమస్య. అప్పటికీ ఎన్టీఆర్ ఇద్దరినీ కూర్చోపెట్టి సంధిచేసే ప్రయత్నం చేసారు. అయినా బాబు తన పని తాను చేసారు. ఎందుకలా..కొన్నాళ్లు ఆగివుంటే, ఎన్టీఆర్ తరువాత ఆయనే కదా అని ఎవరైనా ఇప్పుడు అంటే, అది రాజకీయాల్లో అర్థం లేనిది. అధికారం అనేదాన్ని ఎప్పుడు అవకాశం వస్తే, అప్పుడు అందుకోవాలనే ఎవరైనా చూస్తారు. ఇందిర మరణించగానే ఎక్కడో వున్న రాజీవ్ ను హుటాహుటిన తీసుకువచ్చి, కాస్త విముఖత ప్రదర్శించినా, ఒప్పించి అధికారంలో కూర్చోపెట్టారు పెద్దలు. తెలుగుదేశం వారసత్వం తనకు కావాలని లోలోపల భావిస్తున్న జూనియర్ ను కాదని, చంద్రబాబు చాకచక్యంగా తన కొడుకు లోకేష్ ను విదేశాల్లో చదవు, ఉద్యోగం మానిపించి మరీ తీసుకురాలేదా? వారసత్యం తమ వారికి అందాలని పెద్దలకు, తమకే అందాలని పిల్లలకు కోరిక వుండడం అన్నది లోకసహజం. 

జగన్ ను తప్పు పట్టే ముందు, సామాన్య ప్రజానీకం సైతం తమ తమ  పెద్దల వారసత్వం తమకు కావాలని కోరుకోవడాన్ని గుర్తు చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ వుంది. ప్రజాస్వామ్యంలో వారసత్వాలేమిటి? అధికారం అన్నది ప్రజలు ఇవ్వాలి కానీ అన్నది. నిజమే. అక్షరాలా నిజమే. కానీ జగన్ ను ముఖ్యమంత్రి చేసినంత మాత్రాన, ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో ప్రజలు అంగీకరించకపోతే. రాజీవ్ ను ప్రజలు ఓసారి నెత్తిన పెట్టుకుని మరోసారి కిందకు దింపేయలేదా? రాజకీయాల్లోనైనా, సినిమాల్లోనైనా, వృత్తి వ్యాపారాల్లోనైనా వారసత్వం అందించేవరకు, అందుకునే వరకే వారి వారి చేతుల్లో పని, కానీ విజయవంతం కావడం అన్నది ప్రజల ఆలోచన, అభిమానాలపై ఆదారపడి వుంటాయి.

జగన్ అనేకానేక తప్పులు చేసి వుండొచ్చు, స్కాములకు పాల్పడి వుండొచ్చు. వుండొచ్చు అని ఎందుకు అనడం అంటే, ఏవీ ఇంకా న్యాయస్థానంలో రుజువు కాలేదు కాబట్టి. నిజానికి వారసత్వం కోరుకోకుండా వుండి వుంటే ఈ వ్యవహారాలు ఇంతవరకు వచ్చేవి కాదని, రాష్ట్రంలో రాజకీయాలు పరిశీలించేవారిని ఎవరిని అడిగినా చెబుతారు. అలా రానంత మాత్రాన ఆ తప్పులు ఒప్పులు కావు. వచ్చినంత మాత్రాన రుజువు అయ్యేవరకు తప్పులూ కావు. 

కానీ ఈ యుద్దంలో జగన్ ప్రత్యర్థుల అస్త్రాలు అన్నీ కేవలం వాటి చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి. కేవలం అవినీతి, జైలు, బెయిలు, కేసులు, మళ్లీ జైలుకు ఇలాంటి వాటి చుట్టూనే తిరుగుతున్నాయి. అంతే కానీ ఓ అభిమాన నాయకుడి కొడుకు, అతగాడూ ఓ నాయకుడు. అవకాశం ఇవ్వాలా..వద్దా? ఇస్తే ఏమిటి? ఇవ్వకుంటే ఏమిటి? అన్నవి అన్నీ పక్కకు పోయాయి. జగన్ కు ఇస్తే దోచేస్తాడు. తినేస్తాడు. ఇవే ఆరోపణలు. ఒక మనిషిపై మరీ ఇంత బురద జల్లుడు అవసరమా? దాన్ని జనాలు ఏ మేరకు నమ్ముతారు అన్నది మరో వారం రోజుల్లో తేలిపోతుంది. 

అయితే ఈ బురదజల్లుడు, అదే సమయంలో జగన్ ను ఓడించడం కోసం అతగాడి వైరిపక్షాలు ఎంత బలంగా తయారయ్యాయి అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది.

మీడియాలో తొంభై శాతం ఒకటయ్యింది. అది తెలుగుదేశం పార్టీకి వెన్ను దన్నుగా నిలిచింది. అంటే తొమ్మిద గొంతులు జగన్ దొంగ అంటుంటే, ఒక్క గొంతు కాదు అంటోంది. తెలుగుదేశం పార్టీ తన బలం సరిపోదని భాజపా, లోక్ సత్తా, వంటి పార్టీలను తోడు తీసుకుంది. భాజపా వేపు వెళ్లడం వల్ల దేశానికి దగ్గర కాలేకపోయామన్న బాధ వామ పక్షాలకు వుంది. కానీ నారాయణ లాంటి వారు..అయ్యో, మేం కూడా కలవలేకపోయామే అన్న టైపులో మాట్లాడుతూనే వున్నారు. వీరు చాలదన్నట్లు తెరవెనుక వివిధ ఈక్వేషన్లతో ఎందరొ పెద్దలు చేతులు కలిపారు. తాము కలిసింది చాలక, తమ తమ పలుకుబడి ఉపయోగించి మరెందరినో ఓ దగ్గరకు చేర్చారు. ఇలా కురుక్షేత్రంలో ఓ బలమైన వర్గం ఓ వైపు మోహరించింది. 

ఇటు ఒకే ఒక్కడు

అవినీతి సాకు..అధికార సాధనే లక్ష్యం

చంద్రబాబు ఎందుకింత భయంకరంగా పోరాడుతున్నారు. ఇదంతా ఆంధ్రదేశాన్ని జగన్ బారిన పడకుండా కాపాడడానికేనా? అలా అని అనుకుంటే అది వెర్రితనమే అవుతుంది,. రెండు దఫాలుగా దూరమైన అధికారాన్ని ఈ సారి ఎలాగైనా దక్కించుకోవాలి. ఈసారి కనుక అథికారం రాకుంటే మరో అయిదేళ్లు తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవడం అన్నది సాధ్యమయ్యే పనికాదు. అదీకాక వయస్సు రీత్యా కూడా చంద్రబాబుకు కాస్త కష్టం. ఈ వయస్సులో అధికారం సాధిస్తే తప్ప, వారసత్వంగా లోకేష్ కు పగ్గాలు అప్పగించడం అస్సలు సాధ్యం కాదు. 

ఇక్కడ మరో ఈక్వేషన్ కూడా వుంది. చిరకాలంగా ఈ రాష్ట్రంలో రెడ్లు, కమ్మలు అధికారం కొసం మోహరించడం అన్నది జరుగుతూనే వుంది,. కాంగ్రెస్ మాత్రం వున్నంత కాలం కమ్మల కోరిక తీరలేదు. ఎన్టీఆర్ ను ముందు పెట్టి చేసిన ప్రయత్నం పలించింది. అయితే దానికి మళ్లీ వైఎస్ గంటి కొట్టారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రం రెండుగా చీలింది. చీలగా మిగిలిన ముక్కలో రెడ్లు బలం కూడా రెండు ముక్కలయింది. అదే సమయంలో కొ్త్తా రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన చూస్తే, బిసిలు, కాపులు అధికారం అందుకోవాలి. కానీ అలా జరగకుండా, తొలిసారి తాము అధికారం అందేసుకుంటే, ఇక తరువాత బలంగా మిగిలిపోవచ్చనది కమ్మ సామాజిక వర్గ ఆలోచనగా కనిపిస్తోంది. 

తెలంగాణ, ఆంధ్ర రెడ్లు కలవడం వల్ల ఇంతకాలం తమకు అధికారం అంది, చేజారి ఇలా అప్ అండ్ డౌన్ అవుతోంది కాబట్టి, ఇక ప్లస్ అవుతుందని భావించడంలో తప్పేమీ లేదు కానీ తీరా కొత్త రాష్ట్రంలొ తొలి అధికారం తమకు అందుతుందనుకునే వేళ జగన్ అనేవాడు అడ్డుగా నిల్చున్నాడు.. ఆ అడ్డు తొలగాలి. అధికారం అందాలి. అందుకు అవసరమైతే ఎన్ని వ్యూహాలైనా పన్నాలి. జగన్ దురదృష్టం లేదా స్వయం కృతాపరాథ కావచ్చు, లేదా బాబు అండ్ కో అదృష్టం కావచ్చు. అవినీతి అన్నది ఆయుధంగా మారింది.  అమెరికా వివిధ దేశాలపై ఏదో సాకుతొ యుద్దానికి దిగినట్లు, అసలు సాకు చమురు కోసమే అన్నట్లుగా, చంద్రబాబు అండ్ కో అవినీతి అన్నదాన్ని సాకుగా పెట్టుకుని, జగన్ పై యుద్దానికి దిగారు. ఈ యుద్ధానికి సైద్దాంతిక విబేధాలు పక్కనపెట్టి, వెంకయ్యనాయుడు, జయప్రకాష్ నారాయణ, పవన్ కళ్యాణ్, ఇలా ఎందరో తోడయ్యారు. కాంగ్రెస్ విభజన చేయడం అన్నది మరింత ప్లస్సయింది. ఆ పార్టీని చిరకాలం అంటిపెట్టుకుని వున్న వారు. ఈ సాకుతో దాన్ని వీడి బాబు వెంటకు పరుగెత్తుకు వచ్చారు. నిన్నటి దాకా నిప్పులు చెరిగిన వారు కూడా బాబే శరణ్యమన్నారు.

ఆగేనా? సాగేనా?

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?