cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

ఈ రాష్ట్రానికి దిక్కెవరు?

ఈ రాష్ట్రానికి దిక్కెవరు?

ఇలా అడిగితే తెలుగుదేశం వీరాభిమానులకు వీర కోపం వచ్చేస్తుంది. సకల కళా వల్లభుడు, అనేక విద్యలందు ఆరితేరిన వీరుడు చంద్రబాబు వుండగా..ఆంధ్రదేశం అనాధ ఎలా అవుతుంది..ఈ రాష్ట్రానికి దిక్కెవరు అని ప్రశ్నించడానికి ఎన్ని గుండెలు అని విరుచుకుపడేది ఖాయం. కానీ ఇక్కడ విషయం ఈ రాష్ట్రం దిక్కుమాలిపోయిందనో, దిక్కులేకుండా పోయిందనో కాదు. నిజంగానే సమర్థుడైన చంద్రబాబును ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన తన సత్తా చూపే ప్రయత్నంలోనే వున్నారు. 

ఒక్క సమర్థత ఎప్పుడూ సరిపోదు. అలా సరిపోతుందనుకుంటే ప్రజాస్వామ్యానికి నాలుగు వ్యవస్థలు అవసరమై వుండేవి కాదు. అధికార, న్యాయ, మీడియా వ్యవస్థలు కూడా అవసరమే. నవల, కథ, సినిమాల విజయ సూత్రంగా వైరిపక్షం ఎంత బలంగా వుంటే అంత మంచిది అని చెబుతుంటారు. అదే విధంగా ప్రజాస్వామ్యం విజయవంతంగా, విలువల వలువలు విడిచేయకుండా వుండాలంటే బలమైన ప్రతిపక్షం వుండాలనీ అంటారు. ఒక్కోసారి మీడియా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతుంటుంది. ఇది ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో వున్న మీడియా బాధ్యత. 

కానీ ఇప్పుడు ఆంధ్రదేశంలో మాత్రం చిత్రమైన పరిస్థితి నడుస్తోంది. కాంగ్రెస్‌ అనే జాతీయ పార్టీని జనం విసిరి అవతల కొట్టారు. ఆ షాక్‌ నుంచి లేదా ఓటమి అనే ఆత్మనూన్యతా భావం నుంచి ఇంతవరకు ఆ పార్టీ నాయకులు తేరుకోలేదు. జనానికి మొహం చూపించడం సంగతి అటుంచి, అసలు ఓ మాట కూడా పెగలడం లేదు వారి నోటి వెంట. ఇక ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన వైకాపా పార్టీ అధ్యక్షుడిని ఈ రాష్ట్రపు మెజార్టీ, అగ్రశ్రేణి మీడియా ఎప్పుడో గజదొంగ అని ముద్రవేసి, అచ్చేసి వదిలింది. వారి దృష్టిలో జగన్‌ అనేవాడు పరమ నీచుడు..గజదొంగ..లక్ష కోట్లు కొట్టేసి పరుపుకింద పెట్టుకుని నిద్రిస్తున్నవాడు. వారికి సంబంధించినంత వరకు లక్ష్యం ఒక్కటే జగన్‌ అనేవాడు ఈ రాష్ట్రంలో ఎన్నటికీ అధికారంలోకి రాకూడదు. 

న్యాయశాస్త్రం సైతం నేరం చేసినవాడు శిక్ష అనుభవించి, పశ్చాత్తాపం చెంది, ప్రజా జీవితంలో కోరిన విధంగా బతకవచ్చు అంటుంది. కానీ ఈనాడు-ఆంధ్రజ్యోత-టీవీ 9 లాంటి మీడియా మొఘ(గు)ళ్లు మాత్రం అస్సలు జగన్‌కు ప్రజల్లో బతికే హక్కేలేదు..ఆ తరహా బతకుకు ఉరిశిక్షే తప్ప మరేదీ పనికిరాదు అంటోంది. ఆ విధంగానే గడచిన, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో వారు తమ సర్వ శక్తులు ఒడ్డారు. పోనీ నిజంగానే జగన్‌ అనేవాడు చంబల్‌ లోయ బందిపోటు కన్నా ఘోరం..దేశంలో అంతటి నేరగాడు మరొకడు లేరనుకుందాం. అందువల్ల ఈ మీడియా అతగాడిని వెంటాడి..వేటాడి..వేధించి,.రాజకీయంగా చంపేదాకా నిద్రపోదు..అనుకుందాం. మరి ఎక్కడన్నా మీడియా అనేది తాను ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, ప్రతిపక్షాన్ని బతికించేందుకు చూస్తుంది. కానీ ఇక్కడ మన మీడియా..అధికారపక్షంతో అంటకాగుతోంది. బాబు చెప్పిందే బ్యానరవుతోంది. ఇంకెవరు చెప్పినా సింగిల్‌ కాలమ్‌ అదీ ఇన్‌ సైడ్‌ పేజీలకే పరిమితమవుతోంది. జగన్‌కు పడనివాడు, వార్డు మెంబరైనా, ఒడిసి, దోసిలిపట్టి, మొదటిపేజీలో అలంకరిస్తున్నారు. మరింక ప్రతిపక్షం ఎవరు? ప్రజల సమస్యలు ఏమన్నా వుంటే ఎవరు పట్టించుకుంటారు?

జగన్‌, కాంగ్రెస్‌ లేకుంటే మేం లేమా అని లోక్‌సత్తా, వామపక్షాలు, భాజపా, జనసేన అంటాయి అనుకుందాం. కానీ అది నమ్మశక్యమేనా? వామపక్షాల సంగతి పక్కనపెడితే మిగిలినవన్నీ కలిసే కదా ఇప్పుడు అధికారపక్షం అయింది. వామపక్షాలు సైతం ఈ రాష్ట్రంలో ఏ విధంగా వ్యవహరిస్తాయో అందరికీ తెలిసిందే. మరింక ఏ గొంతు వినిపిస్తుంది? ఏ గొంతును వినిపించనిస్తారు? పోనీ మీడియా ఆ బాధ్యత తీసుకుంటుంది అంటే, ప్రధాన మీడియా అంతా ఒకటే గుత్తాధిపత్యంలో వుంది. రాష్ట్రంలో  సింపుల్‌..ఉదాహరణం.. మంత్రివర్గ సమావేశం జరిగింది. ఏడెనిమిది ప్రధాన దేవాలయాల్లో అన్నదానం ప్రారంభిస్తున్నాం అని ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుపతిలో ఎన్టీఆర్‌ ప్రారంభించారు. మళ్లీ ఎక్కడా లేదు. అందుకే మేం ఇప్పుడు ఈ దేవాలయాల్లో ప్రారంభిస్తున్నాం..రోజుకు అయిదువేల మందికి ఉచితంగా అన్నదానం చేస్తాం..దానికి విరాళాలు స్వీకరిస్తాం..ఇదీ విషయం.

కానీ సాక్షాత్తూ ముఖ్యమంత్రి వర్యులకు తెలియదేమో? అన్నవరం, సింహాచలం, ఇలా చాలా చాలా చాలా దేవాలయాల్లో, సుమారు దశాబ్ధానికి పైగానే అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోజుకు వేయి నుంచి అయిదువేల మందికి. ఇది పెద్ద దేవాలయాలకే కాదు, అంతర్వేది లాంటి చిన్న దేవాలయాల్లో కూడా జరుగుతోంది. విరాళాలు ఇస్తున్నారు..తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు కొత్తగా చేసేదేమిటి?

ఉదాహరణకు బాబు కాకుండా జగన్‌ సిఎమ్‌గా వున్నాడనుకుందాం..ఇలాగే అన్నాడనుకుందాం. మర్నాడు ఈనాడులో అన్నవరం, సింహాచలం, ఇలా అన్ని దేవాలయాల్లోని అన్నదాన సత్రాల ఫొటోలు, వాటి బోర్డులు, విరాళాలు ఇచ్చిన వైనాలు..అన్నీ కలిపి ఓ పేద్ద స్టోరీ వస్తుంది. ఈ పని బాబు వున్నపుడు కూడా చేయాలి కదా..అదే కదా మీడియా బాధ్యత. ఫోర్త్‌ పిల్లర్‌ అన్నది సార్థకమవుతుంది. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాన్ని చంపేయాలని మీడియా కంకణం కట్టుకుని వుంది. అది ఎవర్ని అడిగినా చెబుతారు. పోనీ మీడియా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందా అంటే ఆ సమస్యే లేదు..అది కూడా ఈ రాష్ట్రపు పత్రికల వ్యవహారం తెలిసిన వారెవర్ని అడిగానా చెబుతారు. 

ఇప్పడు చెప్పండి..ఇక ఈ రాష్ట్రానికి దిక్కెవరు? 

చాణక్య

writerchanakya@gmail.com

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి