cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

మ్యాన్ ఆఫ్ ది పాలిటిక్స్

మ్యాన్ ఆఫ్ ది పాలిటిక్స్

వీరుడు అంటే విజయాన్ని సాధించేవాడు..ఆస్వాదించేవాడు...విర్రవీగే వాడు కాదు...ఓటమికి ఎదురొడ్డేవాడు..దాని తలదించేవాడు..పొగరణిచేవాడు. వీరుడంటే ఓటమికి వెరువక ముందుకే వెళ్లేవాడు..వీరుడంటే అపజయం తలుపుతట్టినపుడు, జయకేతనం ఎగరేసినపుడు ఒకేలా ముందుకు సాగిపోగలిగినవాడు..కర్తవ్యం మాత్రమే గుర్తుండి..లక్ష్యాన్ని మాత్రమే చూడగలిగేవాడు..మరికదేన్నయినా లక్ష్యపెట్టనివాడు.

విజయ శిఖరాలు అధిరోహించడం ఎంత కష్టమో..అక్కడ నిలిచి వుండడమో అంతే కష్టం. ఒకసారి శిఖరం నుంచి జారిపోయాక మళ్లీ అధిరోహించాలనే ఆశవున్నా..అది అంతకన్నా కష్టం. ఈ ఫీట్లన్నీ చేసేసినవాడు..రాజకీయ జీవితపు ఎత్తుపల్లాలు అన్నీ చూసేసినవాడు..అపర చాణక్యుడు..మహా మేధావి..మొండివాడు..పట్టువదలని విక్రమార్కుడు..ఏ పనికి ఎవర్ని వాడాలో..ఏ పని ఎక్కడ ఎలా ఆరభించి, ఎక్కడకు చేర్చాలో అనే విద్యలో ఆరితేరిన వాడు..ఎప్పుడో కట్టే భవంతి కోసం ఇప్పుడే రాళ్లు చేరేసి వుంచుకునే జాగ్రత్త కలిగిన వాడు..ఇలా రాసుకుంటూ పోతే ఎన్ని విశేషణాలైనా నిశ్శేషంగా వాడదగ్గవాడు.. అతడు..నారా చంద్రబాబు నాయడు...జనానికి చంద్రబాబు...పార్టీ శ్రేణులకు బాబు గారు..

2014 మ్యాన్ ఆఫ్ ది పాలిటిక్స్.

గెలిచిన ఎమ్మెల్యేల అండతో అధికారంలోకి వచ్చారు..ఏం గొప్ప అనుకున్నారు. మరోసారి నెగ్గారు..సర్లే అనుకున్నారు. ఓడిపోయారు..మేం చెప్పాం కదా..పెద్ద గొప్పేం కాదు మరి అన్నారు.

అయిదేళ్లు..మరో అయిదేళ్లు..ప్రతిపక్షంలో వున్నారు. కప్పెల తక్కెడగా మారిన రాజకీయాలను కాసుకుంటూ, విడిచిపోతున్న స్వజనాన్ని చూసి నవ్వుకుంటూ గడిపేసారు. మళ్లీ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది.

అప్పుడు చూపించడం ప్రారంభించారు తన విశ్వరూపం. పాదయాత్రతో ప్రారంభించి, అధికార పీఠం వద్దకు చేరుకునే వరకు అవిశ్రాంత పోరాటం. ఎన్ని ఎత్తుగడలు..ఎన్నివ్యూహరచనలు..ఎన్ని నిద్రలేని రాత్రులు..ఎన్నిభయాందోళనలు..ఎన్నిభరోసాలు..మరెన్ని రాకపోకలు..అన్నింటినీ సహించారు..అన్నింటిని రచించారు..అన్నింటికి సారథ్యం వహించారు..

ఆఖరికి అధికారాన్ని వరించారు. అధికారం ఆయన్ను వరించలేదు..ఆయనే అధికారాన్ని తన దగ్గరకు వచ్చి వరించేలా చేసుకున్నారు.

అనితర సాధ్యం ఆ వ్యూహరచన..అనితర సాధ్యం ఆ చాక్యచక్యం..చాణక్యం.

పాద యాత్ర చేసారా..యోధానుయోధులు అన్నవారు పార్టీని వదిలపోయిన వేళ, తన పార్టీకి ఎంత మందిని రప్పించాలో అంతమందినీ రప్పించారు. అవసరం మనదైనపుడు ఎన్ని మెట్లు దిగినా ఫరవాలేదు..ఎన్నిగడపలు ఎక్కినా తప్పు లేదు అన్నట్లుగా తానే ముందుకు వెళ్లి భారతీయ జనతాపార్టీతో పొత్తు పొడిచేలాచూసుకున్నారు. కేవలం పొత్తు పెట్టేసుకోవడం కాదు..ప్రజల నాడి ఎటువుందో గమనించారు. భాజపా నేత మోడీపై జనాలకు వున్న అభిమానం, రాష్ట్రంలో ఆ పార్టీకి మేలు చేసినా,చేయకున్నా, తన విజయానికి తోడు కాగలదని గుర్తించారు. అందుకే తన చేయే ముందుగా చాచారు. అది తన బాణీనా లేదా..అనుకరణా అన్నది అనవసరం.. వర్కవుట్ అయిందా లేదా అన్నది ముఖ్యం. 

అందుకే వైఎస్ మాదిరిగా తానూ పాదయాత్ర చేసారు. ఆయన కరెంటు ఫ్రీ అంటే, ఈయన రుణాలు మాఫీ అన్నారు.అంతమాత్రం చేత అధికారం సిద్దిస్తుందా..ఒక పక్క జనాల్లో జగన్ జగన్ అని వినిపిస్తోంది. అవి స్వంత గొంతులో, అద్దె గొంతులో తెలియని పరిస్థితి. పదేళ్ల వైఎస్ పాలనలో పలు రకాల పథకాలకు జనం ఆకర్షితులై వున్నారు. వాటిని మించి ఏదో చేయాలి. యువకులంతా జగన్ వెంట అంటున్నారు. వాళ్లను ఎలా మరల్చాలి? మరోపక్క పార్టీని బలోపేతం చేయాలి. నాయకుల ఖాళీలను భర్తీ చేయాలి. పదేళ్లుగా నిస్తేజంగా వున్న శ్రేణులను ఎన్నికల దిశగా నడిపించాలి. ఇన్ని సమస్యలు.

మనం ఎంత పని చేసాం అన్నదానికన్నా, ఎంత మందితో చేయించాం అన్నది కూడా ఒక్కోసారి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. టీమ్ ను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ను మించిన రాజకీయవేత్త లేరు సమకాలీనుల్లో అంటే సందేహం లేదు. ఫేస్ బుక్ లో ఎన్ని గ్రూప్ లు పెట్టాలో అన్నీ పెట్టించారు. నిత్యం సోషల్ నెట్ వర్క్ ను వాడేవారిని ప్రభావితం చేసేలా, ఆలోచింపచేసేలా రకరకాల పోస్టింగ్ లు. 

మరోపక్క పార్టీ నేతలు వివిధ వేదికల మీద ఏం మాట్లాడాలో, ఎలా మాట్లడాలో ప్రతి గంటకు పార్టీ కార్యాలయం నుంచి అనుభవజ్ఞులన జర్నలిస్టులతో మెయిళ్లు, మెసేజ్ లు. నిజానికి ఇంకో పార్టీ అయి వుంటే, టికెట్ ల ఫంపకం నాడే పార్టీలో లుకలుకలు బయల్దేరేవి. సీట్లు తక్కువ నాయకులు ఎక్కువ. పైగా పక్క పార్టీ నుంచి వచ్చిన వారితో, ఆది నుంచి వున్నవారికి పొసగని వైనం. వీటన్నింటినీ ఎలా మేనేజ్ చేసారో, ఏమని మేనేజ్ చేసారో ఆయనకే తెలియాలి. ఆయన తరపున పనిచేసిన వారికి తెలియాలి. ఎక్కడా చిన్న సన్నాయి నొక్కు కూడా వినిపించలేదు.

తన సామాజిక వర్గం మద్దతు నూటికి నూరు శాతం వున్నంత మాత్రాన గెలవడం సాధ్యం కాదని తెలుసు. అందుకే ముందుగానే ఓ ప్రణాళిక ప్రకారం, ఓట్లను ప్రభావితం చేయగల కాపుకుల నేతలను ఒడిసి పట్టి పార్టీలోకి చేర్చారు. అటు సీమలో, ఇటు ఆంధ్రలో రాజకీయాలను ప్రభావితం చేయగల కాపు కులస్థుల అండ ఎప్పుడైతే దొరికిందో, ఇక వెనుదిరిగి చూడక్కరలేదని ధీమా పడిపోలేదు. అదృష్టం కలిసి వచ్చి, తనంతట తానుగా భాజపాకు మద్దతు ప్రకటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా తన వైపు తిప్పుకోగలిగారు. 

ఇలా ఒక్కోటీ సాధించుకుంటూ వెళ్లారు , కానీ ఇక చాల్లే అనుకోలేదు. ఒక్క ఓటు వున్న వాడి దగ్గర నుంచి లక్ష ఓట్లు తేగలిగిన వాడి వరకు అందరినీ పోగేసారు. అందరితో తన సైన్యాన్ని సర్వసన్నధం చేసారు. ప్రజలకు తన అవసరం తెలియచెప్పారు. రాజకీయ నాయకులు సాధారణంగా ప్రజలు తమకు అవసరం అనుకుంటారు. అలాగే మాట్లాడతారు. 

అలాగే వారిని దువ్వి ఓట్లు వేయించుకుంటారు. కానీ చంద్రబాబు రివర్స్ లో వెళ్లారు. నా అవసరం ఇప్పుడు ఆంధ్రకు వుంది అనిపించారు. నేను కావాలి..మీకు ఉద్యోగాలు కావాలంటే..నేను గెలవాలి మీకు కరెంట్ సదా వుండాలంటే, నేను అధికారం అందిపుచ్చుకోవాలి ఆంధ్రకు సరైన ప్రగతి బాట కనిపించాలంటే, నాకు పట్టం కట్టాలి, రాజధాని కరువైన మీ రాష్ట్రానికి సరైన రాజధాని నిర్మించాలంటే...ఇదీ ఆయన రివర్స్ స్ట్రాటజీ. ఇదే అద్భుతంగా వర్కవుట్ అయింది.

అప్పుడు మొదలైంది యుద్ధం.

మహా మహులు, రాజకీయాల్లో తలపండినవారు ఈ పోరు చూసి బుర్రలు పట్టుకున్నారు. ఎవరి అంచనాలకు అందలేదు ఫలితాలు. ఇంకా ఎక్కడో అనుమానం..జగన్ బోర్డర్ లోకి వచ్చేస్తాడా..కానీ బాబు వ్యూహాలు ఫలించాయి..ప్రయత్నాలు పుష్పించాయి. ఓట్ల విరుల వాన కురిసింది. తెలుగుదేశం బావుటా రెపరెపలాడింది. చంద్రబాబుకు అధికారం సంప్రాప్తించింది.

మరోసారి చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెట్టాల్సి వచ్చింది. ఎన్నికల హామీల కొండ కళ్ల ముందు వుంది. కేంద్రం గతంలోని భాజపా మాదిరిగా లేదు. మోడీ అంతకన్నా చాణక్యం ప్రదర్శిస్తున్నారు. ఆర్బీఐ సహకరించలేదు. రుణమాఫీ..రుణమాఫీ అంటూ ప్రతిపక్షం నానాయాగీ చేస్తోంది. చేసినా, చేయకున్నా సమస్యే. పూర్తిగా మాఫీ చేయగలిగితే ఎప్పుడు చేసినా ఫరవాలేదు. జనం గుర్తుంచుకుంటారు. కానీ అరకొరగా చేస్తే, వెంటనేచేసేయాలి. ఎందుకంటే అయిదేళ్ల తరువాత జనం కాస్త మరిచే అవకాశం వుంటుంది. లేదా మరిన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా వేరే దారిలో వారిని సంతృప్తి పరిచే అవకాశం వుంటుంది. 

అందుకే మొత్తానికి వాయిదాల పద్దతిలో రుణమాఫీ అన్నారు. యాభై వేల లోపు  రుణాలు ఒక్కసారి తీర్చడం ద్వారా కనీసం యాభై శాతం మందిని సంతృప్తి పరిచేసారు. రాజధాని నిర్మాణాన్ని భారీ ఎత్తున తలెపెట్టారు. ఎవరు ఏమనుకున్నా, ఆయన ఇప్పుడు ఓ ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించే యోచనలో వున్నారు. ఇంతపెద్ద నగరం అవసరమా..ఇన్ని ఎకరాలు ఎందుకు అన్న మాటలు వుండనే వున్నాయి. అలా వాదించేవారి పాయింట్లు వారికి వున్నాయి. కానీ బాబు వాటన్నింటినీ తోసి రాజని ఇప్పుడు మహా నగర నిర్మాణానికి నడుం కట్టారు. ఎవరి ఊహల్లోకి కూడా రాని లాండ్ పూలింగ్ విధానాన్ని ప్రకటించారు. ఇవన్నీ ఆయన విజన్ కు తార్కాణాలు. 

ఇక్కడ నుంచి ఇక దారి లేదు అని అందరూ భావించిన చోట, వున్నట్లుండి దారి ప్రత్యక్షమయ్యేలా చేయగల సామర్థ్యం, ఆలోచన చంద్రబాబు స్వంతం. ఆయన ఏం చేయబోతున్నారు. ఏం ఆలోచిస్తున్నారు అన్నది అంత సులువుగా అంతుపట్టే వ్యవహారం కాదు. ఇప్పుడు ఎవ్వరు ఎంత గోలపెట్టినా, ఆయన తను అనుకున్న రీతిలో రాజధాని నిర్మించి తీరుతారు. అప్పుడు నోరు వెళ్ల పెట్టడం జనం వంతవుతుంది. ఆ క్షణంలో పచ్చటిచేలు, మూడు పంటలు, రైతులు, భూమి ఆధారిత జనం..ఇవేవీ ఇక జనానికిగుర్తు రావు. ఆ సంగతి బాబుకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన ఇప్పుడు వినవస్తున్న ఈ విమర్శలేవీ పట్టించుకోవడం లేదు.

అయిదేళ్ల తరువాత తమ కళ్ల ముందు ప్రత్యక్షమైన సువిశామల రాజధాని చూసిన జనానికి బాబు ఒక్కటే చెబుతారు..చేసింది..ఇంత...చేయాల్సింది ఇంకా ఎంతో వుంది. ఈ కొనసాగింపు కావాలంటే, నేను కొనసాగాలి. ఆలోచించుకోండి అంటారు. జనం అవుననక ఏమంటారు?

బాబు చాణక్యం కేవలం అధికారం అందుకోవడం పైనే కాదు..అధికారం నిలెబెట్టకోవడం, అందించడంలో కూడా వుంది. ఎన్టీఆర్ దగ్గర నుంచి అధికారం అందుకుని, తాను చేసింది సబబే అనిపించేసుకున్నారు పార్టీ జనాలతో. అదే చాకచక్యంతో ఇప్పుడు పార్టీ పగ్గాలు కొడుకు లోకేష్ కు అప్పగించి , శ్రేణుల్లో ఇసుమంత ఆలోచన రాకుండా చేసుకోగలిగారు. 

జూనియర్ ఎన్టీఆర్ ను చాలా పద్దతిగా పోటీ లోంచి పక్కకు తప్పించారు. చాలా స్మూత్ గా ఆపరేషన్ లోకేష్ ను విజయవంతం చేసేసారు. ఇప్పుడు లోకష్ ఫుల్ గా ఓపెన్ అయ్యారు. పార్టీ పగ్గాలు దాదాపు ఆయన చేతిలోకి వెళ్లిపోయాయి. సుప్రీం కమాండ్ గా చంద్రబాబు వుంటున్నారు.  ఇవన్నీ రజనీకాంత్ సినిమాలో మాదిరిగా చకచకా జరిగిపోయినట్లు కనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఎంతటి ప్లానింగ్ వుందో? ఎన్ని ప్రణాళికలున్నాయో, ఎన్ని నిద్రలేని రాత్రులు వున్నాయో, మెదడు చిట్లిపోయేంత ఆలోచనలు ఎన్ని సాగాయో? ఇప్పుడు సాధించిన విజయం కావచ్చు..సాధించబొయేవి కావచ్చు. బాబు ముందు చూపుకు తార్కాణాలు. 

వివిధ రంగాల్లో, ఎవరూ ఊహించనంతగా బాబుగారి నెట్ వర్క్ అల్లుకుపోయింది. వారంతా బాబు కోసం పనిచేస్తారు..మళ్లీ మాట్లాడితే పడి చస్తారు. ఇంతటి అద్భుతమైన నెట్ వర్క్ ఓ వ్యక్తి సాధించడం అంత సామాన్యం కాదు. తెలుగునాట అది ఇద్దరికే సాధ్యమైంది. ఒకరు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి. రెండవది చంద్రబాబు. భవిష్యత్ లో ఏమైనా కావచ్చు..ఎవరైనా నాయకులుగా ఎదగచ్చు..కానీ ఇంతటి చాణక్యం, ఇంతటి ఆలోచన, ఇంతటి నెట్ వర్క్ సాధించడం మాత్రం అనితరసాధ్యం.  అందుకే మిగిలిన వారంతా వాళ్ల ముందు పిల్లకాకుల్లా కనిపిస్తారు. కనిపించడం కాదు నిజమే కూడా.

అందుకే చంద్రబాబు మ్యాన్ ఆఫ్ పాలిటిక్స్

చాణక్య

writerchanakya@gmail.com

 


×