Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

కార్టూన్ స్టోరీ: పంచెలూడగొట్టలేదే పవనూ...

కార్టూన్ స్టోరీ: పంచెలూడగొట్టలేదే పవనూ...

మొత్తానికి పవన్ కల్యాణ్ బాబు.. తన కళ్ల ముందే ఏపీలోని మేధావులందరినీ కూర్చోబెట్టుకుని వారితో గణాంకాలను మధించి, నిజాలను బయటకు తీయడానికి జరిగిన ప్రయత్నం తొలిరోజు పూర్తయింది. తమాషా ఏంటంటే.. ఈ సమావేశానికి ఏపీ కాంగ్రెస్ తరఫున కూడా ప్రతినిధులు హాజరయ్యారు.

మొన్నమొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతెత్తున ఎగిరెగిరి పడుతూ.. విపీరతంగా ఫైర్ అయిపోతూ ప్రసంగాలు సాగించిన పవన్ కల్యాణే వారిని స్వయంగా ఆహ్వానించి మరీ.. సమావేశంలో కూర్చోబెట్టుకున్నారు. ఆ పార్టీ తరఫున గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ ఈ మీటింగుకు వచ్చారు. వీరిలో ప్రజారాజ్యం కాలంనుంచి పవన్ తో సాన్నిహిత్యం ఉన్నవారూ ఉన్నారు.

అయితే ఇప్పుడు ప్రజలకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. కాంగ్రెస్ వాళ్ళు తనకు ఇంత సమీపంలో దొరికిన తర్వాత.. పవన్ వారికి పంచెలు ఊడగొట్టకుండానే పంపించాడే అని జోకులు వినిపిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా పవన్ కల్యాణ్ ఆ రోజుల్లో ఒక రేంజిలో చెలరేగిపోయిన వ్యవహారం అందరికీ తెలిసిందే. భాగ్యనగరం నడిబొడ్డున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. ఈ కాంగ్రెస్ నాయకుల పంచెలు ఊడగొట్టి రాష్ట్రంనుంచి వారిని తరిమికొట్టాలంటూ పిలుపు ఇచ్చారు.

విభజన తర్వాత కూడా పవన్ కల్యాణ్ పదేపదే కాంగ్రెస్ వ్యతిరేక దృక్పథాన్ని వినిపించారు. అసలు పాపం కాంగ్రెస్ ది మాత్రమే.. వారు ఎంతో అశాస్త్రీయంగా విభజించిన పాపమే.. రాష్ట్రం ఇవాళ ఇన్ని కష్టాలు పడుతోంది అని పవన్ పదేపదే చెప్పారు.

అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దొరికినప్పుడు.. జరిగిన ద్రోహం గురించి పవన్ వారిని నిలదీశారో లేదో తెలియదు. విభజన చట్టంలో కాంగ్రెస్ ఏపీకి చాలా మేలు చేసిందని, కాకపోతే ఆ చట్టాన్ని అమల్లోకి తిసుకురావడంలో భాజపా, తెదేపా వైఫల్యాల వల్లే నష్టం జరుగుతోందనే మాట తప్ప.. మరో సంగతి వారు ఏమైనా ఈ భేటీలో చెప్పారో లేదో కూడా తెలియదు.

కాకపోతే.. కాంగ్రెస్ నాయకులు దొరికితే చాలు.. పంచెలు ఊడగొట్టి రాష్ట్రంనుంచే తరిమికొట్టాలని 2009లోనే రంకెలు వేసిన పవన్ కల్యాణ్.. 2014లో వారి ద్వారా రాష్ట్రానికి అపరిమితమైన అన్యాయం జరిగిందని తెలిసికూడా.. ఇప్పుడు పంచెలు ఊడగొట్టకుండా ఎలా పంపారనేదే చోద్యం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?