Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

మసాలా1: ‘కేంద్రంనుంచి సాధించడం’ మరచిపోండిక!

మసాలా1: ‘కేంద్రంనుంచి సాధించడం’ మరచిపోండిక!

అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టే పోరాటం ఏమైందో తెలియదు గానీ.. ప్రజల నుంచి అప్పులు తీసుకోవాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ప్రజలందరికీ వారు ఇచ్చే అప్పులకు బాండ్లు ఇస్తాం అని ప్రకటిస్తున్నారు. అలా ప్రజలనుంచి సేకరించిన సొమ్ముతో రాజధాని కడతాను.. మన రాజధానిని మనమే నిర్మించుకుందాం అనేది ఆయన కొత్త నినాదంగా ఉంది. అనేక పరిమితులు, ప్రతిబంధకాలు తొంగిచూస్తున్నప్పటికీ.. ప్రజల నుంచి నిధులు సేకరించే ప్రక్రియను ఫైనలైజ్ చేయడానికి కసరత్తు మొదలైంది. ప్రజలనుంచి ఇలా అప్పులు తీసుకుని ఇచ్చే బాండ్లను మసాలా బాండ్లు అని కూడా అంటారు.

చంద్రబాబు తాజా స్కెచ్ లోని ఈ మసాలా బాండ్ల వ్యవహారాల్లో ఉన్న మంచి చెడుల గురించి గ్రేటాంధ్ర పలు కోణాల్లోంచి కథనాలను అందించనుంది. ఈ బాండ్ల మంచీ చెడూ, ఇందులో ఉన్న ఇతర కోణాలు, ప్రమాదాలు, అప్పులిచ్చే సామాన్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇత్యాది విషయాలపై ఈ కథనాల ఫోకస్ ఉంటుంది. ఆ వరుస కథనాల్లో ఇది మొదటిది.

అంతా అయిపోయింది... మోడీ సర్కారుతో సాగించనంతకాలమూ.. ఒక అనుచిత స్వార్థ ప్రయోజనాలతో కూడిన బంధాన్ని కొనసాగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దాన్ని తెంచుకున్న వెంటనే.. రాష్ట్రం నడ్డివిరిచే భారం మోపడానికి సిద్ధం అవుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయినీ సాధిస్తాం.. పోరాడుతున్నాం.. నల్లరిబ్బన్లు పెట్టుకుని మోడీపై ఒత్తిడి తెస్తున్నాం.. పోస్టుకార్డులు రాసి భాజపాను గడగడలాడించబోతున్నాం.. అంటూ రకరకాలుగా ప్రజల్ని మభ్యపెడుతున్న చంద్రబాబునాయుడు.. ‘పోరాటం చేస్తున్నా’ అనే నిర్వచనానికి అనుగుణంగా.. తనకు కీర్తి దక్కేలా కొన్నిపాట్లు పడుతున్నారే తప్ప.. కేంద్రంనుంచి రాష్ట్రానికి రావాల్సింది సాధించగలం అనే ప్రజల నమ్మకాన్ని పూర్తిగా మంటగలిపేస్తున్నారు.

ఒకప్పట్లో కేంద్రంతో అంటకాగినప్పుడు.. ప్రజల్లో ఉన్న ప్రత్యేకహోదా అనే బలీయమైన వాంఛను ఒక స్కెచ్ ప్రకారం చంద్రబాబునాయుడు ఏ రకంగా అయితే.. సమూలంగా సమాధి చేసేశారో.. ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ కేంద్రంపై పోరాడుతున్నాయి కదా.. విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి దక్కవలసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక పోరాటం సాధించకపోతుందా.. అనే ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. కానీ.. ఆ రకంగా  కేంద్రం నుంచి రాజధానికి నిధులు వారి మెడలు వంచి అయినా సాధించగలం అనుకుంటున్న ప్రజల ఆశలను చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా తొక్కేస్తున్నారు.

తన చేతగానితనం మీద నిందలు రాకుండా.. ప్రజలే కేంద్రసాయం గురించి ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఆయన ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారు. ఈ మసాలాబాండ్లు, ప్రజలనుంచి అప్పులు తీసుకోవడం అనే వ్యవహారాలన్నీ ఇలాంటి కుట్రల్లో భాగమే అనేవాదన విశ్లేషకుల్లో వినిపిస్తోంది. ‘నేను పోరాడుతున్నా... కేంద్రాన్ని గడగడలాడించి సాధిస్తా’ అని చెబుతున్న నాయకుడు.. పోరాటానికి ముందే ప్రత్యామ్నాయం ఆశ్రయించడం పలాయనవాదం, చేతగానితనం కాక మరేమిటి? అనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.

చంద్రబాబునాయుడు పైకి ‘కేంద్రంపై పోరాటం’ అంటున్నారే గానీ... వాస్తవంలో ఆయన ‘కేంద్రం తరఫున’ బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఉన్నదని.. వారి మీద భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వం మీదనే నడ్డివిరిచే భారాన్ని మోపడానికి సిద్ధం అవుతున్నారని పలువురు అంచనా వేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?