Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

మసాలా5: రాష్ట్రమంతా ఎందుకివ్వాలి సార్?

మసాలా5: రాష్ట్రమంతా ఎందుకివ్వాలి సార్?

గుంటూరు జిల్లా లో సెలక్టివ్ గా ఒక ప్రాంతంలో అమరావతి అనే రాజధానిని నిర్మించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆ ప్రాంతంలోని భూముల ధరలకు ఆయన అతిపెద్ద రెక్కలు తొడిగారు. నాలుగైదు లక్షల రూపాయలు మాత్రమే ఉన్న ఎకరా ధరలు.. ఇప్పుడు కోట్లకు కోట్ల రూపాయల్లో పలుకుతూ ఉన్నాయంటే.. చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం మాత్రమే కారణం.

ఈ క్రమంలో- ప్రభుత్వ అధికారిక నిర్ణయానికి ముందే రైతులనుంచి తక్కువ ధరలకు భూములు కొనేసుకుని, ఆ తర్వాత.. ప్రభుత్వ నిర్ణయం తరువాత.. కోట్లకు కోట్ల రూపాయలకు వాటిని అమ్ముకుని పచ్చదళాలు లక్షల కోట్లరూపాయలకు హఠాత్తుగా అధిపతులు అయిపోవడానికి కూడా చంద్రబాబునాయుడు రాచబాటలు వేశారు.

ఇదంతా చాలా సవ్యంగా, ఒక వ్యూహం ప్రకారం ఆయన పూర్తి చేశారు. మరి ఇప్పుడు ఆయన మీద అనుమానాలతో కేంద్రం నిధులు విడుదల చేయడానికి ససేమిరా అంటున్న నేపథ్యంలో.. ఆయన కలగన్నట్లుగా అడిగినంత నిధులు ఇవ్వడం కుదరదని.. రాజధాని నిర్మాణానికి తాము ఇవ్వదలచుకున్నంత మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చేస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రప్రజలంతా రుణాలు ఇచ్చి.. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరుతున్నారు.

సరిగ్గా ఈ పాయింటు దగ్గరే ప్రజలకు ఓ సందేహం కలుగుతోంది. రాజధాని నిర్మాణం ద్వారా ఒక ప్రాంతం రియల్ ఎస్టేట్ వేల్యూ మాత్రమే పెరిగింది. ఒక ప్రాంతం భూమి విలువలు పెరిగాయి. ఒక ప్రాంతం ప్రజలు మాత్రమే.. హఠాత్తుగా కోటీశ్వరులు, కొందరు దళారులు వందల వేల కోట్లకు అధిపతులు అయిపోయారు. ‘అభివృద్ధి’ అనే ముసుగు కింద ప్రభుత్వం ప్రొజెక్టు చేస్తున్న ఇదంతా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయింది.

ఒక ప్రాంతంలోనే జనం బాగుపడినప్పుడు.. రాష్ట్రమంతా ఎందుకు రుణాలు ఇవ్వాలి? ఎందుకు విరాళాలు ఇవ్వాలి? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది.

మొత్తం రాయలసీమ నాలుగు జిల్లాల ప్రజలంతా కలిసి కనీసం హైకోర్టు ఒక్కటీ ఏదో ఒక రాయలసీమ జిల్లాలో ఏర్పాటు చేయండి. హైదరాబాదులో చేసిన తప్పునే అమరావతిలో చేయొద్దు. దానివల్ల నష్టం జరుగుతుంది. రాయలసీమ మరింత వెనుకబడిపోతుంది.. అంటూ విన్నవించుకుంటే.. సీమకు రెండో దేశరాజధాని డిమాండ్ చేయండి.. అంటూ వెటకారాలు చేసిన చంద్రబాబునాయుడుకు, ఆయన దళానికి.. ఆ ప్రాంత ప్రజలనుంచి అమరావతికి సహకారం అడిగే నైతిక హక్కు ఎలా ఉంటుంది.

రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో ఒక్క రాష్ట్ర స్థాయి సంస్థ అయినా ఏర్పాటు కాకుండా.. మొత్తం అమరావతిలోనే గుమ్మరిస్తున్న బాబు అహంకారపూరిత పాలన వైఖరికి.. ఆ ప్రాంతాల వారు ఎందుకు సహకరించాలి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎక్కడైతే మీరు రాజధాని అభివృద్ధి చూపిస్తున్నారో..? వారితోనే రుణాలు, విరాళాలు ఇప్పించుకోండి..? మమ్మల్నెందుకు అడుగుతారు? అంటూ ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తోంది. తన వైఫల్యాల వలన తలెత్తుతున్న ఇలాంటి సంక్లిష్టతను చంద్రబాబు ఎలా అధిగమిస్తారు... వేచిచూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?