cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

ప్రవాస వ్యభిచారం :: చీకటి దందాల కథ

ప్రవాస వ్యభిచారం :: చీకటి దందాల కథ

ప్రవాసంలో తెలుగుదనం, సంస్కృతి.. సంఘాల రూపంలో గుబాళిస్తున్నదని మనం మురిసిపోతూ ఉంటాం. తెలుగుదనం కోసం స్వదేశంలో కూడా ఇంత విస్తృతంగా కార్యక్రమాలు జరగడం లేదని పోల్చుకుంటూ ఉంటాం.

ప్రవాసాంధ్ర తెలుగు సంఘాల వ్యవహారాలు కార్యకలాపాలన్నీ, తెలుగుదనానికి నీరాజనాలు పట్టే సదుద్దేశంతో శ్రీకారం దిద్దుకున్న మాట నిజమే. కానీ, కాలక్రమంలో ఇవి ముసుగులుగా మారిపోయాయి. తులసివనంలో గంజాయి మొక్క అంటే సరిపోయేలా లేదు. ‘తులసివనం’ అని బయట బోర్డు పెట్టి, లోన మొత్తం గంజాయి సాగు చేస్తూంటే ఏమనాలి? తెలుగు సంఘాల కార్యక్రమాల ముసుగులో సాగుతున్న రాసలీలల దందాలు వెలుగులోకి వస్తున్నాయి. తప్పు అచ్చంగా వారి నెత్తిన నెట్టేయలేం... కానీ, సమస్త వ్యభిచార అరాచకాలకు వేదికగా అమరుతున్నది, వెసులుబాటు కల్పిస్తున్నది మాత్రం తెలుగు సంఘాలే!  మరక పడింది... కడిగేసుకోవాల్సిన అవసరం వారిదే!

పొట్ట చేతబట్టుకుని కడుపు కూటికోసం గానీ, బుర్ర నిండా జ్ఞానాన్ని పొదువుకుని తమ స్థాయికి సరిపడా కార్య వేదికను వెతుక్కుంటూ గానీ.. కారణాలు ఏవైనా కావొచ్చు... తెలుగునేలను వీడి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న వారి సంఖ్య అనల్పం. అనాదిగా ఈ ధోరణి ఉంది. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడినా, వారి వారి తాహతును బట్టి కువైట్ నుంచీ అమెరికా దాకా విదేశాలలో స్థిరపడినా ... మనం అందరినీ కలిపి ప్రవాసాంధ్రులు అనే అంటూ ఉంటాం. చిన్న చిన్న పల్లెల నుంచి నగరాల వరకు.. ప్రవాసాంధ్రులను మనం ఓ ప్రత్యేకాభిమానంతోనూ చూస్తూ ఉంటాం.

మరి ప్రవాసంలో తెలుగువారి జీవితాలు ఎలా ఉంటాయి. ఒకరకమైన ఒంటరితనం ఉంటుంది. మరో తెలుగువాడు కనిపిస్తే చాలు ఎంతో ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడూ కలుస్తూ ఉండాలని అనిపిస్తుంది. ఎక్కడో పుట్టిన ప్రాంతానికి దూరంగా బతుకుతున్న తెలుగువాళ్లం మనం.. అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అలాంటి సదుద్దేశంతో పుట్టినవే తెలుగు సంఘాలు. పరాయి ప్రాంతాల్లో ఉన్నవారు అప్పుడప్పుడూ సమష్టిగా కలవడం, కష్టసుఖాలను పంచుకోవడం, ఆ అనుభూతులను నెమరువేసుకుంటూ తర్వాతి కలయిక వరకూ రోజులు గడపడం జరుగుతూ వచ్చింది. క్రమక్రమంగా ఈ తెలుగు సంఘాల కార్యకలాపాలు పెరిగాయి. నలుగురూ కలవడం కోసం వినోద కార్యక్రమాలతో మొదలయ్యాయి. క్రమంగా భాషా సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణ మీద ఆసక్తితో (వాటికి దూరంగా బతుకుతున్నారు గనుక) అలాంటి కార్యక్రమాలు రూపొందాయి. సంఘాలు పెరిగాయి. సంఘాల ప్రాబల్యం పెరిగింది. స్వస్థలంలో ప్రవాస తెలగు సంఘాలకు ప్రాధాన్యం, గౌరవం పెరిగింది. దీంతో ఆయా సంఘాల మీద పెత్తనానికి అర్రులు చాచడం పెరిగింది. సహజంగానే చీలిక సంఘాలు పుట్టుకొచ్చాయి. కాలక్రమంలో ఎలా తయారైందంటే.. విదేశాల్లోని ఓ ఊర్లో ఓ పది తెలుగు కుటుంబాలు ఉంటే చాలు. ఓ తెలుగుసంఘం పెట్టేసుకోవడం రివాజు అయింది. ఇంతవరకూ మంచిదే. కానీ.. ఇతర ప్రాంతాల సంఘాల కార్యక్రమాలతో పోటీగా ఫీలవుతూ, తమ కార్యక్రమాలకు ఎక్కువ ఆదరణ ఉండాలనే అవాంఛిత ఈగోలకు వెళ్తూ... తెలుగు ప్రాంతం నుంచి సెలబ్రిటీ లను ఆహ్వానించడం, వారి ఖర్చులను కూడా భరిస్తూ తమ ఆతిథ్యంతో వారిని ఆనందింపజేసి, వారి సాన్నిధ్యంలో తాము ఆనందించడం కూడా తెలుగు సంఘాలకు అలవాటుగా మారింది. విదేశాలన్నీ కలిపి చూసుకుంటే వందల తెలుగు సంఘాలు ఉన్నాయి. క్రమంగా, ఇంత విస్తారంగా ఉన్న  ఈ తెలుగు సంఘాల్లోకి చెదపురుగులు ప్రవేశించడం కూడా మొదలైంది.

సెలబ్రిటీల కోసం పోటీ!

ప్రవాస జీవితాల్లో ఎన్ని వందల తెలుగు సంఘాలు ఉన్నప్పటికీ.. తెలుగు జాతికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ, నెమ్మదిగా తెలుగు సంఘాల మధ్యనే అవాంఛనీయమైన పోటీ మొదలైంది. తమ కార్యక్రమాలకు ఆదరణ బాగా ఉండాలనే ఉద్దేశంతో తెలుగు సెలబ్రిటీలను ఆహ్వానించడం పరిపాటి. మన సమాజంలో రాజకీయ, సినీ రంగాలకు చెందిన వారు మాత్రమే సెలబ్రిటీలు అనుకోవడం అసత్యమేమీ కాదు. ఆ రకంగా సెలబ్రిటీలను తీసుకువెళ్లడం మొదలైంది. ముందే చెప్పుకున్నట్టు వందలాది తెలుగు సంఘాలుండగా.. ప్రతి సంఘం పిలుస్తోంటే ప్రతిసారీ వెళ్లడానికి నాయకులకు ఖాళీ ఉంటుందా? ఏదో భారీగా సభ్యులుండే కొన్ని పెద్దసంఘాలు పిలిచినప్పుడు వెళ్తారే తప్ప.. ప్రతి ఒక్కరూ పిలిచినప్పుడు వారు వెళ్లగలరా? అందుకే సినీ సెలబ్రిటీలే ఫస్ట్ ప్రయారిటీగా ఎగబడడమూ మొదలైంది. వారైతే.. షూటింగులు తప్ప.. మరో వ్యాపకం ఉండదు (?). పైగా విదేశాలకు వెళ్లిన వారే అయినా.. సినిమాలంటే ఎగబడే జనాలు గనుక.. ఏదో షూటింగుల గ్యాప్ లో ఖాళీగా ఉన్న కొందరు హీరోయిన్లను పోగేస్తే.. సరిపోతుందనే భావనకూడా ప్రబలింది. హీరోయిన్లను ఎప్రోచ్ కావడానికి అందరికీ యాక్సెస్ ఉండదు కదా!

సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే దళారీలు పుట్టుకొచ్చారు. సినీ హీరోయిన్లంటే.. వారికి ఉపాధి అయిన సినిమాలకు డేట్స్ చూడడానికే మేనేజర్లుంటారు. మరి విదేశీ టూర్లకు వెళ్లడానికి కూడా అలాంటి ఏర్పాటు ఒకటి అవసరం గనుక దళారీల వ్యవస్థ వర్ధిల్లింది. అలాంటి దళారీలకు పుట్టిన  ఆలోచనే ఈ ప్రవాస వ్యభిచారం. సాధారణంగా ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నప్పుడు కొన్ని బై-ప్రోడక్ట్స్ కూడా వస్తుంటాయి. అలాగే సినీ హీరోయిన్లను ప్రవాస తెలుగు సంఘాల కార్యక్రమాలకు వెళ్లడం నాణేనికి ఒకవైపు అయితే... బై-ప్రోడక్ట్స్ లాగా ప్రవాసంలో ధనమదాంధుల శృంగార అవసరాలను తీర్చడానికి వీరిని ఉపయోగించడం ఒక లాభదాయకమైన వ్యాపారంగా మారిపోయింది. ఎన్నారై తెలుగు సంఘాలు తలపెట్టే కార్యక్రమాలకు ఈవెంట్ మేనేజర్లుగా నిర్వహణకు పూచీ తీసుకునే పలువురు కూడా.. ఆ కార్యక్రమాల ముసుగులో పిలిపించే హీరోయిన్లతో వ్యభిచారం నడిపించే దందాలకు కేంద్రబిందువులు అవుతున్నారు. వారే బ్రోకర్ల అవతారం ఎత్తుతున్నారు.

ఎటుచూసినా శృంగార విశృంఖలత

‘హీరోయిన్ 123 ఈజ్ అవైలబుల్ ఫర్ వన్ డే, టెన్ తౌజండ్ డాలర్స్’ అంటూ ఓపెన్ గా కొందరు ప్రవాసాంధ్ర ప్రముఖులకు ఎస్సెమ్మెస్ లు వెళుతున్నాయంటే ఇలాంటి బ్రోకర్లు ఎంతగా బరితెగించి ఈ దందాను నడిపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో నాలుగు డబ్బులు కళ్లజూసిన తర్వాత.. కొందరికి విలాసాల మీదికి చూపు మళ్లడం సహజం. అలాంటి వారే ఈ బ్రోకర్లకు టార్గెట్ అవుతున్నారు. అధికారికంగా నిర్వహించే తెలుగుసంఘాల కార్యక్రమాలకంటె ముందునుంచే అలాంటి డబ్బుకు వెనకాడని విటులతో బేరం మాట్లాడుకుని.. వారు కోరుకున్న హీరోయిన్లకు ఎరవేయడంతో ప్రారంభించి.. చివరకు దొరికిన హీరోయిన్ తో పబ్బం గడిచేలా చూసుకుంటున్నారు.

ఇప్పుడంటే నిర్దిష్టంగా ఇలాంటి బ్రోకర్ వ్యవహారాలను నడిపిస్తున్న వారి వ్యవహారం అనుకోకుండా వెలుగులోకి రాబట్టి దీని గురించి భారీగా చర్చ జరుగుతున్నది గానీ.. ప్రత్యేకించి అమెరికాలో ఫలానా హీరోయిన్ ఈసారి కార్యక్రమానికి వస్తున్నదంటే.. ఆమెతో శృంగార సుఖం పంచుకోబోయే ప్రముఖులు ఎవరెవరు ఉండవచ్చునో.. బహిరంగంగానే చర్చించుకుంటూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఉభయులకూ అభ్యంతరం లేనప్పుడు శృంగారంలో పాల్గొనడం అనేది ఆ దేశంలో నేరం కాకపోవచ్చు. కానీ ఈ ముసుగులో చాలా పెద్ద వ్యాపారం జరుగుతున్న మాట వాస్తవం.

ఇలాంటి అరాచక సెక్స్ పోకడలు కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. యూరోపియన్, అరేబియన్ దేశాలలో కూడా ఇదే దందాలు తెలుగుసంఘాల ముసుగులోనే జరుగుతున్నాయి. కొన్ని చిన్న దేశాల్లో అయితే.. ప్రత్యేకంగా బ్రోకర్ల వ్యవస్థ లేకపోయినా.. నిర్వాహకులే అతిథులను ఆహ్వానించడమూ, వారిని అనుభవించడమూ అనే రెండు పాత్రలనూ పోషిస్తున్న ఉదంతాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

అక్కడ ‘సేఫ్’ అనుకుంటున్నారా?

రాజకీయ నాయకులు కూడా ఈ ప్రవాసాంధ్ర వ్యభిచారానికి ఉత్సాహపడుతున్న ఉదంతాలు ఉన్నాయి. అవకాశం రావాలే గానీ.. అలవిమాలిన శృంగారంలో ఓలలాడడానికి ఎగబడే వాళ్లు చాలా మందే ఉంటారు. రాజకీయ ప్రముఖుల్లో కూడా అలాంటి వారు తక్కువేమీ కాదు. రాజకీయరంగంలోనే ఎదగడానికి తమ ప్రాపకం కోసం వచ్చే వారిని, వివిధ పనులను చక్కబెట్టుకోవడానికి ఆశ్రయించే వారిని శృంగారాత్మకంగా వాడుకోవడం కొందరు నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అయినా సాధారణంగా స్వంత ప్రాంతంలో అయితే నాయకుల ప్రతి కదలిక ప్రజలకు తెలిసిపోతూ ఉంటుంది. ప్రజల కళ్లుగప్పి తిరగాలి. అదే ప్రవాసంలో అయితే... చాలా సేఫ్టీ ఉంటుంది. పైగా తమకు శయనసుఖం అందించగల వాళ్లు మామూలు లేడీస్ కాదు. సినీమా హీరోయిన్లు. పైసా ఖర్చు లేకుండా.. అందమూ వన్నెచిన్నెలూ పుష్కలంగా ఉన్న హీరోయిన్లు తామై వచ్చి పడక పంచుకునే భాగ్యం దక్కుతోంటే ఎందుకు కాలదన్నుకుంటారు. అందుకే ఈ కేటగిరీకి చెందిన సినీ హీరోయిన్లు వచ్చే కార్యక్రమాల్లో జమిలిగా అతిథులుగా పాల్గొనడానికి ఎగబడుతున్న రాజకీయ నాయకులు కూడా పుష్కలంగానే ఉన్నారని తెలుస్తోంది.

‘ప్రవాసంలోనే సేఫ్టీ’ అనుకోవడం రాజకీయ నాయకులు మాత్రమే కాదు... హీరోయిన్లు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ఒకసారి శరీరాన్ని అమ్ముకోవడం ఆర్జన మార్గం అని అర్థమైన తర్వాత.. స్వదేశంలో కూడా అందుకు వెనకాడని వారు అనేకులు ఉన్నారు. అయితే స్వదేశంలో ఎంత పెద్ద స్టార్ హోటళ్లలో దిగినా.. ఎప్పుడైనా రైడింగ్ జరగచ్చునని చిన్న భయం. పైగా, పదివేల డాలర్లంటే ఇంచుమించు 7 లక్షల రూపాయలు... స్వదేశంలో అంత మార్కెట్ ధర పలకడం ఎప్పటికి సాధ్యమవుతుందో అనే ఆలోచన కూడా వారికి ఉండవచ్చు. అందుకే హీరోయిన్లు కొందరు... సినిమాలకంటె ప్రవాసాంధ్ర కార్యక్రమాలనే బెటర్ అండ్ సేఫ్ సోర్స్ గా ఎంచుకోవడం కూడా జరుగుతోంది.

అందర్నీ ఒకే గాటన కట్టేయలేం

‘ప్రవాస వ్యభిచారం’ అనేది  ఆ తరహా హీరోయిన్లకు సేఫ్ ఎర్నింగ్ సోర్స్ అన్నమాట నిజమే కావొచ్చు. కానీ.. అలాగని అందరూ హీరోయిన్లను ఒకే గాటన కట్టేయడానికి వీల్లేదు. ఆ మధ్య కాలంలో కాస్త క్రేజీగా ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతానికి అసలు సినిమాలే లేకుండా మారిపోయిన ఓ హీరోయిన్ అచ్చంగా ప్రవాసాంధ్రుల్నే నమ్ముకుంటే.. ఇటీవలి కాలంలో కాస్త లైమ్ లైట్ లోకి వస్తున్న ఓ హీరోయిన్ కోసం వేలకు వేల డాలర్లు కుమ్మరించడానికి అనేకమంది సిద్ధంగా ఉన్నా... ఆమె ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.

నిజానికి మళయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చి.. తొలి అడుగులు కుదురుగా పడకపోయినా.. నెమ్మదిగా నిలదొక్కుకుంటున్న ఓ హీరోయిన్ కోసం, ఆమె డేట్స్ చూసే మేనేజర్ ను సంప్రదించినప్పుడే ఈ బాగోతాలు రచ్చకెక్కాయి. సదరు హీరోయిన్ ఇలాంటి వ్యభిచార దందాలకు నో చెప్పగా, ఆమె మేనేజర్ పోలీసుల్ని ఆశ్రయించిన తర్వాతే.. తీగలాగితే డొంకంతా కదిలినట్లు వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి.

హీరోయిన్లలోనూ డబ్బుకు ఎగబడి శృంగారానికి సిద్ధపడేవారూ...  కెరీర్ చాలు ఇలాంటి డబ్బు అక్కర్లేదని అనుకునేవారూ రెండు రకాలూ ఉన్నారు. అదే తీరుగా ప్రవాసాంధ్ర సంఘాల్లో కూడా.. అచ్చంగా తెలుగుదనం కోసమే పనిచేస్తున్నవారూ, ఇలాంటి చిలక్కొట్టుడు వ్యవహారాల కోసం సంఘాలుగా అవతరిస్తున్న వారూ రెండు కేటగిరీలూ ఉంటున్నారు అని పలువురు విశ్లేషిస్తున్నారు.

నియంత్రించుకోవడం ఈజీ!

ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇలాంటి అరాచకపోకడలను నియంత్రించడం సంఘాల చేతుల్లోనే ఉంది. కార్యక్రమాలకు హీరోయిన్లను ఆహ్వానిస్తున్న వారు రెండు మూడు రోజులకు మించి సదరు పర్యటనకు అనుమతి లేకుండా కట్టడి చేసుకోవచ్చు. అదే హీరోయిన్ వ్యభిచార దందాకోసం వెళ్లదలచుకుంటే మరోసారి వెళ్లాల్సిందే తప్ప- కార్యక్రమంలో ఓ రోజు... వ్యాపారంలో కొన్ని నెలల రోజులు గడిపే వాతావరణం ఉండకూడదు. అలాంటి ఏర్పాట్ల వల్ల వ్యభిచారం ఆగుతుందని కాదు గానీ.. ప్రవాసాంధ్ర తెలుగు సంఘాల మీద మరక పడకుండా ఉంటుంది. పైగా హీరోయిన్లు కూడా కార్యక్రమాలు, షూటింగులు కాకుండా విడిగా వెళుతున్నారంటేనే.. తమ లోగుట్టు బహిర్గతం అయిపోతుందని కొంత జంకే అవకాశం కూడా ఉంటుంది.

ఒక వ్యవస్థ వైభవస్థితిలో పరిఢవిల్లుతున్నప్పుడు.. తమ పబ్బం గడుపుకోవడానికి దానిని ఆశ్రయించుకుని చెదలు పట్టడం చాలా సహజం. దీనిని కట్టడి చేయాలంటే.. ఆ వ్యవస్థే.. తమను తాము ఎప్పటికప్పుడు క్షుణ్నంగా ఆత్మావలోకనం చేసుకుంటూ.. గాడి తప్పుతున్న పరిస్థితుల్ని చక్కదిద్దుకుంటూ ముందుకు సాగాలి. అంతే తప్ప.. మేం అతిథులుగా పిలిచాం.. వారు బయట ఎక్కడో ఏదో తప్పు చేస్తే మమ్మల్ని నిందిస్తే ఎలా? అంటూ పలాయనవాదం ప్రదర్శించకూడదు. తాము ఆహ్వానించినప్పుడు, జరిగే ప్రతి తప్పు గురించి బాధ్యత తీసుకోవడం తప్పనిసరి అయితే.. వారి జాగ్రత్తలో వారుంటారు. ఈ వ్యభిచార దందాలకు ఫుల్ స్టాప్ పడాలంటే.. అలాంటి స్వయం నియంత్రణ కూడా తప్పనిసరి.

ప్రవాసాంధ్ర సోదరులారా...

పరాయిగడ్డపై మీరు భాషా సంస్కృతులు వర్ధిల్లజేస్తున్నందుకు జోహారు!

మీ నీడలో అరాచక వ్యభిచార వ్యాపారాలు పరిఢవిల్లితేనే తకరారు!!

 

... కపిలముని

kapilamuni.a@gmail.com