Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

‘‘జనసేనాధిపతీ.. మనో వాంఛా ఫల సిద్ధిరస్తు’’

‘‘జనసేనాధిపతీ.. మనో వాంఛా ఫల సిద్ధిరస్తు’’

హీరో పవన్ కల్యాణ్ ఇప్పుడు అమరావతి నివాసి కాబోతున్నారు. అక్కడ ఒక శాశ్వత నివాసాన్ని ఆయన నిర్మించుకుంటున్నారు. సోమవారం నాడు ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలను పవన్ కల్యాణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పార్టీకి చెందిన అతి ముఖ్య నాయకులు కొందరు మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానితులు.

తమాషా ఏంటంటే.. అమరావతిని ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఎంపిక చేశారు. అక్కడ ఇంకా రాజధాని నిర్మాణం అంటూ ఏమీ జరగలేదు. శాశ్వతమైన ఏ భవనమూ ఇంకా రాలేదు. రాజధాని అనే భావన కలిగే వాతావరణమూ లేదు. అయినప్పటికీ.. అదే తన భవిష్యత్ కార్యక్షేత్రం అవుతుందనే నమ్మకంతో.. అక్కడ శాశ్వతమైన ఒక సొంత ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్న మొదటి రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ అని చెప్పాలి.

ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కూడా.. అమరావతిలో ఇప్పటిదాకా సొంత ఇల్లు లేదు. ముఖ్యమంత్రి అధికార నివాసం కింద ప్రభుత్వపు సొమ్ముతో.. ఒక అక్రమ నిర్మాణాన్ని లీజుకు తీసుకుని.. దాని రిపేర్లు మరియు ఏర్పాట్ల పేరిట కోట్లకు కోట్ల రూపాయలను తగలేసి... తాను పదవిలో ఉన్నంత కాలం మాత్రమే వైభోగం వెలగబెట్టడానికి చంద్రబాబు ఏర్పాట్లు చేసుకున్నారే తప్ప.. ఆయన ఇప్పటిదాకా ఆ రాజధానిలో సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన చేయలేదు. ఇతర పార్టీల నాయకులు కూడా ఆ జోలికి వెళ్లలేదు. పవన్ ముందుగా.. సొంత ఇల్లు కట్టుకుంటున్నారు.

ఈ సందర్భంగా భూమిపూజతో పాటు.. యజ్ఞయాగాది క్రతువులను కూడా పవన్ కల్యాణ్ ఘనంగా నిర్వహించారు. యజ్ఞాలు క్రతువులు అంటే గుర్తుకు వస్తున్నది. పవన్ కల్యాణ్ .. తన మనోభీష్టాలు నెరవేరడానికి తాంత్రిక పూజలు కూడా చేయిస్తుంటారనే ఒక ప్రచారం కూడా ఉంది. సాధారణంగానే ఇండస్ట్రీలో ఇలాంటి ప్రచారం ముమ్మరంగా ఉండేది.

ఇటీవలి కాలంలో పవన్ మీద కత్తి కట్టినట్టుగా విమర్శలను రువ్విన ఒక సినిమా జర్నలిస్టు.. ఈ తాంత్రిక పూజల వ్యవహారాన్ని ప్రజల్లోకి కూడా తీసుకువెళ్లారు. రహస్యంగా తన ఆప్తసహచరులతో కలిసి తాంత్రిక పూజలు, ఇలా ప్రస్తుతం చేస్తున్నట్టుగా యజ్ఞయాగాది క్రతువులు.. వీటన్నింటి ద్వారా పవన్ ఏం కోరుకుంటున్నారు.. కొంపదీసి రాష్ట్రానికి ప్రత్యేకహోదా కాదు కదా..! అని జనం అనుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ గురించి రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. ఆయన గతంలో ప్రధాని నరేంద్రమోడీని.. కేంద్రమంత్రి పదవి అడిగారని.. ఆయన పట్టించుకోలేదని అంటుంటారు. ఒకవేళ ఆ పుకారు గనుక నిజమైతే.. పవన్ కల్యాణ్ కోరుకుంటున్నట్లుగా.. ఆయనకు కేంద్ర మంత్రి పదవి కల సాకారం కావడానికి, ఆయన అభిమానులు కోరుకుంటున్నట్లుగా.. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఇలాంటి యజ్ఞ యాగాదులు బాగానే ఉపయోగపడవచ్చు.

-కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?