Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

‘సై’ అన్న యోధుడికి.. ‘జైజై’ అంటున్నారే..!

‘సై’ అన్న యోధుడికి.. ‘జైజై’ అంటున్నారే..!

ఇప్పటిదాకా ఈ కోణంలోంచి ఎవ్వరూ ఆలోచించింది లేదు. ఇక్కడ మారుమూల పల్లె సీమల్లో జనం కూలి పనులు చేస్తూ ఉంటే.. ఆ కూలి డబ్బులు ఢిల్లీ పాదుషాలు నజరానా కింద సమర్పిస్తున్నారా? ఎక్కడి డబ్బులను ఎవరికి ఇస్తున్నారు వాళ్లు? ఇది మా సొమ్ము.. మీ కూలి డబ్బులు మేం ఇస్తున్నాం.. మీ కడుపులు మేం నింపుతున్నాం.. అంటూ ఎలా గప్పాలు కొట్టగలుగుతున్నారు వాళ్లు..?

మా ఊర్లో ఏ కులంలో ఎంత మంది ఉన్నారో.. ఏ కులాలు వెనుకబడి ఉన్నాయో వారికి ఎంత మేర దన్ను అందిస్తే వాళ్లు కూడా ఉన్నత స్థానాలకు రాగలుగుతారో మాకు తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? కులాలు, వెనుకబాటు తనమూ, కష్టాలూ... అన్నీ మావి.. అదే సమయంలో.. వాటి మేలుకోసం ఎంత సరిహద్దు గీత వరకూ ఆదుకోవాలో... డిసైడ్ చేసేది.. కళ్లను నెత్తిన తగిలించుకుని పాలన సాగించే ఢిల్లీ చక్రవర్తులా?

మా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులకు సరితూగుతాయో లేదో తెలియకుండానే... చట్టాలు చేసేది మీరు.. అవి ఎంత అపభ్రంశంగా ఉన్నా కళ్లద్దుకుని.. వాటి మేరకు, మమ్మల్ని మేం అష్టవంకర్లూ తిప్పుకుని.. ఆ చట్టాల చట్రంలో ఇముడ్చుకుని.. పాలన సాగించాలా?

ఎన్నాళ్లీ దురన్యాయం? ఎన్నాళ్లీ దాష్టీకం? ఇంకానా ఇకపై సాగదు!! అనే రేంజిలో కేసీఆర్ హూంకరించే సరికి.. దేశవ్యాప్తంగా ఒక వైపు హాహాకారాలు, ఒకవైపు హర్షధ్వానాలు జమిలిగా వెల్లువెత్తుతున్నాయి.

ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా కేంద్రం నిధులు ఇస్తున్నది.. మనం ఖర్చు పెట్టుకుంటూ పోతున్నాం.. అనుకుంటూ కాలం గడిపేసే వారే తప్ప.. మీరు ఇవ్వడం లెక్కేంటి...? దాని చిట్టా పద్దుల కథా కమామీషు ఏంటి? అని నిలదీసే వాళ్లు లేకపోవడం మూలాన ఫెడరల్ వ్యవస్థ అనే నిర్వచనం కింద.. యథేచ్ఛగా చెలరేగే జాతీయ పార్టీల పెత్తందారీ వ్యవస్థ మన దేశంలో నడుస్తూ వచ్చింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని నిలదీసి.. జాతీయ స్థాయిలో దేశానికి తానే దిశానిర్దేశం చేస్తానంటూ తొడకొట్టి ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్. ఆయన ‘సై’ అంటూ సవాలు విసిరింది.. ఏలుబడి సాగిస్తున్న మోడీ-భాజపాకు మాత్రమే కాదు, వారికి కాలం చెల్లితే ఆటోమేటిగ్గా గద్దె ఎక్కేది తామే కదా.. అని ధీమాగా విర్రవీగే కాంగ్రెసుకు కూడా.

అందుకే దేశవ్యాప్తంగా ఆ రెండు జాతీయ పార్టీల దురహంకారాన్ని ఈసడిస్తున్న వాళ్లంతా ఆయనకిప్పుడు జేజేలు పలుకుతున్నారు. ఆ దురహంకారం కింద నలిగిపోతున్న వాళ్లంతా వెంట నిలవడానికి మంతనాలు సాగిస్తున్నారు. దేశంలోనే ఒక కీలక నాయకురాలు అయిన మమతా బెనర్జీ నుంచి, తెలుగు రాష్ట్రాల్లో బుడిబుడి అడుగులేస్తున్న హీరో పవన్ కల్యాణ్ వరకు అంతా కేసీఆర్ కు జై కొడుతుండడం.. విశేషం గాక మరేమిటి..?

-కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?