cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

‘విశ్వనట చక్రవర్తి’కి నీరాజనం!

‘విశ్వనట చక్రవర్తి’కి నీరాజనం!

సెట్లో షూటింగ్ జరుగుతోంది. ఓ నటుడు స్క్రిప్టు పేపర్ చేతిలో పట్టుకుని డైలాగు ప్రకాశంగా (బయటకు) చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్నాడు. డైలాగును ఎలా పలకాలో నేర్పవలసిన అసిస్టెంటు డైరక్టర్లు కూడా ఆయన వద్దకు వెళ్లి నేర్పడానికి ప్రయత్నించడం లేదు. అంతలో మరో వ్యక్తి ఆయన వద్దకొచ్చి... ‘ఆ డైలాగును అలా పలకకూడదండీ, ఇలా పలకాలి’ అంటూ చిన్న మార్పు చెప్పాడు. మొత్తం డైలాగును తనకు చెబుతూ, ఉచ్ఛారణ దోషం దిద్దడానికి వచ్చానన్నట్లుగా పోజు కొడుతున్న ఆ వ్యక్తి కేసి, ఆ నటుడు ఎగాదిగా చూశాడు.

బక్కపలచటి వ్యక్తి, చామనచాయ. తెలుగుపంచె కట్టుకుని ఉన్నాడు. కానీ మనిషిలో బెదురులేదు.

‘‘నాకు డైలాగు పలకడం చెప్పేవాడు ఇంకా పుట్టలేదురా.. నువ్వెవడు’’ అంటూ ఆ నటుడు హూంకరించాడు. అందుకతను- ‘‘ఆ డైలాగు రాసింది నేనే నండీ.. మీరు పలుకుతున్న ఉచ్ఛారణ కరెక్టు కాదు’’ అని నిమ్మళంగా చెప్పేశాడు. ఆ వ్యక్తి రచయిత మల్లెమాల అనేది అప్రస్తుతం. కానీ, ‘నాకు డైలాగు చెప్పగలవాడు పుట్టలేదు’ అని రొమ్మిరుచుకుని చెప్పగల ధైర్యం ఎవరికుంటుంది?

ఆయన సామర్లకోట వెంకట రంగారావు.

ఇవాళ (జులై 3) ఆయన శతజయంతి!!

1964లో జకార్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమనటుడిగా ఎంపికవడం ద్వారా... ఎస్వీ రంగారావు సాధించిన ఘనత ఆ తర్వాత మనవాళ్లకు ఎవ్వరికి సాధ్యమైంది గనుక. నర్తనశాల చిత్రంలో తనది అల్పమైన,  అతిథిపాత్రే అయినప్పటికీ.. చూసిన యావన్మందినీ సమ్మోహితుల్ని చేసేసిన అభినయ పాటవం ఆయన సొత్తు. అందుకే ఆయన ‘విశ్వ నటచక్రవర్తి’ అయ్యారు.

పాతాళభైరవి, మిస్సమ్మ, గుండమ్మకథ, మాయాబజార్, తాత మనవడు, నర్తనశాల, భక్త ప్రహ్లాద, పాండవ వనవాసం, పండంటి కాపురం ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని చిత్రాలు. తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలమూ.. పాఠ్యపుస్తకాలుగా ఉండగల పాతచిత్రాల్లో ఆయన ప్రతిభ పదిలంగా ఉంటుంది. ఆసక్తికలిగి వాటిని చూసేవారిని అబ్బుర పరుస్తూ ఉంటుంది.

ఇవాళ్టి తరానికి ఎస్వీరంగారావు తెలియకపోవచ్చు. కానీ మహానటి చిత్రాన్ని ఆస్వాదించిన ప్రతి ఒక్కరూ అందులో.. అప్పటి సినీ ప్రపంచంలో నిండైన హుందాతనంతో కనిపించిన ఎస్వీరంగారావును రెండు మూడు సన్నివేశాల్లోనే చూసినా.. నటుడిగా, వ్యక్తిగా ఆయన గొప్పదనాన్ని తెలుసుకోగలుగుతారు.

ఆ మహానటుడికి ఇవాళ శతజయంతి. తెలుగు మీడియా ప్రపంచం మొత్తం ఆ నటుడిన ప్రస్తుత తరానికి విధిగా పరిచయం చేయవలసిన సందర్భం ఇది. ఆ సందర్భంగా ప్రత్యేక ఫీచర్ కథనాలను అందించి దాదాపుగా అన్ని పత్రికలూ ఆ పనిచేశాయి. జన బాహుళ్యానికి మరింత ఆయన నటవిశ్వరూపం చేరువ చేయగలిగిన ఈనాడు వంటి పెద్ద పత్రికలు మాత్రం.. కారణాలు ఏవైనా.. ఆయన స్వస్థలం పేరిట జిల్లా ఎడిషన్లకు పరిమితం చేయడం మాత్రం బాధాకరం.

ఏది ఏమైనప్పటికీ..

విశ్వ నటచక్రవర్తికి డైలాగు నేర్పగల వారు అప్పటికి పుట్టలేదు.

భిన్నపాత్రల్లో నటనా వైదుష్యంతో మెప్పించడంలో ఇప్పటికి మరొకరు ఆయన సాటిలేరు.

శతజయంతి సందర్భంగా గ్రేటాంధ్ర ఆయనకు నీరాజనాలు అర్పిస్తోంది.

-కపిలముని