cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

వెల్ రీమేడ్ సినిమా 'ఆటగదరా శివా' !

వెల్ రీమేడ్ సినిమా 'ఆటగదరా శివా' !

రీమేక్ సినిమాలు తీయడం అనేది నిజానికి కత్తి మీద సాము. ఎందుకంటే ఏదో ఒక భాషలో రూపొందిన చిత్రం చాలా బాగుందనే నమ్మకం ఏర్పడ్డ తర్వాతే... మరో భాషలో దానికోసం రీమేక్ రైట్స్ తీసుకుంటారు. అయితే దానిని మళ్లీ రూపుదిద్దే బాధ్యతను భుజానికెత్తుకున్న దర్శకుడు.. సహజంగా, తన ముద్ర చూపించడానికి కూడా ప్రయత్నిస్తుంటాడు. కథా గమనంలో చేయిచేసుకుని, తన భావజాలానికి అనుకూలంగా మార్పుచేర్పులు చేస్తుంటారు. దాదాపుగా ప్రతి రీమేక్ సినిమాకు సంబంధించి.. మేకర్స్ పదేపదే తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పుచేర్పులు చేశాం.. అని ప్రెస్ మీట్ లలో చెప్పుకుంటూ ఉంటారు.

కానీ.. ఆ మార్పుచేర్పులు చాలా సినిమాలను దెబ్బతీసేస్తుంటాయి. ఇటీవలి కాలంలో రీమేక్ గా తెరకెక్కినప్పటికీ... కేవలం కథలో, స్క్రీన్ ప్లేలో చేసిన మార్పులు, చేర్పుల కారణంగా.. ఒరిజినల్ కంటె ఉత్తమంగా రూపొందిన చిత్రం చంద్రసిద్ధార్థ్ – ఆటగదరా శివ!

అటు కన్నడంలో వచ్చిన మాతృక ‘రామారామారే’ చిత్రాన్ని, తెలుగులో వచ్చిన ‘ఆటగదరా శివ’ను చూసినప్పుడు... మూలాన్ని చూసినప్పుడు కలిగిన అసంతృప్తిని రీమేక్ చిత్రం తొలగించేస్తున్నది అనిపించింది. రీమేక్ చేయడంలో మంచి చెడులను, తీసుకున్న జాగ్రత్తలను ప్రస్తావించే వ్యాసం ఇది.

ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు- ఇది కమర్షియల్ సినిమా కోవకు చెందే రకంకాదని మనం గుర్తుంచుకోవాలి. చంద్రసిద్ధార్థ్ అంటేనే భావాత్మకమైన, భావోద్వేగ ప్రధానమైన, అర్థవంతమైన చిత్రాలు తీసే దర్శకుడిగా పేరుంది. ఆయన ఎలాంటి సబ్జెక్టును  టేకప్ చేసినా.. అందులో అంతర్లీనంగా ఒక సామాజిక సందేశం ఉంటుందనే ముద్ర కూడా ఉంది. అలాంటి చంద్రసిద్ధార్థ్ తన సుదీర్ఘమైన కెరీర్ లో తొలిసారిగా చేసిన రీమేక్ చిత్రం ఇది. అయితే మూస రీమేక్ ల మాదిరిగా మిగిలిపోకుండా.. ఆయన తనముద్ర చూపించి... ఒరిజినల్ కంటె ఉత్తమంగా ఆయన దీన్ని అందించగలిగారు.

రెండేళ్ల కిందట కన్నడంలో ‘రామా రామారే’ అనే చిత్రం వచ్చింది. నిజానికి అలాంటి చిత్రం వచ్చినట్లుగా కన్నడ సోదరుల్లోనూ చాలామందికి తెలియదు. డీ మానిటైజేషన్ సమయంలో విడుదల చేయడం వల్ల చిత్రం కమర్షియల్ గా దెబ్బతిన్నదని మేకర్స్ అనుకున్నారు. కానీ, అందులోని ఎలిమెంట్ కమర్షియల్ వేల్యూస్ తో ముడిపడినది కాదని, మంచి-చెడు చిత్రంగా మాట్లాడుకోవడం తప్ప.... హిట్-ఫ్లాప్ అంటూ దాన్ని గురించి చెప్పుకోలేం అని వారు గ్రహించలేదు. కానీ, ఆ విషయంలో స్పష్టమైన గ్రహింపుతోనే చంద్రసిద్ధార్థ్ దీనిని రూపొందించారు.

నిజానికి రామారామారే చిత్రం అనేక అంశాల్లో అసంపూర్తి చిత్రంలాగా కనిపిస్తుంది. రెండు ప్రధాన పాత్రల మధ్య కథను నడుపుతూ... ఆ పాత్రలకు గానీ, కథకు గానీ ఒక స్పష్టమైన ముగింపును కన్నడ చిత్ర దర్శకుడు ఇవ్వలేకపోయారు. అందుకు అనేక కారణాలున్నాయి. నిజానికి భగవద్గీతా సారం తెలియజెప్పే సెల్యులాయిడ్ రూపంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు కన్నడ చిత్ర రూపకర్తలు చెప్పుకున్నారు. అలా చెప్పుకున్నందుకు... బలవంతంగా చొప్పించిన ఒక్కపాట మినహా కథలో అందుకు మరో నిదర్శనం మనకు కనిపించదు.

కృష్ణుడు- అర్జునుడు పాత్రలను బలవంతంగా కథలోకి తీసుకువచ్చి వారితో ఓ పాట పాడించడం ద్వారా.. ఒరిజినల్ రామా రామారే చిత్రాన్ని గీతాసారం చెప్పే కథగా నమ్మించడానికి వారు ప్రయత్నించారు. కానీ దాన్ని తెలుగులో ‘ఆటగదరా శివ’ చిత్రంగా అందించడంలో... స్వేచ్ఛను తీసుకున్న చంద్రసిద్ధార్థ్ ఆ కథా సారానికి తగినట్లుగా.. ఆటగదరా శివ అనే టైటిల్ ను ఎంచుకోవడంతోనే విలక్షణత చూపించారు. కృష్ణార్జునులతో ఒరిజినల్ లో సాగే పాటను తెలుగులో కట్-అండ్-ట్రాష్ చేయడం అనేది ఈ దర్శకుడు చేసిన మొదటి మంచి మార్పుగా చెప్పుకోవాలి.

ఉరిశిక్ష పడి, జైలునుంచి పారిపోయిన ఓ ఖైదీ, అతడికి పడిన ఉరిశిక్షను అమలు చేయాల్సిన వృత్తిధర్మం నిర్వర్తించడానికి బయల్దేరిన ఒక తలారి మధ్య నడిచే కథ ఇది. వారిద్దరి జమిలి ప్రయాణమే భావోద్వేగాల మిళితంగా ఉంటుంది. మార్గ మధ్యంలో వారికి తారసపడే ఘటనలు.. పుట్టుక-జీవితం-చావు ప్రతీకలుగా నిలుస్తూ... వారి ఆలోచనా సరళిలో మార్పులు తెస్తూ సాగుతాయి. ఈ ఘటనల పర్యవసానంగా.. ఒక కరడు గట్టిన హంతకుడు తిరిగి పోలీసులకే లొంగిపోయేంతగా ఎందుకు పరివర్తన చెందుతాడో... ఒరిజినల్ కన్నడ చిత్రంలో చక్కగా చెప్పడంలో విఫలం అయ్యారు.

కథకు మూలసూత్రం అయిన ఈ పాయింట్ దగ్గర చంద్రసిద్ధార్థ్ తీసుకున్న ఎత్తుగడ ఫలించింది. మొదటి మార్పుగా- ఆయన ఉరిశిక్షను తప్పించుకున్న కథలోని పాత్రధారి.. కరడుగట్టిన నేరస్తుడు కాదని, ఒక ఖాకీ కుట్రతో అలా ఉరిశిక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందని మార్చారు. తద్వారా కథలోని ప్రధాన పాత్రధారి మీద ప్రేక్షకుల్లో సానుభూతిని క్రియేట్ చేయగలిగారు. అది కథ మార్పుల్లోని తొలి సక్సెస్ గా చెప్పాలి. అలాగే... వరుస ఘటనలు... ఉరిశిక్ష నుంచి తప్పించుకోడానికి ఒక హత్య చేసి మరీ పారిపోయిన వ్యక్తిలో ఎందుకు పరివర్తన తెచ్చాయో... తలారి- ఖైదీ మధ్య సంభాషణలో చక్కగా వివరించారు.

దానివలన... కథ కన్నడంలో లాగా యథేచ్ఛగా సాగిపోవడం కాకుండా... ఒక పద్దతిగా రూపుదిద్దుకుంది. హైపర్ ఆది, జబర్దస్త్ బ్యాచ్ కమెడియన్లతో సాగే కొన్ని కామెడీ సన్నివేశాలు.. ఎంతో లోతైన భావోద్వేగాలతో సాగిపోయే కథలో.. పంటికింద రాయిలా కొందరికి అనిపించడంలో వింతేమీలేదు. కాకపోతే.. సీరియస్ గా సాగుతున్న కథలో కాస్త రిలీఫ్ కోసం ఒరిజినల్ లో ఉన్న కామెడీ ట్రాక్ నే ఇంకాస్త పేరున్న నటులతో రూపుదిద్దారు తప్ప... కొత్తగా కలిపినది కాకపోవడం గమనించొచ్చు.

అలాగే... వృత్తిరీత్యా తలారి అయిన జంగయ్య పాత్ర కేరక్టరైజేషన్ లోనూ తెలుగులో ప్రత్యేకత ఉంది. మనుషుల ప్రాణాలు తీసే వృత్తిలో ఉన్న అతడిని.. జీవకారుణ్యం ఉట్టి పడే పశువులకు నాటు వైద్యం చేసే వ్యక్తిగా పరిచయం చేయడం.. అతనిలోని సున్నితత్వానికి సరైన ముగింపును తీర్చిదిద్దడం స్క్రీన్ ప్లేలో చేసిన మార్పుల్లో మెచ్చ దగినది. తెలుగు ‘ఆట గదరా శివ’ చిత్రానికి చంద్ర సిద్ధార్ చాలామంచి ముగింపు ఇచ్చారు. కన్నడంలో అర్థంతరంగా, ఇంకా చెప్పాలంటే, అర్థంలేకుండా సినిమా ఆగిపోతుంది. తెలుగులో దానికి పరిపూర్ణమైన ముగింపు ఇచ్చారు.

కన్నడలో ఖైదీ జైలు వద్దకు వచ్చి, లొంగిపోవడంతో కథ ఆగిపోయింది. కథ... రోడ్డు మధ్యలో, బండి రిపేర్ వల్ల ఆగిపోయిన జర్నీ లాగా ఉంటుంది. కానీ, తెలుగులో కథకు, పాత్రలకు, భావోద్వేగాలకు అర్థవంతమైన ముగింపు ఇచ్చారు. ఖైదీ జీవితం మొత్తం ఆకళింపు అయిన తలారి, ఎంతటి భావసంచలనానికి గురై.. తన చేతులతో ఉరి తీయలేక, అలాగని వృత్తి ధర్మం వీడలేక అంతర్మధనానికి గురై, గుండెపోటుతో మరణించడం తారస్థాయి.

రీమేక్ లలో మార్పు చేర్పులు అసలు కథను దెబ్బ తీయకూడదు. భావ ప్రధానమైన చిత్రాల్లో ఇది మరీ ముఖ్యం. రామా రామారే చిత్రాన్ని తన మార్పులు, ముద్రతో సుసంపన్నం చేసి ‘ఆట గదరా శివ’గా చంద్రసిద్దార్థ అందించారు.

చిత్రబృందానికి అభినందనలు.
-కపిలముని