cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఒక విన్నపం

నేను సాధారణంగా నా వ్యక్తిగత విషయాలు పాఠకులతో పంచుకోవడానికి యిష్టపడను. ఏదైనా ఒక అంశాన్ని పోల్చడానికి గాని, ఒత్తి చెప్పడానికి గాని అప్పుడప్పుడు నేను పని చేసిన ప్రాంతాల గురించి, నా ఉద్యోగం గురించి చెప్పానంతే. నా పేరులో లేని ఫేస్‌బుక్‌ ఖాతా (రైటర్స్‌ రెస్పాన్స్‌ అని ఉంటుంది) కూడా పాఠకులకు సమాధానమివ్వడానికే వాడతాను. అయితే అలవాటుకి భిన్నంగా నా వ్యక్తిగత విషయాన్ని చెప్పడానికి యిది రాస్తున్నాను. నేను నా అనారోగ్య కారణంగా కొన్నాళ్ల పాటు కాలమ్‌ రాయలేకపోతాను. మామూలుగా అయితే మధ్యమధ్యలో వేర్వేరు కారణాల వలన చాలా విరామాలు తీసుకుంటూ ఉంటాను. అప్పుడు నా అభిమాన పాఠకులు కొందరు అనారోగ్యమా అని అడుగుతూ మెయిల్స్‌ రాస్తారు. కాదని చెప్తూ వుంటాను.

ఈసారి మాత్రం నిజంగా అనారోగ్యమే. ముందుగానే చెప్పేస్తున్నాను. ఇది కూడా చెప్పకపోదును. కానీ యిది ఎన్నికల, ఫలితాల సీజను. గతంలో 2014 ఎన్నికలప్పుడు యూరోప్‌ పర్యటనకు వెళితే అందరూ మోదీ గెలిచాడనే విషయాన్ని జీర్ణించుకోలేక నిర్ఘాంత - పోయి ఉంటానని, అస్త్రసన్యాసం చేసి ఉంటానని తీర్మానించారు. కానీ నేను తిరిగి వచ్చాక గత ఐదేళ్లగా రాస్తూనే వచ్చాను. ఈసారీ ఎన్నికల సమయంలో అలాటి విరామాన్ని అలా అపార్థం చేసుకునే ప్రమాదం ఉందని ముందుగానే చెప్పుకుంటున్నాను.

రోగలక్షణాలు ఏమీ కనబడకపోయినా రెగ్యులర్‌గా హెల్త్‌ చెకప్‌ చేయించుకునే అలవాటు నాది. మార్చి ఆఖరివారంలో చూపించుకుంటే 2డి ఎకోలో బ్లడ్‌ ఫ్లో తక్కువున్నట్లు తెలిసింది. ఏంజియో తీయిస్తే గుండె లెఫ్ట్‌ మెయిన్‌ ఆర్టరీలో బ్లాక్‌ ఉంది. అది జంక్షన్‌ కాబట్టి స్టెంట్‌ వేయలేరు. బైపాస్‌ సర్జరీ ఒక్కటే శరణ్యం. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదు కానీ ఎప్పుడో ఒకప్పుడు చడీచప్పుడు లేకుండా ఏ స్ట్రోకో వస్తే దాని కారణంగా గుండె పనితీరు బాగా దెబ్బతింటుంది. అందుకని ప్రమాదానికి ఎదురేగి, ఆపరేషన్‌ చేయించుకుంటున్నాను. తక్కిన కాంప్లికేషన్స్‌ ఏవీలేవు కాబట్టి త్వరగానే కోలుకుంటానని ఆశిస్తున్నాను. మళ్లీ రాసే ఓపిక ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి గ్యాప్‌ ఎంతుంటుందో యిప్పుడే చెప్పలేను. ఈ లోగా నా కిష్టమైన పార్టీ ఓడిపోయింది కాబట్టో, ఇష్టంలేని పార్టీ నెగ్గింది కాబట్టో గుండెపోటు తెచ్చుకున్నానని ఎవరైనా చెపితే నమ్మకండి. ఇవాళే ఆసుపత్రిలో చేరుతున్నాను. రేపే అంటే ఏప్రిల్‌ 15న సర్జరీ. ఇప్పటివరకు హార్ట్‌ ఎటాక్‌ రాలేదు.

ఇది చదవగానే మీరందరూ గుళ్లలో, మసీదుల్లో, చర్చిల్లో, గురుద్వారాల్లో నా గురించి ప్రార్థనలు చేస్తారనే దురాశలు నాకులేవు కానీ, చాలామంది బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అనో మరోటో శుభాకాంక్షలు చెప్పడానికి ప్రయత్నించవచ్చు. అలాటిదేమీ చేయకండి. ఇప్పటికే నా మెయిల్‌ బాక్స్‌ పీకలదాకా నిండి వుంది. ఇక్కడ వ్యాఖ్యలు రాసినా నేను చదివే సావకాశం లేదు. అందువలన యిది చదివి 'ఓహో' అనుకుని ఊరుకోండి. పైకి చెప్పినా, చెప్పకపోయినా, మీరు మనసులో నా మంచి కోరతారనే నా ఊహ. నాతో రాజకీయపరమైన భేదాభిప్రాయాలు వున్నవారు కూడా నా మేలే కోరతారని నేను అనుకుంటున్నాను - తిట్లు పడడానికైనా ఒకడు ఉండాలిగా!

బైపాస్‌ సర్జరీలు యీ రోజుల్లో సాధారణంగా విజయవంతమే అవుతున్నాయి. పైగా నాకు యితర సమస్యలు ఏవీ లేవు. అందునా జీవితంలో మొట్టమొదటిసారి ఆసుపత్రికి ఇన్‌-పేషంటుగా వెళుతున్నాను కాబట్టి, మర్యాదగా బయటకు సాగనంపి 'మళ్లీ మళ్లీ వస్తూ ఉండండి' అంటారనుకుంటున్నాను. అయినా కానీ, ఒకవేళ అటుది యిటై నేను బయటకు రాకపోయినా చింతించండి. నా స్థానంలో మరో రచయిత వస్తాడు. 'ఆయన లేని లోటు పూరించలేనిది' అనేది తరచుగా అనేస్తాం కానీ అది ఉత్తిది. 'యహ్‌ జిందగీ కే మేలే, దునియామే కమ్‌ న హోంగే, అఫ్‌సోస్‌ హమ్‌ న హోంగే..' అని ఎప్పుడో చెప్పారు ఓ సినీకవి. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఇక నన్ను బాగా పడతిట్టినవాళ్లు కూడా నేను చచ్చి దెయ్యమై వాళ్లని పీడిస్తానని భయపడనవసరం లేదు. నాకు తీరని కోరికలు ఏవీ లేవు. సంతృప్తికరమైన జీవితాన్ని గడిపాను. దయ్యమయ్యే ఛాన్సే లేదు.

ఇదేదో సరదాకే రాశాను కానీ నేను మళ్లీ తిరిగి వస్తాననీ, మళ్లీ కాలమిస్టుగా మిమ్మల్ని ఎంగేజ్‌ (అలరిస్తాను అనే మాట అందరికీ వర్తించదు కాబట్టి...) చేస్తాననీ గాఢంగా నమ్ముతున్నాను. టీవీ యాంకర్లు విరామం తీసుకున్నపుడు 'డోంట్‌ గో ఎనీవేర్‌, స్టే ట్యూన్‌డ్‌' అని మొహమాట పెట్టేస్తూంటారు. ఓసారి వెళ్లిపోయిన ప్రేక్షకుడు మళ్లీ వెనక్కి రాడేమోనని వారి భయం. నాకు ఆ భయం లేదు. ఎన్నాళ్ల విరామం తర్వాతనైనా నేను మళ్లీ కీబోర్డు పడితే (కలం వాడనుగా మరి) మళ్లీ చదువుతారనే ధీమా నాది. ఆ ధీమాతోనే ఆపరేషన్‌ థియేటరులోకి వెళుతున్నాను.

గమనిక - ఈ ఆర్టికల్‌కి ఫోటో (పెడితే నాదే పెట్టాలి) ఏదీ పెట్టటంలేదు - పెడితే నేను యిప్పటికే పోయానని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి!
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2019)