cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: గవర్నర్ల చురుకుదనం

ఎమ్బీయస్‌: గవర్నర్ల చురుకుదనం

గవర్నర్లను తమ ఏజంట్లగా వాడుకోవడం, తమకు నచ్చని ముఖ్యమంత్రులను వారి ద్వారా వేధించడం కాంగ్రెసు హయాం నుంచి వస్తూన్నదే. బిజెపి కూడా కాంగ్రెసుకు ఏ మాత్రం తీసిపోకుండా వ్యవహరిస్తోంది. తమిళనాడులో జయలలిత వంటి ముఖ్యమంత్రి ఉండగా కేంద్రం జాగ్రత్తగానే ఉండేది. ఎందుకంటే ఆమె చెన్నారెడ్డి వంటి గవర్నరునే లక్ష్యపెట్టకుండా నిత్యం కలహించింది. జయలలిత మరణానంతరం మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగరరావు ద్వారా శశికళకు ముకుతాడు వేశారు. ఆ తర్వాత 2017 అక్టోబరులో ఫుల్‌టైమ్‌ గవర్నరుగా 78 ఏళ్ల భన్వరీలాల్‌ పురోహిత్‌ అనే రాజకీయ నాయకుణ్ని గవర్నరుగా వేశారు. ఆయన దశాబ్దాలుగా కాంగ్రెసు, బిజెపి పార్టీల మధ్య దూకుతూ వచ్చిన దురంధరుడు. ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వాని తాము చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా పెట్టుకున్నామని చాటుకోవడానికి కాబోలు, గవర్నరును పాలనలో కూడా కలగజేసుకోమంది కేంద్రం. ఇక అప్పణ్నుంచి ఆయన ప్రతి జిల్లా ముఖ్యపట్టణానికి వెళ్లడం, అక్కడి అధికారులను పిలిపించి మాట్లాడడం పనిగా పెట్టుకున్నాడు. వాళ్లకు ఆదేశాలు యిచ్చేస్తున్నాడు.

బిజెపికి వంత పాడుతున్న ఇపిఎస్‌ ప్రభుత్వం తమ అధికారానికి ముప్పుగా మారిన గవర్నరు చర్యల గురించి కిక్కురుమనటం లేదు కానీ ప్రతిపక్షంలో ఉన్న డిఎంకె అభ్యంతర పెడుతూ గవర్నరుకి నల్లజండాలతో నిరసన తెలుపుతోంది. పురోహిత్‌ యూనివర్శిటీలకు తమిళేతరులను వైస్‌ ఛాన్సలర్లగా నియమిస్తున్నాడని డిఎంకె ఎత్తిచూపితే, యూనివర్శిటీల ఛాన్సెలర్‌ హోదాలో తనకా హక్కు ఉందని పురోహిత్‌ వాదించాడు. ఈలోగా మధురై కామరాజ్‌ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న అరుప్పుకోట్టయ్‌లోని దేవాంగ ఆర్ట్‌స్‌ కాలేజిలో ప్రొఫెసర్‌గా ఉన్న 46ఏళ్ల లెక్చరర్‌ నిర్మలాదేవి వివాదం వచ్చింది. ఆమె బియస్సీ ఫైనలియర్‌ చదివే నలుగురు విద్యార్థినులతో మార్చినెలలో 20 ని.ల సేపు ఫోన్‌లో మాట్లాడింది.

'యూనివర్శిటీలోని ఉన్నతాధికారులతో పడుక్కుంటే డబ్బుకు డబ్బు, మార్కులకు మార్కులు వస్తాయి. మీకేం భయంలేదు. అమ్మానాన్నాకు చెప్పకండి. గవర్నరుగారు కూడా నాకు బాగాతెలుసు. (ముసిలోడు రసికుడే అనే అర్థంలో) ఆయన తాతేమీ కాడు.'' అని చెప్పింది. ఆ విద్యార్థినులు ఫిర్యాదు చేయగానే కాలేజీ ఆమెను సస్పెండ్‌ చేసింది. ఏప్రిల్‌ మధ్యలో ఆమె మాట్లాడిన ఆడియో ఫైల్‌ బయటకు రాగానే పోలీసులు కేసుపెట్టి ఆమెను అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు. కానీ పురోహిత్‌ దానితో పనిలేకుండా ఆ యూనివర్శిటీ ఛాన్సెలర్‌ హోదాలో సొంతంగా ఒక రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారితో విచారణ జరిపిస్తున్నానన్నాడు. విచారణ వివరాలు మద్రాసు హైకోర్టు వద్ద సీల్‌ చేసి ఉన్నాయి. ఆ ఆడియోలో గొంతు నిర్మలదో కాదో తేల్చడానికి పోలీసులు యింకా వాయిస్‌ టెస్ట్‌ చేయాలి. ఎన్‌డి తివారీ రాజభవన్‌లో రాసలీలల వ్యవహారం తర్వాత ఎవర్నీ నమ్మే పరిస్థితి లేకపోవడం చేత, వివాదంలో తన పేరు వచ్చింది కాబట్టి తప్పించుకోవడానికే పురోహిత్‌ యీ విడి విచారణ చేయిస్తున్నాడని కొందరి అనుమానం. 

ఇలాటి గవర్నరు తమ రాష్ట్రాన్ని పరోక్షంగా పాలించడమేమిటంటూ డిఎంకె నాయకుడు స్టాలిన్‌ రాజ్‌భవన్‌ ఎదుట జూన్‌ 25 న నిరసన ప్రదర్శన చేశాడు. వెంటనే గవర్నరు సెక్షన్‌ 124 కింద మీ అందరి మీద కేసు పెట్టి ఏడేళ్ల జైలుశిక్ష వేయిస్తానని హుంకరించాడు. 2001లో పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు ఆ సెక్షన్‌ ఆఖరిసారిగా ఉపయోగించారు. పార్లమెంటు రాష్ట్రపతి అధికార కేంద్రం కాబట్టి, ఆయన విధులకు అంతరాయం కలిగించిన నేరానికి సెక్షన్‌ 124 వర్తింపచేశారు. ఒక గవర్నరు తనను రాష్ట్రపతితో సమానం చేసుకుని పార్లమెంటుపై దాడిని, నిరసన ప్రదర్శనను సమానం చేయడం హాస్యాస్పదం అంటున్నారు న్యాయకోవిదులు. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ ''తమిళనాడంటే కేంద్రానికి లోకువ అయిపోయింది. బెంగాల్‌లో కానీ, మధ్యప్రదేశ్‌లో కానీ యిలా జరుగుతుందా?'' అన్నాడు.

పాపం, స్టాలిన్‌కు తెలియదు మధ్యప్రదేశ్‌లో కూడా యిలాటి పరిస్థితే ఉంది. ఆనందీ పటేల్‌ మోదీకి విశ్వాసపాత్రురాలు. అందుకే కేంద్రానికి వస్తూ ఆమెను తన వారసురాలిగా నియమించాడు. కానీ అమిత్‌ షాకు, ఆమెకు పడదు. అందుకని పటేళ్ల ఆందోళనను సరిగ్గా డీల్‌ చేయలేక పోయిందంటూ దింపించేశాడు. గుజరాత్‌ ఎన్నికల సమయంలో ఆమె సహకరించలేదు. తర్వాత ఆమె వర్గం కొత్త గుజరాత్‌ ప్రభుత్వానికి తలనొప్పి తేకుండా ఉండాలంటే ఆమెను అక్కణ్నుంచి తప్పించాలనుకుని ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్‌కు గవర్నరుగా వేశారు. ఆమె వస్తూవస్తూ ఓ చార్టెర్డ్‌ బస్సులో డజన్ల కొద్దీ బంధువులతో భోపాల్‌ వచ్చింది. వస్తూనే పిల్లల కోసం రాజ్‌భవన్‌ తలుపులు తెరుస్తున్నా అంది. ఇప్పటిదాకా 3 వేల మందిని రాజ్‌భవన్‌లో కలుసుకుని వాళ్ల అభ్యర్థనలు వింది. ఆ మధ్య హఠాత్తుగా భోపాల్‌ సెంట్రల్‌ జైల్‌ చూడడానికి వెళ్లి కొన్ని గంటలు గడిపి వచ్చింది.

వచ్చిన వారమే అంగన్‌వాడీ సెంటరుకి వెళ్లి అక్కడ పిల్లలకు పెట్టే ఆహారాన్ని పరీక్ష చేసింది. ఆహారం నాణ్యత పెంచమని అధికారులను ఆదేశించింది. పిల్లల విషయంలో అసలే మధ్యప్రదేశ్‌ రికార్డు అంతంతమాత్రం. కలుషితాహారం కారణంగా సంభవించే శిశుమరణాల్లో ఆ రాష్ట్రంది దేశంలో ప్రథమస్థానం. అందువలన ఆనంది వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని యిరుకున పెట్టాయి. ఆ తర్వాత ఆవిడ స్కూళ్లను పరిశీలించసాగింది. 12 జిల్లాలలో ప్రైమరీ, సెకండరీ స్కూళ్లకి వెళ్లింది. టీచరు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయేమంది. 'వ్యాపం' ద్వారా భర్తీ చేద్దామనుకుంటున్నాం అని అధికారులు అంటే దేని ద్వారా చేసినా పారదర్శకత ఉండాలని లెక్చరిచ్చింది. ఇప్పటికే 17 జిల్లాలు చుట్టబెట్టింది. ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు, ఎడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీలకు డైరక్టుగా ఉత్తరాలు రాయడం మొదలుపెట్టింది. మీరు అమలు చేసే స్కీముల గురించి ప్రెజంటేషన్‌ యివ్వండి అంటోంది.

ఇది అసాధారణమైన విషయం. రాష్ట్రప్రభుత్వానికి సమాంతరంగా గవర్నరు యిలా నేరుగా లేఖలు రాస్తే జవాబివ్వాలో లేదో ఉన్నతాధికారులకు తెలియలేదు. ముఖ్యమంత్రి నడిగారు. తనూ బిజెపి వాడే, గవర్నరు బిజెపి మనిషే కాబట్టి కలహం తెచ్చుకోవడం దేనికనుకుని 'సరే జవాబివ్వండి' అన్నాడాయన. కానీ ఆనందీబెన్‌ కీర్తికండూతికి అడ్డు లేకుండా ఉంది. ఆవిడ రాజ్‌భవన్‌లోకి వచ్చి 111 రోజులైన సందర్భంగా ప్రభుత్వ ఖర్చుతో ఒక ఖరీదైన కాఫీటేబుల్‌ పుస్తకం వేయించింది. 'అభ్యుదయ్‌, ఏక్‌ ప్రేర్‌ణా' అని దానికి పేరు. ఈ 111 రోజుల్లో ఆవిడ వెళ్లిన ఫంక్షన్ల, చేసిన పర్యటనల ఫోటోలన్నీ వాటిలో ముద్రించారు. వెంకయ్యనాయుడుగారు ముందుమాట రాశారు. ''ప్రజాధనం యిలా వ్యర్థం కావటం సబబా?'' అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2018)
mbsprasad@gmail.com

 


×