Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఆస్తిక ప్రతినిథులతో తంటా

 ఎమ్బీయస్‌: ఆస్తిక ప్రతినిథులతో తంటా

ఆస్తికత్వం, నాస్తికత్వం (హేతువాదం అనే బ్యానర్‌ కింద) గురించి పత్రికలు చర్చలు పెట్టవు కానీ, టీవీలు పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్రహణం వచ్చినపుడో, ఏదైనా యాగమో, యజ్ఞమో తలపెట్టినపుడో చర్చలు తప్పనిసరి. చర్చల్లో నలుగురు పాల్గొంటే ముగ్గురు వీటిని ఖండిస్తూ మాట్లాడతారు. సమర్థిస్తూ మాట్లాడే వ్యక్తి సాధారణంగా ఒక్కరే ఉంటారు. ఆయన కూడా పండితుడో, పేరున్న వ్యక్తో కాకుండా, ఏ పూజారో ఉంటూంటాడు. వీళ్లు ఒకటి అడిగితే ఆయన మరొకటి చెపుతూ ఉంటాడు. చూసేవాళ్లకు ఆయన ఓటమి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది.

మనకు తోచిన పాయింట్లు కూడా ఆయనకు తోచవు. ఎందుకిలా? ఈ టీవీ ఛానెల్‌ వాళ్లు హేతువాద పక్షపాతులా? కావాలని యీయన లాటి వాణ్ని తీసుకుని వచ్చి ఆస్తికత్వాన్ని హేళన చేస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. ఈ ప్రోగ్రాం జరిగిన కాస్సేపటికి కమ్మర్షియల్‌ స్లాట్స్‌ వచ్చేస్తాయి. వాటిలో గ్రహాల పేరు మీద చక్రాలు, యంత్రాలు అమ్మేవాళ్లు, రాళ్లూ, రత్నాలూ అమ్మేవాళ్లు, న్యూమరాలజీ వాళ్లు.. అందరూ దర్శనమిస్తారు. ఈ ఛానెల్‌ వాళ్లకు కమిట్‌మెంట్‌ ఉంటే, ఒక వాదానికి కట్టుబడి ఉంటే వాళ్లకు ఆ స్లాట్‌ ఎలాట్‌ చేసి ఉండేవారు కారు.

ఆ మాటకొస్తే అనేక టీవీ ఛానెళ్లు పొద్దున్నే హిందూ ప్రవచనాలు, పురాణ కాలక్షేపాలు పెడతాయి. కొందరు క్రైస్తవ సువార్తలు కూడా పెడతారు. వాటికి ఆక్షేపణ చెప్పలేం. ఎందుకంటే వాళ్లు మతధర్మాల గురించి, సాంఘిక ధర్మాల గురించి చెప్తున్నారు. వినదలచుకున్నవాళ్లు వింటారు. లేనివాళ్లు లేదు. కానీ రత్నాలూ, యంత్రాలూ, న్యూమరాలజీ యిలాటివన్నీ హేతువాదానికి చుక్కెదురు. వీటికి దన్నుగా నిలుస్తున్న టీవీ ఛానెల్‌ హేతువాదాన్ని ప్రమోట్‌ చేస్తున్నానని చెప్పుకోలేదు.

టీవీల్లో వాదించే వారనే కాదు, బయట కూడా దేవుడి తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేవాళ్లు చాలా బేలగా కనబడతారు. వీరిలో చాలామందికి హిందూమతం యొక్క తాత్త్విక భూమిక గురించి అవగాహన ఉండదు. వేదాలు, ఉపనిషత్తులు చదవరు. చదివినా వాటిని ఓపిగ్గా వివరించే నేర్పు ఉండదు. మన మతం గొప్పదిట అనేసుకుని ఊరుకుంటారు తప్ప ఎందుకు గొప్పది, ఏ విషయంలో గొప్పది అని తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఏదైనా అనగానే ప్రపంచంలో ఉన్న మతాల్లో కెల్ల గొప్పది హిందూమతం అనే ఒక భారీ స్టేటుమెంటు యిచ్చేస్తారు. దేని ఆధారంగా యిలా తీర్మానించావ్‌ అని అడిగితే చెప్పలేరు.

అసలు ప్రపంచంలో ఉన్న మతాలెన్ని? వేటిల్లో ఏయే సూత్రాలు చెప్పారు? వాటి కంటె హిందూమతం ఏ విధంగా మిన్న? అని ప్రశ్నలు అడిగితే కొరకొరా చూస్తారు. ఇంకో పోలిక చెప్తాను - తెలుగు సభలో వింటూ ఉంటాం -  ప్రపంచ భాషల్లో కల్లా తెలుగు గొప్పది అని ఎవరో ఒక వక్త అని తీరతాడు. ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయి? వాటిల్లో నీకు ఎన్ని తెలుసు? ఏ అంశంలో తెలుగు వాటి కంటె గొప్పది? ఇవి ఎవరూ అడగరు - ఎందుకు? అందరూ తెలుగువాళ్లే కాబట్టి! అదే జాతీయ భాషా సమ్మేళనం అనుకోండి, అక్కడ యిలాటివి ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే వాళ్లు వెంటనే అడుగుతారు, యితర భాషలతో పోల్చి చెప్పు అని.

ఇలా మాట్లాడేవాళ్లలో చాలామందికి తెలుగే సరిగ్గా రాదు. అలాగే హిందూమతం గురించి చొక్కా చింపుకుని మాట్లాడేవాళ్లలో చాలామందికి హిందూమతం గురించి పూర్తి అవగాహన ఉండదు. చిన్నపుడు యింట్లో అమ్మ చెప్పిన కథలు వినేసి, ఎన్టీయార్‌ సినిమాలు చూసేసి నాకు సమస్తం తెలిసిపోయింది అనుకుంటారు. అవి పురాణ గాథలు. వాటిలో మతచర్చల ప్రసక్తి తక్కువ. కథ, పాత్రచిత్రణ, సంఘటనలతో బాటు ఎవరు ఎలా వర్తించాలి అనే ధర్మబోధన ఉంటుంది. ఆ బోధన గుర్తుండదు కానీ కథలా ఉంటుంది కాబట్టి ఆ యా పాత్రలు, కథాగమనం గుర్తుంటాయి. కానీ తాత్త్విక చర్చలు అలాటివి కావు. జాగ్రత్తగా ఒక్కో కాన్సెప్టు అర్థం చేసుకోవాలి.

హిందూమతం గురించి బోర విరుచుకుని మాట్లాడేవాళ్లను అద్వైతానికి, విశిష్టాద్వైతానికి తేడా ఏమిటనో, కఠోపనిషత్‌ సారాంశం ఏమిటనో అడిగితే చాలామంది గుడ్లు తేలేస్తారు. దౌర్భాగ్యం ఏమిటంటే - మనం ఏ విషయంలోనూ లోతుల్లోకి వెళ్లం. అంతా పైపై అట్టహాసమే. క్రైస్తవులు, ముస్లిములు మన చుట్టూ అంతమంది ఉన్నారు. వాళ్ల పురాణాల గురించి కొంతైనా తెలుసుకుంటే మంచిది అనుకుని యిద్దరికీ ఆమోదయోగ్యమైన ఓల్డ్‌ టెస్ట్‌మెంటుని సరళశైలిలో చెప్పనారంభించాను. కానీ తగినంత పాఠకాదరణ లేక దానితో ఆపేయవలసి వచ్చింది. ఆదరణ ఎందుకు లేదు? ఎంత కథలుగా చెప్పినా మనకు తెలియని విషయం అనేసరికి జనాలకు బోరు కొట్టింది.

ఆ సందర్భంలోనే బైబిల్‌, కొరాన్‌ ఎందుకు? ముందు మన హిందూగ్రంథాల గురించి సులభంగా రాయండి, అవే మాకు తెలియవు అని అనేకమంది రాశారు. మళ్లీ దానిలో నేను ఏ రామాయణమో, భారతమో చెపితే చదువుతారేమో కానీ, ఉపనిషత్సారం అంటూ మొదలుపెడితే బాబోయ్‌ అంటారు. ఇలా చాలామందిమి, ఏ విషయం క్షుణ్ణంగా తెలుసుకోకుండానే కాలం గడిపేస్తూన్నాం. తెలియదు కదాని ఊరుకోం. ఎవరైనా హిందూమతం గురించి ఏమైనా అనగానే ఎగేసుకుంటూ వచ్చి వాదనకు దిగుతాం. నిజానికి హిందూ పురాణాల్లో చాలా వైరుధ్యాలున్నాయి, పాఠభేదాలున్నాయి, చిక్కుముళ్లు ఉన్నాయి, రిడిల్స్‌ ఉన్నాయి.

ఒక పురాణం ఒకలా చెపితే, మరొకటి మరొకలా చెపుతుంది. వీటి గురించి ఎవరైనా ప్రస్తావిస్తే, దానికి జవాబు చెప్పలేక అడ్డగోలుగా మాట్లాడడం మొదలుపెడతారు. 'కురాన్‌లో యిలాటి వైరుధ్యం గురించి సౌదీ అరేబియాలో చర్చిస్తానంటే వాళ్లు ఒప్పుకుంటారా? పాకిస్తాన్‌లో ఒప్పుకుంటారా?' అంటారు, అదేం పోలికో నాకు అర్థంకాదు. అవును, వాళ్లు ఒప్పుకోరు. అంతమాత్రం చేత నువ్వూ ఒప్పుకోవా? వాళ్లు నీకు ఆదర్శమా? వాళ్ల అడుగుజాడల్లో నువ్వు నడవాలా? ఏ విషయంలో నువ్వు పాకిస్తాన్‌ని, సౌదీ అరేబియాను ఉన్నతంగా చూస్తున్నావో, గొప్పగా కీర్తిస్తున్నావో చెప్పు. వాళ్లను ఎన్నడైనా మెచ్చుకున్నావా? వాళ్ల పద్ధతుల్ని యీసడిస్తున్నావే!

ఇప్పుడు మాత్రం వాళ్లు ఆదర్శనీయులు, అనుసరణనీయులు అయిపోయారా? బైబిల్‌ గురించి చర్చిస్తే చర్చి ఊరుకుంటుందా అని కొందరు వాదిస్తారు. క్రైస్తవులు మైనారిటీగా ఉన్న మనలాటి దేశాల్లో గొడవలు జరగవచ్చు కానీ మెజారిటీ మతంగా ఉన్న పాశ్చాత్య దేశాల్లో ఆధునిక యుగంలో చర్చిని ధిక్కరించి అనేకమంది సురక్షితంగా ఉంటున్నారు. హిందూమతంలో ఫలానా విపరీతం ఉంది, దాన్ని సంస్కరించవలసిన అవసరం ఉంది. అని నువ్వు ఫీలయితే, దాన్ని బహిరంగంగా ఒప్పేసుకుంటే సరిపోతుంది. వీలైతే ఆ సంస్కరణలు మీరే పూనుకోవచ్చు, లేదా పూనుకున్నవాళ్లకు మీ ఒప్పుదల ప్రేరకంగా నిలుస్తుంది.

కందుకూరి వీరేశలింగం గారు హిందువులు, ఆస్తికులు. ఆయన నెలకొల్పిన స్కూలు పేరు వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాల. కానీ హిందూ సమాజపు పద్ధతులకు విరుద్ధంగా వితంతు పునర్వివాహాలు జరిపించారు, బాల్యవివాహాలు మాన్పించారు. నిజానికి మతం అనే నదీప్రవాహంలో కాలం గడిచేకొద్దీ చెత్త చేరుతూ పోయి, అది కుంచించుకు పోతూ ఉంటుంది. సమాజం సంకుచితమై పోతూ ఉంటుంది. కొందరు చాదస్తులు అసలు విషయం తెలుసుకోకుండా మూఢనమ్మకాలు రుద్దుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొందరు సంస్కర్తలు పుట్టుకుని వచ్చి చెత్త తొలగిస్తూ ఉంటారు.

వీరేశలింగం గారు పండితులతో శాస్త్రచర్చలు చేసి, వితంతు పునర్వివాహం శాస్త్రసమ్మతమే అని నిరూపించినా, కొందరు ఛాందసులు ఆయన ప్రయత్నాలకు అడ్డు తగిలి, నానా రభసా చేశారు. మరి ఆ పండితులు హిందువులు కారా? శాస్త్రాలు తెలియవా? తెలిసినా వారికి అవగాహన లోపించి ఉండవచ్చు. మూర్ఖంగా ప్రవర్తించి ఉండవచ్చు. ఇక్కడ గమనించవలసిన దేమిటంటే సంస్కరణలను అడ్డుకున్న పండితులు ఏ వర్గానికి చెందినవారో, సంఘసంస్కర్తలైన కందుకూరి, చిలకమర్తి, గురజాడ కూడా ఆ వర్గానికి చెందినవారే. లోపాలను కప్పిపెట్టకుండా, ధైర్యంగా బయటపెట్టి, చర్చించి, అందర్నీ ఒప్పించడం చేతనే ఆ సంస్కరణలకు జనామోదం లభించింది. హిందూమతం మరింత దృఢపడింది.

ఇటీవలి కాలంలో యీ దృక్పథం కొరవడుతోంది. హిందూమతంలో ఏదైనా లోపాలు బయటపెట్టి, చర్చకు పెట్టగానే విరుచుకు పడిపోతున్నారు. 'ఇలాటి చర్చలు యితర మతస్తులు చేస్తారా? ఇప్పటికే అందరికీ హిందూమతం అంటే లోకువ, ఇలా బయటపెట్టుకుంటే యింకా లోకువ అయిపోతాం. అందువలన నోరెత్తడానికి వీల్లేదు. కావాలంటే పాకిస్తాన్‌కు పో' అని అడ్డగోలుగా వాదిస్తున్నారు. ఇది అనర్థదాయకం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మతంలోనూ యిలాటి చర్చలు జరుగుతూ ఉంటాయి, సంస్కరణలూ జరుగుతూంటాయి. అయితే ఆ యా మార్పుల గురించి మనకు పెద్దగా తెలియదు. తెలియకుండానే ఏదేదో ఊహించేసుకుంటాం.

మతసంస్కరణలు ఎప్పుడూ మతావలంబుల నుంచే రావాలి. సంస్కరణల గురించి కోర్టులు మరీ యిదిగా జోక్యం చేసుకుని తీర్మానించడం సరి కాదు. సంస్కరణలను ఛాందసులైన మతాధికారులు అడ్డుకుంటారు. అలాటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంస్కర్తలకు మద్దతుగా నిలవాలి. బ్రిటిషు ప్రభుత్వం అదే చేసింది. సతీసహగమనాన్ని రూపుమాపడానికి రాజారామమోహనరాయ్‌కు, వితంతు వివాహాల విషయంలో వీరేశలింగానికి మద్దతు యిచ్చింది. కానీ సంస్కరణ కోసం సంఘర్షణ ఆ మతస్తులలోని ఆధునికులే ప్రారంభించాలి. ముమ్మారు తలాక్‌, చర్చిల్లో బ్రహ్మచర్యం, శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశం - యిలాటివాటిపై ఆయా మతాల్లో కొందరు ఉద్యమించాలి.

కోర్టుకి వెళ్లి ఆదేశాలు తెస్తాం అంటే సబబు కాదు. ఒకప్పుడు హరిజనులు ఆలయప్రవేశం చేస్తే దేవుడు మైల పడిపోతాడనుకునేవారు. క్రమేపీ దృక్పథంలో మార్పు వచ్చింది. సమాజాన్ని నడిపించేవారు పలురకాల వాదనలు చేసి, చర్చలు జరిపి, మెజారిటీ ప్రజల ఆలోచనాధోరణిలో మార్పు తెచ్చారు. అదేమీ జరగకుండా ముగ్గురో నలుగురో జడ్జిలు కూర్చుని తీర్పు చెప్పేసి, మీరంతా యిలా చేయండి, యిలా చేయకండి అనడం వలన ప్రజల్లో ఆ భావాలు నాటుకోవు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం ఉంది. సాధారణంగా ఎక్కడా లేని నిషేధం యిక్కడెందుకు ఉంది?

నాకు తోచినంత వరకు దానికి ప్రాక్టికల్‌ కారణం ఉంది. అయ్యప్ప వద్దకు వెళ్లేవారు 40 రోజుల పాటు చాలావాటికి దూరంగా ఉండాలి. పైగా వెళ్లే దారి అప్పట్లో దుర్గమం. జనసంచారం తక్కువ. పక్కన వయసులో ఉన్న ఆడవాళ్లు ఉంటే, లోపల ఎంత భక్తి ఉన్నా సహజమైన బలహీనతలకు లొంగే ప్రమాదం ఉంది. అప్పుడు 40 రోజుల వ్రతం యీనగాచి నక్కలపాలు చేసినట్లవుతుంది. ఈ ప్రమాదం లేకుండా మొత్తంగా మహిళలను రావద్దని అని ఉంటారు. తర్వాత యుక్తవయసులో ఉన్నవారికి నిషేధాన్ని పరిమితం చేసి ఉంటారు. తక్కిన గుళ్లలో దర్శనానికి యీ మండలదీక్ష సమస్య లేదు కాబట్టి అక్కడ నిషేధం లేదు.

ఇప్పుడైతే మహిళల రక్షణకు అనేక ఏర్పాట్లు చేసుకోవచ్చు. వెళదామనుకున్న మహిళలను వెళ్లనిచ్చినా దేవుడి మహిమ ఏమీ తగ్గిపోదు. హరిజనులను అనుమతించిన తర్వాత ఏ దేవుడి మహిమైనా తగ్గిపోయినట్లు దాఖలాలున్నాయా? ఆస్తిక ప్రతినిథులు యీ కోణంలో ఆలోచించకుండా కోర్టుల్లో రకరకాల వాదనలు చేస్తారు. గత నెలలో అయ్యప్ప కేసులో సుప్రీం కోర్టులో ఒక లాయరు 'అయ్యప్ప కూడా మన దేశపౌరుడే. ఫలానా ఆర్టికల్‌ 25 కింద తన 'నైష్ఠిక బ్రహ్మచర్యా'న్ని కాపాడుకునే హక్కు కలిగి వున్నాడని, అందువలన ఆయనకు తన యింట్లోకి ఆడవాళ్ల రాకను నిరాకరించే హక్కు ఉందని వాదించాడు. దేవుణ్ని మనిషి స్థాయికి దింపడమే వింత అనుకుంటే ఆయనకు మానవ బలహీనతలు అంటకట్టడం ఘోరం.

ఆడవాళ్లని చూడగానే నైష్ఠిక బ్రహ్మచర్యం భగ్నమై పోతుందా? ఆయనకు ఆ మాత్రం నిగ్రహం లేదా? ఆయన వద్దకు వచ్చే భక్తులే 40 రోజుల పాటు నిగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారే, ఆయన ఆడవాళ్లను చూడగానే చలించిపోతాడా? ఆయన దేవుడన్నపుడు సర్వప్రాణులను సృష్టించినవాడు ఆయనే కదా. తన బ్రహ్మచర్యానికి ప్రమాదం కలిగించే ఆడజాతిని ఎందుకు సృజించినట్లు? ఇలాటి ప్రశ్నలకు వారి వద్ద సమాధానం ఉంటుందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?