Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: అగ్నిపథం నిప్పుల బాట ఎందుకైంది?

ఎమ్బీయస్: అగ్నిపథం నిప్పుల బాట ఎందుకైంది?

ఈనాటి బర్నింగ్ టాపిక్స్‌లో ‘‘అగ్నిపథ్’’ ఒకటి. ఉద్యోగ నియామకాల ప్రక్రియ యింత దుమారం లేపడం సాధారణంగా జరగదు. కానీ ఈ పథకంపై వచ్చిన ప్రతిక్రియ అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. రైల్వే స్టేషన్లపై జరిగిన దాడి తప్పకుండా ఖండించవలసినదే. కానీ యిక్కడ గమనించవలసినది ఏమిటంటే దాడి జరిపినవారు గూండాలో, మతోన్మాదులే కాదు. మనమంతా దేశసేవ గురించి కబుర్లు చెపుతాం కానీ ప్రాణభయం చేత సైన్యంలో చేరం. కానీ ఆ యువకులు సైన్యంలో చేరి దేశం కోసం ప్రాణాలివ్వడానికి తెగించినవారు. అలాటివాళ్లు జాతీయ సంపదను నాశనం చేసే హీనమైన చేష్టలకు పాల్పడ్డారంటే వారి ఆవేదనకు కారణమేమిటో తెలుసుకోవలసినదే! పథకం వివాదాస్పదమైన తర్వాత ప్రభుత్వం ఏవేవో మార్పులు చేస్తోంది. ఇది ఒరిజినల్‌గా కాంగ్రెసు పథకమే అంటోంది. ఆ ముక్క ముందు చెప్పలేదు. జిఎస్‌టి కూడా కాంగ్రెసు పథకమే. కానీ ఎన్‌డిఏ దాన్ని అమలు చేసిన విధానంలోనే చిక్కులు వచ్చి నిరంతరమైన మార్పులకు గురవుతోంది. కాంగ్రెసే చేసి ఉంటే ఏం ఉద్ధరించాదో తెలియదు కానీ బిజెపి ఉద్ధరింపు యిలా ఉంటోంది.

ఈ పథకం కూడా సజావుగా ప్రవేశపెట్టి ఉంటే యింత ప్రతిఘటన వచ్చేది కాదేమో అని నా అభిప్రాయం. సబ్జక్టు గురించి చర్చించబోయే ముందు నాకు వస్తున్న ప్రాథమికమైన సందేహాలు వెలిబుచ్చుతాను. కొత్త పథకం పెట్టారు సరే, పాత పథకాన్ని అంత హఠాత్తుగా ఎత్తివేయడం దేనికి? అదీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ నడుస్తూండగా తూచ్ అనడం దేనికి? దీనిపై రెండేళ్ల నుంచి చర్చిస్తున్నామన్నారు. మరి పాత పథకం కింద నియామకాల ప్రక్రియ మొన్నటిదాకా నడుపుతూ వచ్చారేం? దాన్నీ, దీన్నీ సైమల్టేనియస్‌గా ఓ ఏడాది నడిపితే నష్టమేమిటి? అసలు పాత పథకంలో ఉన్న లోపమేమిటి? ఎందుకు మార్చాలనుకున్నారు? పాత పద్ధతిలో రిక్రూట్ అయిన సైనికుల క్వాలిటీ బాగా లేదా? తక్షణం ఎత్తివేయవలసినంత అధ్వాన్నంగా ఉందా పాత పద్ధతి? అయితే ఈ అగ్నివీరులు తయారేందుకు నాలుగేళ్లు పడుతుంది. అప్పటిదాకా ‘లోపభూయిష్టమైన’ పాత పద్ధతిలో తయారైన లో- క్వాలిటీ సైనికులతోనే దేశం అవస్థలు పడాలా?

ఏదైనా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు పైలట్ ప్రాజెక్టుగా కొన్ని రంగాల్లో, కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి, దాని పర్యవసానాలు గమనించి, అప్పుడు విస్తృతపరిధిలో అమలు చేస్తారు. రక్షణరంగం లాకాయిలూకాయిది కాదు. చైనా కారణంగా, పాకిస్తాన్ కారణంగా మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్న యీ రోజుల్లో కొంతకాలం పాటైనా హైబ్రిడ్ మెథడ్ పాటిస్తూ వెళ్లి, యీ పథకం బాగుందనిపిస్తే దానికి పూర్తిగా షిఫ్ట్ అయిపోవచ్చు. అలా చేయకుండా హఠాత్తుగా పాత పథకం రద్దు చేసి దాని స్థానంలో కొత్తదాన్ని ప్రవేశపెట్టడంతో యీ చర్చ జరుగుతోంది. ఇది గొప్పదని చెప్పడానికి ఇజ్రాయేల్‌లో యిలాటి స్కీమే ఉందని చెప్తున్నారు. ఉంటే మాత్రం ఇజ్రాయేల్‌తో పోలిక దేనికి? అది చిన్న దేశం. వైశాల్యంలో కానీ, సరిహద్దుల పొడుగులో కానీ, జనాభాలో కానీ మనతో ఏ మాత్రం తూగదు. పైగా ఇరుగుపొరుగులతో నిరంతరం ప్రత్యక్ష యుద్ధం చేసే దేశమది. మన రక్షణ అవసరాలు వేరు. దానికి తగ్గట్టే మనం పథకాలు రూపొందించాలి.

ఇంతకీ ఏమిటీ అగ్నిపథ్ పథకం? ఇది నాలుగేళ్ల కాంట్రాక్ట్ పథకం. టూర్ ఆఫ్ డ్యూటీగా పిలుస్తున్నారు. ఆఫీసరు కంటె తక్కువ ర్యాంకు ఉద్యోగాలకు వర్తిస్తుంది. ప్రస్తుతం సైనికుల సగటు వయసు 32 ఏళ్లుంది. దీని ద్వారా దాన్ని 26 ఏళ్లకు చేయాలని ప్రయత్నం. (సవరణల్లో వయో పరిమితి పెంచారు కాబట్టి యిది యీ మేరకు నెరవేరకపోవచ్చు) సైన్యానికి చెల్లిస్తున్న వేతనాలు, పెన్షన్ తగ్గించుకుందామని దీన్ని డిజైన్ చేశారట. 2032 నాటికి సైన్యంలో 50% మంది రెగ్యులర్ సైనికులు, 50% మంది అగ్నివీరులు ఉంటారట. 90 రోజుల్లో త్రివిధ దళాల్లోకి 46 వేల మందిని తీసుకుంటారు. వయో పరిమితి 17.5-21 ఏళ్లు. (సవరణల్లో ఈసారికి 23కి పెంచారు) ఆర్నెల్ల ట్రైనింగ్. మూడున్నరేళ్ల సర్వీసు. మొదటి ఏడాది జీతం 30 వేలు దానిలో 21 వేలే చేతికి వస్తుంది. తక్కినది కార్పస్ ఫండ్‌కు పోతుంది. నాలుగో ఏడాదికి జీతం 40 వేలవుతుంది. జీతంలో 30% కార్పస్ ఫండ్‌కు పోతూనే ఉంటుంది.

నాలుగేళ్ల చివర ఉద్యోగి పోగు చేసుకున్న కార్పస్ ఫండ్‌కు సమానమొత్తాన్ని ప్రభుత్వం యిస్తుంది. అది 11.71 లక్షలవుతుంది. దానిలో సగం ఉద్యోగి సేవింగ్స్, సగం ప్రభుత్వం అందించినది. గ్రాట్యుటీ, పెన్షన్ లాటివి ఉండవు. ప్రతిభ, ఖాళీలను బట్టి వీరిలో 25% మందికి ఉద్యోగం పర్మనెంటు చేస్తారు. వాళ్లకు యీ నాలుగేళ్ల సర్వీసు లెక్కలోకి రాదు. అప్పణ్నుంచి15 ఏళ్ల సర్వీసు ఉంటుంది. దానికి పెన్షన్, గ్రాట్యుటీ ఉండదు. అప్పుడు మళ్లీ కఠినశిక్షణ యిస్తారు. తక్కినవాళ్లు బయటకు వెళ్లిపోవాల్సిందే. వారికి కొన్ని రంగాల్లోని ఉద్యోగాల్లో వాళ్లకు ప్రాధాన్యత కల్పిస్తారు. వీళ్లకు మాజీ సైనికుడు హోదా లభించదు.

ఈ పథకం హఠాత్తుగా ప్రవేశపెట్టడం వలన నష్టపోతున్నవారు 1.75 లక్షల మంది యువకులు. ఏళ్ల కిందటే ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్టులు పూర్తి చేసుకుని, రాత పరీక్షకై ప్రిపేరై, ఉద్యోగంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. దానికోసం ఏడాదిగా నిత్యం తర్ఫీదు తీసుకుంటూ శ్రమ పడుతున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం సైన్యంలో 1.22 లక్షల ఖాళీలున్నాయి. ఆర్మీలోనే 97,177 ఉన్నాయి. కరోనా కాలంలో అనేక ఎన్నికలు, కుంభమేళాలు జరిపిన ప్రభుత్వం కరోనా పేరు చెప్పి మిలటరీ ఉద్యోగ నియామకాలను వాయిదా వేస్తూ వచ్చి, యిప్పుడు హఠాత్తుగా కాన్సిల్ చేసింది. అది ఘోరం. కావాలంటే యీ స్కీము ద్వారా ప్రయత్నించండి, మళ్లీ ఆ టెస్టులన్నీ పాసవండి అంటోంది. దీనిలో మొత్తం ఉద్యోగాలు 46 వేలు. 1.75 లక్ష మందికి దీనిలో చోటెక్కడ? వయసు రీత్యా మేం అనర్హులం అవుతాం కదా అంటే అయితే యీ సారికి 21 నుంచి 23కి పెంచుతున్నాం అంది.

అయినా రేపోమాపో ఉద్యోగం రావలసిన వారిని నాలుగేళ్ల తర్వాత మీలో నాలుగో వంతు మందిని మాత్రమే తీసుకుంటాం, తక్కినవాళ్లు యింటికే అంటే ఎంత దుఃఖపడతారు? అసలే ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. జీతాలు రాకపోవడమో, సగం రావడమో జరుగుతోంది. నిరుద్యోగం పెరుగుతోంది. సెంటర్ ఫర్ మానిటారింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం జాతీయ నిరుద్యోగిత రేటు 7.8%. రైల్వేలో 90 వేల క్రింది స్థాయి ఉద్యోగాలకై 2.5 కోట్ల మంది యువకులు అప్లయి చేశారట! ఈ పరిస్థితుల్లో తమ శక్తియుక్తులను, ఆర్థిక వనరులను యీ రంగంపై పెట్టి దీనికోసం తర్ఫీదు అయిన తర్వాత ఆ యువకులకు ఆశాభంగం కలిగించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.

ధోబల్ చెప్తున్నదేమిటంటే, 2006లో యుపిఏ ప్రభుత్వ హయాంలో రక్షణశాఖ యిలాటి అగ్నివీరుల ఐడియాతో ముందుకు వస్తే, బిఎస్‌ఎఫ్ డిజి నేతృత్వంలో ఒక కమిటీ వేశారట. అయితే ఆ కమిటీ యిచ్చిన నివేదిక పక్కన పడేశారట. అందువలన ఆ రిపోర్టులో రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌తో పాటు యిది ఉండాలన్నారో, దానికి బదులుగా ఉండాలన్నారో తెలియదు. దానికి బదులుగా తీసుకోరావడంతోనే యింత అలజడి. ఇప్పుడీ స్కీము తెచ్చాక యిన్ని సవరణలు చేస్తున్నారంటే ఫూల్-ప్రూఫ్ కాదని అర్థమవుతోంది కదా!

అగ్నిపథ్‌ స్కీములో సెలక్టయి, తర్వాత ఉద్యోగాలు పోగొట్టుకునే 75% మంది గతి ఏమిటని అందరూ ప్రశ్నించడంతో ప్రభుత్వం వాళ్లకు హోం, రక్షణ శాఖ పరిధిలోని ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ యిస్తామని ప్రకటించింది. ఆ ఉద్యోగాల్లో గరిష్ఠ వయోపరిమితిలో అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు యిస్తామంది. తొలి బ్యాచ్ అగ్నివీరులకు ఐదేళ్ల సడలింపుట. మాజీ సైనికులకు యిప్పటికే ఉన్న కోటాకు యిది అదనమట. ఆచరణలో యిది ఎంతవరకు సాధ్యం? ఓ పక్క పబ్లిక్ సెక్టార్ సంస్థలను అమ్మి పారేస్తున్నారు. ఉన్నవాటిలో కూడా పర్మనెంటు ఉద్యోగాలు యివ్వటం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే, ప్రభుత్వరంగ సంస్థల్లో రెగ్యులర్ ఉద్యోగుల శాతం తగ్గిపోతోంది. రోజువారీ క్యాజువల్ వర్కర్ల సంఖ్య 2015-16లో 19% ఉండగా యిప్పుడది 40%కు పైగా చేరుకుంది. రైల్వేలో 3 లక్షలకు పైగా, పోలీసు శాఖల్లో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని పార్లమెంటులో ప్రభుత్వం చెప్పింది. గత ఆరేళ్లలో రైల్వే 72వేల ఉద్యోగాలపై కోత విధించింది.

ఈ పథకానికి వత్తాసు పలకడానికి బిజెపి పాలిత రాష్ట్రాలైన యుపి, ఎంపి, అసాం ముఖ్యమంత్రులు రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో కూడా వీళ్లకి ప్రాధాన్యత యిస్తామని ప్రకటించారు. ఈ ప్రేమంతా ప్రస్తుత మాజీ సైనికుల పట్ల ఎందుకు చూపించటం లేదో తెలియదు. యుపిలో ప్రస్తుతం లక్ష పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గణాంకాలు యిలా ఉండగా నాలుగేళ్ల తర్వాత మీకు రిజర్వ్‌డ్ కేటగిరీలో ప్రభుత్వోద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెపితే ఎవరికి నమ్మకం ఉంటుంది? ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్‌ విసర్జితులకు తన గ్రూపులో ఉద్యోగాలు యిస్తానని ప్రకటించగానే ఓ మాజీ సైనికాధికారి యిప్పటిదాకా ఎంతమంది మాజీ సైనికాధికారులకు ఉద్యోగాలు యిచ్చారని ప్రశ్న సంధించారు. నిజానికి ఎవరో పై స్థాయిలో రిటైరైన వాళ్లు తప్పిస్తే సాధారణంగా ఎక్స్ సర్వీస్‌మెన్ పరిస్థితి ఏమంత బాగుండదు. మా బ్యాంకుల్లో వాచ్‌మెన్‌లుగా ఉద్యోగం యిస్తూండేవారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి 24 గంటలూ ఉండనక్కరలేదంటూ ఆ ఉద్యోగాలు తీసేసి, సెక్యూరిటీని ఔట్‌సోర్స్ చేసేశారు.

ఇది వరకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లకు సెక్యూరిటీ ఏర్పాటు చేసేవాళ్లు ‘మా సంస్థలో అందరూ మాజీ సైనికోద్యోగులే’ అని చెప్పుకునేవారు. ఎటిఎమ్ సెక్యూరిటీ, క్యాష్ వ్యాన్ సెక్యూరిటీ యివన్నీ వాళ్లే చూసేవారు. పోనుపోను కాంప్లెక్సులు ఎక్కువై పోవడంతో, ఎవర్ని పడితే వాళ్లను సెక్యూరిటీగా పంపిస్తున్నారు. కాస్ట్ కటింగు పేరుతో ఉత్తరాది నుంచి వచ్చిన యువకులకు, యూనిఫామ్ వేసి కూర్చోబెట్టేస్తున్నారు. నిజంగా దొంగలు వస్తే వాళ్లేమీ చేయలేరు. విజిటర్స్‌ను గమనించడం, వాళ్ల ఆనుపానులు అడగడం, ప్రమాదాలు వస్తే వాటిని ఎదుర్కోవడం యిలాటివన్నీ మాజీ సైనికులకు తెలిసినట్లుగా వీళ్లకేం తెలుస్తాయి? అయినా వీళ్లనే పెట్టుకుంటున్నారు.

మాజీ సైనికుల పునరావాస విభాగం డైరక్టర్ జనరల్ చెప్పిన ప్రకారం, మాజీ సైనికులకు గ్రూప్ సి ఉద్యోగాల్లో 10-14.5% రిజర్వేషన్లు ఉన్నా 1.29% మంది మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారు. అలాగే గ్రూప్ డి ఉద్యోగాల్లో 20-24.5% రిజర్వేషన్లున్నా 2.66% మంది మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారు. ఎక్స్ సర్వీస్‌మెన్ ఉపాధి లేక, తగిన ఆదాయం లేక యిబ్బంది పడుతున్నారు. మిలటరీలో ఉండగా అబ్బిన అలవాట్లు మాత్రం విడిచిపెట్టవు. మిలటరీ క్యాంటీన్‌లో తక్కువ ధరల్లో దొరికే వస్తువులు బంధుమిత్రులకు తెచ్చిపెడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.

ఇక మరణించిన సైనికుల కుటుంబాల గతి అయితే చెప్పనే అక్కరలేదు. మా బ్యాంకు కొలీగ్ ఒకాయన వారి సంక్షేమం కోసం ఒక సంస్థ ఏర్పాటు చేసి కోటి రూపాయల విరాళం యిచ్చి మా అందర్నీ ఉత్తేజపరిచాడు. నేను కూడా ప్రతీ నెలా ఆ సంస్థకు డబ్బు పంపుతాను. మన బజెట్‌లో చాలాభాగం డిఫెన్స్‌కు పోతుంది. అయినా మాజీ సైనికుల పరిస్థితి యిలా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మాజీ సైనికుల సంఖ్యను యిబ్బడిముబ్బడిగా పెంచడానికి కాబోలు యీ పథకం పెట్టింది. వాళ్లయితే మధ్య వయసులో రిటైరవుతారు, వీళ్లయితే 22-26 ఏళ్లకు రిటైరవుతారు కాబట్టి, వేరే ఉపాధి అవకాశాలు వెతుక్కోవచ్చు అని ప్రభుత్వం చెపుతోంది. 11 లక్షలు చేతికి వస్తుంది కాబట్టి ఆ పెట్టుబడితో వ్యాపారమైనా పెట్టుకోవచ్చు అంటోంది. దీనిలో సగం వీళ్లు దాచుకున్నదే అయినా ఒక్కసారిగా డబ్బు చేతికి వస్తుంది కదా. కానీ డబ్బు విలువ ఏడాదేడాదికి తగ్గుతూ వస్తోంది. అందువలన అబ్బో 11 లక్షలు అని యీరోజు అనిపించిందని ఏళ్లు గడుస్తూన్న కొద్దీ అనిపించక పోవచ్చు.

కానీ ఆ డబ్బు మార్జిన్‌గా చూపించి బ్యాంకు ఋణం తీసుకోవచ్చు. మిలటరీలో క్రమశిక్షణ నేర్పుతారు కాబట్టి, అది వ్యాపారానికి పనికి వస్తుంది అని ప్రభుత్వపెద్దల వాదన. క్రమశిక్షణ నేర్చుకోవడానికి మిలటరీకే వెళ్లనక్కరలేదు. వ్యాపారస్తులందరూ మిలటరీకి వెళ్లి తర్ఫీదు అయి వచ్చినవారు కారు. నిజానికి వ్యాపారానికి కావలసినది హ్యూమన్ రిలేషన్స్. ఎదుటివాడిని మాటలతో ఆకట్టుకోవడం. మిలటరీవాళ్లకు బొత్తిగా రాని విద్య అది. చాలామంది మిలటరీ వాళ్లకు సివిలియన్స్‌ను చూస్తే చిన్న చూపు. సర్వీసులోంచి బయటకు వచ్చినా తక్కిన జనంతో కలవరు. వాళ్లంతా ఒక కాలనీ కట్టుకుని, అక్కడే వుందామనుకుంటారు. మిలటరీలో ఉన్నంతకాలం ముభావంగా ఉన్నా, దురుసుగా ఉన్నా వాళ్లకు గడిచిపోతుంది. బయటకు వచ్చాక మామూలు జనాలకు డిసిప్లిన్ లేదంటూ, మర్యాదామప్పితం తెలియవంటూ దూరంగా పెడతారు. అందువలన మిలటరీలో చేరడం వలన వ్యాపారకౌశలం పెరుగుతుందని అనుకోవడం ప్రశ్నార్థకమే! అయినా మిలటరీ అనేది వ్యాపారశిక్షణా కేంద్రం కాదు. ఎంచుకున్న రంగంలో ఉపాధికల్పనకై ఏడాది పాటు ట్రైనింగ్ యిచ్చే సంస్థల సంఖ్యను పెంచితే చాలు.

ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ సైనికాధికారులు చెప్తున్నదేమిటంటే, చైనా, పాకిస్తాన్‌తో ఘర్షణలున్న నేటికాలంలో, కశ్మీరు, ఈశాన్యరాష్ట్రాలు వంటి చోట్ల సైన్యాన్ని నిరవధికంగా ఉపయోగిస్తున్న యీ రోజుల్లో మన సైన్యం సంఖ్యను, నాణ్యతను మరింత పెంచాలి. పోలీసు కానిస్టేబుళ్లకే ఆర్నెల్లకు మించిన ట్రైనింగు యిస్తున్నపుడు, ఒక సైనికుడికి ఆర్నెల్ల శిక్షణ యిచ్చేసి, 42 నెలలు పని చేయండి అంటే వారెలా చేయగలుగుతారు? 42 నెలల తర్వాత తాము 75%లో ఉంటామో, 25%లో ఉంటామో తెలియనప్పుడు వారిలో అంకితభావం ఉంటుందా? అత్యాధునికమైన ఆయుధాలు పుట్టుకొస్తున్న యీ రోజుల్లో కనీసం ఐదారు సంవత్సరాల శిక్షణ అవసరంట. ఇప్పటివరకు వచ్చిన అవార్డులలో 95% అవార్డులు ఏడు లేక అంతకంటె ఎక్కువ సంవత్సరాలు సైన్యంలో పనిచేసిన వారికే వచ్చాయట. ఆ పథకం పూర్తి స్థాయిలో అమలైనప్పుడు బ్రహ్మోస్, పినాక, వజ్ర ఆయుధ వ్యవస్థలను ఉపయోగించలేని కిండర్ గార్డెన్ ఆర్మీగా తయారవుతుందని శతఘ్నిదళం డైరక్టర్ జనరల్‌గా పనిచేసిన పిఆర్ శంకర్ అన్నారు.

సైన్యదళం ఒకటే అయినా అగ్నివీరుల యూనిఫాంపై ప్రత్యేకమైన గుర్తులు ఉంటాయని ప్రభుత్వం చెప్పడాన్ని కొందరు సైనికాధికారులు నిరసిస్తున్నారు. ఇది సైన్యంలో తేడాలను తెచ్చిపెడుతుందని, టీముగా కలిసి పనిచేయడానికి అవరోధంగా మారుతుందని అంటున్నారు. ఎక్కడైనా నాలుగేళ్లు పనిచేస్తే వాళ్లకు సూపర్‌వైజర్ హోదా వస్తుంది. కానీ యీ స్కీములో మూడు వంతుల మందిని యింటికి పంపేస్తామంటున్నారు, విడ్డూరంగా ఉంది అన్నారు. పైకి ఏం చెప్పినా ప్రభుత్వం ఆర్థికభారం తగ్గించుకోవడానికే యీ పథకం పెట్టిందని చెప్తున్నవాళ్లు యిస్తున్న గణాంకాలు యిలా ఉన్నాయి. రక్షణరంగంలో ఉన్న పెన్షనర్లు 32 లక్షలు. దాని బజెట్‌లో 26% పెన్షన్లకే పోతోంది. అమెరికాలో యిది 10%, యుకెలో 14%ట. మన దేశంలో ఏటా 50 వేలమంది రిటైరవుతున్నారు కాబట్టి పోనుపోను యిది యింకా పెరుగుతోంది. ఈ పెన్షన్ ఖర్చు తగ్గించుకుంటే ఆ డబ్బుతో మరిన్ని ఆయుధాలు కొనవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉండవచ్చు.

ఈ అగ్నిపథ్ విషయంలో 75% మంది ఉద్యోగాలు కోల్పోతారనేది ప్రధానంగా చింత కలిగించే విషయం. బస్సులో సీటు గురించే పక్కవాణ్ని డొక్కలో పొడిచేస్తామే, 15 ఏళ్ల ఉద్యోగం తన్నుకుపోతాడంటే పక్కవాడితో సర్దుకుపోగలమా? అగ్నివీరుల మధ్య టీము స్పిరిట్ లేకపోతే సైన్యం ఎలా పనిచేయగలదు? నాలుగేళ్ల తర్వాత 75-25 ఎంపికలో పక్షపాతం చూపించారని, కులవివక్షత, ప్రాంతీయవివక్షత, భాషావివక్షత చూపించారని ఆరోపణలు వచ్చే ప్రమాదం ఉంది. మన దేశంలో యిలాటివాటికి కొదవ లేదు. ఏ క్వాలిఫికేషన్ చూడకుండా తాత్కాలిక ఉద్యోగం అని చెప్పి, కాంట్రాక్టు పద్ధతిపై తీసుకున్నవారే కొద్దికాలానికి పర్మనెంటు చేయాలని ఆందోళనకు దిగుతారు. అలాటిది నాలుగేళ్ల ఉద్యోగం అనంతరం నువ్వు అనర్హుడివి అని ముద్రకొట్టి యింటికి పంపితే వీళ్లకు స్వగ్రామాల్లో పరువుంటుందా? వీళ్ల ఆత్మగౌరవం దెబ్బ తిందా?

ఈ స్కీము తక్కిన దేశాల్లో అమల్లో ఉంది కదా అంటే వాళ్ల సంగతి నాకు తెలియదు. మన దగ్గర ఆత్మాభిమానాలు, పరువుప్రతిష్ఠల గోల ఎక్కువ. పరువు హత్యలు మన దేశంలో జరుగుతాయి. ఆ దేశాల్లో ఉంటాయని అనుకోను. మన దగ్గర ఉద్యోగంలో సస్పెండ్ అయినవాడికి కొన్నాళ్లకు సగం శాలరీ, మరి కొన్నాళ్లకు పూర్తి శాలరీ కూడా యిచ్చేస్తారు. అయినా వాళ్లు హ్యేపీగా ఉండరు. ఇరుగుపొరుగు తన గురించి ఏమనుకుంటారో అనే చింతతో చిక్కి శల్యమౌతారు. అగ్నివీరుడిగా ఘనంగా వెళ్లి నాలుగేళ్ల తర్వాత ఆరిపోయిన నిప్పులా తిరిగి వచ్చినపుడు అతని మనఃస్థితి ఎలా ఉంటుంది? బిజెపి ఆఫీసుల్లో ఉద్యోగాలిస్తామని ఒకాయన అన్నాడు. ఏ ఉద్యోగం? ఎలాటి ఉద్యోగం? వీళ్లు ఫ్రస్ట్రేషన్‌లో ఉండి రాడికలైజ్ అవుతారేమోనన్న భయాలు కూడా ఉన్నాయి. పూర్తి శిక్షణ పొందకుండా రైల్వే స్టేషన్లలో ఆశోపహతులు చేసిన వీరంగం చూశాం. ఎవరూ వాళ్లను ఆపలేకపోయారు. గంటల్లో కోట్ల ఆస్తి దగ్ధమైంది. అగ్నివీరుల్లో ఆశోపహతుల విషయంలో ఆయుధాల ట్రైనింగు పొందినవారు కదాని పెత్తందార్లో, రాజకీయ పక్షాలో ప్రయివేటు ఆర్మీల్లో చేర్చుకుంటారేమో తెలియదు.

ప్రభుత్వం యీ పరిణామాలన్నీ అంచనా వేసిందో లేదో తెలియదు. స్కీము పెట్టేశారు. వెంటనే మోదీ భక్తబృందం భజన మొదలుపెట్టేశారు. ఐ యామ్ ఫర్ అగ్నిపథ్ స్కీమ్ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజిలు వచ్చేస్తున్నాయి. మనమూ లింకు నొక్కి సంఘీభావం వ్యక్తం చేయాలట. నోట్ల రద్దు టైములోనూ యింతే. ఎటిఎంలలో కొత్త నోట్లు పడతాయో లేదో, బ్యాంకులకు ఆర్‌బిఐ ద్వారా నోట్లు చేరాయో లేదో కూడా చూసుకోకుండా పథకం పెట్టేశారు. విమర్శలు వచ్చినపుడు, తప్పు దిద్దుకోలేదు. మరీ బిర్రబిగిసారు. పొరపాట్లు ఎత్తి చూపినవారిని దేశద్రోహులన్నారు. చివరకు పథకం ఏమైంది? బిజెపి కూడా దాని గురించి చెప్పుకోవటం లేదు. ఇప్పుడీ పథకం కూడా పూర్తిగా మంచిదో, చెడ్డదో చెప్పడం కష్టం. ప్రయోగాత్మకంగా చిన్న స్థాయిలో, కొన్ని రంగాలలో ప్రవేశపెట్టి చూసి, అవసరమైన సవరణలు చేస్తూ పోయి, కొన్నాళ్లకు స్థిరపరచవచ్చు. ఈలోగా పాత స్కీమును కూడా సైమల్టేనియస్‌గా నడపవచ్చు. కానీ ప్రభుత్వం ప్రతిష్ఠకు పోతోంది. తగ్గేదేలే అంటోంది.

నోట్ల రద్దుతో అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థ యిప్పటిదాకా కోలుకోలేదు. రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇప్పుడీ ప్రయోగం అతి ముఖ్యమైన రక్షణరంగంలో జరుగుతోంది. రిస్కు ఎక్కువ కదా! అది భయాన్ని కలిగిస్తోంది. 1962 నాటి చైనా యుద్ధంలో తప్ప భారతసైన్యం ఎన్నడూ ఓటమి చవి చూడలేదు. రెండు ప్రపంచయుద్ధాలలో కూడా భారతసైన్యం అద్బుతంగా పోరాడి పేరు తెచ్చుకుంది. ఆ వ్యవస్థను ఒక్కసారిగా తృణీకరించడం దేనికి? తరతరాలుగా కాలపరీక్షకు నిలిచి, గెలుస్తూ వచ్చిన రెజిమెంటల్ వ్యవస్థను హఠాత్తుగా మార్చేయడం మంచిది కాదని సైన్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. విమర్శకులపై ప్రభుత్వ వ్యతిరేక ముద్ర వేయకుండా, కాస్త నిదానించాలి. ఇప్పటికే పరీక్షలు పాసయినవారికి రాత పరీక్ష పెట్టి రిక్రూట్‌ చేసుకోవడం ప్రథమ కర్తవ్యం. అగ్నివీర్ పథకం మంచిదే అయితే చిన్న స్థాయిలో యీ ఏడాది ప్రవేశపెట్టి, క్రమేపీ వారి సంఖ్య పెంచుకుంటూ పోవచ్చు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?