Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: జ్యోతి వేడికి కమలం వాడేనా?

ఎమ్బీయస్: జ్యోతి వేడికి కమలం వాడేనా?

ప్రస్తుతం ఆంధ్రజ్యోతికి, ఆంధ్ర బిజెపికి మధ్య సిగపట్ల గోత్రంగా ఉంది. చివికి, చివికి గాలివాన కావడమంటే యిదేనేమో! జ్యోతిలో ఆదినుంచీ వున్న ఒక సల్లక్షణమేమిటంటే, పత్రిక పాలసీ ఏదైనప్పటికీ, భిన్న, భిన్న ఆలోచనాధోరణులకు వేదికను కల్పించడం! రాధాకృష్ణగారు వచ్చిన తర్వాత కూడా పద్ధతి మార్చలేదు. దళితులకు, బిసిలకు, స్త్రీవాదులకు, మైనారిటీలకు తక్కిన పేపర్లలో చోటు లభించినా లభించకపోయినా జ్యోతిలో ఎడిట్ పేజీలో కల్పిస్తారు. అదే సమయంలో రైటిస్టు భావాలకూ, ఛాందసవాదులకూ కూడా చోటిస్తారు. కాలమిస్టుల్లో నాకు నచ్చేవారున్నారు. బిజెపికి చోటివ్వడం గురించి చెప్పాలంటే వెంకయ్యనాయుడు గారు వ్యాసాలు రాస్తూనే వుంటారు. సత్యకుమార్ వారానికి ఒకటి రాస్తారు. ఇదంతా ఎడిటోరియల్ విభాగం క్రెడిట్‌లోకి వెళుతుంది.

ఇక యాజమాన్యం రాజకీయ ప్రయోజనాల విషయానికి వస్తే, అది టిడిపికి అనుకూలమనేది స్పష్టంగా కనబడే వాస్తవం. బాబుతో కలిసి వున్నపుడు బిజెపిలో వారికి తప్పేమీ కనబడలేదు. విడిపోయాక అన్నీ తప్పులే కనబడ్డాయి. మోదీ ప్రాభవం తగ్గిపోయింది కాబట్టి, విడిపోతే మంచిదని రాధాకృష్ణ సలహా యిచ్చారని, అది వినే బాబు దెబ్బ తినేశారనీ కొందరంటారు. బాబుకి యీయనొక్కడే సలహాదారా? బిజెపిలో లేరా? మావాడి పని అయిపోయిందయ్యా అని వెంకయ్య నాయుడే చెప్పారేమో, ఎవరికి తెలుసు? ఫుల్వామా దాడి ప్లాన్ చేశారని ఆయనకు తెలిసివుండకపోవచ్చు. ఏది ఏమైనా మోదీ నెగ్గారు, బాబు ఓడారు. నాలుక కరుచుకుని బాబు మోదీకి దగ్గరవుదామని చూస్తున్నారు. గతంలో హద్దులు మీరి మోదీని వ్యక్తిగతంగా కూడా విమర్శించిన ఆయన యిప్పుడు నోరెత్తటం లేదు. గ్యాస్ సిలండర్ ధర పెరిగినా (ఇవాళ మళ్లీ పెరిగింది) జగన్‌దే తప్పని ఆయనా, లోకేశూ అంటున్నారు తప్ప మోదీని పల్లెత్తు మాట అనటం లేదు.

కానీ రాధాకృష్ణ మోదీ విధానాలపై విమర్శలకు తన పత్రికలో చోటిస్తున్నారు. మధ్యలో అమిత్ షాను వెళ్లి కలిసినా యీ విధానం యింకా మారలేదు. ఈనాడు పూర్తిగా బిజెపి పత్రిక అయిపోయింది. సాక్షి మోదీకి వ్యతిరేకంగా రాయదు. ఎబికె ప్రసాద్ గారు లాటి వాళ్లు వ్యాసాలు రాస్తే వేసి వూరుకుంటుంది తప్ప సంపాదకీయాల్లో చెరిగేయదు. ఇక రాస్తే జ్యోతి మాత్రమే రాయాలి. కానీ జ్యోతి ప్రధాన శత్రువు జగన్. జగన్‌ను తిట్టడానికి బిజెపి పాలసీ పనికి వస్తుందంటే, అప్పుడు వాళ్లను ఉటంకిస్తూ రాస్తారు. ఆంధ్ర బిజెపిలో వచ్చిన చిక్కేమిటంటే అది టిడిపి అనుకూల, వ్యతిరేక క్యాంపులుగా చీలి వుంది. అనుకూల నాయకత్వం వున్నపుడు, అనుకూల నాయకులు ప్రకటనలు చేసినప్పుడు జ్యోతి వారిని భుజాన వేసుకుని మోస్తుంది, ప్రచారం కల్పిస్తుంది. జగన్ వచ్చాక అమరావతి అనేది కేంద్రాంశంగా మారిపోయింది. అన్ని పెట్టుబడులూ అమరావతిలోనే పెట్టాలన్న స్టాండ్ జ్యోతిది. దానికి అనుకూలంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడినంత కాలం బిజెపి యింపుగానే ఉంది. బిజెపి అధిష్టానం కన్నా స్థానంలో సోము వీర్రాజును తెచ్చినదగ్గర్నుంచి యిరకాటంగా వుంది.

నిజానికి సోము వీర్రాజు దేవాలయాలపై దాడులు జరగడానికి వైసిపియే కారణం అంటూ ఆందోళన చేసినప్పుడు, స్థానిక ఎన్నికలలో అక్రమాలు జరిగాయని ఆరోపించినప్పుడు రాధాకృష్ణ వారిని మెచ్చుకుంటూనే వ్యాసాలు రాశారు. కానీ మనసులో ఏదో మడత వుంది. విష్ణువర్ధన్ సంఘటన తర్వాత వీర్రాజు స్పందించిన తీరు చూశాక, రాధాకృష్ణ దాన్ని బయట పెట్టేశారు. ‘నాకు ఆయనతో పరిచయం ఏమీ లేదు. అయినా నామీద ఆయనకు ద్వేషం వుందంటే కారణం కులద్వేషమే కావచ్చు.’ అంటూ కొత్తపలుకులో రాశారు. వీర్రాజుకు కమ్మలంటే పడదని ఎస్టాబ్లిష్ చేయడానికి తన కులాన్ని ప్రస్తావించడం జర్నలిస్టు వృత్తికి శోభ నివ్వదు. దీనితో బాటు బిజెపికి పంచాయితీ ఎన్నికలలో ఏమీ రాలేదని నొక్కి చెపుతూ, ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని గమనించిన పవన్ పలుచోట్ల టిడిపితో అవగాహన కుదుర్చుకున్నారని కూడా రాసేశారు.

క్షమాపణ చెప్పేవరకు జ్యోతిని బహిష్కరిస్తామని వీర్రాజు ప్రకటించినా, మర్నాడే కన్నా లక్ష్మీనారాయణ దాన్ని బేఖాతరు చేసి తన ప్రెస్ మీట్‌కు జ్యోతిని పిలిచారు. దీన్ని రాధాకృష్ణ ప్రస్తావిస్తూ, కన్నాపై ఏ యాక్షన్ తీసుకుంటారో చూద్దామని వ్యాఖ్యానించి, ఆంధ్ర బిజెపిలో రెండు శిబిరాలున్నమాటను ఎస్టాబ్లిష్ చేశారు. ఇంత దూరం వెళ్లారు కాబట్టి బిజెపిపై జ్యోతి ప్రస్తుతానికి కక్ష కట్టినట్లే తోస్తోంది. దీనికి మూలకారణమైన సంఘటనను గుర్తు చేసుకుంటే, యిలా ఎందుకు జరిగిందాన్న ఆశ్చర్యం కలుగుతుంది.

అమరావతిలో అసంపూర్ణంగా వదిలేసిన భవంతులలో చాలాభాగం పూర్తయిన వాటి నిర్మాణం పూర్తి చేస్తామని వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో చెప్పింది కానీ ఆ తర్వాత ఊరుకుంది. అక్కడ అమరావతి ఉద్యమం ప్రారంభం కావడంతో సరుకుల రాకపోకలను, పనిచేసే పనివాళ్లను అడ్డుకుంటారన్న భయమో ఏమో తెలియదు. ఇప్పుడు ఉద్యమం మందగించింది. ఎబిఎన్, టివి5 కూడా ఆ వార్తలు కవర్ చేయడం మానేశాయి. ఇప్పుడు తననుకున్నది చేద్దామని ప్రభుత్వం సమకట్టి వుండవచ్చు. మరీ ముఖ్యంగా విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ‘ఈ ప్రాంతాన్ని దిక్కుమాలినదానిగా వదిలేయలేదు. పెట్టుబడులు పెట్టి అభివృద్ధి పరుస్తున్నాం చూడండి’ అని చూపించడానికైనా కావచ్చు.

విధానపరంగా దీన్ని జ్యోతి యాజమాన్యం హర్షించాలి. జగన్ మనసులో ఉద్దేశం ఏం పెట్టుకున్నా, అమరావతి ప్రాంతానికి 3వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కదా. ఆ భవంతులన్నీ నివాసయోగ్యంగా మారతాయి కదా! వాటిలో ఎమ్మెల్యేలు వుండబోతారో, సెక్రటేరియట్ స్టాఫ్ వుండబోతారో తెలియదు. రాజధాని ముక్కలు చేస్తే వేరే వాళ్లు వుండవచ్చు. ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకు అమ్మివేయవచ్చు. ఉద్యోగులున్నా, వ్యాపారస్తులున్నా ఆ ప్రాంతమంతా కళకళలాడుతుంది. వారి అవసరాలు తీర్చడానికి చుట్టూ వ్యాపారసముదాయాలు వస్తాయి. ‘ఆ భవంతులకు కూతవేటు దూరంలోనే సకల సదుపాయాలతో కాంప్లెక్సు కడుతున్నాం’ అంటూ ప్రయివేటు రియల్టర్లు వస్తారు. ప్రయివేటు పెట్టుబడులు వస్తే ఆటోమెటిక్‌గా డెవలప్ అవుతుంది. ఆశించినంత కాకపోయినా, ఎంతో కొంతమేరకు భూముల రేట్లు పుంజుకుని పెట్టుబడిదారులకు ఊరట కలుగుతుంది.

సంక్షేమ పథకాలంటూ ప్రజాధనం అంతా యీనాటి అవసరాలకే ఖర్చు పెట్టేస్తున్న యీ వేళ కనీసం అభివృద్ధికి దోహదపడే యీ చర్యను హర్షించవచ్చు. ముఖ్యంగా ‘ఒకప్పుడు సకల హంగులతో విలసిల్లిన అమరావతి యీనాడు జిల్లేడు మొక్కలతో జీబురుమంటూ వుంది’ అని తన వ్యాసాల్లో వాపోయిన జ్యోతి స్వాగతించవచ్చు. ఎందుకంటే యిప్పుడున్న స్తబ్దత చూసి పెట్టుబడిదారులు, భూములిచ్చిన రైతులు ఉసూరుమని ఉన్నారు. ఇప్పుడొక ఆశాజ్యోతి వెలిగి, రెపరెప లాడుతోంది. జగన్ రాజకీయ ప్రయోజనాలు ఎలా ఏడ్చినా, యిదొకటి అఘోరిస్తే చాలనిపిస్తోంది. కానీ జ్యోతివారికి మాత్రం యిది నచ్చటం లేదు. ఈ ప్లానులో ఏదో మర్మముందేమో కనుక్కోవాలి అన్నదాని పైనే వుంది వారి దృష్టి. దాన్ని కనిపెట్టి, బయటపెట్టి, జగన్‌పై ఆగ్రహాన్ని తగ్గించుకోకండి సుమా అని అమరావతి పెట్టుబడిదారులకు చెప్పడమే వాళ్ల ధ్యేయంగా వుంది.

ఫిబ్రవరి 23 సాయంత్రం ఎబిఎన్ దీనిపై డిబేట్ పెట్టింది. దానిలో వేర్వేరు సంఘాల అమరావతి ఉద్యమకారులు యిద్దర్ని పిలిచారు. టిడిపి ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిన కుటుంబరావు గార్ని, బిజెపి తరఫున విష్ణువర్ధన రెడ్డిని పిలిచారు. విష్ణుని నేను చాలా డిబేట్లలో చూశాను. మంచి వక్త. పాయింట్లు బాగా, చిరునవ్వుతోనే చెప్తారు. చమత్కరించడం వచ్చు. టీవీ డిబేట్లలో వచ్చే బిజెపి ప్రతినిథుల్లో సగం మంది ఎదుటివారు మాట్లాడుతూండగానే మాట్లాడి చికాకు తెప్పిస్తారు. కొందరు చాలా డిసిప్లిన్‌డ్‌గా వుంటారు. ఈయన అలాటాయనే. అయితే ఆయన టిడిపి పట్ల కానీ, బాబు పట్ల కానీ ఏ సానుభూతీ కనబరచరు. రాయలసీమ వాసి కాబట్టి అన్నీ అమరావతిలోనే పెట్టాలనే వాదనను ఎదుర్కుంటూంటారు. యాంకర్ వెంకటకృష్ణతో నువ్వునువ్వు పరిచయం వుంది. ఓ సారి కృష్ణ టిడిపి తరఫున మాట్లాడుతూంటే ‘పానెల్‌లో ఆ పార్టీ తరఫున పట్టాభి వున్నాడుగా, నువ్వెందుకు అనవసరంగా వకాల్తా పుచ్చుకుంటావ్’ అని కృష్ణపై చురక వేశారు కూడా.

వివాదంలోని రెండో వ్యక్తి కె. శ్రీనివాసరావును టీవీ చర్చల్లో నేనెన్నడూ చూడలేదు. సెంట్రల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌ట. విష్ణు వంతు వచ్చినపుడు ఆయన ‘దీనిపై ఏం మాట్లాడాలో తెలియటం లేదు. అసలు యిక్కడదాకా వచ్చిందంటే అమరావతి ఉద్యమకారులదే ఘనత. సోకాల్డ్ పార్టీలు మద్దతు యిచ్చాయని చెప్పుకోవడమే తప్ప చేసిందేమీ లేదు. 430 రోజులుగా ఉద్యమం నడిపి, యీ మేరకు సాధించారంటే అమరావతి రైతులనే మెచ్చుకోవాలి...’ అంటూ మొదలుపెట్టి ‘అక్కడ ఏమీ చేయటం లేదని యిన్నాళ్లూ ఫిర్యాదు చేసి, యిప్పుడు ఏదో మొదలుపెట్టినపుడు నేను ఏ కోణంలో మాట్లాడాలి? తొందరగా చేయండి అనాలి తప్ప వేరే కోణం ఎందుకు తీసుకోవాలి? ఉద్యమకారుల కోరిక మన్నిస్తోంది కదా, స్వాగతిస్తే తప్పేముంది, ముందే వాళ్ల నిజాయితీని శంకిస్తే ఎలా?..’ అంటూండగానే  ‘వాళ్లది (బిజెపిది) అల్‌రెడీ ఆ లైనే కదా’ అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కృష్ణకు ఈ మూడు వేల కోట్లూ ఎక్కణ్నుంచి అప్పు పుట్టించగలరనే పాయింటుపైకి చర్చ మళ్లించబోయారు. ‘సిఆర్‌డిఏను రద్దు కాలేదు. ఇప్పుడు ఎఎమ్‌ఆర్‌డిఏకి శాంక్టిటీ లేదు. అప్పులు ఎలా పుడతాయి?’ అంటూ ఏదో హింట్ యివ్వబోయారు. ‘ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, అప్పూ పుట్టదు, ఇదేమీ అయి చచ్చే వ్యవహారం కాదు, దానికి నిజాయితీ లేదు’ అని వక్తల చేత అనిపించాలని ఆయన తాపత్రయం.

కానీ విష్ణు గతంలో యిలాటివి చూపించే బాబు అప్పులు పుట్టించిన వ్యవహారంపై వెక్కిరిద్దామనుకున్నారు. చిరునవ్వు చిందిస్తూ ‘‘మన ముఖ్యమంత్రులు, ప్రణాళిక చైర్మన్లు అప్పు పుట్టించడంలో ఘనులు. ఎవరైనా అప్పు అడుగుదామంటే చాటుగా వెళ్లి అడుగుతారు. కానీ మనవాళ్లు విమానాల్లో బొంబాయి వెళ్లి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో గంట కొట్టి మరీ...’’ అని అంటూండగానే కుటుంబరావుగారు అభ్యంతరం తెలిపారు. అది సహజమే. ప్రణాళిక చైర్మన్ అనేది ఆయనకే వర్తిస్తుంది, ఆ పని చేయించింది ఆయనే కాబట్టి! ‘దానిలో తప్పేముంది?’ అంటూ ఆయన వంతు వచ్చినపుడు వాదించి వుండేవారేమో! కానీ యీ శ్రీనివాస్ హఠాత్తుగా పక్కనే విష్ణుని ‘ఏం మాట్లాడుతున్నారండీ, యూ ఆర్ టాకింగ్ నాన్సెన్స్’ అంటూ పదేపదే అడ్డు తగిలారు. విష్ణుకు కోపం వచ్చింది. కాస్సేపు పోయాక ‘నీ భాష మార్చుకో, యూ ఆర్ క్రాసింగ్ లిమిట్స్’ అని అన్నారు. అయినా శ్రీనివాస్ అదే మాట రిపీట్ చేస్తూ పోయారు.

తర్వాత జరిగిన సంఘటన గురించి చర్చించేందుకు ముందు అసలు శ్రీనివాస్‌కు కోపం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి. విష్ణు వ్యంగ్యంగా మాట్లాడాడని, అది ఆయనకు అలవాటేనని, చెప్పుదెబ్బలు తినకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత ఆయనకుండాలని ‘కుండబద్దలు’ కాటా సుబ్బారావు దగ్గర్నుంచి తప్పుపడుతున్నారు. విష్ణు వ్యంగ్యబాణం ఎవరిమీద వేశారు? అమరావతి రైతుల మీద అయితే మనం తప్పుపట్టవచ్చు. వేసినది రాజకీయ నాయకుడైన చంద్రబాబు మీద. కార్యక్రమం అయిపోయిన తర్వాత ముక్తాయింపుగా మాట్లాడుతున్నపుడు కృష్ణ ‘వ్యంగ్యం, వెటకారం తప్పు కాదు. రోజూ పేపర్లలో కనబడే కార్టూన్లు అవే కదా!’ అంటూ మాట్లాడారు. విష్ణు వెటకారానికి నొచ్చుకోవలసినది, స్పందించవలసినది కుటుంబరావు గారు, టిడిపి. మధ్యలో శ్రీనివాస్‌కు ఎందుకు నొప్పి వచ్చింది? అంతకు కొద్ది క్షణాల ముందే విష్ణు అమరావతి ఉద్యమకారులను మెచ్చుకుంటూ, ఘనతంతా వారికే కట్టబెడుతూ మాట్లాడారు కదా.

ఉద్యమాన్ని వెక్కిరిస్తే యీయన నాన్సెన్స్ అన్నా భావ్యంగా వుండేది. బాబుని వెక్కిరించినప్పుడు నొచ్చుకోవడం, అంత తీవ్రంగా స్పందించడం దేనికి? ఇది అప్పటికి నాకు అర్థం కాలేదు. కానీ మర్నాడు కృష్ణ ఆయన్ని ప్రత్యేకంగా యింటర్వ్యూ చేసినప్పుడు నాకు అర్థమైంది. ‘మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. అందువలన పంచాయితీ ఎన్నికలలో వైసిపి అభ్యర్థులు ఓడిపోవాలని అనుకున్నాను. దాని కోసం శ్రమించాను. టిడిపి అభ్యర్థులు బలంగా వున్న చోట్ల వారి కోసం పనిచేశాను. ఒకచోట జనసేన అభ్యర్థి బలంగా వుంటే అతని కోసం పనిచేశాను.’ అని ఆయనే స్పష్టంగా చెప్పారు. (కింద లింకు యిచ్చాను) అప్పుడే మాటల్లో తమకు సిపిఐ, కాంగ్రెసు కూడా మద్దతిచ్చాయని చెప్పారు. ఆ అభ్యర్థుల కోసం కూడా పని చేశారా? అని కృష్ణ అడగలేదు, ఆయన చెప్పనూ లేదు. బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన గురించి పని చేశారంటే టిడిపి కోసం పని చేసినట్లే అని అనుకునేవాణ్ని కాదు కానీ, రాధాకృష్ణ తన ‘కొత్త పలుకు’ ద్వారా నా కళ్లు తెరిపించారు. స్థానిక ఎన్నికలలో పవన్, టిడిపితో కలిసి పనిచేశారని రాసేశారు.

ఏతావతా విషయం ఏమిటంటే ఈ శ్రీనివాస్ గారు టిడిపి పక్షపాతి. అదే ప్యానెల్‌లో వున్న మరో అమరావతి ఉద్యమకారుడు, ఆకుపచ్చ కండువా వేసుకున్నాయన తమ ఉద్యమం పార్టీలకు అతీతం అని కొద్ది రోజులకు ముందే చెప్పుకున్నారు. ఉద్యమం నడుస్తున్న ప్రాంతాలలో పంచాయితీ ఎన్నికలలో వైసిపి గెలవడం మీకు సిగ్గుచేటుగా లేదా? అంటూ కృష్ణ ఆయనను ఉడికిస్తూ వుంటే ఆయన అతి ప్రశాంతంగా ‘మేము ఏ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా పనిచేయలేదు. చేస్తే మాపై రాజకీయ ముద్ర పడిపోతుందని భయం. వైసిపి అభిమానులుగా వుంటూ, మా ఉద్యమంలో పాలుపంచుకున్న వారున్నారు. ఎన్నికలకు, మా ఉద్యమానికి సంబంధం లేదు.’ అంటూ ఎంతో సంయమనంతో చెప్పారు. మరి యీ శ్రీనివాస్ గారు టిడిపికై పనిచేశారంటే బహుశా వ్యక్తిగత హోదాలో అయి వుంటుంది. తప్పేమీ లేదు. ఎవరిష్టం వారిది. కానీ ఆయనకు ఏది ప్రాధాన్యం అనేది అవేళ బయటపడింది. విష్ణు ఉద్యమకారుల్ని మెచ్చుకున్నా సరే, దానికి మార్కులు వేయలేదు (ఆయన ప్రొఫెసరు) కానీ బాబుని వెక్కిరించ బోయేసరికే తాడియెత్తున కోపం వచ్చి ‘యూ ఆర్ టాకింగ్ నాన్సెన్స్’ అంటూ పదేపదే అరవసాగారు.

అలాటి పరిస్థితుల్లో యాంకర్‌గా వున్న కృష్ణ బాధ్యత ‘ఆగండి, ఆగండి’ అనడం, ఆయన ఆ పని చేయకుండా యీ గలాటాను నవ్వుతూ చూస్తున్న దృశ్యం వీడియోలో (లింకు కింద యిచ్చాను) 5.33 వద్ద కనబడుతోంది. తర్వాత కూడా శ్రీనివాసరావుగారూ, శ్రీనివాసరావు గారూ అన్నారు తప్ప ప్లీజ్ స్టాప్ అని గట్టిగా అరవలేదు. చెప్పు తీశాకనే చెయ్యి చాచి ఆపబోయినట్లు బొమ్మలో కనబడుతోంది.  విష్ణు బాధ్యతను గుర్తు చేసే పెద్దలు కృష్ణ బాధ్యత గురించి ఎందుకు మాట్లాడటం లేదో నాకు తెలియదు. తన మాటలను నాన్సెన్స్ అనడం, హద్దు మీరుతున్నావని హెచ్చరించినా ఆగకపోవడంతో విష్ణుకి వెర్రిగా కోపం వచ్చేసింది. పైగా యీ శ్రీనివాస్ టిడిపి మద్దతుదారన్న విషయం ఆయనకు అప్పటికే తెలుసో, గ్రహించాడో మరి. ‘హూ ఆర్ యూ టు ఆస్క్ మీ? టిడిపి జండా కప్పుకుని మాట్లాడు, వాళ్ల భజన చేసుకో, వాళ్ల ఆఫీసులో పనిచేసుకో, నీ భజన నేను చేయాల్నా? నీ పెయిడ్ ఆర్టిస్ట్ పని నేను చేయాల్నా?’ అంటూ వరసవరసగా చదివేశారు. శ్రీనివాస్ వెంటనే కిందకు వంగి చెప్పు తీసుకుని విష్ణుపై లంఘించారు. కొట్టేశారు. దాంతో కార్యక్రమానికి అంతరాయం. స్టూడియో సిబ్బంది సహాయంతో శ్రీనివాస్‌ను బయటకు పంపించేశాక కార్యక్రమం పునఃప్రారంభమైంది.

ఇక్కడ కీ వర్డ్ ‘పెయిడ్ ఆర్టిస్ట్’. అమరావతిలో ఉద్యమం చేస్తున్నవారు అసలైన రైతులు కాదని, అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టి, ఆ పెట్టుబడి ఏమౌతుందోనని భయపడుతున్నవారు కొందరికి డబ్బిచ్చి ఉద్యమాన్ని నెలల తరబడి నడిపిస్తున్నారనే అర్థంలో ‘పెయిడ్ ఆర్టిస్ట్’ అనే పదాన్ని వైసిపి వాళ్లు వాడారు. దాని కారణంగా అసలైన రైతులు నొచ్చుకుంటున్నారని గ్రహించారో ఏమో, యిటీవల దాని వాడకం బాగా తగ్గించేశారు. వైసిపి అధిష్టానం నుంచి ఆ మేరకు ఆదేశాలు వచ్చి వుండవచ్చు. అలాటిది యీనాడు విష్ణు నోట ‘పెయిడ్ ఆర్టిస్ట్’ వినగానే అది అమరావతి రైతు ఉద్యమకారులను ఉద్దేశించి అన్నదే అని తీర్మానించి జనాలు ఖండించేయడం మొదలుపెట్టారు. కానీ విష్ణు మాటల ఫ్లో చూస్తే ఆయన శ్రీనివాస్‌ను టిడిపి పెయిడ్ ఆర్టిస్టుగా పేర్కొన్నట్లు సులభంగా తెలుస్తోంది. శ్రీనివాస్ ఎన్నికలలో టిడిపికి ఉచితంగానే ప్రచారం చేసి వుండవచ్చు. కానీ దానిలో ఏదో స్వలాభం వున్నట్లు యీయనకు తోచిందేమో ఆ మాట ఉపయోగించాడు.

పెయిడ్ ఆర్టిస్టు అనే పదంపై అమరావతి ఉద్యమానికి పేటెంటు లేదు. అది ఎవరైనా, ఎవరి గురించైనా వాడవచ్చు. ‘నేను చంద్రబాబును వెక్కిరిస్తే నీకేమిటి నొప్పి? నువ్వేమైనా టిడిపి వాడివా? అంత టిడిపి సానుభూతిపరుడివైతే ఆ జండా కప్పుకునే మాట్లాడు. నువ్వు బాబు వద్ద డబ్బు తీసుకుని మాట్లాడుతున్నావు కాబట్టి అలా మాట్లాడుతున్నావు కానీ నేను నీలాగ పెయిడ్ ఆర్టిస్టుని కాదు కాబట్టి నా యిష్టం వచ్చినట్లు మాట్లాడతాను. అది నాన్సెన్స్ ఎలా అవుతుంది?’ అనేది విష్ణు భావం. కోపంలో యిన్నిమాటలు మాట్లాడలేదు కానీ సారాంశం అదే. నువ్వు టిడిపి నుంచి డబ్బు తీసుకుని వారి కొమ్ము కాస్తున్నావనే అర్థంలోనే విష్ణు అన్నారు తప్ప నువ్వు పెట్టుబడిదారుల వద్ద డబ్బు తీసుకుని అమరావతి ఉద్యమం చేస్తున్నావని అనలేదు.

విష్ణు ఆ మాట అనగానే శ్రీనివాస్ మరింత పెద్దగా గొంతు పెంచి అరవడమో, విష్ణుని బయటకు పంపేయమని కృష్ణకు ఫిర్యాదు చేయడమో, వాకౌట్ చేయడమో ఏదో ఒకటి చేయాలి. అదేమీ చేయకుండా చెప్పు తీసుకుని కొట్టడం మాత్రం అన్యాయం. అనేక టీవీ చర్చల్లో గొడవలు వస్తూంటాయి కానీ యీ తరహా గతంలో చూడలేదు. మర్నాడు ఆ సంఘటన గురించి మాట్లాడమన్నపుడు ‘దురదృష్టకరం’ అనేసి వూరుకున్నారు తప్ప, ఆవేశంలో అలా ప్రవర్తించాను, క్షమాపణ చెప్తున్నాను అని అనలేదు. విద్యాధికుడు, పదిమందికి పాఠాలు చెప్పే అయ్యవారు కదా హుందాతనం చూపిస్తా రనుకున్నాను. దురదృష్టకరం అనడంలో విష్ణు అలా వెటకరించడం దురదృష్టం అనే అర్థం కూడా వుంది. నేను అలా ప్రవర్తించి వుండకూడదు అని వాచ్యా అనలేదు. ఇది ఆయన సొంత విషయం కాబట్టి మనం యింతకంటె వ్యాఖ్యానించలేము.

23 నాటి కార్యక్రమం అయిపోయిన తర్వాత కృష్ణ ఆయనను మళ్లీ ఛానెల్‌కు పిలవను అన్నారు. విష్ణు ఆయన మీద మీరే కేసు పెట్టాలి అన్నారు. తప్పకుండా, ఆ విషయం పరిశీలిస్తాం అని కృష్ణ హామీ యిచ్చారు. విషయం రాధాకృష్ణ గారి దగ్గరకు వెళ్లేసరికి ఐడియా మారింది. బాధితులు బిజెపి వాళ్లయితే మనమెందుకు కేసు పెట్టాలి? అనే స్టాండు తీసుకున్నారు. ఆదివారం తన కొత్త పలుకులో ఓ కామెడీ సినిమా సీనుతో పోలిక తెచ్చారు. క్లాసులో ఓ పిల్లాడు తనను ఏడిపిస్తే సునీల్ క్లాసు లెక్చరరు తనకు క్షమాపణ చెప్పమని అడుగుతాడు. నేనెందుకు చెప్పాలని లెక్చరర్ అడుగుతాడు. ఆ పోలిక యిక్కడ నప్పుతుందా? వచ్చిన పానెల్ సభ్యులు ఛానెల్ ఆహ్వానం మేరకు వచ్చారు. అతిథులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ఛానెల్‌కు లేదా? కల్పించకపోవడం వైఫల్యం కాదా? దానికి చింతించవలసిన పని లేదా?

మన దేశానికి అతిథిగా వచ్చిన పరదేశపు అధ్యక్షుడిపై దాడి జరిగితే మన దేశం క్షమాపణ చెప్పదా? నాకేం బాధ్యత లేదని వదిలేస్తుందా? మా యింటికి మీరు వచ్చారు. అదే సమయానికి వచ్చిన మరొకాయన మీమీద పడి కొట్టాడు. నేను సారీ చెప్పనా? ఆయన అలాటివాడని తెలిస్తే రానీయక పోదునండి అననా? ఏమైనా వుంటే మీరూమీరూ బయట చూసుకోవాలి తప్ప, మా యింట్లో యీ అల్లరేమిటి? అని దాడి చేసినవాణ్ని తిట్టనా? జ్యోతి శ్రీనివాస్‌పై కేసు పెట్టకపోతే పెట్టకపోవచ్చు, కనీసం మా స్టూడియోలో జరిగిన దుర్ఘటనకు క్షమాపణ చెప్తున్నాం, ఇకపై అలాటివి జరగకుండా చూస్తాం అని బాధితుడితో అనవద్దా? ఇకపై ఆ శ్రీనివాస్‌తో చర్చల్లో పాల్గొనేవారు ‘మాకేమిటి గ్యారంటీ?’ అని అడిగితే ఎబిఎన్ ఏం చెప్తుంది?

ఈ సంఘటన జరగగానే ఇదేదో ప్రి ప్లాన్డ్ ఎటాక్ అనుకున్నారేమో (ముందే ప్లాను చేయడానికి అవకాశం లేదని నా భావన) సోము వీర్రాజు చాలా వైల్డ్‌గా రియాక్టయ్యారు. పార్టీ సమావేశం ఏర్పరచి, లేదా జూమ్ మీటింగు పెట్టి అందరి అభిప్రాయాలూ తీసుకోకుండానే ఒక మీడియా సంస్థకు హెచ్చరిక జారీ చేసేశారు. ఎబిఎన్ క్షమాపణ చెప్పేవరకూ ఆ మీడియాను బహిష్కరిస్తామని ప్రకటన విడుదల చేశారు. తమ పార్టీలో ఎవరిచేతనైనా బహిష్కరణనను ఉల్లంఘింపచేసి, వారిదే పార్టీ వాయిస్‌గా ప్రచారం చేస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని కూడా ఎబిఎన్‌ను హెచ్చరించారు. ఇది జరిగిన మర్నాడే కన్నా ప్రెస్‌మీట్‌కు జ్యోతిని పిలిచారు. ఇవాళ సత్యకుమార్ జ్యోతిలో కాలమ్ రాశారు. వీర్రాజుకి పార్టీలో వున్న పట్టేమిటో తెలిసిపోవడంతో బాటు, పార్టీలో చీలిక కూడా బహిర్గతమైంది.

ఆ చీలికను మరింత పెద్దది చేయడానికి కాబోలు రాధాకృష్ణ బిజెపిలో నలుగురు – విష్ణు, వీర్రాజు, జివిఎల్, దేవధర్ జగన్ సేవలో తరిస్తున్నారని ప్రకటించేశారు. విష్ణు ఎంతటి దుర్మార్గాలు చేస్తూ వచ్చాడో ఆ పురాణమంతా వాట్సాప్‌ల ద్వారా ప్రచారంలోకి వచ్చేసింది. విష్ణు, జివిఎల్ కోట్ల రూ.ల సెటిల్‌మెంట్లు చేస్తున్నారని జ్యోతికి, టిడిపికి సన్నిహితులైన సిపిఐ నాయకులు ఆరోపణలు చేసేశారు. ఇలా ఆంధ్ర బిజెపిలో ఒక వర్గంపై జ్యోతి, టిడిపి, దాని సానుభూతిపరులు దాడి మొదలు పెట్టేశారు. ఇది ఎంతకాలం నడుస్తుందో తెలియదు. ఎందుకంటే రాజకీయ పార్టీ, ప్రముఖ మీడియా సంస్థ ఒకరిపై మరొకరు ఆధారపడతారు. దిల్లీ వాళ్లు కలగచేసుకుని వివాదాన్ని సాధ్యమైనంత త్వరలో చల్లార్చవచ్చు.

అయితే దీనిలో రాధాకృష్ణ కమ్మ యాంగిల్ తీసుకుని రావడం ఆసక్తికర పరిణామం. జగన్‌పై ఎంత ద్వేషం వున్నా, టిడిపికి భవిష్యత్తు వుందని తోచకపోవడంతో కమ్మ ప్రముఖులు కొందరు బిజెపివైపు చూస్తున్నారని వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. కమ్మలు టిడిపిని, రెడ్లు వైసిపిని అంటిపెట్టుకుని వుండడంతో తమకంటూ ఓటు బ్యాంక్ ఉండాలంటే కాపులను చేర్చుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోందన్నది చూడవచ్చు. కానీ కాపులపై పవన్ ప్రభావం యింకా వున్నట్టే వుంది. తద్వారా వారు టిడిపికే చేరువగా వున్నారు. అందువలన ధనిక కమ్మవారిపైనే బిజెపి కన్నేసింది. ఇలాటి పరిస్థితుల్లో రాధాకృష్ణ తన ఉదంతాన్ని చూపి బిజెపి నాయకత్వం కమ్మలకు వ్యతిరేకంగా వుంది చూసుకోండి మరి అని బిజెపి వైపు చూస్తున్న కమ్మ నాయకులకు హెచ్చరిక యిచ్చారనుకోవాల్సి వస్తోంది.

Click Here For Video

ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?