cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : అమరావతి ఆందోళనకు 300 రోజులు

ఎమ్బీయస్ : అమరావతి ఆందోళనకు 300 రోజులు

అమరావతి ఆందోళన ప్రారంభించి 300 రోజులైందని వారం రోజుల క్రితమే వార్త వచ్చింది. అదేదో అప్పుడప్పుడు పలకరించే న్యూస్ ఐటమ్ కింద అయిపోయింది తప్ప, ఎవరూ దాని గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశారు. టివి5, ఎబిఎన్ కొన్నాళ్లూ రోజూ చూపించేవి కానీ వాళ్లూ తగ్గించేశారు. ఇలా 200 రోజులు, 300 రోజులన్నపుడు కాస్త డిస్కషన్ పెడుతున్నారు. 

దిల్లీ వెళ్లినపుడు, కోర్టు ఏదైనా వ్యాఖ్యానించినపుడు మాత్రం అందరూ కవర్ చేస్తారు. లేకపోతే చప్పగా నడుస్తోంది. మధ్యలో కరోనా రావడంతో ఉద్యమ ఉధృతి తగ్గిందన్నది వాస్తవం. ఈ 300 రోజుల్లో 200 రోజులు కరోనాకే పోయాయి. ప్రజల దృష్టి ఎంతసేపూ కరోనా మీద, వాక్సిన్ మీదా వుండడంతో, మీడియా వారు తక్కిన వార్తలకు ప్రాధాన్యత యివ్వడం మానేశారు. 

మధ్యమధ్యలో కాస్త దృష్టి మరలిందంటే సుశాంత్ ఆత్మహత్య, బాలీవుడ్ డ్రగ్‌లు, పరువు హత్యలు, ఎస్పీ బాలు అనారోగ్యం, అమెరికా ఎన్నికలు – యిలాటివాటి మీదకు పోతోంది తప్ప అమరావతి ఆందోళన మీదకు చూపు పోవటం లేదు.

ఏదైనా ఆందోళన నడుస్తూంటే ఫటఫటా ఏదో జరుగుతూంటే, హింసాత్మకంగా మారితే, ప్రభుత్వం అణచివేయడానికి చూస్తే అప్పుడు ఇంట్రస్టు కలుగుతుంది, అదీ కొద్దికాలం పాటు.  మొదట్లో వైసిపి వాళ్లు ఆందోళనకారులను పెయిడ్ ఆర్టిస్టులని అన్నపుడు కాస్త ఉత్సుకత కలిగింది. ఆ మాటలపై గట్టిగా అభ్యంతరాలు రావడంతో తర్వాత వారు చప్పబడ్డారు.

పట్టించుకోవడం మానేశారు. ఉద్యమం కదలని గొంగళీలా అయిపోయింది. అవే ఊళ్లు, అవే వాదనలు, ‘అమరావతిని రక్షించండి’ అంటూ అవే నినాదాలు, అవే జండాలు. ఎప్పటికీ దారీతెన్నూ కనబడలేదని, దీనివలన ప్రయోజనం కనబడటం లేదని భావించారో ఏమో, కొత్త కార్యకర్తలు వచ్చి చేరటం లేదు కానీ చదువుకున్నవాళ్లు, టీవీల ముందు బాగా వాదించగలిగే నాయకులు పెరుగుతున్నారు.

ఉన్నదున్నట్లు చెప్పాలంటే అమరావతి పోరాటవీరులకు రణక్షేత్రం న్యాయస్థానమే కాబోతోంది తప్ప అమరావతి కావటం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఆ ఆందోళన ఒక దశకు మించి ముందుకు సాగటం లేదు. ఇతర ప్రాంతాల్లో కూడా దానికి మద్దతుగా నిరాహార దీక్షల్లాటివి జరిగివుంటే పరిస్థితి వేరేలా వుండేదేమో! .

ఇక్కడైనా ఒక వ్యక్తి ఆమరణ నిరాహారదీక్షకు కూర్చునుంటే ఎఫెక్టు వుండేదేమో! అసలైన యిబ్బంది ఎక్కడ వచ్చిందంటే ‘అమరావతి సమస్య ఆ గ్రామాల రైతుల సమస్య మాత్రమే కాదు, యావత్ రాష్ట్రం యొక్క సమస్య’ అని టిడిపివారు ఎంత గొంతు చించుకుంటున్నా, తక్కిన ప్రాంతాల వారు స్పందించటం లేదు. రాజధానికి భూములిచ్చి, యింకా అమ్ముకోకుండా వున్న రైతులకు న్యాయం జరగాలి అని ప్రతీవాళ్లూ అంటూనే, ఈ ఆందోళనను అక్కడ భూములు కొన్నవారు నిర్వహిస్తున్న ఉద్యమంగా చూస్తున్నారని నా అభిప్రాయం.

నిజానికి రెండూ కలిసి వున్నాయి. కానీ టిడిపి అవసరానికి మించి ఎక్కువ ఆసక్తి చూపడంతో, తన అస్తిత్వమంతా అమరావతిపై ఆధారపడి వున్నట్లు ప్రవర్తించడంతో, రైతుల సమస్య వెనక్కి వెళుతోంది. అమరావతి ప్రాజెక్టులోంచి ఒక్క బిల్డింగు తగ్గించినా ఊరుకోమంటూ గగ్గోలు పెట్టడం అనుమానాలకు దారి తీస్తోంది. 

టిడిపి, వారికి అనుకూలంగా వుండే కమ్యూనిస్టు నాయకులు తప్ప వేరెవరూ అమరావతి గురించి మాట్లాడవలసినంతగా మాట్లాడటం లేదు. బిజెపి పేరు చెప్పుకుని కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడేవారు కానీ ఆయన నోటి ముందు నుంచి పార్టీయే మైకు లాగేసుకుంది. ప్రస్తుతం బిజెపి నిర్లిప్తంగానే వుంది. రాజధాని గురించి మా స్టాండ్ యిది అని చెప్పేసి వూరుకుంటోంది తప్ప ఆందోళనలు చేపట్టడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే దీని గురించి ఎక్కువ మాట్లాడితే తక్కిన ప్రాంతాల వారు నొచ్చుకుంటారన్న భయం వాళ్లది.

నిజానికి రాష్ట్రమంతా వ్యాపించిన టిడిపికి ఆ భయం ఎక్కువ వుండాలి. కానీ వారు అమరావతినే పట్టుకుని వేళ్లాడుతున్నారు. పైగా దీనికి కులం కోణం వచ్చి చేరింది. ‘అమరావతిలో కమ్మలు మాత్రమే ఇన్వెస్ట్ చేశారనడం తప్పు. అక్కడ అందరూ చేశార’ని టిడిపి నాయకులు చెప్తున్నారు. అది కరక్టు. కమ్మలు పెద్ద సంఖ్యలో చేసి వుండవచ్చు కానీ తక్కినవాళ్లు కూడా తప్పకుండా చేశారు. 

టిడిపి ఆ వాదనతో ఆగి వుండాల్సింది. అలా కాకుండా ‘కమ్మల మీద కోపంతో జగన్ అమరావతి రూపుమాపుతున్నాడు’ అని ఆరోపించడంతో విషయం గందరగోళం అయిపోతోంది. ఈ వాదన ద్వారా అమరావతి కమ్మల కోసమే అనే అర్థం స్ఫురిస్తోంది కదా. దానికి తగ్గట్టు అమరావతి ఆందోళనకారుల్లో మొదటి వరుసలో వున్నవారందరూ వారే కనబడుతున్నారు. దీనితో టిడిపిపై కులముద్ర పడి పార్టీకి చెరుపు అవుతోంది.

రాజధానిలో ప్రధానభాగం వైజాగ్‌కు తరలిపోతే కమ్మ కులస్తులకు నష్టం వాటిల్లుతుంది అనడానికి లేదు. ఎందుకంటే అక్కడా చాలామంది కమ్మలు ఇన్వెస్ట్ చేసి వున్నారని, ఆ వూరిపై వారి ప్రాబల్యం బలంగా వుందని గ్రేట్ ఆంధ్రలోనే చాణక్య విపులంగా రాశారు. ఎటొచ్చీ అమరావతిలో యిన్వెస్ట్ చేసినవారే వైజాగ్‌లో చేసి వుండకపోవచ్చు. 

వైజాగ్‌కు తరలించడం కమ్మలను దెబ్బ కొట్టడానికి అనే వాదనకు బలం లేదని చెప్పడానికి యిది చెప్పాను. కులపరంగా చెప్పాలంటే చాలామంది కమ్మలకు ముందుచూపు, సాహసం, కొత్త ప్రాంతాలకు వెళ్లి స్వయంకృషితో నిలదొక్కుకునే చొరవ ఎక్కువ. ఇతర రాష్ట్రాలలో కూడా వారు జెండా పాతిన ఊళ్లు అనేకం వున్నాయి. అందువలన అమరావతిలో అద్భుతనగరం కట్టకపోవడమనేది వారిని దెబ్బ తీయడానికే అనలేము. మీరు ఎక్కడ కట్టినా వారు అక్కడ రాణించగలరు.

కానీ టిడిపి అమరావతి, కమ్మ స్టూల్స్ మీదే విన్యాసాలు చేస్తూండడంతో, తక్కిన ప్రాంతాల, తక్కిన కులాల టిడిపి నాయకులు వేరే కొమ్మలకు దూకేస్తున్నారు. టిడిపి సంకుచిత దృక్పథాన్ని ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’కు (ఈ పదాన్ని దీనికి వాడవచ్చో లేదో నాకు తెలియదు) ముడిపెట్టి వైసిపి అమరావతి రైతుల భవిష్యత్తును దెబ్బ తీస్తోంది. 

అక్రమాలు జరిగితే దాన్ని వేరేలా డీల్ చేయాలి తప్ప, ప్రభుత్వం రైతులకు యిచ్చిన హామీలను తప్పకూడదు. లిఖితపూర్వకంగా ఏం రాసి యిచ్చారో దాన్ని అమలు చేసి తీరాలి. లేకపోతే విశ్వసనీయత దెబ్బ తింటుంది. రైతులను, రియల్టర్లను కలగలిపి చూస్తే రైతులకు అన్యాయం చేసినట్లే.

అమరావతి ‘స్కాము’పై సిబిఐ విచారణ చేయమని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్రం ప్రాధాన్యతలు కేంద్రానివి. ఎప్పటికి చేపడుతుందో, అసలు చేపడుతుందో లేదో తెలియదు. అప్పటిదాకా అమరావతిపై ఏ నిర్ణయమూ తీసుకోమని కూర్చుంటే తప్పు కదా! దీనికి పరిష్కారం చూపకుండా సాగదీస్తూ పోతే ఎలా? ‘మిమ్మల్ని చంద్రబాబు మోసం చేశాడు.’ అంటూ ఎన్నాళ్లు చెప్తారు? బాబు హయాంలో పెండింగు పెట్టిన పనులు చేస్తున్నారు, బిల్లులు చెల్లిస్తున్నారు. అలాగే దీనికీ ఏదో మార్గం చూడాలి.

రైతు సమస్యకు పరిష్కారం రైతు నాయకుల దగ్గర్నుంచే రావాలని గతంలో రాశాను. పంతాలకు పోకుండా, మాకు కనీసం యిది యివ్వండి అని అడిగితే ప్రజలు కూడా వారికి మద్దతుగా నిలుస్తారు. ఇమేజి కోసమైనా ప్రభుత్వం దిగి రావచ్చు. అలాటి ప్రాక్టికల్ సజెషన్ చేయకుండా ఉద్యమనాయకులు ‘తక్కిన ప్రాంతాలకు ఏదీ యివ్వవద్దు, అన్నీ మాకే కావాలి. చంద్రబాబు మాకు అలాటి హామీలు మౌఖికంగా యిచ్చారు.’ అని వాదిస్తూ కూర్చుంటే పనులు జరగవు. ముఖ్యమంత్రే మా వద్దకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసినా జరిగే పని కాదు.

ఇలా ఆలోచించాలంటే మొదట రాజధాని అంటే అద్భుతనగరంగా వెలవాలి అనే ఆలోచనను మనసులోంచి తుడిచేయాలి. అద్భుతనగరాలు పనికి రావు అని నేను ఎప్పణ్నుంచో రాస్తూ వచ్చాను. ఇప్పుడు తాజాగా మరో సమాచారం నాకు తెలియవచ్చింది. మోహన్ కందాగారు తన ‘‘మోహన మకరందం’’ (ఇది గ్రేటాంధ్రలో సీరియల్‌గా వచ్చి, పుస్తకరూపంలో రెండుసార్లు వచ్చింది)ను ఇంగ్లీషులో ‘‘ట్రెక్కింగ్ ఓవర్ పెబుల్స్’’ పేర అనువదిస్తూ కొన్ని అధ్యాయాలు అదనంగా చేర్చారు. 

వాటిల్లో ఒక దానిలో బ్రెజిల్‌ రాజధాని బ్రసీలియాకు వెళ్లిన విషయం రాశారు. అక్కడ ఒక వ్యవసాయ సంస్థ పక్కనే వున్న పశుక్షేత్రానికి వెళితే అక్కడ మన ఒంగోలు గిత్తలు కనబడ్డాయని వాటిని వాళ్లు బ్రాహ్మణులు అంటారని రాస్తే ఉత్సుకతతో చదివాను. బ్రెజిల్‌లో బ్రాహ్మణులేమిట్రా అనుకుంటూ ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని సేకరించాను.

టెక్సాస్ వంటి దక్షిణ యుఎస్ ప్రాంతాల్లోనూ, దక్షిణ అమెరికాలోనూ యీ తరహా పశువులు 1854 నుంచి చాలా పాప్యులర్. మన గుజరాత్, ఒంగోలు ప్రాంతాల నుంచి బ్రిటిషు వారు వాటిని తరలించుకుని పోయి, అమెరికాలో ప్రవేశపెట్టారుట. ఇవి అక్కడి ఎండలను, రోగాలను బాగా తట్టుకుంటాయి. వీటి నుంచి పాలు మాత్రమే కాక బీఫ్ కూడా హెచ్చు పరిమాణంలో వస్తుంది. 

డిమాండు ఎక్కువగా వుండడంతో ఒంగోలు నుంచి దొంగతనంగా స్మగుల్ చేస్తూంటారని అక్కడివాళ్లు మోహన్‌గారికి చెప్పారట. తమాషా ఏమిటంటే వీటిని స్థానికులు ‘బ్రాహ్మణ’ అని పిలుస్తారు. భారతదేశం నుండి దిగుమతి అయిన జాతి కాబట్టి ఏ ‘ఇండికా’యో అనవచ్చు కానీ బ్రాహ్మణ అని ప్రత్యేకంగా ఎందుకన్నారో నాకు అర్థం కాక ఆయన్ని అడిగితే నాకూ తెలియలేదు అన్నారాయన.

సరే యింతకీ యీయన బ్రసీలియా గురించి రాస్తూ ‘నగరం పరిశుభ్రంగా, తీర్చిదిద్దినట్లు వుంది. పైగా ఎక్కడా రణగొణధ్వని లేదు. ఇక ఆఫీసు భవంతులు కూడా ఊరికే కళ్లుచెదిరేలా కట్టకుండా, ఫంక్షనల్‌గా, ఉపయోగపడేట్లా కట్టినట్లు తోచింది. బ్రెజిల్ దేశం విశాలమైనదే అయినా దాని రాజధాని చిన్నగా, చక్కగా, కాంపాక్ట్‌గా, చాలా పద్ధతిగా వుంది.  ఆధునిక టెక్నాలజీతో కట్టినా యునెస్కోవాళ్లు 1987లో దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు’ అని రాశారు. పాత నగరాలను తప్ప కొత్తవాటిని కూడా హెరిటేజి సైటుగా గుర్తిస్తారా అని ఆశ్చర్యపడి, నెట్‌లో దాని గురించి చదివాను. చాలా విషయాలు తెలిశాయి.

బ్రెజిల్‌కు 1956లో అధ్యక్ష పదవి చేపట్టినతను పాత నగరాలు రాజధానిగా పనికిరావని, ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా, కొత్తగా కట్టాలని సంకల్పించి ఓ కమిటీ వేసి దానికి మాస్టర్ ప్లాన్లు సబ్మిట్ చేయమని ఆర్కిటెక్ట్‌లను, సిటీ ప్లానర్లను కోరాడు. కమిటీవాళ్లు లూసియో కోస్తా అనే అతను యిచ్చిన ప్లానును ఆమోదించారు. దాని ప్రకారం 1956 నుంచి 1961లోగా మహానగరం కట్టేశారు. ఇది మహాద్భుతం, మిరకిల్ అన్నారందరూ.

దాన్ని ఆకాశం నుంచి చూస్తే విమానంలా కనబడుతుంది. తూర్పు నుంచి పడమర వైపు సాగే లైనంతా ప్రభుత్వ, ప్రయివేటు ఆఫీసులు వరుసగా కట్టారు. ఉత్తరం నుంచి దక్షిణంవైపు సాగే లైనంతా ఇళ్లు, స్కూళ్లు, చర్చిలు కట్టారు. రెండు వరసలూ కలిసే చోట బ్యాంకులు, హోటళ్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు కట్టారు. 

అంతా రిచ్‌గానే కట్టేస్తున్నారు, పేదలుండే చోటెక్కడ అని అడిగితే ధనికులు, పేదలు కలిసే వుంటారు అన్నాడు కోస్తా. ‘5 లక్షల మంది జనం పట్టేట్లా కడుతున్నాం. దానికి 15  మైళ్ల వెడల్పున్న గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి అవతల శాటిలైట్ టౌన్స్ ఏర్పాటవుతాయి. వారెవ్వరూ నగరంలోకి రానక్కరలేకుండా అక్కడా అభివృద్ధి జరుగుతుంది.’ అన్నాడతను.

కానీ వాస్తవానికి జరిగింది వేరు. ఈ బిల్డింగులు కట్టడానికి వచ్చిన కార్మికులు ఆ భవంతుల పక్కనే మురికివాడలు నిర్మించుకుని అక్కడ వుండసాగారు. వాటికి నీటి వసతి లేదు, డ్రైనేజి వసతి లేదు, ట్రాన్స్‌పోర్టు లేదు, ఏ సౌకర్యమూ లేదు. కొంతమంది తామున్న స్థలాలను కబ్జా చేసేశారు కూడా. దాంతో నగరశోభ దెబ్బ తింది. కొన్నాళ్లు పోయాక నగరపాలకులు బలవంతంగా వాళ్లని ‘యిళ్లు’ ఖాళీ చేయించి శాటిలైట్ టౌన్లకు తోలేశారు. ధనికులు, పేదలు కలిసి వుండడానికి కట్టిన భవంతులను రిచ్, సూపర్ రిచ్ కొనేసుకున్నారు.

పేదవాడికే కాదు, మధ్యతరగతివాడికి కూడా యిల్లు లేకుండా పోయింది. ‘కాపురముండడానికే కాదు, నడవడానికి పేవ్‌మెంట్లు కూడా లేకుండా కట్టారు మహానుభావులు. ఏమైనా కొనాలంటే షాపింగు మాల్స్‌లోకి వెళ్లాలి తప్ప మామూలు రోడ్‌సైడ్ దుకాణాల్లాటివి వుండనే వుండవు. కళ్లు చెదిరే ఈ అద్భుతనగరంలో లైఫ్ లేదు. వ్యాపారకార్యక్రమాలు లేవు. అంతా ఏదో మ్యూజియంలా, సినిమా సెట్టింగులా వుంటుంది. ఆర్ట్ వేరే, లైఫ్ వేరే అని తెలుసుకోకుండా కట్టేశారు. అందుకే వీకెండ్స్ రాగానే సివిక్ లైఫ్ కోసం ఊళ్లోవాళ్లంతా యితర నగరాలకు వెళ్లిపోతూ వుంటారు.’ అని అంటారు స్థానికులు.

అసలైన చిక్కు ఎక్కడ వచ్చిందంటే ఆ రాజధానిలోనే అన్ని ఆఫీసులు, కోర్టులు, సచివాలయం అన్నీ కట్టేశారు. దాంతో దేశంలోని జనాలంతా ఆ వూరికి తరలి రాసాగారు. ఏటా నగరజనాభా 2.8 శాతం చొప్పున పెరుగుతోంది. ప్రస్తుత జనాభా 25 లక్షలు. అంటే అనుకున్నదాని కన్నా ఐదు రెట్లు పెరిగారన్నమాట. అందరూ వుండడానికి నగరంలో చోటు లేదు, పైగా అక్కడ జీవనవ్యయం ఎక్కువ కూడా. అందువలన 5 లక్షల మంది వుండవలసిన నగరంలో కేవలం 3 లక్షల మంది ఉంటున్నారు. తక్కిన 22 లక్షల మంది శాటిలైట్ టౌన్స్‌లో వుంటున్నారు.

ఆ టౌన్లలో ఓ పాటి యిళ్లున్నా మురికివాడలదే పైచేయి. అక్కణ్నుంచి ఇక్కడి ఆఫీసుల్లో పని చేయడానికి అందరూ బస్సుల్లో పడి రావాలి. బ్రసీలియా సెంట్రల్ బస్ టెర్మినల్‌ను రోజుకి 8 లక్షల మంది ఉపయోగిస్తారు. వాహనాల రద్దీ. ట్రాఫిక్ సమస్యలు. పర్యావరణ సమస్యలు. దాంతో వాతావరణం కలుషితం కాకుండా ఆ దేశస్తులు పెట్రోలులో చెఱుకు నుంచి తీసిన ఇథనాల్‌ను పావువంతు కలిపి వాడడం మొదలెట్టారు.

ఆర్థిక అసమానతలు పెరిగిపోవడంతో నేరాలు, హింస పెరిగాయి. యుటోపియా (ఆదర్శనగరం) అనుకున్నది డైస్టోపియా (భూతలనరకం) అయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో వాళ్లు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. రాపిడ్ బస్సులు ప్రవేశపెట్టారు. పాదచారులకు, సైక్లిస్టులకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ లైట్లను విస్తారంగా అమరుస్తున్నారు. ‘అయ్యవారేం చేస్తున్నారు?’ అని అడిగితే ‘చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు.’ అనే సామెత గుర్తుకు వస్తుంది. బ్రసీలియా కథ వింటే.

రాజధానులు కట్టదలచినవారు తెలుసుకుని, గుర్తుంచుకోదగిన సమాచారమిది. నగరం అంటే కళ్లు చెదిరే ఆకాశహర్మ్యాలు, ఆఫీసులు కడితే సరిపోదు. పేదలు, మధ్యతరగతి వాళ్లు నివసించే ఏర్పాట్లు కూడా వుండాలి. లేకపోతే దానిలో జీవం వుండదు. అనేక సమస్యలు ఎదురై, నగరం కలుషితమై పోతుంది లేదా ఖాళీ అయిపోతుంది. అదృష్టవశాత్తూ చంద్రబాబు అమరావతిని భ్రమరావతిగానే మిగిల్చారు తప్ప నిజంగా కట్టేయలేదు. బతికిపోయాం. లేకపోతే బ్రసీలియాలా తయారయ్యేదేమో!

దేశంలోని కొన్ని నగరాలను మీరు పరికించండి. మద్రాసు, ముంబయి, కలకత్తా – వీటిల్లో పేదలు కూడా బతకగలరు. దిల్లీలో బతకడం కష్టం. ధనికులు మంచి ఏరియాల్లో వుంటే పేదలు వూరికి బాగా దూరంగా, తగిన పౌరసదుపాయాలు లేని బస్తీల్లో వుంటారు. అనుమతులు లేకుండా కట్టిన కాలనీలు వందల సంఖ్యలో వున్నాయి. అక్కణ్నుంచి ఊళ్లోకి బస్సుల్లో, సొంత వాహనాల్లో వెళ్లి వస్తూ వుంటారు. అందుకే వాతావరణ కాలుష్యం ఎక్కువ.

హైదరాబాదులో జూబిలీ హిల్స్ వంటి ప్రాంతాలు వున్నా పేదలు, మధ్యతరగతి బతకగలరు. బెంగుళూరు అలాకాదు. పేదలుండడం కష్టం. జీవనవ్యయం మొదటినుంచీ ఎక్కువే. బాబు అమరావతిని హైదరాబాదులా కడదామనుకోలేదు, సైబరాబాదులా కాఫీ డేలు, శిల్పారామాలతో, విలాసంగా కడదామనుకున్నారు. మలేసియా వారి చేత కొంతమేర విలాసంగా కట్టించినా, తక్కిన ప్రాంతాలను మధ్యతరగతివాళ్లకు కేటాయిస్తే బాగుండేది.

ఆయన చేసిన తప్పేమిటంటే మలేసియా వాళ్లు వచ్చి పెద్దది కట్టేదాకా, రాజధాని చుట్టుపట్ల ప్రాంతాల్లో కూడా సామాన్య బిల్డర్లెవరికీ అనుమతులు యివ్వకపోవడం. అంతా ప్రభుత్వమే రియల్ ఎస్టేటు చేద్దామనుకోవడంతో చిక్కు వచ్చింది. ప్రయివేటు పెట్టుబడులు అనుమతించి వుంటే, చుట్టూ సాధారణ ఎపార్టుమెంట్లు వచ్చేలా చేసి వుంటే యీ రోజు జగన్ రాజధాని మార్చే యీ దుస్సాహసం చేసేవాడు కాదు. అలా అనుమతించకపోవడంతో అమరావతిలో అభివృద్ధి జరగలేదు. ఆయన అనుకున్న రీతిలో అద్భుతనగరం వెలవలేదు. బ్రసీలియా కథ తెలిశాక, వెలవకపోవడమే మంచిదైంది అనిపించింది నాకు.

అమరావతి ఉద్యమకారులకు కూడా యీ కథ తెలిస్తే బాగుండును. వాళ్లు అక్కడ పేదలకు యిళ్ల స్థలాలు కేటాయించినా, ఠఠ్ వీల్లేదంటూ కోర్టుకి వెళ్లారు. యూనివర్శిటీలకు వందలాది ఎకరాలు యిచ్చినా ఫరవాలేదట. మా మధ్య మధ్యతరగతివారు, పేదలు వుండడమేమిటి, నాన్సెన్స్ అంటున్నారు. వైసిపి వారు కూడా యీ కథ వినాలి, పట్టుకెళ్లి అన్నీ వైజాగ్‌లో పెట్టేయకుండా తమాయించుకోవాలి. హైదరాబాదులో వర్షబీభత్సం చూశాం, అంతకుముందు కరోనా విలయమూ చూశాం. 

అసలు నగరాలే వద్దనిపిస్తోంది. వాటి నిర్వహణ చాలాచాలా కష్టం. ఇక అద్భుత నగరాలా? అయ్యబాబోయ్, అసలే వద్దు, వాటి గురించి తలపెట్టవద్దు. (ఫోటో – బ్రసీలియా)

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2020)

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×