Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: అమరావతి రైతు ఆందోళన

ఎమ్బీయస్‌: అమరావతి రైతు ఆందోళన

మామూలు పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలో నైనా రాజధాని మార్చి వుంటే అంత పేచీ లేదు. ఎక్కడో అక్కడ ఉంటుంది అనుకుని ఊరుకుంటారు. కానీ ఆంధ్ర విషయంలో లాండ్‌ పూలింగ్‌ ప్రక్రియ కారణంగా రైతుల సమస్య వచ్చిపడింది. ఏ ప్రాజెక్టయినా సరే భూసేకరణ అనేది పెద్ద సమస్య. ఇస్తానన్న పరిహారం, ప్రత్యామ్నాయ ఆవాసం దశాబ్దాలైనా యివ్వకపోవడం జరుగుతూంటుంది. యుపిఏ ప్రభుత్వం దానిపై దృష్టి సారించి, భూసేకరణకై లాండ్‌ ఎక్విజిషన్‌ చట్టం తెచ్చింది. దాని ప్రకారం భూములిచ్చినవారికి చాలా డబ్బే యివ్వాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో ప్రాజెక్టు చేపట్టకపోతే వెనక్కి యివ్వాల్సి ఉంటుంది. దాదాపు 33 వేల ఎకరాల సేకరణ లక్ష్యం పెట్టుకున్న బాబు దాన్నించి తప్పించుకోవడానికి కొత్త ఎత్తు ఎత్తారు. ఎల్‌పిఎస్‌ (లాండ్‌ పూలింగ్‌ స్కీము) అని పెట్టి భూమి యిచ్చినవారి పాలిట ఫూలింగ్‌ స్కీములా మార్చారు. అది గ్రహింపుకి రావడంతో రైతులు యిప్పుడు గగ్గోలు పెడుతున్నారు.

బాబు ప్రభుత్వం యిచ్చిన ఆఫర్‌ ఏమిటి? రాజధాని నిర్మాణానికై మీరు సిఆర్‌డిఏకి భూమి యివ్వండి. దానికి విద్యుత్‌, నీరు, డ్రైనేజి సౌకర్యాలు కల్పించి డెవలప్‌ చేస్తాం. దానిలో కొంత మేము ఉంచుకుని కొంత మీకిస్తాం. మీరు ఎకరం (4800 చ.గ.) భూమి యివ్వండి. మీది జరీబు (మిక్కిలి సారవంతమైన) భూమైతే, వెయ్యి చ.గజాల నివేశన (రెసిడెన్షియల్‌) స్థలం, 450 చ.గ.ల వాణిజ్య (కమ్మర్షియల్‌) స్థలం యిస్తాం, మీది మెట్ట భూమైతే (డ్రై ల్యాండ్‌) అది 1000, 200, మీది ఎసైన్‌డ్‌ భూమైతే అది 800, 100 అని. ఆ ఆఫర్‌ ఒప్పుకుని భూమి యిచ్చిన రైతులకు అన్నమాట ప్రకారం బాబు ప్రభుత్వం ఆ యా స్థలాలు రిజిస్టర్‌ చేసి యిచ్చేసింది. ఇక డెవలప్‌ చేయడమొకటే మిగిలింది. అది తాపీగా సాగుతోంది. 

ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం ఏమంటోంది? మేం కూడా తక్కినవన్నీ డెవలప్‌ చేసేసి, మీకు అప్పగించేస్తాం అంటోంది. అంటే ప్రభుత్వం తన మాట నిలబెట్టుకున్నట్లే. మరి రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?  ఎందుకంటే వాళ్లకు యివ్వబోయే కమ్మర్షియల్‌ స్థలానికి పెద్దగా విలువ వుండబోదని వాళ్లకు తెలిసిపోయింది. విలువ ఉంటుందని చెప్పినవారెవరు? బాబు! ఎందుకంటే డెవలప్‌ చేసి యిస్తాం అనే ఆఫర్‌ రియల్‌ ఎస్టేటు వ్యాపారి ఎవరైనా యిచ్చే ఆఫర్‌ లాటిదే. ఆ మాత్రానికి మూడు పంటలు పండే భూమిని మేం ఎందుకు యివ్వాలి? అని రైతులు అడిగారు. మీ కివ్వబోయే 450/250 చ.గ.ల స్థలం లాకాయిలూకాయిది కాదు. సాక్షాత్తూ బంగారమే అని నమ్మబలికారు బాబు. 

 'ఇక్కడ ప్రపంచమంతా తెల్లబోయి చూసే అద్భుత నగరం ఏర్పడబోతోంది. దానిలో ప్రతీ చ.అ.కు ఎంతో కమ్మర్షియల్‌ వేల్యూ ఉంటుంది. ఉదాహరణకి మీ స్థలంలో ఓ కమ్మర్షియల్‌ కాంప్లెక్స్‌ కట్టేమనుకోండి, మీ వాటాకు కొన్ని షాపులు వస్తాయి. వాటి మీద అద్దెతో మీరు కొన్ని తరాలపాటు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు.' అని చెప్పారు. పరిపాలనాదక్షుడిగా, హైటెక్‌ సిటీ నిర్మాతగా బాబుకి యిమేజి ఉంది. పైగా కేంద్రంలో ఉన్న బిజెపితో సఖ్యంగా ఉన్నాడు. మోదీ లక్షల కోట్లు యిక్కడ గుమ్మరిస్తాడు, మన జీవితంలో వచ్చిన అద్భుతావకాశం యిది అనుకున్న వాళ్లు ఐచ్ఛికంగా భూములిచ్చారు. ఇవన్నీ జరిగినప్పటి మాట కదా అనుకున్నవాళ్లు యివ్వలేదు. నయానో, భయానో వాళ్లను వంచి మరిన్ని ఎకరాలు సాధించారు.

వీళ్లందరికీ మాటలతో అరచేతిలో స్వర్గం చూపించారు కానీ రాతపూర్వకంగా ఏమీ యివ్వలేదు. ప్రభుత్వం యిచ్చిన జిఓలలో యింత కమ్మర్షియల్‌ స్థలం యిస్తాం అని వుంది తప్ప, దాని పక్కన మేం ఫలానాది కడతాం, దాని కారణంగా స్థలం విలువ యింత ఉంటుంది అని రాసి లేదు. ఇది సాధారణంగా బిల్డర్లు మనతో వ్యవహరించే తీరులోనే ఉంది. 'ఇక్కడ హార్డ్‌వేర్‌ పార్క్‌ వస్తోంది, మెట్రో యిక్కడి దాకా వేద్దామాని అధికార్లు సర్వే చేసి వెళ్లారు, ఎయిర్‌పోర్టు యిటువైపు మారుస్తారు' వంటి మాటలు నోటితో చెప్తారు. సేల్‌ ఎగ్రిమెంట్‌లో అవేమీ ఉండవు. పక్కనే ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌ వస్తోంది, ఫ్లాట్‌ అద్దెకిస్తే నెలకు పాతిక వేలు ఖాయం అనుకుని ఫ్లాట్‌ కొంటాం. తర్వాత అవి రాకపోతే బిల్డర్‌ను కోర్టుకి యీడ్చలేం, ఎందుకంటే అగ్రిమెంటులో అవేమీ లేవు. బిల్డర్‌ను అడిగితే 'వస్తాయని నేనూ నమ్మానండి. అందుకే పది ఫ్లాట్లు నా వద్దే ఉంచుకున్నాను. మీతో పాటు నేనూ నష్టపోయాను, ఏం చేయగలం? మన కింతే ప్రాప్తం' యింత విబూది తీసి చేతిలో పెడతాడు.

ఇప్పుడు రైతులదీ అదే పరిస్థితి.  స్థలాలు డెవలప్‌ చేసి యివ్వకపోతే ప్రభుత్వంది తప్పవుతుంది. కానీ వాటి మార్కెట్‌ విలువ యింత ఉండి తీరాలి అని ఏ కోర్టూ రూలింగు యివ్వలేదు. అది అర్థమవుతున్న కొద్దీ రైతులకు దుఃఖం కలుగుతోంది. మొదట ప్రభుత్వభూముల్లోనే రాజధాని కడతారనుకున్నారు. ఈ లాండ్‌ పూలింగు ఐడియా రాకముందు, యిక్కడ వాళ్లు యిచ్చిన భూమికి బదులుగా వేరే చోట, చవగ్గా దొరికే భూమిని దీనికి రెట్టింపు పరిమాణంలో  భూములిస్తారు,  రైతులే కాబట్టి అక్కడ వ్యవసాయం చేసుకుని వృద్ధి చెందుతారు అనుకున్నారు. అదే జరిగి వుంటే సహజపరిణామంలో ఆ భూముల విలువ పెరిగేది. కానీ బాబు  ప్రభుత్వ భూములను పట్టించుకోకుండా, ప్రత్యామ్నాయ భూములిచ్చే ఆలోచన మానేసి, యీ డెవలప్‌మెంట్‌ ఆఫర్‌ వాళ్ల కళ్ల ముందు ఆడించారు. దాని విలువ గురించి గాలి కబుర్లు చెప్పి గారడీ చేశారు.

వాళ్లను బురిడీ కొట్టిస్తూనే 'పైసా ఖర్చు లేకుండా భూసేకరణ చేస్తున్నా, ప్రపంచంలో ఎవ్వరూ యీ పని చేయలేక పోయారు' అని మనకు కబుర్లు చెప్పారు. నిజానికి ఆయన అప్పటికప్పుడు డబ్బు యివ్వలేదు కానీ ప్రభుత్వం నెత్తిన డెవలప్‌ చేసే పెద్ద బాధ్యత పెట్టారు. దానితో బాటు ఏన్యుయుటీ పేర ఏటా ఎకరాకు రూ.30 వేలు (మెట్ట అయితే) రూ.50 వేలు (జరీబు అయితే) యిస్తానన్నారు. ప్రతీ ఏడూ 10% చొప్పున పెంచుకుంటూ పోతానన్నారు. ఇలా పదేళ్లు యిస్తానన్నారు. అంటే దాని అర్థం - ఎకరా మెట్ట భూమికి పదేళ్లకు 4.78 లక్షల అద్దె, ఎకరా జరీబు భూమికి పదేళ్లకు 7.97 లక్షల అద్దె చెల్లించాలన్నమాట. ఇలా రమారమి 33 వేల ఎకరాలకు చెల్లించాలంటే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో ఆలోచించండి. 

ఇది కాకుండా భూములు తీసేసుకోవడం చేత జీవనభృతి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు (హీనపక్షం 15 వేల మంది ఉండవచ్చు) ఏడాదికి 30 వేలు యిస్తూండాలి. ఈ చెల్లింపులకై ఈ ఏడాది బజెట్‌లో కేటాయించిన మొత్తం రూ.187 కోట్లు. ఈ మొత్తానికి డెవలప్‌ చేయడానికి ఉపయోగించి వుంటే రైతులకు త్వరగా భూములు తిరిగి యిచ్చేయవచ్చు. కానీ రాజధాని నిర్మాణానికి నిధులు రాలేదు. అనుకున్నన్ని ఋణాలు రాలేదు. పర్యావరణ పరమైన అనుమతులు ఓ పట్టాన రాలేదు. పైగా అనేక సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించాల్సి వచ్చింది. అందువలన డెవలప్‌మెంట్‌ పనులు కుంటినడక నడుస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తున్న రైతులు  ప్రభుత్వం నెలనెలా యిచ్చే డబ్బు పుచ్చుకుంటూ ఆ అద్భుతనగరం ఎప్పుడు వెలుస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు. సాధారణంగా ఒక రాజధాని తయారు కావడానికి 20, 25 ఏళ్లు పడుతుంది. కానీ బాబు మై హూఁ న అన్నారు.

కొన్నాళ్లకే సందేహాలు ప్రారంభమయ్యాయి, ఈయనకు మోదీ డబ్బిచ్చేట్టు లేడే, ఎలా కడతాడబ్బా అని! రైతుల శంకలు పటాపంచలు చేయడానికి బాబు పబ్లిసిటీని పెంచారు, శంకుస్థాపనలపై శంకుస్థాపనలు చేశారు. కొత్త డిజైన్లన్నారు, మార్చామన్నారు, లండన్‌ నిపుణులను రప్పించామన్నారు, జపాన్‌ వాళ్లతో భాగస్వామ్యం అన్నారు, సింగపూరు వాళ్లు ఉచితంగా ప్లాను వేసి యిస్తారన్నారు, ఇక్కడి ఎమ్మెల్యేలను, రైతులను సింగపూరు పంపారు. చూశారు కదా, అచ్చు అలాగే యిక్కడ వెలుస్తుంది చూడండి అన్నారు. 

ఈ పబ్లిసిటీ రంధిలో పడి, నిర్మాణాలు చేపట్టడం మర్చిపోయారు. కట్టిన కాస్త బిల్డింగులనూ నాణ్యంగా కట్టలేదు. పర్యావరణ సమస్యలను పరిష్కరించలేదు. అన్నీ అరకొర పనులే. అయినా ఐదేళ్లలో పూర్తి చేస్తానన్న బింకం వదలలేదు. సింపుల్‌గా కట్టుకుంటే ఫర్వాలేదు కానీ, అద్భుతనగరాలు కడతామంటే మేం డబ్బెందుకు యివ్వాలి అని బిజెపి వాళ్లు బహిరంగంగా అంటున్నా 'ఏదో అనుకున్నా, మరేదో జరిగింది, ఇదిగో ఎవరి భూములు వాళ్లు తీసేసుకోండి. ప్రభుత్వభూముల్లోనే సంసారపక్షంగా రాజధాని కడతాను' అని ఒక్కనాడూ అనలేదు.

బాబు గేమ్‌ప్లాన్‌ ఏమిటో ఎవరికీ తెలియదు. పాతికేళ్లదాకా తనే పాలిస్తానని, ఆ లోగా రాజధాని కట్టేస్తానని అనుకున్నారా? నిజంగా అద్భుతనగరం కడతానని ఆయన తనను తాను నమ్మించుకుని ఉండకపోతే తన సన్నిహితులందరి చేత అక్కడ భూములెందుకు కొనిపిస్తాడు? తను చెప్పిన మహానగరం అవతరించకపోతే ఆ భూమికి విలువ ఉండదు కదా! అంటే ప్రజల్ని మభ్యపెట్టడమే కాక, తనను తాను కూడా మభ్యపెట్టుకున్నాడా? దేశంలో ఏ రాష్ట్ర రాజధానీ ఆ స్థాయిలో లేనప్పుడు, యిక్కడ మాత్రం ఎలా వెలుస్తుంది? విభజిత రాష్ట్రం చిన్నది. 25 ఎంపీలు ఉన్న రాష్ట్రం. గుజరాత్‌ కున్న ఎంపీలు 26. దాని రాజధాని గాంధీనగర్‌ 177 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. అమరావతి కూడా ఆ సైజులో తయారవుతుంది. అంతకంటె ఎక్కువగా ఎలా ఊహించగలం? 

బాబు ముందులో ఏమనుకున్నా, క్రమేపీ వాస్తవాలు గ్రహిస్తున్న కొద్దీ తన ఆశలు తగ్గించుకుంటూ, జనం ఆశలు దింపుతూ రావల్సింది. కానీ బీరాలు పలుకుతూనే పోయారు. కేంద్రం యివ్వకపోతే అంతర్జాతీయంగా అప్పులు తెస్తాం అన్నారు. తీర్చే సామర్థ్యం వనరులు లేని కొత్త రాష్ట్రానికి ఎలా వుంటుంది అని వాళ్లు మాత్రం ఆలోచించరా? ఇలా మభ్యపెట్టడం చేతనే ఆశాభంగం చెందిన ప్రజలు ఎన్నికలలో దెబ్బ తీశారు. అమరావతి గుదిబండ తగుల్చుకుని ఉండకపోతే బాబు అంత నవ్వులపాలయి వుండేవారు కారు. అంత ఘోరంగా ఓడేవారు కారు. రాజధాని ప్రాంతం వారితో సహా టిడిపిని మట్టి కరిపించారు. ముఖ్యమంత్రి కొడుకు, మంత్రి అయిన లోకేశ్‌ మంగళగిరిలో ఓడిపోయాడు. 

రాజధాని ప్రాంతమూ, టిడిపికి గట్టి పట్టు ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఫలితాలు ఘోరంగా వచ్చాయి. కృష్ణాలో 16 సీట్లుంటే గతంలో 14 వస్తే యీ సారి 2 వచ్చాయి. గుంటూరులో 17 ఉంటే గతంలో 12 వస్తే యీసారి 2 వచ్చాయి. ఎందుకిలా జరిగింది? అని కాస్త ఆలోచించి చూడాలి. భూములిచ్చిన రైతులు కొందరు పనులేమీ కాలేదని ఆక్రోశంతో టిడిపికి వ్యతిరేకంగా ఓట్లేశారనుకుందాం. కానీ ఆ రైతులు 29 గ్రామాల్లోనే ఉన్నారు. వాళ్లున్న మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో వైసిపి నెగ్గింది సరే తక్కిన చోట్ల ఉన్నవారికి ఏమైంది? ఎప్పటికైనా ఆ అద్భుతనగరం మన ప్రాంతంలో వస్తే మన ఆస్తులకు విలువ పెరుగుతుంది కదాన్న ఆశతోనైనా టిడిపికి ఓటేయ్యాలి కదా! ఎందుకు వేయలేదు?

టిడిపిని ఓడించి, వైసిపిని అధికారంలోకి తెస్తే రాజధాని దొనకొండకు తరలి పోవచ్చు అని ఎన్నికలకు ముందు అన్నారు. జగన్‌కు అక్కడ భూములున్నాయని, తనకు అధికారం వస్తే అక్కడకు రాజధాని పట్టుకుపోతాడని టిడిపి వారు తెగ ప్రచారం చేశారు. (ఇప్పుడు వైజాగ్‌కు రాజధాని వెళుతోందంటే అక్కడ జగన్‌ కబ్జా చేసిన భూములున్నాయంటున్నారు) ఒకవేళ రాజధాని యిక్కడే ఉంచినా సాదాసీదాదే కడతాడు తప్ప అద్భుతనగరం మాత్రం ఛస్తే కట్టడు అనే అవగాహన కృష్ణా, గుంటూరు వాసులకు ఉంది. అయినా వారు టిడిపిని గెలిపించలేదు. దీని అర్థం ఏమిటి? 

'రైతులకు ఏన్యుయిటీ పదేళ్లపాటు యిస్తానని బాబు ఒప్పుకున్నాడంటే దాని అర్థం అద్భుత నగరం పదేళ్లలో రూపు దిద్దుకుంటుందని. కానీ దానిలో సగం కాలం ఐదేళ్లు అయ్యేపోయింది. కథ ముందుకు కదలలేదు.  కనీసం మెట్రో ఐనా రాలేదు. అద్భుతనగరం కాదు కదా, సాధారణ రాజధాని కట్టడం కూడా బాబు తరం కాదు. విజయవాడలోని దుర్గ గుడి దగ్గర పూర్తి కాని ఫ్లయిఓవర్‌ ఆయన డాబు కబుర్లను వెక్కిరించే దిష్టిబొమ్మలా కనిపిస్తోంది. ఆయన కట్టాకట్టడు, కట్టలేనని ఒప్పుకోనూ ఒప్పుకోడు. జగన్‌ నెగ్గితే యిక్కడ అద్భుతనగరం కట్టనంటాడు, అలా అయితే నైతిక బాధ్యత వహించి మాకిచ్చే నష్టపరిహారం పెంచమని అడగవచ్చు' అనుకున్నారా? 

తెలియదు. చట్టబద్ధంగా ప్రభుత్వాన్ని లొంగదీయలేమని వాళ్లకూ తెలుసు, వాళ్ల లాయర్లు చెప్పేవుంటారు. బాబుని తిట్టుకునీ ప్రయోజనం లేదు. ప్రపంచ బ్యాంకు వాళ్లు అమరావతిలో రాజధాని అంటే అప్పివ్వమని చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు జగన్‌ అమరావతి రాజధాని కాదు అనకుండా లెజిస్లేటివ్‌ రాజధాని అంటూ మెలిక పెట్టాడు. అందువలన రాజధానికై భూములు తీసుకుని కట్టకపోవడం ప్రభుత్వం మాట తప్పడమే అనడానికి లేదు. రాజధాని కాకపోవడమేం, లెజిస్లేటివ్‌ రాజధాని కదా అని బుకాయించవచ్చు. ఇక నైతికంగా ఒత్తిడి చేసి ఎక్కువ పరిహారం సాధించడమొకటే ప్రాక్టికల్‌ సొల్యూషన్‌. అలా కాకుండా వాళ్లను ఎమోషనల్‌గా రెచ్చగొట్టడానికి ప్రతిపక్షాలు - ముఖ్యంగా టిడిపి - ప్రయత్నించవచ్చు. దానికి వారు వాడే ఆయుధం - రాజధాని తరలిపోతే అభివృద్ధి తరలిపోతుంది అని.

రాజధాని ఉన్నచోట అభివృద్ధి ఉంటుంది అనే స్లోగన్‌తో గతంలో టిడిపి, యిప్పుడు వైసిపి ప్రజలను మభ్యపెడుతున్నాయి. అసలు రాజధానికి, అభివృద్ధికి సంబంధం ఉందా అన్న విషయం తర్వాతి వ్యాసంలో చర్చిద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?