Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : అమ్మో ‘అతి’వ – దబాయింపుకై హత్య

ఎమ్బీయస్ : అమ్మో ‘అతి’వ – దబాయింపుకై హత్య

అది 1868. ఇంగ్లండ్‌లోని బ్రైటన్‌లో క్రిస్టియానా ఎడ్మండ్స్ అనే 40 ఏళ్ల మహిళ వుండేది. పెళ్లి కాలేదు. తల్లితో కలిసి ఒక ఎపార్ట్‌మెంట్‌లో వుండేది.  ఆమె తండ్రి విలియం పేరున్న ఆర్కిటెక్ట్. కానీ మతిస్థిమితం పెద్దగా లేదు. చిన్న వయసులోనే చనిపోయాడు. క్రిస్టియానాకు చిన్నపుడే హిస్టీరియా రావడంతో కాలేజీకి పంకుండా యింట్లోనే వుంచి చదివించారు. ఆమె అందగత్తె కాదు. ఎవరితో కలవదు. చీటిమాటికీ కోపం తెచ్చుకునే రకం. అందుకే ఏ యువకుడూ పెళ్లి చేసుకుంటానని ముందుకు రాలేదు. తన భర్త లాగే చిత్తచాంచల్యం వుందని తల్లి అనుమానం. అందువలన కూతుర్ని తన దగ్గరే పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటోంది. చుట్టుపట్ల ఎవరితోనూ స్నేహబాంధవ్యాలు పెద్దగా లేవు. ఓహో అంటే ఓహో అనుకోవడం మాత్రమే.

ఇలాటి పరిస్థితుల్లో క్రిస్టియానాకు డాక్టర్ చార్లెస్ బియర్డ్ పరిచయమయ్యాడు. ఈమెకు తలనొప్పి వస్తే అతని దగ్గరకు వెళ్లింది. అతను మర్యాదగా మాట్లాడితే పొంగిపోయింది. తన మీద మోజు పడ్డాడని అనుకుంది. డాక్టరు దాన్ని అవకాశంగా తీసుకుని ఏవేవో తీపికబుర్లు చెప్పి ప్రోత్సహించి, అనుభవించాడా అన్నది తెలియరాలేదు. తర్వాతి రోజుల్లో అతను ‘ఆమెతో నాకు శారీరక సంబంధం ఏమీ లేదు. ఒక వైద్యుడిగా ఆమెకు ఉల్లాసం చేకూర్చడానికి ప్రయత్నించానంతే’ అని చెప్పుకున్నాడు. కానీ ఆమె మాత్రం ‘నన్నెవరూ యిప్పటిదాకా పట్టించుకున్నవారు లేరు. నా మనసులో సున్నితమైన భావాలను అర్థం చేసుకుని స్పందించాడు.’ అనుకుంది. ఇంతకాలానికి తనను తను ఒకరికి ప్రేయసి నైనానని అత్యంత సంతోషంగా వుండసాగింది. దశాబ్దాల డిప్రెషన్ లోంచి బయటకు వచ్చింది.

ప్రేమకు పర్యవసానం పెళ్లి కాబట్టి, డాక్టరును పెళ్లాడాలనుకుంది. డాక్టరు అప్పటికే వివాహితుడు. అయినా సరేనని తన ప్రేమను వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లగా ఆమె మనసులో ఘనీభవించిన శృంగార భావనలను బయటపెడుతూంటే డాక్టరు చలించిపోయాడు. అబ్బే, కుదరదు అని చెప్పడానికి మనసు రాలేదు. పైగా ఒక వనిత తనంతట తానే వలచి వచ్చిందన్న సంగతి థ్రిల్ కలిగించిందేమో, ఆమె ప్రేమను ప్రోత్సహించాడు. ఆమె ప్రేమలేఖలు రాస్తే తనూ రాశాడు. తమ యింటికి కూడా ఆహ్వానించేవాడు. ఒక ఒంటరి మహిళకు మానసిక ఊరట కలిగిస్తున్నానని అనుకుంటూ రాశాను తప్ప వేరేమీ కాదని చెప్పుకున్నాడు. ఏది ఏమైతేనేం, డాక్టరు తన కోసం తపించి చచ్చిపోతున్నాడని, తన భార్య సజీవంగా వుండడంతో మహా బాధ పడిపోతున్నాడని, ఆమె చనిపోయిన మర్నాడే తనను పెళ్లాడడానికి సిద్ధంగా వున్నాడని యీమె గట్టిగా నమ్మింది.

అతని బాధ, తన బాధ తీరాలంటే రంగం నుంచి తప్పుకోవలసిన వ్యక్తి, డాక్టరు భార్య. తప్పించవలసిన బాధ్యత ప్రకృతిది. కానీ ప్రకృతి తన పని తాను సకాలంలో చేస్తుందన్న నమ్మకం యీమెకు కుదరలేదు. ఎందుకంటే డాక్టరు భార్య తన కంటె బాగా చిన్నది, పైగా ఆరోగ్యంగా, పుష్టిగా వుంది కూడా. మృత్యుదేవతకు తాను సాయపడకపోతే పని జరగదని తోచి ఒక ఐడియా వేసింది. మేనార్డ్ అని ఊళ్లో చాకొలెట్లు, ఐస్‌క్రీమ్‌లు అమ్మే షాపు వుంది. అక్కణ్నుంచి ఒక చాకొలెట్ బాక్స్ కొని పెట్టుకుంది. ఆ తర్వాత మందుల షాపుకి వెళ్లి స్ట్రిక్‌నీన్ అనే విషాన్ని కొంది. మన దగ్గర విషముష్టిచెట్టుగా పిలిచే చెట్టు కాయల్లోంచి దీని రసం తయారుచేసి, పొలాల్లో ఎలుకల్ని, పంట పాడు చేసే యితర జంతువులను చంపడానికి వాడేవారు. కొనేవాళ్లు తమ పేరు, చిరునామా ఒక రిజిస్టరులో రాసి, ఎందుకు కొంటున్నారో రాసి యిస్తే మందుల షాపుల్లో అమ్మేవారు.

ఈమె మిసెస్ ఉడ్స్ అనే మారుపేరుతో, దొంగ అడ్రసుతో దాన్ని కొని తెచ్చుకుంది. చాకొలెట్ బాక్స్‌లోంచి ఒక్కోటి జాగ్రత్తగా బయటకు లాగి, ఓపిగ్గా వాటిని తెరిచి, లోపల యీ రసాన్ని చొప్పించింది. 1870 సెప్టెంబరులో ఓ రోజు మధ్యాహ్నం ఆ బాక్స్ పట్టుకుని టీ టైములో డాక్టరు యింటికి వెళ్లింది. డాక్టరు భార్య యీమెను ఆహ్వానించి కబుర్లు చెపుతూంటే ‘మీ కోసమే తెచ్చాను, తినండి’ అని చేతిలో పెట్టింది. ఆమెకు టీ టైములో చాకొలెట్లు తినే అలవాటు లేకపోయినా మొహమాటానికి ఒకటి తీసుకుని నోట్లో పెట్టుకుంది కానీ చేదుగా తోచడంతో వెంటనే ఉమ్మేసింది. ‘అది మంచి షాపేనే, ఈ చాకొలెట్ ఎలా పాడైపోయిందో ఏమిటో’ అంటూ క్రిస్టియానా ఆశ్చర్యాన్ని నటించి, యింటికి వచ్చేసింది.

డాక్టరు భార్యకు తనపై విషప్రయోగప్రయత్నం జరిగిందని అనుమానం వచ్చేసింది. భర్త యింటికి రాగానే ‘నువ్వు దానితో కులకడంతో ఆగలేదు. దాని ద్వారా నన్ను చంపించాలని చూస్తున్నావు’ అంటూ దులిపేసింది. దాంతో డాక్టరు ఆమె దగ్గర నెత్తి మొత్తుకుని, యీమె దగ్గర నిప్పులు తొక్కాడు. ‘నీతో అప్యాయంగా వుంటున్నాను కదాని యింతకు తెగిస్తావా? ఇకపై నీ మొహం చూడను పో’ అని రంకెలు వేశాడు. ‘నాకే పాపమూ తెలియదు. ఆ చాక్‌లెట్ రుచి అదోలా వుంటే అది ఆ షాపువాడి తప్పు. నా మీద నింద వేస్తే ఎలా? నేను మనుషుల్ని చంపేదానిలా కనబడుతున్నానా?’ అని ఎదురు తిరిగిందీమె. అయినా డాక్టరు నమ్మలేదు. ఆమెను పూర్తిగా దూరం పెట్టేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామా అనుకున్నాడు కానీ తన ప్రేమపురాణం బయటపడుతుందని జంకాడు. మళ్లీ ఆమె జోలికి వెళ్లకపోతే సరి, వ్యవహారం యింతటితో ముగిసిపోతుందని అనుకున్నాడు.

క్రిస్టియానాకు మళ్లీ డిప్రెషన్ పట్టుకుంది. పెళ్లి చేసుకుందామనుకున్న డాక్టరుతో ప్రేమ అర్ధాంతరంగా ముగిసిపోవడమే కాక, అతను తనను అసహ్యించుకుంటున్నాడు కూడా. తను నిరపరాధిని అని నిరూపించుకోవాలంటే ఒకటే మార్గం. ఆ మేనార్డ్ షాపువాడే విషపూరితమైన చాకొలెట్లు అమ్ముతూండవచ్చు కానీ, తెలిసి తను ఏ తప్పూ చేయలేదని బుకాయించాలి. ఈ ఒక్క సంఘటన పట్టుకుని మేనార్డ్‌ను ఎవరు మాత్రం సందేహిస్తారు? అందువలన ఆ షాపులో చాకొలెట్లు తిని మరి కొంతమంది జబ్బుపడాలి, లేదా చావాలి. వాళ్ల తాలూకు వాళ్లు ‘ఇదిగో వీటివలననే మా వాళ్లు పోయార’ని ఫిర్యాదు చేయాలి. విచారణ జరిగి పోలీసులు కేసు పెట్టాలి. అప్పుడు తను డాక్టరు దగ్గరకి వెళ్లి ‘చూశావా, నా తప్పేమీ లేదు, వాడిదే దోషమంతా’ అని చెపితే అతను నమ్ముతాడు. మళ్లీ స్నేహం చేస్తాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే తను హత్యాప్రయత్నం చేసే మనిషిని కానని నిరూపించడానికి ఆమె హత్య చేయడానికి సిద్ధపడింది. ఆ హతుడెవరో ఆమెకు తెలియదు, వాడిపై కక్ష లేదు, వాడు ఛస్తే యీమెకు కలిసి వచ్చే ఆస్తీ లేదు. జస్ట్ డాక్టరు అభిమానం తిరిగి పొందడానికి యీ దుర్మార్గానికి ఒడిగట్టమని ప్రేరేపించింది ఆమె చిత్తచాంచల్యం, మానసిక స్థితి, మరేదైనా అనండి. అయితే మేనార్డ్ వాడు విషపూరితమైన చాకొలెట్లు ఎందుకు అమ్ముతాడు? మనమే అమ్మించేట్లు చేయాలి. అతని షాపులోంచి కొన్ని చాకొలెట్ బాక్సులు కొని, వాటికి విషం ఎక్కించి, మళ్లీ షాపుకి వెళ్లేట్లు చేయాలి. అప్పుడు అతను ఎవరెవరికో అమ్ముతాడు. ఆ కొనుక్కున్న అమాయకులు విషం పాలబడతారు, చావుదాకా వెళతారు, లేదా చస్తారు. అది ఎవరైనా కావచ్చు, తన బంధువులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు. అయినా డోంట్‌కేర్. డాక్టరు దగ్గర తన ‘అమాయకత్వం’ నిరూపించబడుతుంది. అది చాలు.

1871 మార్చిలో తన పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. ఎలుకలే కాదు, పిల్లుల బాధా ఎక్కువై పోయిందంటూ మరింత విషాన్ని కొనుక్కుని వచ్చింది. వీధుల్లో ఆడుకునే ఓ కుర్రాణ్ని పిలిచి ‘నాకు సాయం చేసి పెట్టు, చాకొలెట్ కొనుక్కోవడానికి నీకు డబ్బులిస్తా’ అంటూ వాణ్ని మేనార్డ్ షాపుకి పంపి చాకొలెట్ క్రీము కొనిపించింది. ఇంటికి పట్టుకెళ్లి వాటిల్లో విషం నింపింది. దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసేసి, మర్నాడు అదే కుర్రవాణ్ని పట్టుకుని ‘నిన్న నువ్వు తెచ్చింది, నేనడిగిన వెరైటీ కాదు. ఇది యిచ్చేసి అది పట్టుకు రా’ అంది. షాపువాడు పాతది తీసుకుని షెల్ఫ్‌లో పడేసి, కొత్తది యిచ్చాడు. ఈమె యింటికి వచ్చి కొత్తది హాయిగా తినేసింది. పాతది షాపు నుంచి కొన్నవాడెవడో అవస్థలు పడి వుంటాడు. కానీ తన రోగానికి, ఆ షాపులో కొన్న చాకొలేట్లకు లింకు వుందని గ్రహించలేక ఊరుకుని వుంటాడు.

క్రిస్టియానా రోజూ పేపరు చూసేది, ఇవాళ ఎవడైనా చచ్చిపోయాడా, పోలీసులు ఆ చావుకీ చాకొలేట్‌లకు లింకు పెట్టారా లేదా అని. అలా ఏమీ జరగకపోవడంతో మరిన్ని ప్రయోగాలు యిలాగే చేసింది. చివరకు ఓ రోజు షాపుకి వెళ్లి ‘మీ షాపులో కొన్న చాకొలెట్లు తిని మా బంధువులొకరు జబ్బు పడ్డారు. మీకు యిలాటి ఫిర్యాదులు ఏమైనా వచ్చాయా?’ అని అడిగింది. ‘అబ్బే, కొంతమంది వచ్చి కొన్ని వెరైటీలు చేదుగా వుంటాయని అంటున్నారు తప్ప అస్వస్థులైనట్లు చెప్పలేదే’ అన్నాడు షాపువాడు. ఓహో అనుకుని యీమె విషం డోసు పెంచింది. ప్రతీ సారీ ఒక్కో కొత్త కుర్రాణ్ని ఎంచుకునేది. ఇలా షాపులో విషం కలిపిన చాకొలేట్ బాక్సులు బాగానే పోగడ్డాయి. చివరకు మూడు నెలల తర్వాత జూన్ 12న ఓ నాలుగేళ్ల పాప చాకొలెట్ తిని చనిపోయింది. పేపర్లో ఆ వార్త చదివిన క్రిస్టియానా ‘అమ్మయ్య, నా ప్రియుడి దగ్గర నా నిర్దోషిత్వం నిరూపించబడుతుంది.’ అనుకుని ఆనందించింది.  కానీ ఆ చావుకి, చాకొలెట్‌కు వున్న కనక్షన్ ఎవరికీ తోచలేదు.

అయ్యో అనుకుంది క్రిస్టియానా. ఇక తనే కొంతమంది ప్రముఖులకు మీ అభిమానిని అంటూ విషపూరితమైన చాకొలెట్ బాక్సులు బహుమతిగా పంపడం మొదలెట్టింది. ఎప్పటికైనా తనమీద అనుమానం వస్తుందేమోనని ముందు జాగ్రత్తగా తన పేర కూడా ఒకటి పంపించుకుని పెట్టుకుంది. ఆ తర్వాత డాక్టరు భార్య మీద మరోసారి ప్రయోగం చేద్దామని ఆమెకూ పంపింది. ఈసారీ ఆమె తినడం, తీవ్రంగా అస్వస్థురాలు కావడం జరిగింది. గతానుభవంతో దీని వెనుక క్రిస్టియానా హస్తం వుందేమోనని డాక్టరుకి అనుమానం వచ్చింది. వెళ్లి పోలీసులకు తమ వ్యవహారం సమస్తం చెప్పేశాడు. క్రిస్టియానా గతంలో యిదే వుపాయంతో తన భార్యను చంపబోయిందని చెప్పాడు. అప్పుడు పోలీసులు చనిపోయిన పాప యింటికి వెళ్లి, ఎప్పుడు ఎలా చనిపోయిందని గట్టిగా ఆరా తీస్తే అప్పుడు చాకొలెట్ తిన్నాక ఇరవై నిమిషాలకు చనిపోయిందని తేలింది.

వెంటనే పోలీసులు ఆ షాపుపై దాడి చేసి అమ్మే సరుకులన్నీ తనిఖీ చేశారు. కొన్నిటిలో స్ట్రిక్నీన్ వుందని తేలింది. ఎందుకుందని అడిగితే ఆ షాపు యజమాని ఏమీ చెప్పలేకపోయాడు. కేసు పెట్టారు కానీ అతనే కావాలని ఆ పాపను చంపాడని నిరూపించ లేకపోయారు. జడ్జి గారు ఇది ప్రమాదం మాత్రమే అని చెప్పి కేసు మూసేశారు. పోలీసులు క్రిస్టియానాను అనుమానిద్దామా అంటే తనకు తెలియని ఆ పాప మీద వైరం ఎందుకుంటుంది? అనుకున్నారు. ఆమె మనసు ఏ విధంగా పనిచేసిందో, ఆమె లాజిక్ ఏమిటో ఎవరూ ఊహించలేక పోయారు. చాక్‌లెట్ విషప్రయోగం చేస్తున్నవారెవరో తెలుసుకోవాలనే పట్టుదలతో పోలీసులు ఆ విషం అమ్మే మందుల షాపులన్నీ గాలించారు. స్ట్రిక్నీన్ కొన్నవాళ్లందరి వివరాలు సేకరించి, వారెవరో కనుక్కున్నారు. అందరూ దొరికారు కానీ మిసెస్ ఉడ్స్ అనే ఆవిడెవరో అంతు చిక్కలేదు. ఇచ్చిన అడ్రసులో ఆమె లేదు.

ఈమెకు, హత్యకు లింకుందని పోలీసులు అనుకోకపోదురేమో కానీ అంతలోనే మందులషాపతను ‘ఈ రిజిస్టరును విచారణాధికారి (బ్రిటన్‌లో కరొనర్ అంటారు) తెప్పించుకున్నారు’ అనడంతో ఉలిక్కిపడ్డారు. ‘చిన్నపిల్ల మరణం గురించి కోర్టులో కేసు నడిచే సమయంలో మీ షాపులో రిజిస్టర్ చెక్ చేయాలంటూ కరోనర్ నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఓ చిన్నబ్బాయి పట్టుకుని వచ్చి యిచ్చాడు. రిజిస్టర్ పంపాను. మర్నాడు మళ్లీ వెనక్కిచ్చేశారు కానీ, దానిలో ఒక పేజీ చింపేసి వుంది. వాళ్లు తీసుకున్నారు కాబోలు అనుకున్నాను.’ అన్నాడతను. ఏదీ ఆ ఉత్తరం చూపించంటే చూపించాడు. అది ఫోర్జరీ అని పోలీసులు వెంటనే కనిపెట్టారు. మార్చి నుంచి జూన్ వరకు ఉన్న ఎంట్రీలున్న కాగితాన్ని క్రిస్టియానా చింపేసింది కానీ అంతకుముందు కొన్ని నెలల క్రితం డాక్టరు భార్యను చంపడానికి కొన్న ఎంట్రీ అలాగే వుండిపోయిందన్నమాట. దాన్ని బట్టి మిసెస్ ఉడ్స్ గురించి పోలీసులు వెతకసాగారు.

డాక్టరు చెప్పినది మనసులో మెదిలి విషం కొన్న వ్యక్తి పోలికలెలా వున్నాయని షాపువాణ్ని అడిగితే కొన్నది క్రిస్టియానాయే అనిపించింది. ఏదో ప్రభుత్వశాఖ నుంచి ఏదో సమాచారం కోరుతున్నట్లు ఆమెకు లేఖ రాశారు. జవాబుగా ఆమె రాసిన లేఖలో చేతిరాతను కరోనర్ పేర రాసిన ఉత్తరంలో నమూనాతో పోల్చి చూస్తే ఆమెయే ఫోర్జరీ చేసిందని, ఆమెయే మిసెస్ ఉడ్స్ అనీ తేలిపోయింది. ఈలోగా చాకొలెట్ షాపులో పనిచేసే కుర్రవాడు, చాకొలెట్ డబ్బాలు కొని మళ్లీ వెనక్కి యిచ్చేసే కుర్రవాళ్లను వర్ణించి చెపితే వాళ్లను పట్టుకుని అడిగితే వాళ్లు చెప్పిన పోలికలు కూడా క్రిస్టియానాతో సరిపోయాయి. ఈ ఆధారాలతో ఆమెను పట్టుకుని విచారించారు.

ఆమె జరిగినది చెప్పేసింది. డాక్టరు తనకు రాసిన ప్రేమలేఖలు చూపించింది. డాక్టరు ‘ఒక మెంటల్ పేషంటును ఊరడించడానికి రాశాను. ఏదో సరదా ఫ్లర్టింగ్‌యే తప్ప నేను ఆమెతో శృంగారం నెరపలేదు’ అంటూ తప్పుకున్నాడు. ఎంతైనా హత్యలో అతని పాత్ర లేదు కాబట్టి వదిలేశారు. 1872లో కేసు నడిచింది. ఆమె హత్య చేసిందన్నది రుజువైంది. కానీ మోటివ్ చిత్రంగా వుంది. పైగా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని తల్లి సాక్ష్యం యిచ్చింది. విపరీత మనస్తత్వంతో యిలాటి ఘాతుకానికి ఒడిగట్టిందని న్యాయమూర్తి భావించాడు. అందుకని ఆమెకు ఉరిశిక్ష వేసినా, యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాడు. అప్పణ్నుంచి 35 ఏళ్ల పాటు జైల్లోని పిచ్చాసుపత్రిలోనే వుండి 1907లో చనిపోయింది. ఈమె కథపై ఆధారపడి 1939లో ‘‘ద బ్లాక్ స్పెక్టకల్స్’’ అనే నవల వెలవడింది. ‘‘ద గ్రేట్ చాకొలెట్ మర్డర్స్’’ పేర 2006లో బిబిసిలో డ్రామాగా వచ్చింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?